కాంగ్రెస్ మద్దతు తాత్కాలికమే: ఆమాద్మీ
posted on Dec 23, 2013 @ 3:34PM
ఆమాద్మీ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తామని గవర్నర్ కు లేఖ వ్రాసిన కాంగ్రెస్ పార్టీ, తీరా చేసి ఆమాద్మీ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధంకాగానే, తామేమీ బేషరతుగా మద్దతు ఇస్తామని వాగ్దానం చేయలేదని మాట మార్చింది. ఇక కాంగ్రెస్ చేతిలోంచి డిల్లీని గుంజుకోవాలని విశ్వప్రయత్నం చేసి, దానికి ఆమాద్మీతన చీపురు కట్ట అడ్డం వేయడంతో కంగు తిన్నబీజేపీ, తమ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోనేందుకే కాంగ్రెస్ అమాద్మీకి మద్దతు ఇస్తోందని ఆక్రోశిస్తోంది.
ఎన్నికలలో కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టిన ఆమాద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతి పార్టీతో అధికారం కోసం చేతులు కలిపి డిల్లీ ప్రజలను మోసం చేశాయని ఆరోపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆమాద్మీ పార్టీకి ఎంతో కాలం మద్దతు ఈయకపోవచ్చని బీజేపీ జోస్యం చెప్పింది.
బీజేపీ జోస్యం నిజమయ్యే అవకాశం ఉందని దృవీకరిస్తూ అమాద్మీకి చెందిన ప్రశాంత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ, “మాకు కాంగ్రెస్ ఎంత కాలం మద్దతు కొనసాగిస్తుందో మాకు అనుమానమే. అది ఒక నెలా నాలుగు నెలలా లేక ఆరు నెలలా? అనేది దానినే నిర్ణయించుకోనివ్వండి. కానీ మేము మాత్రం కాంగ్రెస్ ఎటువంటి షరతులు పెట్టినా అంగీకరించబోము. మా ఎన్నికల మ్యానిఫెస్టోని మేము ఖచ్చితంగా అమలుచేసి తీరుతాము."
"ఒకవేళ కాంగ్రెస్ నచ్చకపోతే ఎప్పుడయినా మద్దతు ఉపసంహరించుకావచ్చును. అందుకు సిద్దపడే మేము ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమవుతున్నాము. అయితే మాకున్న కొద్దిపాటి వ్యవధిలో కూడా దేశంలో ప్రజాభిప్రాయాలకి అనుగుణంగా కూడా పరిపాలన చేయవచ్చని నిరూపించబోతున్నాము,” అని అన్నారు.
బహుశః వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించగానే కాంగ్రెస్ ఏవో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటి సాకులు చెప్పి అమాద్మీకి తన మద్దతు ఉపసంహరించవచ్చును. ఆవిధంగా అయితే, మళ్ళీ డిల్లీలో ఎన్నికలు నిర్వహించి, ఈ నాలుగు నెలలో అమాద్మీ ప్రభుత్వం చేసిన తప్పుల లిస్టు గురించి ప్రచారం చేసుకొని డిల్లీలో మళ్ళీ అధికారం చెప్పట్టే ప్రయత్నం చేయవచ్చును.