కొంపముంచిన అత్యుత్సాహం
posted on Oct 16, 2013 @ 2:08PM
కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనేకానేక గొప్ప సిద్ధాంతాలలో సోనియా, రాహుల్ గాంధీల భజన కార్యక్రమం కూడా ప్రముఖమయినది. కేంద్రమంత్రి నుండి కార్పొరేటర్ వరకు అందరూ తమ పదవులు సురక్షితంగా కాపాడుకోవాలంటే, గొప్పగా పనిచేయకపోయినా ఈ భజన కార్యక్రమం సర్వకాల సర్వావస్తలందూ కూడా నిష్టగా చేస్తూ ఉండాలి. అదే వారి పదవులకి శ్రీరామ రక్ష.అయితే ఒక్కోసారి వారు అత్యుత్సాహంతో చేసే ఈ భజన వల్లనే అమ్మ ఆగ్రహానికి గురవుతుంటారు. అందుకు ఉదాహరణగా ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ లో ఒక ప్రధాన కూడలిలో కొందరు ‘వీరభక్తులు’ పెట్టిన బ్యానర్ వ్యవవహారం గురించి చెప్పుకోక తప్పదు.
అలహాబాద్ లోని ఫూల్ పూర్ పార్లమెంటు నియోజక వర్గానికి గెలుపు గుర్రం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కసరత్తు చేస్తోంది. అయితే ఇక్కడ నుండి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా వాద్ర పోటీ చేస్తే బాగుటుందని పార్టీలో అభిప్రాయం ఉంది. కానీ రీటా బహుగుణ వంటి వేరే పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే, భజన సంస్కృతి నరనరాన్న జీర్ణించుకొన్న కొందరు కాంగ్రెస్ నేతలకు మాత్రం ఈ వ్యవహారమంతా నచ్చలేదు. నేరుగా ప్రియాంకా గాంధీకి ఆ సీటు అప్పగించకుండా ఇంకెవరి పేర్లో పరిశీలించడం ఏమిటని బాధపడుతూ, తమ ఆవేదనని ఒక బ్యానర్ రూపంలో బయటపడితే పార్టీ తమ కోరికను మన్నిస్తుందనే ఆలోచన రాగానే, అలహాబాద్ లో ఒక ప్రధాన కూడాలిలో ఒక పెద్ద బ్యానర్ ఏర్పాటు చేసారు.
అందులో సోనియా, ప్రియాంకా గాంధీల ఫోటోలు వేసి క్రింద ఈ విధంగా వ్రాసారు. “అమ్మ ఇప్పుడు తరచు జబ్బు పడుతోంది. తమ్ముడు పని ఒత్తిడితో సతమవుతున్నాడు. అందువల్ల ప్రియాంక గాంధీ పూల్ పూర్ నుండి పోటీకి నిలబడి పార్టీని మళ్ళీ మూడో సారి అధికారంలోకి తీసుకు రావాలి.”
ప్రియాంకా గాంధీ పోటీ చేయాలనో, లేకపోతే పోటీ చేస్తే బాగుంటుందనో వ్రాస్తే సరిపోయే దానికి ప్రాస కోసం సోనియాగాంధీ తరచు జబ్బు పడుతోందని వ్రాసి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు పాపం ఆ వీర భక్తులు. సోనియాగాంధీ గురించి ఆవిధంగా వ్రాసినందుకు సదరు నేతలందరికీ పార్టీ సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది కూడా.