ఆమాద్మీని మీడియా కనికరిస్తే...
చాలా విచారకరమయిన విషయమేమిటంటే, నిత్యం నీతులు, ఆదర్శాలు వల్లెవేస్తూ దేశం కోసం చాలా ఆవేదన పడిపోయే మన భారత మీడియా, తన రేటింగ్స్ పెంచుకోవడానికి ఏదో ఒక వ్యక్తిని లేక వ్యవస్థని లేక రాజకీయ పార్టీని ఆకాశానికి ఎత్తేసి ఎంత హంగామా చేస్తుందో, పోటీలో అందరికంటే తామే ముందుండాలనే దురాశతో మళ్ళీ ఆ వ్యక్తులను, వ్యవస్థలనే నిర్దాక్షిణ్యంగా అధః పాతాళానికి తొక్కేసేందుకు కూడా వెనుకాడదు. అమాద్మీ పార్టీకి చెందిన వినోద్ కుమార్ బిన్నీఅనే శాసనసభ్యుడు తనకు మంత్రి పదవి ఈయలేదని నిన్న పార్టీ సమావేశం నుండి అలిగి వెళ్లిపోయాడనే వార్తకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యమే అందుకు ఉదాహరణ.
రాజకీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు తమకు పెనుసవాలుగా మారిన అమాద్మీ సర్వ నాశనమయిపోవాలని కోరుకోవడం సహజమే. కానీ, నిత్యం దేశం కోసం ఆవేదన పడిపోయే మీడియా కూడా సమాజంలో ఒక మంచి మార్పుకోసం ప్రయత్నిస్తున్నఅమాద్మీకి అండగా నిలబడకపోగా, ఆ పార్టీ నైతిక స్థయిర్యం దెబ్బతీసేలా పనిగట్టుకొని ప్రచారం చేయడం చాలా తప్పు. అమాద్మీ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే అది చేసిన వాగ్దానాలను అమలుచేయడం అసంభవమని, అమాద్మీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయని, అమాద్మీ ప్రభుత్వం ఎంతో కాలం ఉండబోదని మీడియా పనిగట్టుకొని ప్రచారం చేయడం వల్ల దేశంలో ఒక మంచి రాజకీయ ప్రయోగం జరగకుండా ముందే అడ్డుపడినట్లవుతుంది.
మీడియా కూడా ఈ వ్యవస్థలో భాగమేనని, ఆ వ్యవస్థ బాగుపడితే తను కూడా ఇంకా ప్రయోజనం పొందే అవకాశం ఉందని గ్రహించి, మీడియా కూడా అమాద్మీ నిజాయితీగా చేస్తున్నఒక మంచి ప్రయత్నానికి యధాశక్తిన సహకారం అందించాలి. లేకుంటే కనీసం అమాద్మీని దెబ్బతీసే ప్రయత్నాలయినా చేయకుండా అమాద్మీని(సామాన్యుడిని) కనికరిస్తే ఈ దేశానికి మహోపకారం చేసినదవుతుంది.