విశ్వాసపరీక్షలో కేజ్రీవాల్ విజయం

      ఢిల్లీ శాసనసభలో ఆమాద్మీ పార్టీ తన బలం నిరూపించుకుంది. మొత్తం 70మంది ఉన్న అసెంబ్లీ లో 37 మంది సభ్యుల మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆప్కు చెందిన 28 సభ్యులు, కాంగ్రెస్కు చెందిన 8, ఒక జెడియు సభ్యుడు మద్దతు ఇవ్వడంతో ఆమాద్మీ విశ్వాస పరీక్ష నెగ్గింది.   ఇటీవల ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అమ్ఆద్మీపార్టీకి 28 స్థానాలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌కు 8 స్థానాలు వచ్చాయి. ఏఏపీకి కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ జరుగుతోంది. కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఆరు నెలల వరకు ఎటువంటి ఢోకా ఉండదు. ఈ ఆరు నెలల్లో ఏఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చవలసి ఉంటుంది.

చరిత్రలో ఇదే తొలిసారి, శ్రీధర్ ఇష్యూ నో

      ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యంతర భృతిపై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అనతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇవ్వడానికి అంగీకరించమని, 2014 జనవరి ఒకటి నుంచి ఐఆర్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కిరణ్ స్పష్టం చేశారు. ఉద్యమాల వల్ల రాష్ట్ర రెవెన్యూ తగ్గడానికి కారణమయ్యాయని అన్నారు.  ఒకటి, రెండు రోజుల్లో హెల్త్ కార్డులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.వాణిజ్యపన్నుల శాఖను స్వీకరించబోనన్న శ్రీధర్‌బాబు ప్రకటనపై స్పందించనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి శ్రీధర్ బాబుని ప్రమోట్ చేస్తున్నారా?

  రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతలందరి వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగానే ఉంది. సీమాంధ్ర యంపీలు, కేంద్రమంత్రులు రాష్ట్ర విభజన గురించి చాలా ముందుగానే తెలిసి ఉన్నా ఆవిషయాన్ని చివరివరకు దాచిపెట్టి తరువాత ఆడిన నాటకాలు చూస్తూనే ఉన్నాము. ఇక తను ముఖ్యమంత్రి పదవిలో ఉండగా రాష్ట్ర విభజన జరిగే పరసక్తే లేదని బల్లగుద్ది మరీ చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా బిల్లు శాసనసభకు చేరుకోనేవరకు అందరినీ కట్టడిచేసి, విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకు తెలంగాణా వారికంటే ఎక్కువ సహకారం అందించారు. బిల్లువచ్చాక దాని అంతు తేలుస్తామని ప్రగల్భాలు పలికిన ఆయన అది ప్రవేశపెడుతున్నపుడు అసలు సభకే హాజరు కాలేదు. ఆ తరువాత కూడా దాని గురించి గట్టిగా మాట్లాడింది లేదు.   ఇప్పడు శాసనసభ సమావేశాలు మొదలయ్యే ముందు శ్రీధర్ బాబు మంత్రి పదవి వెనక్కి తీసుకొని మళ్ళీ మరో కొత్త నాటకానికి తెర లేపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై జరుగుతున్న రగడ, ఆయన రాజీనామా డ్రామాతో వెల్లువెత్తుతున్నసానుభూతి మంత్రి శ్రీధర్ బాబుని ఒకే ఒక్క రోజులో తెలంగాణా హీరోగా ఎదిగిపోయారు. ఆయన శాఖ మార్పిడితో తెలంగాణా బిల్లుకి వచ్చేనష్టం ఏమీ లేదని అందరికీ తెలిసినప్పటికీ, అందరూ కూడా ఏదో ఉపద్రవం ముంచుకు వస్తున్నట్లు దాని గురించే మాట్లాడుకొంటున్నారు. ఇది చివరికి ఎంతవరకు వెళ్లిందంటే ఏకంగా తెలంగాణా బంద్ కి పిలుపు ఇచ్చేంత. ఇంత చిన్న విషయానికి ఇంత హంగామా ఎందుకు జరుగుతోందనే అనుమానాలు కూడా కలగడం సహజం.   ఇంతకాలంగా మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సంగతి అందరికీ తెలుసు. ఒకరు తెలంగాణా కోసం, మరొకరు సమైక్యాంధ్ర కోసం వాదిస్తున్నపటికీ, అది వారి స్నేహానికి ఎన్నడూ కూడా పెద్ద అడ్డంకిగా మారలేదు. తెలంగాణా ఏర్పాటు అనివార్యమని ముఖ్యమంత్రికి తెలియకపోలేదు. అదేవిధంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మొట్ట మొదటి ముఖ్యమంత్రి కావాలనుకొనే వారిలో శ్రీధర్ బాబు కూడా ఒకరని కూడా తెలియకపోలేదు.   అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేఖించే ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, ఇంకా గీతారెడ్డి, డీ.శ్రీనివాస్ వంటి హేమాహేమీలు అనేకమంది ఈ రేసులో ఉన్నారు. వారందరితో పోలిస్తే శ్రీధర్ బాబు ఈ రేసులో కొంచెం వెనకబడి ఉన్నారనేది సుస్పష్టం. మరి తనకు ఆప్తుడయిన శ్రీధర్ బాబుని ఈ రేసులో అందరి కంటే ముందుకు తీసుకు వెళ్ళాలంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఒకటి చేయక తప్పదు. ఆయనేమి చేసారో, దానివల్ల శ్రీధర్ బాబు స్కోర్ ఒక్కసారిగా ఎలా పెరిగిపోయిందో వేరే చెప్పనవసరం లేదు.   రాష్ట్రం విడిపోయిన తరువాత తనను తీవ్రంగా వ్యతిరేఖించే దామోదర, జానారెడ్డి, జైపాల్ రెడ్డివంటి వారికంటే, తనకు అత్యంత ఆప్తుడయిన శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి కాగలిగితే దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డికి లాభమే తప్ప నష్టమేమి ఉండదు. బహుశః అందుకే ఈ మిత్రభేధమనే డ్రామా మొదలయినట్లు భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి తను ఏవిధంగా సమైక్య చాంపియన్ గా ఎదిగారో, అదేవిధంగా అదును చూసి శ్రీధర్ బాబుకి మంత్రి పదవి తొలగించి అతనిని కూడా రాత్రికి రాత్రి తెలంగాణాలో హీరోగా మార్చేసారు.   మరి శ్రీధర్ బాబు ఈ వేడిని ఎంతకాలం కాపాడుకొని తెలంగాణాలో తన రేటింగ్ పెంచుకోగలరనేది ఆయన శక్తియుక్తుల మీద ఆధారపడి ఉంటుంది. తాటిచెట్టు ఎక్కేందుకు ఎవరయినా కొంత వరకే సాయం చేయగలరు. ఆ తరువాత స్వయంగా ఎక్కవలసి ఉంటుంది. ఇది కూడా అంతే మరి.

మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు: 27 మంది మృతి

      దేశంలో జరుగుతున్న రైలు,బస్సు ప్రమాదాలు సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజలు బస్సు, రైలు ప్రయాణాలు చేయాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అనంతపురంలో నా౦దేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదా సంఘటన మరచిపోకముందే...తాజాగా మహారాష్ట్రలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 27 మంది మృతి చెందారు.   40 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న బస్సు థానే జిల్లా తోకవాడే సమీపంలో మాల్‌సేజ్ ఘాట్ వద్ద అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఓ మూలవద్ద బస్సు పైకి ఓ టెంపో దూసుకు రావడంతో డ్రైవర్ దానిని తప్పించబోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి 250 మీటర్ల లోతు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా, అందులో 19 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు.

ఈ రాద్ధాంతం కూడా కాంగ్రెస్ వ్యూహమేనా

  ఊహించినట్లుగానే టీ-కాంగ్రెస్ నేతలు అందరూ శ్రీధర్‌బాబు మంత్రిత్వశాఖ మార్పుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లాలో వీ.హనుమంత రావు నిర్వహిస్తున్నఇందిరమ్మ విజయయాత్రలో పాల్గొనెందుకు హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాను, మంత్రి శ్రీధర్‌బాబుతో సహా తెలంగాణా నేతలందరూ కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పిర్యాదు చేసారు. ఆయన ముఖ్యమంత్రిని మందలిస్తున్నట్లు ఏమయినా చెప్తారేమోనని వారు భావిస్తే, కుంతియా ‘ముఖ్యమంత్రికి తన మంత్రుల శాఖలను మార్చేస్వేచ్చ,అధికారం ఉంటుందని’ చెప్పడంతో షాక్ తిన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి నిరసనగా వారందరూ మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని భావిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను చూసిన మంత్రి టీజీ వెంకటేష్, “ఒకవేళ ముఖ్యమంత్రి నిర్ణయం వారికి నచ్చకపోతే రాజీనామా చేయడమే మేలు” అంటూ వ్యాఖ్యలు చేయడం వారికి పుండు మీద కారం చల్లినట్లయింది. ఇక కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కూడా కలుగజేసుకొంటూ ఇటువంటి సమయంలో మంత్రిత్వ శాఖలు మార్చడం సబబు కాదు. అయినా శాఖలు మార్చిననత మాత్రాన్న తెలంగాణా ఏర్పాటు ఆగిపోతుందని భావించడం అవివేకం, అని మీడియాతో అన్నారు.   రేపు శాసనసభలో అందరూ కలిసి కట్టుగా ముఖ్యమంత్రిని, ఆయన సహచరులను గట్టిగా డ్డీ కొనవచ్చును. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో మంత్రి శైలజానాథ్ ప్రతిపాదించనున్న సమైక్యతీర్మానాన్నిఎట్టి పరిస్థితుల్లో సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకొంటామని టీ-కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సమైక్యతీర్మానం చేసిన తరువాతనే తెలంగాణా బిల్లుపై చర్చకు అంగీకరిస్తామని సీమాంధ్ర కాంగ్రెస్, వైకాపా సభ్యులు కూడా అంతే ఖరాఖండిగా చెపుతున్నారు. అంటే శాసనసభలో బిల్లుపై ఇక ఎటువంటి చర్చజరగకుండానే జనవరి23 రాష్ట్రపతికి తిప్పి పంపే అవకాశాలే ఎక్కువని స్పష్టం అవుతోంది. బిల్లుపై సభలో ఎలాగు చర్చ జరిగే అవకాశం లేదు గనుక, తక్షణమే దానిని రాష్ట్రపతికి తిప్పి పంపమని టీ-కాంగ్రెస్, తెరాస నేతలు రేపు గట్టిగా పట్టుబట్టడం ఖాయం. కానీ, ముఖ్యమంత్రి దానిని జనవరి23 గడువు వరకు ఇక్కడే ఆపడం కూడా అంతే ఖాయం. ఈ కాంగ్రెస్ నేతల డ్రామాలన్నీచూస్తుంటే తెలంగాణా బిల్లు రాష్ట్రానికి వచ్చినప్పుడు దానిని ఎటువంటి చర్చ జరగకుండా, వ్యతిరేఖ ముద్ర పడకుండా ఏవిధంగా రాష్ట్రపతికి తిప్పి పంపాలో అంతా ముందే ప్లాన్ తయారు చేసుకొని అందరూ దాని ప్రకారమే నటించేస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే జైపాల్ రెడ్డి మొదలు టీజీ వెంకటేష్ వరకు అందరూ కలిసి ఇంత రాద్ధాంతం చేయవలసిన సమస్య కాదిది.

సీఎం హెలీకాఫ్టర్‌ను గాల్లో పేల్చేస్తా౦: పొన్నం

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఎర్రంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం జిల్లాకు సీఎం వస్తే హెలీకాఫ్టర్‌ను గాల్లోనే తుపాకీతో పేల్చేసామని హెచ్చరించారు. ‘కిరణ్‌ కరీంనగర్‌కి రావొద్దని సూచిస్తున్నాం.. హెచ్చరిస్తున్నాం.. కాదని సిగ్గులేకుండా వస్తే మాత్రం ఊరుకునేది లేదని అన్నారు. కిరణ్‌ వస్తే హెలీకాఫ్టర్ ల్యాండింగ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులదే ఆయన తెలిపారు. శ్రీధర్‌బాబు శాఖ మార్పుతో కిరణ్ వక్రబుద్ది బయటపడిందన్నారు. తెలంగాణ మంత్రులు అసెంబ్లీలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని, అవసరమైతే క్యాంప్ ఆఫీస్‌ను ఆక్రమించుకోవాలని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

శ్రీధర్ బాబు రాజీనామా..!!

      మంత్రి శ్రీధర్‌బాబుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విసిరిన 'బౌన్సర్'కు తెలంగాణ నేతల నుంచి తీవ్రస్థాయిలో కౌంటర్ ఎదురవుతోంది. తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖను తప్పించినందుకు నిరసనగా... పౌరసరఫరాల శాఖనూ వదులుకోవాలని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్‌ కు రాజీనామా లేఖను సమర్పించబోతున్నట్లు తనతోటి మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్‌రెడ్డి తదితరులకు తెలియజేశారు. తన రాజీనామాపై శ్రీధర్ బాబు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌ తో చర్చించారు. శాసనసభ వ్యవహారాల శాఖను తప్పించడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆయనకు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖను తీసుకునేది లేదని... పైగా, పౌర సరఫరాల శాఖ మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని వివరించారు.     

సమైక్య తీర్మానానికి వైకాపా మద్దతు ఇస్తుందా?

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నుండి శాసనసభ వ్యవహారాల శాఖను వెనక్కి తీసుకొని దానిని తన సమైక్య అనుచరుడు శైలజానాథ్ కు కట్టబెట్టారు. దానిపై ప్రస్తుతం జరుగుతున్నయుద్ధం గురించి అందరూ చూస్తూనే ఉన్నాము. శైలజానాథ్ చేత రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ శాసనసభలోఒక తీర్మానం ప్రవేశపెట్టించాలనేది ముఖ్యమంత్రి వ్యూహంగా కనబడుతోంది.   వైకాపా మొదటి నుండి సమైక్య తీర్మానం కోసం పట్టుబడుతూ, అదిచేసే వరకు సభను నడవనీయమని చెపుతున్నందున, ఇప్పుడు తీర్మానం ప్రవేశపెడితే దానికి మద్దతు ఈయవలసి ఉంటుంది. ఇక ఇటీవల ఏపీఎన్జీవోలు సమైక్యాంద్ర కోసం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్, తెదేపాలు రాష్ట్రాన్ని విడిపోకుండా ఉంచేందుకు కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి గనుక సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు దానికి బేషరతు మద్దతు ఈయవలసి ఉంటుంది. కానీ వారితో కలిసి పనిచేయడానికి ఇష్టంలేదని కుంటిసాకుతో ఆ వైకాపా సమావేశానికి హాజరవలేదు. అందువల్ల ఇప్పుడు కూడా ఆ పార్టీ అదే వైఖరి అవలంబించవచ్చును.   వైకాపా మొదటి నుండి ఈ తీర్మానం కోసమే పట్టుబడుతునందున, ఇప్పడు అది సభలో ప్రవేశపెట్టబడినట్లయితే దానికి మద్దతు ఈయకుండా తప్పించుకోవడం కూడా కష్టమే. అలాగని మద్దతు ఇస్తే దానివలన ముఖ్యమంత్రికే మరింత పేరు వస్తుంది తప్ప వైకాపాకు రాదు. సీమాంధ్రలో ఏకైక సమైక్యచాంపియన్ గా నిలబడాలనుకొంటున్న జగన్మోహన్ రెడ్డి, ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తనకు పోటీగా తయారవ్వాలని కోరుకోరు. అదీగాక, రాష్ట్ర విభజన జరిగితే తప్ప వైకాపాకు రాజకీయ లబ్ది కలుగదు. ఈ తెర్మానానికి మద్దతు ఇస్తే అది విభజనకు అడ్డంకులు సృష్టిస్తే, ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరుగకపోతే వైకాపా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గనుక ఒకవేళ సభలో మంత్రి శైలజానాథ్ రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ తీర్మానం ప్రవేశపెట్టినా దానికి వైకాపా ఏవో కుంటి సాకులు చెప్పి మద్దతు ఈయకుండా తప్పుకోవచ్చును.   ఇది వైకాపాకు చాలా ఇబ్బంది కలిగించే విషయమే. కానీ, టీ-కాంగ్రెస్, తెరాస శాసనసభ్యులు ఆ తీర్మానం సభలో ప్రవేశపెట్టకుండా సభను ఎలాగూ స్తంభింపజేస్తారు గనుక, వైకాపాకు ఇక దాని గురించి ఎటువంటి దిగులు ఉండదు. కావాలంటే తను కూడా వాళ్ళతో చేరి సమైక్యతీర్మానం ప్రవేశపెట్టమని గొడవ చేస్తూ సభను స్తంభింపజేసి వాయిదాపడేలాచేయవచ్చు.

శ్రీధర్ బాబుకి జలక్ దేనికో?

  ఇంతకాలం గట్టిగా సమైక్యవాదం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభకు తెలంగాణా బిల్లురాగానే చాలా వీరోచితంగా పోరాడి బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చేస్తారని ఆశిస్తే, ఆయన చప్పగా చల్లారిపోవడం చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నిన్నఆ పదవి నుండి తప్పించి, ఆ శాఖను తన అనుచరుడు మంత్రి ఎస్‌.శైలజానాద్‌కు అదనపు బాధ్యతగా అప్పగించారు. సరిగ్గా మరో రెండు రోజుల్లో శాసనసభ మళ్ళీ సమావేశాలు మొదలవనున్న ఈ సమయంలో తెలంగాణా బిల్లును సభలో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్న శ్రీధర్‌బాబును ఆ పదవి నుండి తప్పించడం ద్వారా రాజకీయాలలో మళ్ళీ ఒక్కసారిగా వేడి పుట్టించారు.   అధిష్టానం ఆమోదముద్ర లేనిదే రాష్ట్ర మంత్రుల నియామకాలు, వారి శాఖల మార్పులు చేయ సాహసించని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండానే కీలకమయిన ఈ సమయంలో ఒక తెలంగాణా మంత్రిని శాఖ నుండి తప్పించడం మరోమారు అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంగానే భావించవచ్చును. దానివల్ల సీమాంధ్ర ప్రజలో దృష్టిలో ఆయన మళ్ళీ సమైక్యహీరోగా మరికొన్ని మార్కులు సంపాదించుకోవచ్చును.   అంతే గాక ఈ నిర్ణయం తెలంగాణా నేతలందరికీ ఆగ్రహం తెప్పించడం సహజమే గనుక రేపు వారందరూ సభలో ఆయనపై మూకుమ్మడిగా ఎదురుదాడి చేస్తున్నపుడు, ముఖ్యమంత్రి పద్మవ్యూహంలో అభిమన్యుడులాగ వారినందరినీ వీరోచితంగా ఎదుర్కొని పోరాడడం ద్వారా ఈ మధ్య కాలంలో మసకబారిన తన సమైక్య చాంపియన్ ట్రోఫీకి మళ్ళీ కొత్త మెరుపులు ఆద్దుకొనే అవకాశం కూడా ఆయనకు కలుగుతుంది. ఇవన్నీఆయన కొత్త పార్టీకి ప్రజల సానుభూతిని, మద్దతుని సంపాదించిపెడతాయి కూడా.   ఇక రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న శైలజానాథ్ కు శాసనసభా వ్యవహారాల మంత్రిత్వ శాఖను కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి ఆయన అనుచరులు ఈసారి సభలో తెలంగాణా బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. అయితే ఓటింగు కూడా అవసరం లేని బిల్లుని వారు ఎంతగట్టిగా వ్యతిరేఖించినా దానివల్ల బిల్లుపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదు. బిల్లుపై వ్యతిరేఖతకు సిద్డంపడిన తరువాతనే కేంద్రం దానిని శాసనసభకు పంపింది గనుక కాంగ్రెస్ అధిష్టానానికి ఇదేమి ఆందోళన కలిగించే విషయం కాదనే చెప్పవచ్చును. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు బిల్లుపై చర్చకు సిద్దమయినప్పటికీ, సభలో సమైక్యతీర్మానం చేసేవరకు సభను నడవనీయమని జగన్మోహన్ రెడ్డి చెపుతునందున సభలో చర్చజరగడం అనుమానాస్పదమే. కానీ, ముఖ్యమంత్రికి సభలో చర్చ జరిపే ఉద్దేశ్యం ఉంటే, వైకాపా సభ్యులతో సహా సభలో ఆందోళన చేస్తున్నవారిని సస్పెండ్ చేయవలసి ఉంటుంది. వైకాపా, తెదేపా సీమాంధ్ర సభ్యులు కూడా బహుశః అదే కోరుకొంటునట్లయితే, వారు సభ నుండి బహిష్కరింపబడగానే, మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ పార్టీలపై రంకెలు వేసి తృప్తి పడవచ్చును.   ఈసారి సమావేశాలలో జరిగిన పరిణామాలను బట్టి, మళ్ళీ శాసనసభ జనవరి16న చివరిసారిగా సమావేశమయినప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు అంతిమ పోరాటం చేసి, ముందు నుండి అనుకొన్న విధంగానే బిల్లును శాసనసభ గుమ్మం వరకు సాగనంపి, రాజీనామాలు చేసి, కొత్త జెండా పట్టుకొని ప్రజల ముందు రావచ్చును.

శ్రీధర్ బాబుపై కిరణ్ బౌన్సర్...'టి' నేతలకు ఝలక్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త సంవత్సరం రోజున మంత్రి శ్రీధర్ బాబుపై బౌన్సర్ విసిరి తెలంగాణ నేతలకు ఝలక్ ఇచ్చారు. శ్రీధర్‌బాబు ను శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించి... సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్వీనర్‌గా, సమైక్య పోరుకు నేతృత్వం వహిస్తున్న శైలజానాథ్‌కు ఆ శాఖను అప్పగించారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నడనే కోపంతోనే శ్రీధర్‌బాబుకు సీఎం కిరణ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై మంత్రి శ్రీధర్‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నుంచి శాసనసభా వ్యవహారాల శాఖను తప్పించడాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామన్నారు. "ఇలాంటి సమయంలో అదనపు శాఖలు అవసరంలేదు. అసలు ఏ శాఖలూ లేకున్నా ఫర్వాలేదు' అని ఆయన వ్యాఖ్యానించారు. శాసన సభా వ్యవహారాల మంత్రిత్వశాఖ బాధ్యతల నుంచి శ్రీధర్‌ను తప్పించడంపై తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. ఇది సీఎం అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు నుంచి శాఖ తొలగించినందుకు నిరసనగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బంద్ నిర్వహిస్తండడం విశేషం.

‘ఆప్‌’లోకి ‘పాప్‌’...

      భారతదేశంలోకి పాప్‌ ఎప్పుడు వచ్చిందంటే ఎవరూ చటుక్కున చెప్పలేరేమో కాని... పాప్‌ సింగర్‌ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు రెమో ఫెర్నాండెజ్‌. హిందీ పాప్‌ సింగర్‌గా సంచలనానికి నాంది పలికిన రెమో... తెలుగుతో సహా విభిన్న భాషల్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా బోలెడన్ని పాటలు పాడారు. ఆల్బమ్‌లు విడుదల చేశారు. అవార్డులు అందుకున్నారు. సంగీత సంబరాలకు నిత్య నిలయమైన గోవానగరంలో పుట్టిన ఈ ఆల్‌ ఇండియా సింగర్‌... ఇప్పుడు మరో సంచలనానికి తెర తీశారు.   అదేమిటంటే ఆమ్‌ ఆద్మీ పార్టీలోకి చేరడం. ‘‘స్వాతంత్య్ర పోరాటం అవసరమైనంతటి పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది’’ అని అంటున్నారు రెమో. ఆ పోరాటంలో తన వంతు పాత్ర  పోషించాలని అనుకున్నా... అందుకు తగిన వేదికగా మరే పార్టీ ఆయనకు కనపడకపోవడంతో ఇన్నాళ్లూ ఊరుకున్నారు. అయితే ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ ఆవిర్భావం, విజయం సాధించడం తన లక్ష్యాలకు ఆప్‌ తగిన పార్టీ అని అనిపించడంతో... ఆయన ఆ పార్టీలోకి జేరిపోతున్నట్టు ప్రకటించారు. మొత్తానికి ఆప్‌ అమ్ములపొదిలో తొలి వినోద బాణం చేరిందని మనం చెప్పుకోవచ్చు.

కడప పేరు వింటేనే భయపడేలా చేశారు: చంద్రబాబు

      వైఎస్‌ హయంలో కడప అనే పేరు వింటేనే భయపడేలా చేశారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కబ్జా చేశారన్న కారణంగా జూబ్లీహిల్స్‌లో అధికారులు కూల్చివేసిన ఇంటిని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ విషయంలో కడప మేయర్‌ రవీంద్రనాధ్‌రెడ్డికి ఎదురొడ్డి నిలిచి కడవరకూ పోరాడి, గెలిచిన నీరజారావును ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తన హయంలో ఎంతో కష్టపడి, బోర్డులు పెట్టి కాపాడిన భూములన్నీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్రమార్కుల పాలు చేసిందన్నారు. వైఎస్‌ హయంలో హైదరాబాద్‌లో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వేల ఎకరాలు కబ్జా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియాతో పోరాడడం అంటే మామూలు విషయం కాదని, ఈ విషయంలో నీరజారావు ధైర్యం ఎంతైనా ప్రశంసనీయమైనదని అన్నారాయన.

కాంగ్రెస్ పార్టీపై అవినీతి పిడుగు

  కాంగ్రెస్ పార్టీకి అవినీతికి ఉన్నఅవినాభావ సంబంధం గురించి ప్రజలకు కొత్తేమీ కాకపోయినా, ఈ మధ్యకాలంలో యువరాజు రాహుల్ గాంధీ వారికి అవినీతి పూనకం (అంటే అవినీతికి వ్యతిరేఖంగా లెక్చర్లు ఇవ్వడం) రావడంతో, కొంపదీసి ఆయన మాటలకు తలొగ్గి కాంగ్రెస్ నేతలందరూ నిజంగానే అవినీతిని విడిచిపెట్టేయబోతున్నారా? అని ప్రజలు ఒకటే అనుమానంపడిపోసాగారు. కానీ, మీకా భయం అక్కరలేదని కాంగ్రెస్ తరపున బీజేపీ నేతలు లికితపూర్వకంగా హామీ ఇచ్చారు.   హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన అర్ధాంగి ప్రతిభా సింగ్ ఇద్దరూ కూడా గతంలో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించలేక చేతేలేత్తేసిన వెంచర్ ఎనర్జీ కంపెనీ అనే ఒక ప్రైవేట్ విద్యుత్ సంస్థ వద్ద నుండి రూ.1.5కోట్లు, రూ.2.4 కోట్లు (మాత్రమే) ముడుపులు పుచ్చుకొని, దానికి మళ్ళీ పనులు మొదలుపెట్టడానికి అనుమతులు మంజూరు చేసారని, అంతే గాక సదరు కంపెనీకే చెందిన వేరే సంస్థ- తరిణి ఇన్ఫ్రా కంపెనీలో వీరభద్ర సింగ్ భార్య, కుమారుడు విక్రమాదిత్య సింగ్, కుమార్తె అపరాజిత కుమారిలు వాటాదారులుగా ఉన్నారని అన్ని ఆధారాలతో సహా బీజేపీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి పది పేజీల లేఖ వ్రాసిపడేసి, ఈ అవినీతి భాగోతం గురించి గురించి సోనియా, రాహుల్ గాంధీలు ఏమి జవాబు చెప్తారంటూ ప్రశ్నిస్తోంది. ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కోరిన రాహుల్ గాంధీ మరి వీరభద్ర సింగ్ ముడుపుల వ్యవహారంపై కూడా పెదవి విప్పుతారా లేదా? అని బీజేపీ నిలదీస్తోంది.   అయితే షరా మామూలుగానే కాంగ్రెస్ ముందుగా ఆ ఆరోపణలను గట్టిగా ఖండించేసి పడేసింది. మరీ అంత ముచ్చటాగా ఉంటే ఆ కాయితాలు, సాక్ష్యాలు పట్టుకొని ఏ కోర్టుకో  సీబీఐ దగ్గరకో వెళ్ళండి కానీ మమ్మల్ని మాత్రం విసిగించొద్దని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది. అదేవిధంగా వీరభద్ర సింగ్ కూడా నేను, నా పెళ్ళాం పిల్లలు ఏ పాపం ఎరుగమని, కావాలంటే ఏ విచారణకయినా సిద్దం అని ఒక ఖండన ప్రకటన ఒకటి పడేసి చేతులు దులుపుకొన్నారు. ఇక మరో నాలుగు నెలలో దిగిపోయేవాడిని నాకెందుకు ఈ గొడవ? అనుకొంటూ మన్మోహన్ సింగ్ తన మౌనవ్రతంలో మునిగిపోయారు. కానీ, బీజేపీ మాత్రం ఇంతవీజీగా నిన్నొదల బొమ్మాళీ అంటూ కాంగ్రెస్ వెంట పడుతూ ఒకటే వేదిస్తోంది. ఇదంతా చూసి రాహుల్ గాంధీకి గానీ మళ్ళీ మూడొచేస్తే తనకు మూడుతుందని పాపం వీరభద్ర సింగ్ బిక్కుబిక్కుమంటూ డిల్లీ వైపు చూస్తున్నాడు.

జగన్ పాట పాడుతున్న జేసీ

      రాష్ట్ర విభజన జరిగినా, సమైక్యంగా ఉన్నా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండనని ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 తర్వాత తన రాజకీయ భవిష్యత్తు చెబుతానని, ఏ పార్టీలోకివెళ్లేదీ తెలియచేస్తానని చెప్పారు. ఇప్పటికీ తనకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి షోకాజ్ నోటీస్ అందలేదన్నారు. ఒకవేళ అందినా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. "ఇప్పటికీ వైసీపీలో మా కుటుంబానికి తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఆ పార్టీ తరపున మాకు రావచ్చు. ప్రస్తుతం వైసీపీలో ప్రకటించిన వారికి గానీ, మరొకరికి గానీ పార్టీ టికెట్ ఇస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పటికీ వైసీపీతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి.

కిరణ్ కాంగ్రెస్ కోసం రెబల్స్ ఎదురుచూపులు

  ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ మొన్ననే మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పుకొన్నారు. కనీసం 25మంది శాసనసభ్యులు మరో కొందరు మంత్రులు కూడా త్వరలోనే పార్టీలో నుండి వేరే పార్టీలలోకి జంప్ అయిపోనున్నారని బల్లగుద్దీ మరీ చెప్పారు. అయితే వారిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారా లేదా? అనే సంగతి కూడా చెప్పి పుణ్యం కట్టుకొని ఉంటే, ఆయన కొత్త పార్టీ పెడతారని ఆశగా ఎదురుచూస్తున్నవారి నోట్లో పంచదార పోసినట్లయ్యేది.   వారిలో చాలా మంది తమకు సరిపడని జగన్మోహన్ రెడ్డితోనో, లేక తమ రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబుతోనో సర్దుకుపోవడం కంటే, ఒకటే బ్లడ్ గ్రూప్, ఒకటే బ్లడ్ కల్చర్, ఒకటే డీ.యన్.యే. ఉన్న కిరణ్ కుమార్ రెడ్డితోనే సర్దుకుపోవడమే సులువని భావిస్తు, జనవరి23 ముహూర్తం కోసం కళ్ళు కాయలు కాసేలా, చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు పాపం.   చివరికి రాయపాటి, లగడపాటి, ఉండవల్లి వంటి సీనియర్ రాజకీయ నేతలు కూడా ఎంతసేపు కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో ఎక్కి ఈ ఎన్నికల వైతరిణిని దాటేద్దామని ఆశపడుతున్నారు తప్ప వారిలో ఎవరూ కూడా స్వయంగా పార్టీ పెట్టే ఆలోచన చేయడం లేదు. తమకంటే చాలా జూనియర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే, ఆయన క్రింద ఇంతమంది సీనియర్లు పనిచేసేందుకు సిద్దపడుతుండటం చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇదంతా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డితో సహా అందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకొంటున్నారనే అనుమానం కలుగుతోంది.   రాష్ట్ర విభజన చేస్తే సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేఖత ఎదురవుతుందని, దానివల్ల పార్టీకి తీవ్రంగా నష్టం కలుగుతుందని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకపోదు. బహుశః అందుకే రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ “పార్టీని రెండు ప్రాంతాలలో ఏవిధంగా గెలిపించుకోవాలో మాకు తెలుసు. అందుకు తగిన వ్యూహాలు మావద్ద ఉన్నాయని” ధీమా వ్యక్తం చేసారు.   ఇంతవరకు ఈ కాంగ్రెస్ అధిష్టాన వ్యతిరేఖ వర్గమంతా కలిసి రాష్ట్రవిభజనకు పూర్తి సహకారం అందించారు. జనవరి23తో అధిష్టానం తమకు అప్పజెప్పిన ఆ పని కూడా పూర్తి చేసిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ తిరుగుబాటుదారులందరూ కొత్త జెండా పట్టుకొని ఎన్నికలలో పోటీచేయడం, కాంగ్రెస్ వ్యతిరేఖతను ఓట్లుగా మలచుకొని ఎన్నికలలో గెలిచిన తరువాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడమే ఆ వ్యూహం అయ్యిఉండవచ్చును.   ఆ ప్రయత్నంలో భాగంగానే వారందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానం తమను, ప్రజలను కూడా చాలా అన్యాయం చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమయిపోతుందని అంటూ కాంగ్రెస్ ను తిట్టిపోస్తూ ప్రజల సానుభూతిని, కాంగ్రెస్ పట్ల వ్యతిరేఖతను పెంచి పోషిస్తున్నారు. అందరూ కలిసి పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నా కూడా పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఎవరిమీద మీద ఇంతవరకు ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలను దృవీకరిస్తోంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళందరూ పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు తప్ప సోనియాగాంధీని విమర్శించడం లేదు. పార్టీలో అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని బొత్స వారిని వెనకేసుకొని వస్తున్నారు. అంటే కిరణ్-కాంగ్రెస్ లో జేరెందుకు ఆలోచిస్తున్నవారు మాత్రం నేటికీ పార్టీ క్రమశిక్షణ అధిగమించడం లేదని, వేరే పార్టీలలో టికెట్స్ ఖరారు చేసుకొన్నవారే కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్నికించపరుస్తున్నారని అర్ధం అవుతోంది. బహుశః అందుకే జేసీ దివాకర్ రెడ్డికి షో-కాజ్ నోటీసులు జారీచేసారు. మిగిలిన వారు పార్టీకి ఎంత నష్టం కలిగిస్తున్నాదానిని అభిప్రాయ వ్యక్తీకరణ పద్దులో వ్రాసి అడ్జస్ట్ చేస్తున్నారు. బహుశః జనవరి23 తరువాత కిరణ్ కొత్త పార్టీ పెట్టగానే, అప్పుడు బొత్ససత్యనారాయణ వారందరి మీద మూకుమ్మడిగా క్రమశిక్షణ చర్యలు తీసుకొంటారేమో!

పాలిటిక్స్‌లో పవనిజం... పెళ్లితో ఖతం...

      పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మరోసారి వార్తల్లోకి వచ్చారు.. గత కొంతకాలంగా సినిమాల హిట్స్‌ పరంగా, ఆ తర్వాత పవనిజం అనే కొత్త స్లోగన్‌తోనూ మీడియా నోళ్లలో నానుతున్న ఈ హీరో... ఇటీవలే రాజకీయనేత అవతారం ఎత్తనున్నాడని కూడా బాగా వినిపించింది. తెలుగుదేశం పార్టీలోకి రానున్నాడని మీడియా కధనాలు వెల్లడిరచాయి. అవన్నీ ఒకెత్తయితే... ఇప్పుడు మూడో పెళ్లితో పవన్‌ మరో సంచలనానికి కారణమయ్యారు.   అయితే విశేషం ఏమిటంటే గతంలో వచ్చిన కధనాలు ఒకదాని పునాది మీద ఒకటి పుట్టుకొస్తే... ఇప్పుడు వెల్లడైన నిజం... ఆ కధనాల్లో చాలా వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేదిలా ఉండడం. ముఖ్యంగా పవన్‌ వరుస పెళ్లిళ్లు ఆయనకు మహిళల్లో ఉన్న ఫాలోయింగ్‌ను దెబ్బతీయనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వల్పవ్యవధిలోనే పెళ్లిళ్లు, విడాకులు అంటూ ఈ కొణిదల వారసుడు చెలరేగిపోవడం మరింతగా అతని ఇమేజ్‌కు మచ్చ తేనుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో... అసలే అంతంత మాత్రపు ఆశలతో రేపటి ఎన్నికలకు వెళుతున్న రాజకీయ పార్టీలు పవన్‌కళ్యాణ్‌ను రమ్మనడం మాట అటుంది అతను వస్తే పారిపోయే అవకాశం లేకపోలేదని పలువురు జోస్యం చెబుతున్నారు. అలాగే పవనిజం అంటూ వెర్రెత్తిపోతున్న అభిమాన సందోహానికి కూడా ఇదొక ఎదురుదెబ్బేనని, పవనిజం అంటే పూటకొకర్ని పెళ్లి చేసుకోవడమేనా అంటూ ఇతర హీరోల అభిమానులు, పవన్‌ ప్రత్యర్థులు ప్రచారం చేసే ప్రమాదం ఉంది కనుక... పెళ్లి అనే నిజం దెబ్బకు మిగతావన్నీ హాంఫట్‌ అయిపోవడం ఖాయమని తేల్చేస్తున్నారు. వీటన్నింటి నేపధ్యంలో తన పెళ్లి వార్తలపై పవన్‌ ఎలా స్పందిస్తారనేదానిపైనే రేపటి పవన్‌ భవిష్యత్తు అడుగు ఆధారపడి ఉందనేది నిర్వివాదం.  

విభజన...‘విడిది’

      గతంలో శీతాకాల విడిదికి గాను హైదరాబాద్‌కు వచ్చిన ఏ రాష్ట్రపతికీ ఈ తరహా అనుభవం ఎదురై ఉండదు. దీనికి కారణం రాష్ట్రంలో నెలకొన్న విభజన పరిస్థితులే. గందరగోళంగా రాష్ట్ర పరిస్థితి రాష్ట్రపతి నిలయాన్ని కేంద్రంగా మార్చుకోవాలని చూస్తుండడంతో... విశ్రాంతి నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రణబ్‌ముఖర్జీ... ఫుల్‌ బిజీగా మారిపోయారు. పార్టీల వారీగా వచ్చేవారు కొందరు, వ్యక్తిగతంగా వచ్చేవారు మరికొందరు... గుట్టల కొద్దీ వినతిపత్రాలు, అర్జీల మీద అర్జీలు వచ్చి పడుతుంటే పాపం...ఏం చేయాలో తెలియక ఓపికగా అందర్నీ ఆహ్వానిస్తున్నారు. దీంతో నగరంలోని రాష్ట్రపతినిలయం ఎప్పుడూ లేనంత సందడిగా మారింది.     మామూలుగా అయితే ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతిని కలవడం అంటే అంత తేలికైన విషయం కాదు. పైగా అసలు ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకడమే గగనం. ఎంతో వ్యయప్రయసలకు ఓర్చుకుని అక్కడి దాకా వెళ్లినా అక్కడ ఉండే బిజీ కారణంగా రాష్ట్రపతి ఇచ్చే సమయం ఏదో కొన్ని నిమిషాలకు మించి ఉండదు. వీటన్నింటిని బేరీజు వేసుకున్న పార్టీలు, వ్యక్తులు... విడిదిలో బస పూర్తయిపోయేలోగా... తమ పని చక్కబెట్టేసుకోవాలని ఆరాటపడుతున్నారు. నిజానికి విభజనకు సంబంధించినంత వరకూ ఇరు ప్రాంతాల నేతలు చేస్తున్న వాదనలు, వినిపిస్తున్న అంశాలు కొత్తవీ కావు... ఇప్పటిదాకా ప్రణబ్‌కు తెలియనివీ కావు. మరెందుకీ ఆరాటం అంటారా? అదేనండీ మైలేజీ. నిజానికి తామే సమైక్యవాద ఛాంపియన్‌లం అని నిరూపించుకోవాలని తహతహలాడుతున్నవారు అందుకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోదలచుకోవడం లేదు. వారే ఈ మార్గం కనిపెట్టారు. అది మరెందరికో దారి చూపింది. ముక్కలు చెక్కలుగా విడిపోయిన సమైక్యవాదులు... ఒకరొకరుగా రాష్ట్రపతిని కలిసి వచ్చి, ఆ విషయాన్ని మీడియాకు వెళ్లడిస్తూ బోలెడంత మైలేజీ తెచ్చేసుకుంటుంటే... కంగారుపడిపోయిన ప్రత్యేకవాదులు కూడా అదే బాట పట్టారు. అందుకోసం అప్పటికప్పుడు ఉమ్మడిరాజధానిని రెండేళ్లు కుదించాలనే సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చి మరీ రాష్ట్రపతిని కలిసొచ్చారు. గతంలో పదేళ్ల ఉమ్మడికి ఒప్పుకున్న నాయకులు ఇప్పటికిప్పుడు రెండేళ్ల డిమాండ్‌ తేవడం విచిత్రమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ‘వాదుల’ హోరు చూస్తున్న మరికొందరు వ్యక్తులు పలు రకాల సంస్థలు, సంఘాలు అప్పటికప్పుడు తమ డిమాండ్లను గుర్తు తెచ్చుకుని ఛలో రాష్ట్రపతి నిలయం అంటున్నారు. ఏదేమైనా... నేతల ప్రచార కండూతి కాస్త తగ్గితే ఆ మేరకు ఈ శీతాకాలవిడిది రాష్ట్రపతికి విశ్రాంతిని ఇస్తుంది.  

ఆంధ్ర, తెలంగాణాలలో మారిన రాజకీయ బలాబలాలు

  మూడేళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రకటన చేయగానే సీమాంధ్ర నేతలందరూ పార్టీలకతీతంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గక తప్పలేదు. సీమాంధ్ర నేతలు కేంద్ర నిర్ణయాన్ని సైతం మార్చగలగడంతో వారి శక్తిపై సీమాంధ్ర ప్రజలకు అపారమయిన నమ్మకం, విశ్వాసం ఏర్పడ్డాయి. ఆ తరువాత తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్నతరుణంలో టీ-కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీలు, జేయేసీలు కలిసి పనిచేస్తూనే ఒకరితో మరొకరు కీచులాడుకొంటుంటే, ఇంత అనైక్యంగా ఉన్నవీరు తెలంగాణా సాధించేనా? అని అందరూ పెదవి విరిచారు. సీమాంధ్ర నేతల శక్తి యుక్తులపై ప్రజలకున్నఅపార నమ్మకం వల్ల, తెలంగాణా ప్రజలు, పార్టీలు ఎంతగా పోరాడినా తెలంగాణా ఏర్పడే అవకాశం లేదనే ధీమా కూడా ఉండేది. బహుశః ఆ ధీమాతోనే అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు కూడా ఇచ్చాయి.   అయితే తెలంగాణా ప్రజల అలుపెరగని పోరాటాల వల్లనయితేనేమి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే సోనియా గాంధీ దృడసంకల్పం వల్లనయితేనేమి, రాష్ట్రంలో ప్రత్యర్ధ రాజకీయ పార్టీలను దెబ్బతీయాలనే కాంగ్రెస్ దురాలోచన వల్లనయితేనేమి, సీమాంధ్ర మంత్రుల, యంపీల సహకారం వల్లనయితేనేమి మొత్తం మీద హటాత్తుగా రాష్ట్ర విభజనకి, తద్వారా తెలంగాణా ఏర్పాటుకి రంగం సిద్దమయిపోయింది.   అయితే మరి సర్వశక్తివంతులనుకొన్న సీమాంధ్ర నేతలందరూ ఈసారి ఎందుకు విఫలమయ్యారు? అనే ప్రశ్నకు జవాబు అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన జరుగుతోందని చాలా ముందే కాంగ్రెస్ నేతలందరికీ తెలిసినప్పటికీ, వారిలో కొంతమంది మంత్రి పదవులకు, మరికొందరు పార్టీ టికెట్లకు, కాంట్రాక్టులకు అమ్ముడుపోయారనేది బహిరంగ రహస్యం. అంటే తెలంగాణా సాధనకు తెలంగాణా ప్రజల కృషి పట్టుదల ఎంత ఉందో, అందుకు సరిసమానంగా సీమాంధ్ర యంపీలు, మంత్రులు, నేతల సహకారం కూడా ఉందని అంగీకరించక తప్పదు. మళ్ళీ వారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమను అన్యాయం చేసిందని వాపోతూ అద్భుతంగా నటిస్తున్నారు.   ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాలో రాజకీయపార్టీల పరిస్థితి పూర్తిగా తారుమరయ్యింది. ఒకప్పుడు ఐకమత్యంగా ఉన్న సీమాంధ్ర నేతలు, పార్టీలు ఇప్పుడు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా విడిపోవడమే కాకుండా, సీమాంధ్రపై పట్టుకోసం ఎంతకయినా దిగజారేందుకు వెనకాడటం లేదు. వచ్చేఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ల కోసం, పార్టీలను, సిద్ధాంతాలను అన్నిటినీ పక్కనబెట్టి అటూఇటూ పరుగులు తీస్తున్నారు.   ఇక తెలంగాణాలో పార్టీల నేతలందరూ ఇంతవరకు వచ్చిన తెలంగాణాను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోనీయకూడదనే గట్టి పట్టుదలతో తమ విభేదాలను, పార్టీ జెండాలను కూడా పక్కనబెట్టి సమైక్యంగా ముందుకు కదులుతున్నారు. వారు ఇప్పుడు సీమాంధ్ర నేతలను ఎదుర్కోవడం తమకు పెద్ద సమస్య కాదనే పూర్తి నమ్మకంతో ఉన్నారు. సీమాంధ్ర నేతలలో చిత్తశుద్ధి కొరవడిందనే సంగతి గ్రహించడమే అందుకు కారణం.   తెలంగాణా బిల్లుని శాసనసభలో ఓడిస్తామని, లేకుంటే పార్లమెంటులో ఓడిస్తామని, ఇంకా కుదరకుంటే రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించి ఆయన మనసు మార్చేస్తామని, లేకుంటే సుప్రీం కోర్టులో కేసులు వేసి ఆపేస్తామని ఇలా ఏవేవో కట్టు కధలు, పిట్ట కధలు సీమాంధ్ర నేతలు చెపుతూనే ఉన్నారు. అయితే వారి అసలయిన లక్ష్యం రాష్ట్ర విభజనను ఆపడం కాదు. ఆపడానికి తాము మాత్రమే చాలా గట్టిగా కృషి చేసామని చెప్పుకొంటూ వచ్చే ఎన్నికలలో ప్రజల ఓట్లు దండుకోవడమే. మొన్న శాసనసభ సమావేశాలప్పుడు వారందరూ ప్రవర్తించిన తీరు అనుసరించి వ్యూహాలే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును.    ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా సాగుతున్నఈ వికృత రాజకీయ క్రీడని బహుశః రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా ఎన్నికలు పూర్తయ్యేవరకు వారు ఆడుతూనే ఉంటారు. అందుకు ప్రజలు తగిన ప్రతీకారం తీర్చుకోదలిస్తే తమను ఇంతగా మోసం చేసినవారు ఏ పార్టీలో చేరినా వారిని నిర్దాక్షిణ్యంగా ఓడించడమోకటే మార్గం.