అవన్నీ పుకార్లే: లక్ష్మినారాయణ
posted on Feb 28, 2014 @ 5:15PM
అవినీతి, అసమర్ధత, స్వార్ధ రాజకీయాల కారణంగా నానాటికి ప్రజల దృష్టిలో పలుచనవుతున్న రాజకీయ పార్టీలు, ప్రజలలో మంచి పేరున్న ఒక సినిమా స్టార్ లేదా సామాజిక కార్యకర్త లేదా మరెవరినయినా పార్టీలోకి రప్పించి, వారిని ముందుంచుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంటాయి. లేదా ఫలానా గొప్ప వ్యక్తి తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకొంటాయి.
సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మినారాయణ, గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ గనుల త్రవకాల కేసులు, జగన్ అక్రమాస్తుల కేసులు చేధించి ప్రజల దృష్టిలో ఒక హీరోగా నిలిచారు. నీతి నిజాయితీలకు మారుపేరుగా, ప్రభుత్వ,రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ముక్కు సూటిగా దూసుకుపోయే ఒక అత్యుతమ అధికారిగా, మంచి పేరు సంపాదించిన సీబీఐ జేడీ లక్ష్మినారాయణకు, ఆయన నీతి నిజాయితీ, సమర్ధతలే శాపంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయనను జగన్ కేసులలో దర్యాప్తుకు నియమించినప్పటికీ, మరెవరి ఒత్తిళ్లకు లొంగడం వలననో ఆయనకు ఎటువంటి పోస్టింగు ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలలపాటు ఖాళీగా కూర్చోబెట్టింది. కానీ, ఆయన తన మనోస్తయిర్యం కోల్పోలేదు. పైగా ఆ సమయాన్ని పూర్తిగా సద్వినియోగించుకొంటూ యువతకు స్వామీ వివేకానంద వంటి మహనీయుల భోదనల గురించి వివరిస్తూ దేశమాత సేవలో వారు కూడా పాల్గొనవలసిన అవసరముందని యువతకు ప్రేరణ కలిగించేవారు.
అయితే, ఆయన పరిస్థితిని అలుసుగా తీసుకొన్న రాజకీయ పార్టీలు ఆయన త్వరలోనే తన పదవికి రాజీనామా చేసేసి తమ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం చేసుకోసాగాయి. ఆయన ఆమాద్మీ పార్టీలో చేరుతున్నారని, బీజేపీలో చేరుతున్నారని ప్రచారం మొదలయింది. ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను ఏ రాజకీయ పార్టీలోను చేరబోవడం లేదని, తను పూర్తికాలం సర్వీసులోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. తను రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని ఆయన స్పష్టం చేసారు.