జేసీది ఆవేదనా? ఆవేశమా?
posted on Feb 22, 2014 @ 9:21PM
సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి సోనియాగాంధీని దిగిపొమ్మని డిమాండ్ చేసినందుకు ఆయనకి కాంగ్రెస్ పార్టీ షో-కాజ్ నోటీసు జారీ చేసింది, కానీ ఆ తరువాత దానిని పక్కన పడేసింది. రాష్ట్ర విభజన కూడా జరిగిపోవడంతో ఇక ఆయనే స్వయంగా పార్టీని వదిలేయాలనుకొంటున్నారు. అందుకే ఆయన తన ఆవేదనని, ఆక్రోశాన్ని వ్రేళ్ళగ్రక్కుతూ ఈరోజు సోనియా గాంధీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.
“ఆమె చేతిలో అధికారం పిచ్చోడు చేతిలో రాయిలా ఉంది. ఆమె ఆ రాయిని ఎప్పుడు ఎవరి మీదకి విసురుతుందో ఎవరికీ తెలియదు. అటువంటి ఆమె మా పార్టీకి అధ్యక్షురాలవడం మా దౌర్భాగ్యం. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ అవన్నీ వృధాశ్రమే. ఎందుకంటే ఆ సోనియమ్మ విసిరిన రాయి ఎక్కడ పడితే అదే మన రాజధాని అని సీమాంధ్ర ప్రజలు మహాప్రసాధంలా స్వీకరించాలి. తమ కర్మ అంతేనని తృప్తి పడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఈ నిపుణుల కమిటీలు, నివేదికలు అన్నీ వృధా శ్రమే. ఇదివరకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి తయారు చేసిన కృష్ణా కమిటీకే దిక్కు లేనప్పుడు, మళ్ళీ రాజధాని కోసం కొత్త కమిటీలెందుకు? ఆమె వేలెత్తి ఏ ప్రదేశాన్ని చూపిస్తే అదే మన రాజధాని అవుతుంది. ఏ విషయంలోనయినా ఆమెదే అంతిమ నిర్ణయం. అదే అందరికీ మహా ప్రసాదం అని స్వీకరించాలి తప్ప ఎవరూ ప్రశ్నించకూడదు. వేరే ఏ పార్టీలు చేర్చుకొని కారణంగానే మా పార్టీ లో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మకి భజన చేసుకొంటూ కాలక్షేపం చేసుకొంటున్నారు. ఈ ఎన్నికల తరువాత ఆంధ్ర రాష్ట్రంలో మరిక కాంగ్రెస్ కనబడదు. ఇక నుండి ఇక్కడ కూడా తమిళనాడులో లాగే ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తుంది.” అని మీడియాతో అన్నారు.
ఆయన వాడిన భాష చాలా కటోరంగా ఉన్న, ఆయన అభిప్రాయలు మాత్రం ప్రజలలో దాగిన ఆవేదన, అక్రోశాలను ప్రతిఫలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి పెద్ద అండగా నిలిచిన తెలుగు ప్రజల పట్ల ఆమె, ఆమె చుట్టూఉన్న కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా చాలా హీనాతి హీనంగా వ్యవహరించారు. అయినప్పటికీ, కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీ టికెట్ల కోసం, మంత్రి పదవుల కోసం ఆమె చుట్టూ నిసిగ్గుగా ప్రదక్షిణాలు చేస్తున్నారు. రేపు ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని తెలిసి ఉన్నపటికీ, వేరే పార్టీలలోకి వెళ్లేందుకు సమస్యలు ఉన్నందునే వారు గత్యంతరంలేక కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అయితే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తమ భయాన్ని కప్పి పుచ్చుకోనేందుకు బయటకి పోయేవారే పిరికిపందలని నిందిస్తున్నారు.