కొత్త పార్టీకి ముహూర్తం ఖరారయిందా
posted on Feb 21, 2014 @ 7:41PM
నిన్న మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గురించే మీడియాలో ఎక్కువగా చర్చలు జరుగుతుండేవి. కానీ, రాజీనామా చేసిన తరువాత ఆయన మళ్ళీ మీడియాకు కనబడలేదు. అయితే ఈరోజు ఆయన సన్నిహిత సహచరుడు మరియు మంత్రి పితాని సత్యనారాయణ రేపు 23వ తేదీన కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీని ప్రకటిస్తారని, అందులో తను తన అనుచరులు అందరం జేరుతామని మీడియాకు తెలపడంతో, కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ కోసం కసరత్తు చేస్తున్నట్లు అర్ధమవుతోంది.
ఇంతకాలంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా గట్టిగా పోరాడినవారిలో ముఖ్యుడైన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం చేయగా, గంటా శ్రీనివాసరావు తెదేపాలో జేరెందుకు ఆసక్తి చూపుతునట్లు సమాచారం. ఇక టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు తాము ఏ పార్టీలో చేరుతామో ఇప్పుడే చెప్పలేమన్నారు. అందువలన ఇప్పుడు కిరణ్ కొత్త పార్టీ పెడితే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారనేది అనుమానమే. ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయినందున, సమైక్య నినాదం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. పైగా రాష్ట్ర విభజనను అడ్డుకొంటానని ఆయన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరినీ త్రప్పు ద్రోవ పట్టించి విభజన జరిగేందుకు కారకుడయ్యాడని బొత్ససత్యనారాయణ, రామచంద్రయ్య, చిరంజీవి వంటివారు విస్పష్టంగా చెపుతున్నారు. అంటే ఈ విషయం వారికి కూడా తెలిసినప్పటికీ రాష్ట్ర విభజన జరిగే వరకు అందరూ మౌనంగా ఉండిపోయి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ అధిష్టానానికి అందరూ సహకరించారని వారే స్వయంగా అంగీకరిస్తున్నారన్న మాట!
ఇక కిరణ్ విషయానికి వస్తే ఆయన అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ రాజీనామా చేస్తున్న తరుణంలో కూడా సోనియా, రాహుల్ గాంధీలని తీవ్రంగా విమర్శించకపోగా, తనకు ఈ హోదా, గౌరవం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ పదవి నుండి సవినయంగా తప్పుకొన్నారు. అందువల్ల నేటికీ ఆయన కాంగ్రెస్ విధేయుడేనని స్పష్టమవుతోంది. బొత్స తదితరులు చెప్పిన మాటల ప్రకారం చూసినట్లయితే రాష్ట్ర విభజనలో అధిష్టానానికి ఆయనే సహకరించారని అర్ధం అవుతోంది.
మరి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి, ఇంతగా విధేయత చూపిస్తున్న ఆయన ఎన్నికల తరువాత తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కలిపేయకుండా ఉండరని భావించే ప్రజలకు ఏవిధంగా నమ్మకం కలిగించగలరు? ఇంతకీ ఆయన కొత్త పార్టీ దేనికోసం సాధిస్తున్నారు? అని ఆలోచిస్తే అది కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా ఓట్లు చీల్చి తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోనేందుకే తప్ప ఏదో సాధించడానికి కాదని అర్ధమవుతుంది.