కాంగ్రెసేతర పార్టీలతో జగన్ నెయ్యమా? దేనికి
posted on Nov 9, 2013 @ 12:14PM
జగన్మోహన్ రెడ్డి ద్వారా తేదేపాకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అయితే మడమ తిప్పే వంశం కాదంటూనే అనేక ‘యూ టర్నులు’ తీసుకొన్నఅతను ఇప్పుడు అకస్మాత్తుగా దేశాటనకి బయలుదేరి కాంగ్రెసేతర పార్టీలను, ప్రభుత్వాల మద్దతు కూడా గట్టాలని అనుకోవడం చూస్తే అందరికీ స్పాట్ పెట్టే కాంగ్రెస్ పార్టీకే అతను స్పాట్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాడా? అనే అనుమానం కలుగుతుంది.
అయితే అతనిని ఏ పనికోసం బెయిలిచ్చి బయటకి రప్పించిందో ఆపని చేయకుండా తన ప్రత్యర్ధులను కూడగట్టే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకొంటుందని అనుకోవడం అమాయకత్వమే. అతని వల్ల తనకు ప్రమాదం ఉందని గ్రహించిన మరుక్షణం లోటస్ పాండ్ మీద సీబీఐ, ఈడీ చిలుకలు వాలిపోతాయని చెప్పడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అటువంటి పొరపాటు పని ఎన్నడు చేయడు. ఒకవేళ అతని రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నట్లుగా కాక, అతనికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి రహస్య ఒప్పందం, అనుబంధం లేదని అనుకొన్నపటికీ, కాంగ్రెస్ పార్టీతో పెట్టుకొంటే ఏమవుతుందో అనుభవ పూర్వకంగా తెలుసుకొన్న అతను మళ్ళీ మరో మారు అటువంటి దుస్సాహసం చేయడని గట్టిగా చెప్పవచ్చును.
అందువల్ల అతను తన సమైక్య చాంపియన్ షిప్ ట్రోఫీని భద్రంగా కాపాడుకొంటూనే, మరో వైపు రాష్ట్ర విభజన సజావుగా జరిగేందుకు వీలుగా అతను ఈ ఉపాయం ఎంచుకొని ఉండవచ్చును. తద్వారా తను రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు చేయని ప్రయత్నమంటూ లేదని చెప్పుకొనే అవకాశం, పనిలో పనిగా తను కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధిననే భావన ప్రజలలో కలిగించవచ్చు. అంతేకాక సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా నేతలు కాంగ్రెస్ అధిష్టానంతో అతనికి రహస్య ఒప్పందం ఉందని చేస్తున్న ఆరోపణలు నిజం కాదని చాటుకొన్నట్లు అవుతుంది కూడా.