తెలంగాణాపై ప్రధాని భరోసా ఇచ్చేరుట!
posted on Feb 5, 2014 @ 6:39PM
కొద్ది సేపటి క్రితం ప్రధాని డా. మన్మోహన్ సింగుని టీ-కాంగ్రెస్ నేతలు కలిసి ఈ పార్లమెంటు సమావేశాలలోనే తెలంగాణా బిల్లును ఆమోదింపజేయాలని విజ్ఞప్తి చేసారు. ఆ తరువాత మంత్రి జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా బిల్లుపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని, పార్లమెంటులో బిల్లుని ఆమోదింపజేసేందుకు కృషిచేస్తున్నామని ప్రధాని తమకు హామీ ఇచ్చారన్నారు. అయితే ఈ రాష్ట్ర విభజన వ్యవహారంలో ఎన్నడూ తలదూర్చే ప్రయత్నం చేయని వారిలో ఆయన కూడా ఒకరు. ఆయన దేశానికి ప్రధాని మంత్రి అయినప్పటికీ, ఏనాడు తెలంగాణా ఉద్యమాల గురించి కానీ, వారి ఆకాంక్షల గురించి గానీ, ఆ తరువాత మొదలయిన సమైక్య ఉద్యమాల గురించి కానీ, అక్కడి ప్రజల మనోభావాల గురించి గానీ ఏనాడు నోరు విప్పి మాట్లాడింది లేదు. గత మూడునాలుగేళ్ళుగా రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతున్నప్పటికీ, ఆయన రోమ్ నగరం తగులబడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిలా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయారు తప్ప సున్నితమయిన, జటిలమయిన ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నడూ చొరవ చూపలేదు. అసలు ఈ సమస్యతో తనకెటువంటి సంబంధమూ లేదన్నట్లు నిమ్మిత్త మాత్రుడిగా ఆయన వ్యవహరించారు.
ఇక ఎన్నికల తరువాత తన కుర్చీని రాహుల్ గాంధీకి అప్పగించేయబోతున్నట్లు కూడా ప్రకటించేశారు. అటువంటి ఆయన తెలంగాణా గురించి భరోసా ఇచ్చారని టీ-కాంగ్రెస్ నేతలకు చెప్పుకోవడం ఆత్మసంతృప్తికి తప్ప వేరే దేనికీ పనికి రాదు. నిజానికి రేపు పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టబడినపుడు, మహా అయితే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం వ్రాసి ఇచ్చిన ఉపన్యాసం చదవగలరు. బిల్లు ఓటింగుకి వచ్చినట్లయితే అనుకూలంగా ఓటు వేయగలరు. అంతకు మించి తెలంగాణా ఏర్పాటులో ఆయన పాత్ర మరేమీ ఉండబోదు. ఆవిషయం టీ-కాంగ్రెస్ నేథలకి కూడా తెలియక పోదు. అయితే, ప్రస్తుతం డిల్లీలో సీమాంధ్ర నేతలందరూ, ధర్నాలు చేస్తూ, రాష్ట్రపతికి విజ్ఞప్తి పత్రాలు అందిస్తూ, ప్రతిపక్షాల మద్దతు కూడగడుతూ చాలా హడావుడి చేస్తునారు. అటువంటప్పుడు తాము ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోనట్లయితే, వారి ప్రయత్నాల కారణంగా రేపు తెలంగాణా బిల్లు ఆగిపోయినట్లయితే, ప్రజలకు మొహం చూపించడం కష్టమవుతుంది గనుక మీడియా ముందు ఎంతో కొంత హడావుడి చేయక తప్పదు. అయితే వారు తెలంగాణా ఏర్పాటుకి చిత్తశుద్దితో కృషిచేయదలిస్తే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వలే ప్రతిపక్ష నేతలను కలిసి బిల్లుకి మద్దతు కూడగట్టగలిగినట్లయితే ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.