పార్లమెంటులో ఆందోళనకు అధికార, విపక్షాలు సిద్దం
posted on Feb 5, 2014 8:41AM
ఈరోజు నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవనున్నాయి. నిన్నరాత్రి జరిగిన కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశంలో సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు లగడపాటి, హర్ష కుమార్, రాయపాటి తాము ఈరోజు నుండి పార్లమెంటులో ఆందోళన చేసి సభా కార్యక్రమాలు జరగకుండా చేసి బిల్లుని అడ్డుకొని తీరుతామని గట్టిగా చెప్పారు. ఇక యంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకతరం రెడ్డి తాము బిల్లుకి వ్యతిరేఖంగా ఓటువేస్తామని ఖరాఖండిగా చెప్పారు. చిరంజీవి, జేడీ.శీలం తదితర సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజనను వ్యతిరేఖించినప్పటికీ, వారందరూ అధిష్టానం కనుసన్నలలోనే మెలిగే అవకాశం ఉంది గనుక వారివల్ల కాంగ్రెస్ అధిష్టానానికి ఎటువంటి సమస్య ఉండకపోవచ్చును. ఇక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా సభలో పోడియం వద్దే నిలిచి ఆందోళన చేస్తానని ప్రకటించారు. తెదేపా సీమాంధ్ర సభ్యులు కూడా వీరికి తోడవడం ఖాయం గనుక ఇక పార్లమెంటు సమావేశాలు ఏవిధంగా జరుగబోతున్నాయో ముందే ఊహించుకోవచ్చును.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ మొన్ననిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో, బీజేపీతో సహా అనేక పార్టీలు ఈసారి కేవలం రెండు వారాలు మాత్రమే సాగే పార్లమెంటు సమావేశాలలో39 బిల్లులపై చర్చ చేప్పట్టి ఆమోదించవలసి ఉంది గనుక, తెలంగాణా బిల్లుని సభలో ప్రవేశపెట్టవద్దని, పెడితే కాంగ్రెస్ యంపీలే ఆందోళన చేసి సభ జరగకుండా అడ్డుపడతారని హెచ్చరించాయి. ఇప్పుడు సరిగ్గా అదే జరుగబోతోంది. గత సమావేశాలలో ఆందోళన చేస్తున్నసభ్యులను సస్పెండ్ చేసి సభా కార్యక్రమాలను నిర్వహించడాన్నికూడా ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. కనుక ఇప్పుడు సభలో ఆందోళన చేయబోతున్న కాంగ్రెస్, తెదేపా, వైకాపా, తెరాస యంపీలను సభ నుండి సస్పెండ్ చేయడానికి కూడా ఆలోచించక తప్పదు.
ఓట్-ఆన్-అకౌంట్ ద్వారా కీలకమయిన సాధారణ, రైల్వేబడ్జెట్లను సభలో ఆమోదించవలసిన ఈ తరుణంలో సభలో తెలంగాణాకు అనుకూలంగా, వ్యతిరేఖంగా కాంగ్రెస్ సభ్యులే ఆందోళనకు దిగితే, అది కాంగ్రెస్ అధిష్టానానికే అవమానం. ‘కాంగ్రెస్ అధిష్టానం తన యంపీలు, ముఖ్యమంత్రినే అదుపులో ఉంచుకోలేకపోతోందని’ బీజేపీ నేత సుష్మాస్వరాజ్ విమర్శ అక్షరాల నిజమని ఈరోజు సభలో కాంగ్రెస్ యంపీలు, జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ధర్నాచేయనున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, వారి ధర్నాను వ్యతిరేఖిస్తూ రాజ్ ఘాట్ వద్ద ధర్నాచేయబోతున్న టీ-కాంగ్రెస్ నేతలు నిరూపించబోతున్నారు.