ముఖ్యమంత్రి టీ-బిల్లుకి వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తారా?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ నిన్న డిల్లీలో ధర్నాచేసి, రాష్ట్రపతి విజ్ఞప్తి పత్రం అందించడంతో ఆయన పోరాటంలో మరొక ముఖ్యమయిన అధ్యాయం ముగిసింది గనుక, తరువాత ఆయన ఏమి చేయబోతున్నారని ప్రజలు, రాజకీయ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రాష్ట్ర విభజన బిల్లు రేపు రాష్ట్రపతి వద్దకు వెళ్ళబోతోంది. గనుక బహుశః దానిపై ఆయన ప్రతిస్పందన చూసిన తరువాత ముఖ్యమంత్రి రంగంలోకి దిగవచ్చును. ఒకవేళ రాష్ట్రపతి బిల్లుని యధాతధంగా ఆమోదించి కేంద్రానికి పంపిచినట్లయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా కానీ లేదా రాష్ట్రప్రభుత్వం తరపున గానీ లేదా వేరెవరిద్వారానయినా సుప్రీంకోర్టులో బిల్లుకి వ్యతిరేఖంగా పిటిషను వేయవచ్చును. అయితే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వం తరపున కోర్టులో పిటిషను వేయాలంటే క్యాబినెట్ లో మంత్రులందరి ఆమోదం ఉండాలని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గనుక బహుశః అది సాధ్యం కాకపోవచ్చును. కానీ, రాష్ట్రప్రభుత్వం తరపున కేసు దాఖలయినప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది గనుక, ముఖ్యమంత్రి ఏదో విధంగా రాష్ట్రప్రభుత్వం తరపునే కోర్టులో కేసు వేసేందుకు ప్రయత్నించవచ్చును. అయితే, ఈ పరిణామాన్ని ముందే ఊహించిన ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించి రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించవద్దని ప్రభుత్వ కార్యదర్శికి ఒక లేఖ వ్రాసారు.
ఇక, ఆ తరువాత ఆయన కొత్త పార్టీ ఎప్పుడు స్థాపిస్తారనే ప్రశ్నవస్తుంది. రాష్ట్రపతి విభజన బిల్లుపై స్పందించిన తీరుని బట్టి న్యాయపోరాటం చేయాలా వద్దా? అనే సంగతి తేలుతుంది. ఒకవేళ ఆయన బిల్లుని యధాతధంగా కేంద్రానికి పంపిస్తే, న్యాయపోరాటం మొదలుపెట్టవలసి ఉంటుంది. అయితే అదేసమయంలో బిల్లు పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టబడుతుంది గనుక దానిపై ఈనెల 21న పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగానే ఖచ్చితంగా ఏదో ఒకటి తేలిపోతుంది. అందువల్ల ఆ తరువాతే కొత్తపార్టీకి ముహూర్తం ఖరారు కావచ్చును.
పార్లమెంటు సమావేశాలు ముగిసే సమయానికి ఐదు విషయాలపై పూర్తి స్పష్టత వస్తుంది.
1.రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుందా లేదా?
2. తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందా? లేక ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొంటుందా లేదా?
3. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ స్థాపిస్తారా లేక కాంగ్రెస్ లోనే కొనసాగుతారా?
4.ఎన్నికల షెడ్యుల్ విడుదల.
5.రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు.
అందువల్ల ఈ నెల 21నుండి రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల పొత్తుల ప్రకటనలు, ఆ వెంటనే అభ్యర్ధుల జాబితాల విడుదల, టికెట్ రాని అభ్యర్ధుల అలకలు, విమర్శలు, కప్ప గెంతులు, సమైక్య చాంపియన్ల ప్రదర్శనలు, రాజకీయ నాయకుల సభలు, సమావేశాలు, వారి ఊకదంపుడు ప్రసంగాలతో రాష్ట్రానికి ఎన్నికల కళ వచ్చేస్తుంది. గనుక, ముఖ్యమంత్రి ఆయన అనుచరులు కూడా అప్పుడు కొత్త పార్టీ స్థాపించాలా? లేక రాష్ట్ర విభజన జరగాకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలా? అనేదానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు.