కేసీఆర్ గొంతులో వెలక్కాయ!
posted on Feb 4, 2014 @ 2:56PM
తెలంగాణ సాధించుకునే ఢిల్లీ నుంచి తిరిగి వస్తానని, తాను తిరిగి అడుగుపెట్టేది తెలంగాణ రాష్ట్రంలోనేనని ప్రతిజ్ఞ చేసి ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్ అక్కడ ఎదురవుతున్న పరిస్థితులను చూసి డంగైపోతున్నారు. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. మైకు ముందుకు వస్తేచాలు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియని పూనకం స్థితికి వెళ్ళిపోయే కేసీఆర్ ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే తిరిగొస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ విభజనవాదుల్లో ఉత్సాహాన్ని నింపింది. సోమవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో జరిగిన పరిణామాలు కేసీఆర్‌తోపాటు విభజన వాదులందరికీ టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఈసారి పార్లమెంట్ సమావేశాలను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకే పరిమితం చేయాలని దాదాపు అన్ని పార్టీలు పట్టు పట్టడం, తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ చేసిన కామెంట్లు కేసీఆర్ అండ్ బ్యాచ్ కట్టుకున్న గాలిమేడని కూల్చేశాయి. అసలు తెలంగాణ బిల్లు పార్లమెంటులో చర్చకి వస్తుందా, రాదా అనే సందేహాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో అయితే దోచుకున్నారు, సీమాంధ్ర దోపిడి లాంటి పడికట్టు పదాలు ఉపయోగించి, నోరు వేసుకుని మీద పడిపోయి నెగ్గుకురావొచ్చు. అయితే ఇప్పుడు సీన్ ఢిల్లీకి మారింది. బాల్ జాతీయ పార్టీల కోర్టులో వుంది. తెలంగాణ బిల్లు పార్లమెంటులో నెగ్గే విషయం అటుంచితే, చర్చకు వచ్చే విషయమే డౌటుగా వుంది. ఈ నేపథ్యంలో విభజనవాదుల బీపీ డౌన్ అయిపోవడంతో కేసీఆర్ ఆ బీపీని పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణవాదులు డంగైపోవాల్సిన అవసరం లేదని అర్జెంటుగా సందేశం ఇచ్చేశారు. తాను ముందుగా నోరు జారినట్టుగానే తెలంగాణ ఏర్పడిన తర్వాతే తిరిగి వస్తానని మరోసారి నోరుజారారు. కేసీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ విభజనవాదుల్లో ఉత్సాహం కలిగించిందో లేదోగానీ, ఢిల్లీలో విభజన బిల్లు పరిస్థితి మాత్రం అంతకంతకూ దిగజారుతోంది. అజిత్ సింగ్, రామ్ విలాస్ పాశ్వాన్ లాంటి నాయకులు తప్ప ప్రధాన పార్టీల నాయకులెవరూ తెలంగాణ బిల్లు మీద ఆసక్తి చూపించడం లేదు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో వున్న బిల్లుల విషయం ఆలోచించాలా? హడావిడిగా తెచ్చిన తెలంగాణ బిల్లు విషయం ఆలోచించాలా అని నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం, కీలక బిల్లుల ఆమోదం తర్వాతే ఏ విషయమైనా అంటున్నారు.