దీనబందుతో పురందేశ్వరి చెలగాటం
దీనబందు, కళాబందు, ఆత్మబందు, భక్తబందు, వైద్యబందు వంటి అనేక వీరత్రాళ్ళు వేయించుకొని వాటిని భారంగా మోసుకు తిరుగుతున్న రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామి రెడ్డికి పాపం! కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది నందమూరి గడుసుపిల్ల పురందేశ్వరి. ఆయన పాపం.. ఎన్నికల కోసం ఎదురు చూడకుండా బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి ఒక పద్దతి ప్రకారం ప్రజాసేవ, కళాసేవ, దైవసేవ ఇత్యాది నానారకాల సేవలు చేసుకుపోతూ, జస్ట్ విశాఖ లోక్ సభ టికెట్ మాత్రమే పుచ్చుకొంటానని చెప్పుకొంటుంటే, ఆ పురందేశ్వరి ‘నేను కూడా ఇక్కడే కంటిన్యూ అయిపోతా’నని చెపుతూ పాపం! ఆ పెద్దమనిషిని ఒకటే అల్లరి పెట్టేస్తోంది.
అప్పటికీ ఆయన చాలా విశాల హృదయం గలవాడు గనుక ‘ఇగో పిల్లా... నువ్వు కావాలంటే ఆ పక్కనున్నఏ నరసాపురంకో పోయి పోటీ చేసుకో’ అని మంచిగా చెప్పి చూసాడు. పైగా ‘సోనియమ్మ చాన్నాళ క్రితమే నాకు వైజాగ్ టికెట్ కన్ఫర్మ్ చేసేసారు’ అంటూ ఓ దైవరహస్యం కూడా బయట పెట్టేరు. కానీ ఆమె వింటే కదా! పైగా వాళ్ళాయన వెంకటేశ్వర రావు కూడా ఆమెకు తోడుగా వచ్చి అడ్డుగోలు వాదనలు మొదలుపెట్టేసాడు. “అల్లపుడేపుడో నాగార్జున సాగర్ డ్యాం కడుతున్నపుడు నువ్వు సిమెంట్ బ్లాకులో అమ్ముకోలేదా? కాంట్రాక్టుల కోసం పైరవీలు చేయలేదా?” అంటూ ఏవేవో అవాకులు చవాకులు వాగి పాపం! ఆ పెద్దాయన మనసు నొప్పించేసాడు.
‘వైజాగ్ టికెట్ కోసం నేను మాట్లాడితే, ఈయనేమిటి హిస్టరీ మాట్లాడుతూ నా పరువు తీసేస్తున్నాడు’ అని ఆగ్రహంతో ఊగిపోతూ ‘నా మూడోకన్ను తెరుస్తా.. మరో ముక్క ఎక్సట్రా మాట్లాడినా పరువు నష్టం దావా వేస్తా’ నని మెళ్ళో వ్రేలాడుతున్న రుద్రాక్షలు పట్టుకొని భీకర శపథం చేసేసారు ఆ భక్తబందు. అందుకు ఆ దగ్గుబాటి అదర లేదు, బెదరలేదు. పైగా ‘ఆ.. వేస్తే పోయేది నీ పరువే కాని నాది కాదు,’ అని బెదిరించారు. ‘సోనియమ్మ కాళ్ళమీద పడితే టికెట్ రావచ్చు. కానీ కోర్టుకెళితే పోయిన పరువు తిరిగి రాదూ కదా..’ అని బాధపడుతూ పాపం ఆ దీనబందు వెనక్కి తగ్గవలసి వచ్చింది.
అయితే ఆ తరువాత నుండి వైజాగ్ లో మొక్కలు నాటుడు, మందులు పంచుడు, కచేరీలు పెట్టుడు వంటి అనేక కార్యక్రమాలు స్పీడ్ పెంచేసి ‘ఇక వైజాగ్ టికెట్ నాదే’నని కుదుట పడుతుంటే, మళ్ళీ ఎక్కడి నుండో హటాత్తుగా ఊడిపడిన పురందేశ్వరి ‘నేను కూడా వైజాగ్ జనాలకి బోలెడు సర్వీస్ చేస్తున్నాను. ఆ సంగతి నేను ఊరంతా బ్యానర్లు తగిలించుకొని చాటింపు వేసుకోకపోయినా జనాలకి తెలుసు. వాళ్ళు ఎవరు కావాలనుకొంటే వారికే టికెట్’ అని కౌంటర్ ఇచ్చేసి సీమాంధ్రకి ప్యాకేజీ కోసం డిల్లీ ప్లేన్ ఎక్కేసింది.
ఆ మహాతల్లి మళ్ళీ వైజాగ్ వచ్చేలోగా జనాలని కాస్త మంచి చేసుకొంటే బెటర్ అని మన పెద్దాయన అగనంపూడిలో ఓ క్యాన్సర్ ఆసుపత్రికి శంకు స్థాపన చేసేసి, సినిమా వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళతో క్రికెట్ ఆడించి జనాలని ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు కూడా. అయితే ప్యాకేజీ కోసం డిల్లీ వెళ్లిన చిన్నమ్మ ఇంతకీ ఎవరి ప్యాకేజీ కోసం మాట్లాడారో ఇంకా ప్రకటించనప్పటికీ, డిల్లీ నుండి ప్లేన్ వైజాగ్ లో దిగగానే ‘నేను వైజాగ్ నుండే పోటీ చేస్తున్నాను’ అని అనౌన్సమెంటు చేసేసారు. ఆమె అనౌన్సమెంటుకి పాపం దీన బందుగారి బీపీ మళ్ళీ పెరగడం ఆరంబించింది పాపం!