కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం తాయిలం
posted on Mar 1, 2014 @ 11:34AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతీసారి సామాన్య ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. ఏ కొత్త పన్నులతో అవి తమ కష్టార్జితాన్ని దోచుకొంటాయో అని వారు భయపడతారు. అదేవిధంగా ఎన్నికలను చూసి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు బెంగపెట్టుకొంటాయి. ఐదేళ్ళు ప్రజలతో ప్రభుత్వాలు ఆడుకొంటే, ఎన్నికలు వచ్చినప్పుడు ఓ రెండు మూడు నెలలు వాటితో ప్రజలు ఆడుకొనే అవకాశం కలుగుతుంటుంది. కానీ ఆ మూనేళ్ళ ముచ్చటలో కూడా తమదే పైచేయి కావాలని ప్రభుత్వాలు వాటిని నడుపుతున్నరాజకీయ పార్టీలు తాయిలాలు విసురుతుంటాయి.
సబ్సీడీ గ్యాస్-ఆధార్ బందం త్రెంపి ప్రజలకు గ్యాస్ ట్రబుల్ నుండి విముక్తి కలిగించిన కేంద్ర ప్రభుత్వం, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 10 శాతం డీఏ పెంచి ఎన్నికల తాయిలాలు ఉదారంగా పంచిపెట్టింది. పేద, మధ్యతరగతికి చెందిన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ పింఛన్ కనీస వెయ్యికి పెంచింది. నగరాలు, పట్టణాలలో ఉన్న ఓటర్లతో బాటు మారుమూల గ్రామాలలో భారంగా బ్రతుకులీడుస్తున్న గిరిజన ఓటర్లను కూడా మరిచిపోకుండా వారికి ఏడాదికి కనీసం 150 రోజులు ఉపాధి కల్పించేందుకు అంగీకరించింది. ఇంకా ఇటువంటివి చిన్నచిన్న తాయిలాలు చాలానే ప్రకటించింది. ఐదేళ్ళ పాటు అనేక కుంభకోణాలు చేసుకొంటూ కాలక్షేపం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడేసరికి ఒక్కసారిగా మేల్కొని అవినీతి చట్టాలను, మహిళా, గిరిజన సంరక్షణ చట్టాలు అంటూ చాల హడావుడి చేసింది. ఇక పార్లమెంటు సమావేశాలు కూడా ముగిసిపోవడంతో ఇప్పుడు ఇటువంటి తాయిలాలు పంచిపెడుతూ ప్రజలను మంచి చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఐదేళ్ళ పాటు సమర్ధమయిన, అవినీతి రహితమయిన పాలన అందించి ఉంటే, ఈ తిప్పలు పడే బాధ ఉండేది కాదు కదా?