ఆమ్ ఆద్మీ ముష్టి తెలివి!
posted on Feb 4, 2014 @ 2:49PM
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రజల్లో పరువు పూర్తిగా పోయింది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు ఊడ్చిపారేయాలని కలలు కన్న కేజ్రీవాల్ కలలు కల్లలైపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఏర్పడిన అంచనాలనీ భ్రమలన్నీ తేటతెల్లం అయిపోయాయి. అధికారం చేపట్టి నెల రోజులు పూర్తి చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం ఢిల్లీలో దినదినగండంగా నెట్టుకొస్తోంది. జనాల్లో నమ్మకం కోల్పోయిన ఆమ్ ఆద్మీ పార్టీ రోజుకో ముష్టి తెలివిని ప్రదర్శిస్తూ జనాల్లో పోయిన పరువుని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మొన్నీమధ్య అవినీతిపరుల లిస్టు ఒకదాన్ని విడుదల చేసింది. దాంతోపాటు అవినీతిని అరికట్టడం తనవల్ల తప్ప మరొకరి వల్ల కాదన్నట్టు బిల్డప్పులిస్తూ ఆచరణ యోగ్యంగా లేని లోక్‌పాల్ బిల్లును ఢిల్లీ అసెంబ్లీలో ఆమోదించేసింది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని కొనసాగిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులని పేరుపేరునా తిట్టిపోస్తోంది. ఆమ్ ఆద్మీ ఎంత తిడుతున్నా కాంగ్రెస్ దులిపేసుకుంటూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తోంది. దీన్నే రాజకీయం అంటారేమో! ఇదంతా ఇలా వుంటే మదన్‌లాల్ అనే ఓ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ఇష్యూని ఒకదాన్ని లేవదీశాడు. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీ కుట్ర పన్నారనేది ఆ ఇష్యూ సారాంశం. ఎవరో ఇద్దరు వ్యక్తులు తన దగ్గరకి వచ్చి ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని కూలిస్తే ఇరవై కోట్లు ఇస్తామని చెప్పారట. ముఖ్యమంత్రిని కూడా చేస్తామని ఆశ చూపించారట. నరేంద్రమోడీకి సన్నిహితుడినని ఆ వ్యక్తులు చెప్పారట. అలాగే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తనకి ఫోన్ చేసి తనతో బీజేపీ అగ్ర నాయకుడొకరు మాట్లాడుకుంటున్నారని చెప్పారని, ఎవరా వ్యక్తి అని అడిగితే అరుణ్ జైట్లీ అనిచెప్పారని ఆరోపించాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా మదన్‌లాల్ చేసిన ఈ ఆరోపణలని బీజేపీ నాయకులు ఖండించారు. రాజకీయ వర్గాలు కూడా ఈ ఆరోపణలని రాజకీయ మైలేజీ కోసం, జనాల్లో పోయిన పరువుని తిరిగి సంపాదించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పనుల్లో భాగంగా భావిస్తున్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయంగా మరింత దిగజారిపోయే అవకాశం వుందని విశ్లేషిస్తున్నారు. ‘పిచ్చి ముఖ్యమంత్రి’గా పేరు సంపాదించుకున్న కేజ్రీవాల్ తన పార్టీ నాయకులతో ఆడిస్తున్న ఇలాంటి నాటకాలను కట్టిపెట్టాలని సూచిస్తున్నారు.