లగడపాటిది కాంగ్రెస్ డీ.యన్.ఏ. కాదా?
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి తనదయిన శైలిలో ‘సమైక్య చాంపియన్ షిప్’ పోటీలో దూసుకుపోతున్నపటికీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు వేస్తున్నఎత్తులతో పోటీలో వెనుకబడిపోతున్నారు. ఇక వీరిరువురు కాక ఈ పోటీలో విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్ తదితరులున్నపటికీ, వారందరూ పక్క వాయిద్యాలకే పరిమితమవడం వలన వారు మీడియా ముందుకు వచ్చి ఎంతగా గొంతు చించుకొన్నపటికీ ముఖ్యమంత్రికి వస్తున్నంత మీడియా కవరేజ్, ప్రాధాన్యం దక్కడం లేదు, బహుశః ఆశించడం లేదేమో కూడా. మిగిలినవారి సంగతి ఎలా ఉన్నపటికీ లగడపాటి రాజగోపాల్ మాత్రం ఈవిషయంలో ఎన్నడూ రాజీపడలేదు. మీడియా దృష్టిలో పడాలనే తాపత్రయంతో ఆయన రాజీనామా చేయడం, దానిని స్పీకర్ ఆమోదించలేదని కోర్టుకి వెళ్ళడం, స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టడం వంటివి చాలానే చేస్తున్నారు. కానీ, చేసేపనిలో చిత్తశుద్ది లోపించడంతో అవి విఫలమయి నవ్వులపాలవుతున్నారు.
ఇంతకు ముందు తమ అధిష్టానం దత్తపుత్రుడు (జగన్మోహన్ రెడ్డి) కోసం స్వంత కొడుకులవంటి తమనే బలిపెడుతోందని, ఆయనతో తమ అధిష్టానం తెరవెనుక రహస్య ఒప్పందాలు చేసుకొందని ఆరోపించారు. మళ్ళీ ఆయన మొన్నమీడియాతో మాట్లాడుతూ విభజనవాది అయిన తెరాస రాజ్యసభ అభ్యర్ధి కేశవ్ రావుకి ఓటేయమని తమ అధిష్టానం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పిందని సరికొత్త ఆరోపణలు చేసారు. కానీ, వైకాపా తన శాసనసభ్యులెవరూ రాజ్యసభ ఎన్నికలలో పాల్గొనరాదని విప్ జారీ చేయడంతో లగడపాటి మరోమారు కంగుతిన్నారు.
ముఖ్యమంత్రితో సీమాంధ్ర నేతలందరూ కూడా విభజన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నారు తప్ప ఎవరూ అధిష్టానాన్ని వ్యతిరేఖించాలని అనుకోవడం లేదు. పార్టీ సూచించిన రాజ్యసభ అభ్యర్ధులకు మద్దతుగా ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కృషి చేసినప్పుడే ఆ విషయం మరోమారు స్పష్టమయింది. కానీ, లగడపాటి మరి ఆ సంగతి గ్రహించలేదో లేక ఎలాగు కొత్తపార్టీ పెట్టుకొని బయటకు వెళ్లిపోతున్నపుడు, అధిష్టానాన్ని ఆ మాత్రం ఆడిపోసుకొంటే తప్ప పూర్తి మైలేజీ రాదని భావిస్తున్నారో తెలియదు కానీ నిత్యం కాంగ్రెస్ అధిష్టానాన్ని దుమ్మెత్తి పోస్తూ హిరణ్యకశిపుడిలా వైరం పాటిస్తున్నారు. పనిలోపనిగా అధిష్టానానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సాటి సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులను కూడా ఆయన ఏదో రూపంలో గట్టిగా ‘టచ్చ్’ చేస్తూనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ, కావూరి సాంభశివరావు తదితరులతో ఆయన చాలాసార్లే కత్తులు దూశారు.
మూడు రోజుల క్రితం కేవీపీ రామచంద్ర రావు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర నేతలందరికీ డిల్లీలో తన నివాసంలో విందు భోజనం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా లగడపాటి రాజగోపాల్, కేంద్రమంత్రి కావూరి సాంభశివరావు పార్లమెంటులో గట్టిగా సమైక్యవాదం వినిపించకుండా మిన్నకుండి పోతున్నారని తీవ్ర విమర్శలు చేసినప్పుడు, సీమాంధ్ర నేతలందరూ లగడపాటినే తప్పుపట్టారు.
పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించడం ఎంత ముఖ్యమో పార్టీని బ్రతికించుకోవడమూ తమకు అంతే ముఖ్యమని, అప్పుడే రాజకీయ నేతలుగా తమకు మనుగడ ఉంటుందనే సంగతిని గ్రహించాలని కేవీపీతో సహా అందరూ ఆయనకు క్లాసు పీకినట్లు సమాచారం. కానీ, లగడపాటి మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో చివరికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకు సర్ది చెప్పినట్లు సమాచారం.
పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ కేంద్ర ప్రభుత్వం పంపిన బిల్లుకి వ్యతిరేఖంగా శాసనసభలో తీర్మానం కూడా చేయించి, డిల్లీలో దీక్షలు చేస్తూనే పార్టీని ఎలాగయినా బ్రతికించుకోవాలని ఆత్రుతపడుతున్నకేవీపీ, చిరంజీవి, కావూరి, కిరణ్, బొత్స, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు తదితరులు, మరోవైపు స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానాలు చేస్తున్నకాంగ్రెస్ పార్టీకి స్వంత కొడుకు వంటి లగడపాటి రాజగోపాల్ లలో ఎవరిది అసలు సిసలయిన కాంగ్రెస్ డీ.యన్.ఏ. యో ప్రజలే తేల్చవలసి ఉంది.