టీ-బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టడం కూడా వీలుకాదా?

  ఇంతవరకు తెలంగాణా ఏర్పాటుపై చాల ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ నిన్న జరిపిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాల వైఖరి చూసి కంగుతింది. రేపటి నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలలో తెలంగాణా బిల్లుని ప్రవేశపెడితే, ఆంధ్ర, తెలంగాణా ప్రాంత సభ్యుల ఆందోళన కారణంగా అసలు సభ జరిగే అవకాశమే ఉండదని, అందువల్ల ఈ సమావేశాలలో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టవద్దని, ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు వంటి అత్యంత ముఖ్యమయిన బిల్లులను మాత్రమే సభలో ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాల సూచనతో కాంగ్రెస్ అధిష్టానం నోటమాటలేకుండా పోయింది. కేవలం రెండు వారాలు మాత్రమే సాగే ఈ సమావేశాలలో ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు ఆమోదించడం అత్యంత అవసరం. అదిగాక మరో 39 బిల్లులపై సభలో చర్చజరిపి ఆమోదించవలసి ఉంది. వాటిలో కొన్ని రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్టను పెంపొందించే ఉద్దేశ్యంతోనే ప్రవేశపెట్టబడుతున్నాయి. తమ రాజకీయ ప్రత్యర్ధికి మేలు చేకూర్చే అటువంటి బిల్లులకు తామెందుకు మద్దతు ఈయాలి? అని భావించడంతో బీజేపీతో సహా ప్రతిపక్ష నేతలు కేవలం ఓట్-ఆన్-అకౌంట్ బిల్లు మరికొన్ని ముఖ్యమయిన బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టాలని సూచించాయి.   తెలంగాణా బిల్లుని ఎన్నికల తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలేయమని వారు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం తను అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణా బిల్లుని సభలో ఆమోదింపజేయడం మాట సంగతెలా ఉన్నా, దానిని అసలు సభలో ప్రవేశపెట్టవద్దని ప్రతిపక్షాలు కోరడం కాంగ్రెస్ అధిష్టానం జీర్ణించుకోవడం చాలా కష్టమవుతోంది. తెలంగాణా బిల్లుని సభలో ప్రవేశపెట్టడానికే అభ్యంతరం చెపుతున్న ప్రతిపక్షాలు, వాటి మాట కాదని ప్రవేశపెట్టినా దానికి మద్దతు ఇస్తాయని నమ్మకం లేదు.   బీజేపీ నేత సుష్మాస్వరాజ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ యంపీలపై ఆ పార్టీకి ఎటువంటి అదుపు లేదు. అందువల్ల వారు మళ్ళీ సభా కార్యక్రమాలను జరుగకుండా స్తంబింపజేయడం తధ్యం. అటువంటి పరిస్థితిలో కీలకమయిన బిల్లులపై ఏవిధంగా చర్చించలము? అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముందుగా తన సభ్యులను అదుపులో ఉంచుకొని సభను నిర్వహించమనండి. అప్పుడు బిల్లులకు మా మద్దతు గురించి అడగవచ్చును,” అని అన్నారు.

రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ

  రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరుకోవడంతో రాష్ట్ర రాజకీయ వర్గాలన్నీ ఢిల్లీలోనే మకాం వేశాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ రాష్ట్రాన్ని విభజిస్తోందని నినదిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో హల్‌చల్ చేస్తున్నారు. శరద్ యాదవ్ లాంటి పలువురు జాతీయ నాయకులను కలసి సమసపై వారికి పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మంగళవారం రాత్రి ఏడున్నర గంటలకు చంద్రబాబు భేటీ అయ్యారు. అరగంట పాటు ఆయనతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా వుందంటూ రాసిన ఓ పుస్తకాన్ని ఆయన రాష్ట్రపతికి ఈ సందర్భంగా అందజేశారు. అలాగే ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఒక ప్రహసనంలా మార్చిందన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రపతికి వివరించినట్టు తెలిసింది.

రాష్ట్ర విభజనపై సుప్రీంలో పిటిషన్లు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో మూడు వ్యక్తిగత పిటిషన్లు. ఒకటి ప్రజాహిత వ్యాజ్యం. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, విశాలాంధ్ర మహాసభ వేరు వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా, ఢిల్లీకి చెందిన ఎం.ఎల్.శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. వీటిలో మూడు పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టనున్నామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని శనివారం నాడు విచారణకు చేపట్టనున్నామని చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.

6 నుంచి ఉద్యోగుల సమ్మె

  రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆఖరి అంకం పార్లమెంటుకు చేరుకున్న నేపథ్యంలో ఏపీ ఎన్జీవోలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటూ సమ్మె శంఖారావం పూరించారు. ఈనెల 6 నుంచి సమ్మె చేయనున్నట్టు ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటించారు. గురువారం నుంచి పార్లమెంటు సమావేశాలు ముగిసే సమ్మె కొనసాగిస్తామని, సమ్మెలో భాగంగా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీల ఇళ్ళను ముట్టడించనున్నట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌తో సహా సీమాంధ్రలోని 13 జిల్లాలలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య పరుగు, 10న అమలాపురంలో భారీ బహిరంగసభ, 17, 18 తేదీలలో ఛలో ఢిల్లీ కార్యక్రమాలను నిర్వహించనున్నామని అశోక్‌బాబు చెప్పారు. ఇంకా ధర్నాలు, రాస్తారోకోలు, రైల్ రోకోలు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ముందుకు వెళ్ళిన పక్షంలో దక్షిణాదిని చీకటిమయం చేయడానికి సిద్ధంగా వున్నట్టు విద్యుత్ జేఏసీ ప్రకటించింది.

నెలలోగా మునిసిపల్ ఎన్నికలు

  నాలుగు వారాల్లోగా రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణజ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. అయితే రాష్ట్ర విభజన అంశం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతోపాటు ఇంత తక్కువ వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ధర్మాసనానికి నివేదించారు. ఎన్నికల నిర్వహణకు మరింత వ్యవధి కావాలని అభ్యర్థించారు. అయితే గతంలో ఎన్నోసార్లు గడువులు తీసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదని, అలాగే రాష్ట్ర విభజన అంశం తాజాగా తెరమీదకు వచ్చింది కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

పెప్సీ వివాదంలో అమితాబ్ బచ్చన్

  సినిమా నటులు, క్రికెట్ ఆటగాళ్ళు వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కోట్ల రూపాయలకు కాంట్రాక్టులు కుదుర్చుకొని సదరు కంపెనీ ఉత్పత్తుల గురించి ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా బచ్చన్ కూడా వివిద కంపెనీల ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొంటున్నారు. అమితాబ్ బచ్చన్ 2008 నుండి 8 సం.ల పాటు పెప్సీ కంపెనీతో ఏడాదికి రూ.3 కోట్లు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని ఆ కంపెనీ ఉత్పత్తులకు ప్రచారం చేసారు. అందుకు పెప్సీ కంపెనీ ఆయనకు మొత్తం రూ.24 కోట్లు చెల్లించింది. అయితే ఆయన ఇటీవల అహ్మదాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ లో ఉపాద్యాయులు, గుజరాత్ పర్యాటక శాఖ సంస్థ అధికారులు, విద్యార్ధులు పాల్గొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి.   ఆయన వారితో మాట్లాడుతూ “నేను ఒకసారి జైపూర్ లో ఒక స్కూలు విద్యార్ధులతో మాట్లాడుతున్నపుడు ఒక బాలిక “మాకు మా టీచర్ అటువంటి పానీయాలు (కూల్ డ్రింక్స్) విషం వంటివని చెప్పారు. మరి మీరు అటువంటి విష పానీయాలను త్రాగమని ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించింది?” ఆమె ప్రశ్నకు నేను వెంటనే జవాబు చెప్పలేకపోయాను. కానీ, ఆమె ప్రశ్న నన్ను తీవ్ర ఆలోచనలో పడేసింది. నేను ప్రచారం చేస్తున్న శీతల పానీయాల గురించి ప్రజలలో ఇటువంటి అభిప్రాయం ఉన్నపుడు నేను వాటికి ఇంకా ప్రచారం చేయడం సరికాదని భావించి ఇక అటువంటి ఉత్పత్తులకు ప్రచారం చేయడం మానివేశాను. అంతేకాకుండా నేను నా కొడుకు, కోడలికి కూడా అటువంటి ఉత్పత్తులకు ప్రచారం చేయవద్దని సూచించాను. ఎందుకంటే, మన వృత్తిరీత్యా ఏదయినా ఒక వస్తువుకు ప్రచారం చేసేటప్పుడు అది ఇతరుల జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఉండకూడదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.   అమితాబ్ బచ్చన్ వంటి ఒక ప్రముఖుడు ఎనిమిదేళ్ళ పాటు పెప్సీ మరియు ఆ కంపెనీ తయారు చేసే ఇతర శీతల పానీయాలను త్రాగమని విరివిగా ప్రచారం చేసి, అందుకు ప్రతిఫలంగా రూ.24 కోట్లు డబ్బు కూడా తీసుకొని ఇప్పుడు అవన్నీ విషంతో సమానమని, వాటికి ప్రచారం చేయవద్దని తన కొడుకు కోడలికి కూడా చెప్పానని ఆయన బహిరంగంగా చెప్పడంతో సదరు కంపెనీ వారే కాక ఇతరులు కూడా ఆయనను తీవ్రంగా తప్పు పడుతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సైతం ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఆయన వాటిపై ఇంతవరకు స్పందించకపోవడంతో ఆయనపై విమర్శలు జడివానలా కురుస్తూనే ఉన్నాయి.   ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మ్యాగీ నూడుల్స్, పార్లే గోల్డ్ స్టార్ కుకీస్, బైనాని సిమెంట్స్, కళ్యాణ్ జ్యులర్స్, గుజరాత్ పర్యాటక శాఖలకు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడయినా ఈ వస్తువులలో కూడా ఏదయినా లోపం ఉందని ఆయన తెలుసుకొంటే అప్పుడు వాటిని కూడా వాడవద్దని ఆయన సూచిస్తారా? ఆ విధంగా చేస్తే, ఇంతవరకు ఆయన సదరు వస్తువు కోసం చేసిన ప్రచారమంతా దేనికోసం? దేశంలో అత్యంత ప్రభావంతుడయిన ఆయన చేసే ప్రచారం వల్ల ఒక వస్తువు అమ్మకాలు ఏవిధంగా పెరుగుతాయో,దానికి వ్యతిరేఖంగా ఆయన చెపుతున్నమాటలు కూడా అంతే వ్యతిరేఖ ప్రభావం చూపుతాయనడంలో ఎటువంటి సందేహము లేదు. మా శీతల పానీయాలకు ఎనిమిదేళ్ళు ప్రచారం చేసిన తరువాత ఇప్పుడు ఆయన ఆవిధంగా చెప్పడం చాలా విచారకరమని పెప్సీ కంపెనీ సంస్థ ప్రతినిధులు అన్నారు.

బుధవారం నుంచి పార్లమెంట్

  ప్రస్తుత 15వ లోక్‌సభ చివరి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అవినీతి నిరోధానికి సంబంధించిన బిల్లులు, మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుస్తోంది. మొత్తం 39 బిల్లులను కేంద్రం క్యూలోపెట్టింది. అయితే ఈ సమావేశాల్లో బిల్లుల గురించి చర్చించకూడదని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒక్కదాన్ని ప్రవేశపెడితే సరిపోతుందని అనేక పార్టీలు సూచించినా కేంద్రం తన పట్టు విడిచిపెట్టలేదు. తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో పెట్టడం మీద వచ్చిన అభ్యంతరాలనీ కేంద్రం పట్టించుకోవడం లేదు. సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడిగా వేడిగా చర్చ జరిగింది. సభలో సీమాంధ్ర ఎంపీలను కేంద్రం అదుపు చేయగలిగితే తెలంగాణ బిల్లు మీద చర్చకు ఒప్పుకుంటామని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కేంద్రానికి స్పష్టం చేశారు.

తెలంగాణా ప్రజలకు కేసీఆర్ భరోసా

  తెలంగాణా బిల్లుకి బీజేపీ మద్దతు ఇచ్చే అంశంపై మీడియాలో వస్తున్నరకరకాల వార్తలు, కధనాలు తెలంగాణావాదులకు, ప్రజలకు చాలా ఆందోళన కలిగించడం సహజమే. టీ-కాంగ్రెస్ నేతలందరూ వాటిని ఎంత గట్టిగా ఖండిస్తున్నా, వారందరూ ఒకే కాంగ్రెస్ తానుకి చెందినవారు గనుక తెలంగాణా ప్రజలు వారి మాటలను నమ్మేందుకు సిద్దంగా లేరు. అందుకే కేసీఆర్ వెంటనే మీడియా ముందుకు వచ్చి బీజేపీ మద్దతుపై వస్తున్నవార్తలను నమ్మనవసరం లేదని, బీజేపీ తప్పకుండా తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తుందని, ఈ పార్లమెంటు సమావేశాలలోనేబిల్లు ఆమోదం పొందడం, ఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం ఖాయమని ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఎంతగా భరోసా ఇస్తున్నపటికీ, బీజేపీ నేతలు స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెపుతున్న మాటలు మారిన వారి ఆలోచనలకు అద్దంపడుతున్నాయి.

నరేంద్ర మోడీకే నా ఓటు: కిరణ్ బేడీ

  మాజీ ఐపీయస్ ఆఫీసర్ కిరణ్ బేడీ మొన్న ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీల గురించి చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. “రాహుల్ గాంధీకి నేను ఓటు వేయలేను. ఎందుకంటే లెర్నింగ్ లైసెన్సుతో వస్తున్నఅటువంటి వ్యక్తి చేతికి దాదాపు 1.2 బిలియన్ల జనాభా ఉన్న భారత్ దేశాన్ని అప్పగించలేము. అనుభవరహితుడయిన అతను ఇంత పెద్ద దేశాన్ని ప్రధానిగా పరిపాలించగలడని నేను భావించడం లేదు. కానీ, అనేక అగ్నిపరీక్షలు ఎదుర్కొని నెగ్గుకొచ్చిన నరేంద్ర మోడి ప్రధాని పదవికి అన్ని విధాల తాను అర్హుడనని నిరూపించుకొన్నారు. ఇంత పెద్ద దేశాన్నికొత్తగా డ్రైవింగ్ నేర్చుకొంటున్న అనుభవరహితుడయిన రాహుల్ గాంధీ చేతిలో పెట్టడం కంటే, అనుభవజ్ఞుడు, తన దక్షత నిరూపించుకొన్న వాడయిన నరేంద్ర మోడీ చేతికి అప్పగించడమే మేలని నేను భావిస్తున్నాను. అందువల్ల నేను వారిరువురిలో నరేంద్ర మోడీకే నా ఓటు వేసేందుకు ఇష్టపడతాను.” అని అన్నారు.   ప్రముఖ సామాజిక నేత అన్నాహజారేతో కలిసి నడుస్తున్న కిరణ్ బేడీ ఒకప్పటి తమ ఉద్యమ సహచరుడయిన అరవింద్ కేజ్రీవాల్ కి కానీ, ఆయన స్థాపించిన ఆమాద్మీ పార్టీకి గానీ ఈవిధంగా ఎన్నడూ తన మద్దతు ప్రకటించలేదు. కానీ, తామందరూ వ్యవ్యతిరేకిస్తున్న బీజేపీకి చెందిన ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి ఈవిధంగా మద్దతు తెలపడం విశేషమే. ఆమాద్మీ పార్టీ కూడా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా వీలయినన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తోందని తెలిసి ఉన్నపటికీ ఆమె బీజేపీకి మద్దతుగా మాట్లాడటం మరో విశేషం.   ఇక ఆమె మాటలను మన రాష్ట్రానికి కూడా చాలా చక్కగా అన్వయించుకోవచ్చును. ప్రస్తుతం మన రాష్ట్ర, దేశం పరిస్థితులు ఒక్కలాగే చాల క్లిష్టంగా తయారయ్యాయి. అదేవిధంగా రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కంటుంటే, ఇక్కడ రాష్ట్రంలో అనుభవరహితుడు, అనేక ఆర్ధిక నేరాలలో కేసులు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి మరో నాలుగు నెలలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోదామని ఆత్రుత పడుతున్నాడు.   ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగినా, జరుగకపోయినా మున్ముందు రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనకొనవలసి ఉంటుంది. ఆ పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించడం, గాడి తప్పినా పాలనను మళ్ళీ గాడిలో పెట్టడం అనుభవరహితుడయిన జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం కాదని చెప్పవచ్చును. అందువల్ల రాష్ట్ర ప్రజలు కూడా అన్నివిధాల సమర్ధుడయిన వ్యక్తికే ఓటు వేయడం అత్యవసరం.

కమలంపై చంద్రుడి ప్రభావం

  చంద్రబాబు కంటే ముందే డిల్లీ చేరుకొన్న కేసీఆర్ తెలంగాణాపై ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నబీజేపీ నేతలని కలిసి, బిల్లుకి అనుకూలంగా వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. కానీ, వారు ఆయన కంటే ముందు చంద్రబాబునే కలవడం, మారుతున్న వారి ఆలోచనలకు అద్దం పడుతోంది. బీజేపీ మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుకి పూర్తి మద్దతు తెలుపుతున్నపటికీ, తెదేపాతో సాన్నిహిత్యం పెరిగిన తరువాత క్రమంగా దాని ఆలోచనా సరళిలో కూడా మార్పు రాసాగింది. చంద్రబాబు కూడా రాష్ట్ర విభజనను కాక అది జరుగుతున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేఖిస్తున్నందున, ఎన్నికల తరువాత రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన చేయవచ్చని బీజేపీ భావించి ఉండవచ్చును.   అదీగాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకే ప్రయోజనం కల్పిస్తుంది తప్ప బీజేపీకి కాదు. అంతేగాక, ఎన్నికల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే అటువంటి లోపభూయిష్టమయిన బిల్లుని ఆమోదింపజేసినందుకు బీజేపీ ప్రభుత్వమే నానా అవస్థలు పడవలసి ఉంటుంది. గనుకనే బీజేపీ ఇప్పుడు తెలంగాణాపై మాట మార్చింది. ఇప్పుడు బీజేపీ నేతలు సీమాంధ్రవైపు మొగ్గు చూపిస్తుండటానికి ప్రధాన కారణం చంద్రబాబేనని చెప్పవచ్చును. తొమ్మిదేళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి బీజేపీ కంటే బాగా రాష్ట్ర పరిస్థితులు, సాధ్యాసాధ్యాలు గురించి తెలుసు గనుక, బహుశః బీజేపీ నేతలు ఆయన సూచన ప్రకారమే వ్యవహరిస్తుండవచ్చును.   ఇక మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే ఇంతవరకు పార్టీలోని ఆంధ్ర, తెలంగాణా ప్రాంత నాయకులను వారివారి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడేందుకు అనుమతించిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు వారినందరినీ ఒకే త్రాటిపైకి తీసుకువచ్చి వారందరినీ వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, ప్రతిపక్షనేతలని కలుస్తుండటం ద్వారా తెదేపా ఇంతకాలంగా కోరుతున్న'ఇరుప్రాంతాల ప్రజలకి సమన్యాయం' అనే తన వాదనలో నిబద్దత ఉందని స్పష్టం చేయగలిగారు. ఒకవేళ ఆయన ప్రత్యర్దులందరూ వాదిస్తున్నట్లుగా ఆయన సమైక్యాంధ్ర లేదా సీమాంధ్రకే ప్రాధాన్యం ఇస్తున్నట్లయితే, ఆయన కేవలం సీమాంధ్ర సభ్యులనే వెంటబెట్టుకొని వెళ్ళేవారు. ఇది ఆయన నాయకత్వాల్ లక్షణాలకి, రాజకీయ చాతుర్యానికి అద్దంపడుతోంది. 

సీఎమ్మా? ఏ స్టేట్‌కి?

      వైఎస్సార్సీపీ ప్లీనరీలో జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఆయన భృత్యులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నాలుగు నెలల తర్వాత నేనే సీఎం అంటూ జగన్ ముసలమ్మలకి, ముసలయ్యలకి ఆ మీటింగ్‌లో చెప్పడం, నాలుగు నెలల్లో మీ మనవడు సీఎం కాబోతున్నాడు (అంటే జగనే) అని అనడం జగన్ శిబిరంలో లేని ఉత్సాహాన్ని నింపింది. వైఎస్సార్సీపీ మూలన పడిందన్న అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్న తరుణంలో పార్టీలో ఉత్సాహాన్ని నింపడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇలాంటి స్టేట్‌మెంట్లని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   జగన్ తాను సమైక్యవాదినని చెబుతున్నప్పటికీ లోకం మొత్తం ఆయన్ని విభజనవాదిగానే చూస్తోంది. నిన్నగాక మొన్న వైసీపీలోంచి బయటపడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రఘురామ కృష్ణంరాజు జగన్ నూటికి నూరుశాతం విభజనవాది అని ఢంకా బజాయించి చెబుతుంటే దాన్ని ఖండించేవారు వైసీపీలో ఎవరూ లేకుండా పోయారు. ఇప్పుడు జగన్ నాలుగు నెలల తర్వాత తానే సీఎం అని ప్రకటించడం వైసీపీలోని కొన్ని వర్గాలను సంతోషపరుస్తున్నప్పటికీ, కొన్ని వర్గాలు మాత్రం పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు నెలల తర్వాత జగన్ సీఎం అయ్యేది పూర్తిస్థాయి ఆంధ్రప్రదేశ్‌కా? లేక రాష్ట్రం ముక్కలయ్యాక మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కా అనే సందేహాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క రాష్ట్రం ముక్కలయ్యే ముప్పు ముంచుకొస్తుంటే జగన్ మాత్రం తాను ముఖ్యమంత్రి కాబోతున్నానని స్టేట్‌మెంట్లు ఇస్తూ వుండటం వైసీపీలోనే కొన్ని వర్గాలకు మింగుడు పడటం లేదు. విభజన బిల్లు ఢిల్లీకి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో అటు విభజనవాదులు, ఇటు సమైక్యవాదులు ఢిల్లీకి చేరుకుని ఎవరి లాబీయింగ్‌లో వారున్న నేపథ్యంలో జగన్ మాత్రం అలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా మీటింగులు, స్టేట్‌మెంట్లతో స్టేట్‌లోనే కాలక్షేపం చేస్తూ వుండటాన్ని అందరూ అనుమానపు కళ్ళతో చూస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆఖరి బాల్ ఆడబోతున్నారా?

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు డిల్లీలో ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్ వద్ద రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, యంపీలు, యం.యల్యేలతో కలిసి మౌనదీక్ష చేసి, ఆ తరువాత రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లి ఆయనకు విజ్ఞప్తి పత్రం అందించబోతున్నట్లు ద్రువీకరించబడింది. అయినా ఇంతవరకు కాంగ్రెస్ అధిష్టానం ఈవిషయంపై స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక్క కాంగ్రెస్ అధిష్టానం తప్ప మిగిలిన అందరు ఏదో రూపంగా దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. చివరికి ఈ రోజు బీజేపీ సీనియర్ నాయకురాలుఅయిన సుష్మస్వరాజ్ కూడా ఈ దీక్ష గురించి మాట్లాడుతూ “తన ముఖ్యమంత్రినే అదుపులో పెట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ మేము తన మాట వినాలని ఏవిధంగా భావిస్తోందో అర్ధం కావడం లేదు,” అని వ్యాఖ్యానించారు.   పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్న కీలక సమయంలో, ముఖ్యమంత్రి స్వయంగా తన నిర్ణయాన్నివ్యతిరేఖిస్తూ డిల్లీలోనే దీక్షలు, ర్యాలీలకు పూనుకోవడం, రాష్ట్రపతిని కలిసి అందుకు అనుమతి ఈయవద్దని కోరాలనుకోవడం కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయడం క్రిందే లెక్కవస్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావించవచ్చునేమో కానీ ప్రతిపక్షాలు, మీడియా మాత్రం ఆ విధంగా భావించబోవు.     ముఖ్యమంత్రి రేపు డిల్లీలో చేయబోయే దీక్ష వలన రాష్ట్ర విభజన ఆగకపోవచ్చు కానీ, అధిష్టానంపై మాత్రం తీవ్రమయిన ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రతిపక్ష పార్టీలు, జాతీయ మీడియా అందరూ కలిసి ఆయన దీక్షను ప్రస్తావించడం వలన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరువు గంగలో కలిసిపోతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అందునా కాంగ్రెస్ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ దేశరాజధానిలో దీక్ష చేస్తే, కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్ర ప్రజల అభిమతానికి విరుద్దంగా రాష్ట్ర విభజనకు పూనుకొంటోoదనే భావన దేశమంతా వ్యాపిస్తుంది.     ఇప్పటికే బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు. రేపటి నుండి నరేంద్ర మోడీతో సహా బీజేపీ నేతలందరూ ఇదేవిషయాన్ని తమ ఆయుధంగా చేసుకొని సభలలో ప్రముఖంగా ప్రస్తావించడం మొదలుపెడితే ఇక కాంగ్రెస్ పార్టీకి జరగబోయే నష్టం గురించి అంచనా వేయలేము.   అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం ఇక కిరణ్ కుమార్ రెడ్డిని ఎంత మాత్రం ఉపేక్షించే అవకాశం లేదని భావించవచ్చును. కానీ, బహుశః ఆఖరు ప్రయత్నంగా ఆయనకు నయాన్నో భయాన్నోనచ్చజెప్పి దీక్షలు, ర్యాలీలు విరమింపజేసే ప్రయత్నాలు చేస్తోందేమో! కానీ ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి మొండిగా ముందుకే వెళ్ళదలిస్తే మాత్రం ఇక ఇదే ముఖ్యమంత్రిగా ఆయన ఆఖరు డిల్లీ యాత్ర కావచ్చును. అంతకంటే ముందే ఆయనను పదవిలోంచి తొలగించినా ఆశ్చర్యం లేదు.   పరిస్థితులు ఇంతవరకు వచ్చిన తరువాత ఆయన తన పదవిలో, పార్టీలో కొనసాగడం కూడా కష్టమే. అయితే, తనే స్వయంగా పదవి నుండి తప్పుకోవడం కంటే, పార్టీ చేతే వేటు వేయించుకొని బయటపడినట్లయితే, దానివలన సీమాంధ్రలో ప్రజల నుండి అపారమయిన సానుభూతి పొందవచ్చును. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం తన పదవిని, పార్టీని తృణప్రాయంగా త్యజించినందుకు సమైక్య ఛాంపియన్ బిరుదు కూడా ఇక ఆయనకే ఖరారు అవుతుంది. ఒకవేళ ఇదంతా కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగమే అయి ఉంటే నేడో రేపో ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం వేటువేసి, ఆయన స్థానంలో ఏ కన్నా లక్ష్మి నారాయణనో నియమించవచ్చును.   ఒకవేళ ఇంకా ఉపేక్షిస్తే అది కాంగ్రెస్ పార్టీకే కాక, ఆయనకీ రాజకీయంగా చాల నష్టం కలిగిస్తుంది. ఇంత హంగామా చేసిన తరువాత కూడా అయన ఇంకా తన పదవిలోనే కొనసాగితే ఆయన విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది గనుక, ఒకవేళ అధిష్టానం తనను పదవి నుండి తప్పించాకపోయినట్లయితే ఆయనే తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసి, “సమైక్య త్యాగశీలి’ గా బయటకు వచ్చి తన కొత్త పార్టీకి రిబ్బన్ కటింగ్ చేసుకోవచ్చును.

జగన్ కు సబ్బంహరి హెచ్చరిక

      వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సబ్బంహరి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నిజమైన సమైక్య వాదులు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గెరపెట్టుకోవాలని హెచ్చరించారు. జగన్ తన స్వార్ధ రాజకీయాలకోసం సమైక్యవాదులను దొంగలనడం సరికాదన్నారు. ''వాళ్ళు దొంగలు...వీళ్ళు దొంగాలంటే'' ఊరుకొనేదిలేదన్నారు. ప్లీనరీలో ఆయన బాష స్థాయికి తగ్గట్టులేదన్నారు. సిగ్గు గురించి జగన్ మాట్లాడితే సిగ్గుకే సిగ్గేస్తు౦దన్నారు. జగన్ పార్టీలో ఎవరికి ఎంత గౌరవం ఉంటుందో ఆయన సోదరి షర్మిలాకు బాగా తెలుసునని అన్నారు. వైకాపా నేతలకు వున్న సంస్కారాలు తనకు అంటగట్టవద్దని కోరారు. ఇకపైన వైకాపా నేతలు తన గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. జగన్ బయట సమైక్యవాది..లోపల విభజనవాది అని ఆరోపించారు.  పార్లమెంట్లో తొంభై శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనె ఆమోదం పొందుతాయని తెలిపారు.                                     

టీ-బిల్లుపై కడదాకా అదే సందిగ్దత, సస్పెన్స్

  తెలంగాణా బిల్లు, రాష్ట్ర విభజన అంశాలపై రాజకీయ నేతలు, మీడియా, విశ్లేషకులు కూడా ప్రాంతాల వారిగా విడిపోయి ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. చివరికి రాజ్యాంగ నిపుణులు, రిటైర్డ్ జడ్జీలు కూడా బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ అంశాలపై ప్రజలలో చాలా సందిగ్దత నెలకొంది. కొందరు టీ-బిల్లుపై కిరణ్ ప్రవేశపెట్టిన తీర్మానం పనికిరాదని తేల్చేస్తుంటే, కిరణ్ కుమార్ రెడ్డి అదే బ్రహ్మాస్త్రమని అంటున్నారు.   టీ-బిల్లుపై చర్చలు, వాదోపవాదాలు ఇలా సాగుతుంటే, కేంద్రం మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. ఇంకా బిల్లు చేతికి రాకమునుపే, రేపు కేంద్ర మంత్రుల బృందం సమావేశమయి బిల్లుకి తుది రూపం ఇచ్చేందుకు సిద్దమవుతోంది. బిల్లుకి మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి ప్రయత్నాలు చేస్తోందో తెలియదు కానీ, బిల్లుని పార్లమెంటు చేత ఖచ్చితంగా ఆమోదింపజేస్తామని గట్టిగా చెపుతోంది. ఈ రోజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్ని పార్టీలతో సమావేశమవనున్నారు. బహుశః అదే సమయంలో బీజేపీని టీ-బిల్లుకి మద్దతు ఈయమని కాంగ్రెస్ పార్టీ తరపున మరోమారు అభ్యర్దిస్తారేమో!   అవసరమయితే పార్లమెంటు సమావేశాలు పొడిగించయినా బిల్లుని ఆమోదింపజేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెపుతున్నపటికీ, ఈనెల 24 లేదా 26 తేదీలలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమీషన్ సిద్దమవుతోంది గనుక, సమావేశాలు ఇక పొడిగించడానికి వీలుకుదరకపోవచ్చును. అందువల్ల ఈలోగానే టీ-బిల్లుని ఆమోదించవలసి ఉంటుంది.   కేవలం రెండు వారాలు మాత్రమే సాగే ఓట్-ఆన్-ఎకౌంట్ సమావేశాలలో, కేంద్రంలో ఎన్నికల తరువాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ ప్రభుత్వ నిర్వహణకు అవసరమయిన ఖర్చుల నిమ్మితం కొన్ని కీలకమయిన ఆర్ధిక బిల్లులు, రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచేందుకు ఉద్దేశించబడిన మరికొన్ని బిల్లులు కూడా ఉభయ సభలలో ప్రవేశపెట్టి ఆమోదించవలసి ఉంటుంది. అదే సమయంలో టీ-బిల్లు కూడా ప్రవేశపెట్టి, ఉభయ సభలలో సవివరంగా దానిపై చర్చించిన తరువాతనే ఆమోదించవలసి ఉంటుంది.   కానీ, సమయాభావం వలన ఉభయ సభలలో బిల్లుపై అర్ధవంతమయిన చర్చ జరగపోవచ్చును. బిల్లుపై పార్లమెంటులో కూడా మరింత లోతుగా చర్చ జరగకుండా నివారించేందుకే బహుశః కాంగ్రెస్ అధిష్టానం ఇటువంటి సమయాన్ని ఎంచుకొని ఉండవచ్చును. ఇవే యూపీయే ప్రభుత్వం హయంలో జరిగే చిట్టచివరి పార్లమెంటు సమావేశాలు గనుక, బీజేపీ పార్లమెంటులో బిల్లుకి మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా అతితక్కువ ఇబ్బందితో, నష్టంతో బయటపడవచ్చనే ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఉండి ఉండవచ్చును.   రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు ప్రతీ దశలో కూడా ఇటువంటి సందిగ్దత కలిగి ఉండటం, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనిస్తే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎంత అసమర్ధంగా, అసంబద్దంగా నిర్వహిస్తోందో అర్ధమవుతుంది. రాష్ట్ర శాసనసభ తీర్మానంతో మొదలవవలసిన విభజన ప్రక్రియను, ముగింపులో దానికి పంపడం, పంపిన తరువాత కూడా దాని అభిప్రాయానికి ఎటువంటి విలువలేదని చెప్పడం కాంగ్రెస్ అధిష్టానానికి చట్ట సభల పట్ల, ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల పట్ల ఎంతటి చులకన భావం ఉందో తెలియజేస్తోంది. ఏమయినప్పటికీ, రానున్న ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పడుతుందో లేదో కేవలం మరో రెండు మూడు వారాలలో ఖచ్చితంగా తేలిపోతుంది.  

అన్నా చెల్లెళ్ళ అనుబంధం!

      ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే... అన్నయ్యా.. నీవేలే నా ప్రాణమూ.. ఓ చెల్లెమ్మా నీవేలే నా లోకమూ... అంటూ అన్నా చెల్లెళ్ళ అనుబంధంతో సాగే సినిమా పాట గుర్తుందిగా. ఆదివారం జరిగిన జగన్ పార్టీ ప్లీనరీలో స్టేజీ మీద ఈ పాటని ప్లే చేసినట్టయితే, స్టేజీమీద కనిపిస్తున్న సీన్‌కి ఈ పాట బాగా సింకయ్యేది. ఎందుకంటే ఈ మీటింగ్‌ వేదిక మీద జగనన్న, ఆ జగనన్న వదిలిన బాణం షర్మిల తమ అన్నాచెల్లెళ్ళ అనుబంధం గురించి అందరికీ తెలిసేలా వ్యవహరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు.   జగన్ జైల్లో ఉన్నన్నిరోజులూ పార్టీ బాధ్యతలు తీసుకుని పాదయాత్రలు చేసిన షర్మిలకు జగన్ జైల్లోంచి బయటకి వచ్చాక ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. షర్మిల కడప నుంచి లోక్‌సభకు పోటీ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారని, అయితే దాన్ని జగన్ తిరస్కరించడంతో ఆమె పార్టీ ఛాయలకు రావడం మానుకున్నారన్న అభిప్రాయాలు గతంలో వినిపించాయి. అయితే ఇప్పుడు వైసీపీ కష్టాల్లో ఉన్నందున అన్నయ్య పార్టీని రక్షించడానికి షర్మిల మళ్ళీ ముందుకొచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ సందర్భంగా వేదిక మీద తల్లి విజయమ్మ మధ్యలో కూర్చుని వుండగా, అటు జగన్, ఇటు షర్మిల కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. మేం చాలా సన్నిహితంగా వున్నాం. మామధ్య ఎలాంటి విభేదాలు లేవన్న విషయాన్ని జనంలోకి వెళ్ళేలా చేయడానికే వీరిద్దరూ ఇలా పబ్లిగ్గా అనుబంధాన్ని వ్యక్తం చేసి వుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే ఈ వేదిక మీద నుంచి షర్మిల చేసిన ప్రసంగం కూడా తనకు, జగనన్నయ్యకి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే అర్థం వచ్చేలా సాగిందని అంటున్నారు. ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని అంతిమలక్ష్యం చేరేవరకూ ఎంత దూరమైనా సాగుతాను’ అని షర్మిల స్పష్టంగా చెప్పడం కూడా తామంతా ఒక్కటే అనే సందేశాన్ని జనానికి ఇవ్వడంలో భాగమేనని విశ్లేషిస్తున్నారు.

డిల్లీకి చేరిన విభజన రాజకీయం

  రాష్ట్ర విభజన బిల్లు ఈరోజు డిల్లీ చేరుకోబోతోంది. దానికంటే ముందు, తరువాత రాష్ట్ర రాజకీయ నేతలందరూ కూడా డిల్లీలో దిగి విభజనకు అనుకూలంగా, వ్యతిరేఖంగా లాబీయింగ్ చేస్తున్నారు. అందరి కంటే ముందు డిల్లీలో వాలిన కేసిఆర్ ఆర్.జే.డీ. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ లను కలిసి బిల్లుకి మద్దతు ఇచ్చేందుకు ఒప్పించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాతనే తిరిగి హైదరాబాద్ వస్తానని ఆయన ప్రతిజ్ఞ కూడా చేసారు.   చంద్రబాబు నాయుడు తన ఆంధ్ర, తెలంగాణా యంపీ, యంయల్యేలను వెంటబెట్టుకొని కొద్ది సేపటి క్రితమే డిల్లీకి బయలుదేరారు. ఆయన ఇరుప్రాంతల నేతలను వెంటబెట్టుకొని రాష్ట్రపతిని కలిసి రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని లేకుంటే కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ విభజన ప్రక్రియను ఆపివేయాలని కోరనున్నారు. తెదేపాతో ఎన్నికల పొత్తు పెట్టుకొందామని భావిస్తున్న బీజేపీ కూడా సీమాంధ్రకు అన్యాయం జరిగినట్లయితే చూస్తూ ఊరుకోమని, వారి హక్కులను కాపాడుతూ తాము బిల్లులో కొన్ని సవరణలు సూచించబోతున్నామని, కాంగ్రెస్ అధిష్టానం వాటిని ఆమోదిస్తేనే బిల్లుకి తాము మద్దతు ఇస్తామని ఈమధ్యనే ప్రకటించింది.   ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రేపు డిల్లీలో ఇందిరాగాంధీ సమాధి వద్ద రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ దీక్ష చేప్పట్టి, ఆ తరువాత సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, యంపీలు, యంయల్యేలతో కలిసి రాష్ట్రపతిని కలిసి శాసనసభ తిరస్కరించిన బిల్లుని పార్లమెంటుకి పంపవద్దని కోరనున్నారు. అదేవిధంగా ఏపీయన్జీవో ఉద్యోగ సంఘ నాయకుడు అశోక్ బాబు కూడా ఉద్యోగ సంఘ నాయకులను వెంటబెట్టుకొని డిల్లీలో ధర్నా చేయనున్నారు.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీ యంపీలను, యంయల్యేలను వెంటబెట్టుకొని నేడో రేపో రాష్ట్రపతిని కలిసి బిల్లుని తిరస్కరించమని కోరనున్నారు. రాష్ట్రం నుండి అన్ని రాజకీయ పార్టీల నేతలు డిల్లీలో ఇతర పార్టీ నేతలను కలిసి బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేఖంగా ఓటువేయమని కోరుతుండటంతో వారు కూడా రెండుగా చీలిపోయారు.   మొదటి నుండి రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తున్న సీపీయం నేతలు తాము పార్లమెంటులో బిల్లుని వ్యతిరేఖిస్తామని స్పష్టం చేసారు. అదేవిధంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేఖిస్తున్న సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్, అతని కుమారుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ తెలంగాణా బిల్లుని తాము వ్యతిరేఖిస్తామని ప్రకటించారు.

త్వరలో నారా లోకేష్ సైకిల్ యాత్ర

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత సం. “వస్తున్నామీ కోసం”అంటూ పాదయాత్ర చేసి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తించారు. ఇప్పుడు ఆయన తనయుడు నారా లోకేష్ అదే స్పూర్తితో త్వరలో సైకిల్ యాత్ర మొదలుపెట్టి రాష్ట్రమంతటా పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు. తెదేపా ప్రస్తుతం ఆయన యాత్రకి రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది. త్వరలోనే ఆయన యాత్ర మొదలయ్యే తేదీ ప్రకటించవచ్చును. ఆయన తిరుపతి నుండి తన యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది.   మరొక రెండు మూడు నెలలో ఎన్నికలు వస్తున్నందున ఆంద్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలలో ప్రజలను, పార్టీ శ్రేణులను కలిసి గత పది సం.ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏవిధంగా అధోగతికి దిగజారిపోయిందో వివరిస్తూ, తేదేపాకు ఓటేయమని ప్రజలను కోరుతారు. లోకేష్ తన యాత్రలో ప్రధానంగా యువతను కలిసి మాట్లాడుతూ పార్టీకి వారి సహకారం కోరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయబోవడం లేదని ముందే ప్రకటించారు. గనుక ఆయన పార్టీని బలోపేతం చేయడంపైనే శ్రద్ధ వహిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన తన సైకిల్ యాత్రలో పార్టీ కార్యకర్తలను, స్థానిక నేతలను కూడా కలుస్తూ పార్టీ పరిస్థితి గురించి చర్చించి, వారి నుండి సలహాలను, సూచనలను తీసుకొంటూ, వారికి తగిన విధంగా మార్గదర్శకత్వం చేసే అవకాశం ఉంది. ఈ నెల 24 లేదా 26 తేదీలలో ఎన్నికల కమీషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవచ్చునని తాజా సమాచారం. అందువల్ల నారా లోకేష్ ఇప్పుడు మొదలుపెడుతున్న సైకిల్ యాత్ర ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కొనసాగించవచ్చును.

వీర విధేయ విచిత్ర కాంగ్రెస్ నేతలు

  రాష్ట్ర విభజన ప్రకటన చేసేవరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని దూషిస్తూ, బెదిరిస్తూ అతికష్టం మీద రోజులు దొర్లించుకొచ్చిన టీ-కాంగ్రెస్ నేతలు, ఆ తరువాత సోనియా గాంధీ తెలంగాణా ప్రజల ఇంటి ఇలవేల్పని, ఆమె మాటంటే మాటే! అని ఆమెకు చెక్కభజన చేస్తూ తరిస్తున్నారు. ఒకవేళ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదించలేక, ఎన్నికలలోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చేయకపోతే అప్పుడు వారందరూ సోనియమ్మకు చెక్క భజన చేస్తారో లేక మళ్ళీ తిట్లు లంఖించుకొంటారో చూడాలి. వారందరూ ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలని నిందిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని నిందించని టీ-కాంగ్రెస్ నేత లేడంటే అతిశయోక్తి కాదు. గత ఐదు నెలలుగా వారందరూ కూడా అతను ముఖ్యమంత్రిగా అనర్హుడని వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతని వల్లనే తెలంగాణా ఏర్పాటు ఆలస్యం అవుతోందని వాదిస్తారు. అధిష్టానానికి నిత్యం అతనిపై పిర్యాదులు చేస్తుంటారు. అయితే వారెవరూ కూడా అతని ప్రభుత్వానికి కూల్చే ప్రయత్నం మాత్రం చేయలేదు.   ఇక సీమాంధ్ర కాంగ్రెస్ నేతల పద్దతి మరీ విచిత్రంగా ఉంది. వారిలో కొందరు అధిష్టానానికి దిక్కరిస్తుంటే, మరి కొందరు ఆ విమర్శిస్తున్న వారితో మాటల యుద్ధం చేస్తుంటారు. అలాగని వారు తమ అధిష్టానం నిర్ణయం ప్రకారం రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నామని చెప్పే సాహసం చేయలేరు. మొన్న రాజ్యసభ అభ్యర్ధుల చేత నామినేషన్లు వేయించడానికి ముఖ్యమంత్రి, దామోదర రాజనరసింహ, బొత్ససత్యనారాయణ ముగ్గురు చెట్టాపట్టాలు వేసుకొని తరలివెళ్లడం చూస్తే, కాంగ్రెస్ నేతలందరి డీ.యన్.ఏ. ఒకటేనని, అందరు అధిష్టానానికి విధేయులేనని అర్ధం అవుతుంది. పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర నేతలందరూ కలిసి చేసిన కృషి చూస్తే వీరేనా అధిష్టానాన్ని దిక్కరిస్తోంది? అనే అనుమానం కలగక మానదు.