పగలు ధర్నాలు, రాత్రి అధిష్టానంతో సమావేశాలు
posted on Feb 6, 2014 7:52AM
నిన్నజంతర్ మంతర్ వద్ద రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మౌన దీక్షలో పాల్గొన్నసీమాంధ్ర కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం, కావూరి తదితరులు నిన్న సాయంత్రం రాష్ట్ర విభజనను పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రుల బృందం (జీ.ఓ.యం) సమావేశానికి హాజరయి, తమ డిమాండ్స్ వారి ముందుంచి వాటిని కేంద్రం ఆమోదించినట్లయితేనే తాము రాష్ట్ర విభజనకు అంగీకరిస్తామని చెప్పారు. సాయంత్రంవరకు డిల్లీ వీధుల్లో రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా దీక్షలు చేసిన వారందరూ, మళ్ళీ సాయంత్రం జీ.ఓ.యం నిర్వహించిన సమావేశానికి హాజరయి కొన్ని షరతులతో రాష్ట్ర విభజనకు అంగీకరిస్తామని చెప్పడం వారి ద్వంద వైఖరికి అద్దంపడుతోంది. కానీ వారు ప్రతిపాదించిన ఏ ఒక్క డిమాండ్ ను కూడా జీ.ఓ.యం సభ్యులు అంగీకరించలేమని నిస్సహాయత వ్యక్తం చేయడంతో వారి పని వ్రతం చెడినా ఫలం దక్కనట్లుగా అయింది.
చిరంజీవి హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేయమని కోరారు. అది సాధ్యం కాదు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణాలో కలిపి రాయల తెలంగాణా ఏర్పాటు చేయాలని కోరారు. అదీ సాధ్యం కాదు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపాలని కోరారు. అదీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అదేవిధంగా వారు చేసిన మరికొన్ని డిమాండ్స్ కూడా నెరవేర్చడం సాధ్యం కాదని జీ.ఓ.యం సభ్యులు జైరాం రమేష్, నారాయణస్వామి, షిండే, మొయిలీలు స్పష్టం చేసారు. అంటే జీ.ఓ.యం గతంలో ఏ విధంగా రాష్ట్ర విభజన చేయాలని నిశ్చయించుకొందో అదేవిధంగానే చేసేందుకు సిద్దమవుతోందని అర్ధమవుతోంది.
మరి అటువంటప్పుడు మళ్ళీ సీమాంధ్ర కేంద్రమంత్రులతో ఈ చర్చలు, సమావేశాలు ఎందుకంటే వారిని బుజ్జగించి దారికి తెచ్చుకోవడానికేనని చెప్పక తప్పదు. రేపు పార్లమెంటులో తెలంగాణా బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు వారందరూ వ్యతిరేఖంగా ఓటు వేస్తామని బెదిరిస్తున్నారు గనుక వారిని బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ జీ.ఓ.యం సమావేశాలు, చర్చల డ్రామా మొదలుపెట్టింది. ఆ సమావేశానికి హాజరయిన కేంద్రమంత్రులు ఆ సంగతి గ్రహించలేని రాజకీయ అజ్ఞానులు కాదు. అంటే వారు ఇష్టపూర్వకంగానే హాజరయినట్లు భావించవలసి ఉంటుంది.
రాష్ట్ర విభజన అనివార్యమయినప్పుడు సీమాంధ్రకు న్యాయం చేకూర్చే విధంగా సరయిన ప్యాకేజీ వారు సాధించగలిగినా వారి చర్చలకు ఒక అర్ధం ఉండేది. కానీ, వారు కోరిన ఏ ఒక్క డిమాండ్ ను కూడా జీ.ఓ.యం సభ్యులు ఆమోదించలేమని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెపుతున్నపుడు వారు జీ.ఓ.యంతో సమావేశాలకు హాజరుకావడం చూస్తే అటు అధిష్టానం ఆగ్రహానికి, ఇటు ప్రజాగ్రహానికి గురి కాకూడదనే ఆలోచనతోనే వారు లోపాయికారిగా వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈవిధంగా వ్యవహరించడం వలన నష్టపోయేది వారే తప్ప ప్రజలు కాదనే జ్ఞానోదయం బహుశః ఎన్నికల సమయంలోనే కలుగుతుందేమో.