కొనసాగుతున్న శాసనసభ వాయిదాల పర్వం
posted on Dec 18, 2013 @ 3:24PM
తెలంగాణా బిల్లుపై ఎటువంటి చర్చ చేప్పట్టకుండానే శాసనసభ, శాసనమండలి రెండూ కూడా రేపటికి వాయిదాపడ్డాయి. సభలో సీమాంధ్రకు చెందిన తెదేపా, వైకాపా కాంగ్రెస్ సభ్యులు సభాకార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడుతుండటంతో ఉభయ సభలు రేపటికి వాయిదాపడక తప్పలేదు. సీమాంధ్రకు చెందిన తెదేపా నేతలు రాష్ట్రపతి పంపిన టీ-బిల్లులో విభజనపై సమగ్ర సమాచారం లేదని, అందువల్ల బిల్లుపై చర్చ వాయిదా వేసి కేంద్రం నుండి సమాచారం రప్పించిన తరువాతనే బిల్లుపై చర్చ జరపాలని లేఖ ఇచ్చారు.
ఇక వైకాపా, సభలో ముందుగా సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ సభను స్తంభింపజేసింది. తెరాస నేతలు అసలు ఎటువంటి చర్చ అవసరం లేదని, తాము తమ అభిప్రాయాలను నేరుగా రాష్ట్రపతికే పంపుతామని తెలియజేస్తూ ఒక లేఖ ఇచ్చారు.
సభ మళ్ళీ మూడోసారి సమావేశమయినప్పుడు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ యొక్క తరువాత సమావేశపు తేదీలను ప్రకటిస్తారని అందరూ భావించినప్పటికీ ఎందువలననో ఆయన ప్రకటించలేదు. వచ్చేనెల 3నుండి 13వరకు, మళ్ళీ 16నుండి 23వరకు శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చని సమాచారం. కానీ, టీ-కాంగ్రెస్, తెరాస నేతలు బిల్లుపై చర్చను ఈ నెలాఖరులోగానే ముగించి రాష్ట్రపతికి తిప్పి పంపేయాలని స్పీకర్ పై ఒత్తిడి తెస్తున్నారు. అసలు సభలో బిల్లుపై చర్చ జరిగే వాతావరణమే లేనందున బిల్లును వెంటనే రాష్ట్రపతికి త్రిప్పి పంపేయాలని కోరుతున్నారు.