తెదేపాలో పొట్లూరి ముసలం

  ఈసారి ఎన్నికలలో విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న పొట్లూరి వరప్రసాద్, తెదేపా, వైకాపాలు ఆయనకీ టికెట్ నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ పంచన చేరి జనసేన పార్టీ స్థాపన కోసం విరివిగా డబ్బు ఖర్చు చేసారు కానీ, అయన కూడా ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోమని ప్రకటించడంతో హతాశులయ్యారు. అయితే ఎలాగో ఆయనను ఒప్పించి విజయవాడ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అందువలన పొట్లూరి నేడో రేపో ఆయన విజయవాడ నుండి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేయవచ్చును.   పవన్ కళ్యాణ్ తెదేపాకు మద్దతు ప్రకటించి ఈవిధంగా చేస్తుండటం తెదేపా కూడా జీర్ణించుకోలేపోతోంది. ఒకవేళ పొట్లూరి పోటీకి దిగితే, ఆయనకు సన్నిహితుడయిన పవన్ కళ్యాణ్ ఆయన తరపున ప్రచారంలో పాల్గొనవచ్చును. అదే జరిగితే అది పార్టీ అభ్యర్ధి కేశినేని నాని విజయావకాశాలను దెబ్బ తీయవచ్చును గనుక, తెదేపా కూడా ఈ వార్త తెలుసుకొని అప్రమత్తమయింది.   పవన్ కళ్యాణ్ తమ కంటే బీజేపీతోనే ఎక్కువ సన్నిహితంగా మెలుగుతున్నందున, ఆ పార్టీ ద్వారానే ఆయనకు చెప్పించి పొట్లూరిని పోటీ నుండి విరమింపజేయాలని తెదేపా భావిస్తోంది. సందిగ్ధంలో పడిన తెదేపా-బీజేపీ పొత్తుల విషయమై మాట్లాడేందుకు ఈరోజు డిల్లీ నుండి హైదరాబాద్ వస్తున్న బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ తో ఈవిషయాన్ని తెదేపా సీనియర్ నేతలు చర్చించవచ్చును.   అయితే అందుకు బీజేపీ అంగీకరించినా, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తారా లేదా అనేది అనుమానమే. ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించినా, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని తహతహలాడుతున్న పొట్లూరి వరప్రసాద్ వెనక్కి తగ్గుతారా? అనేది మరొక ప్రశ్న. అంతిమంగా ఈ వ్యవహారంలో ఎవరివో ఒకరివి సంబంధాలు దెబ్బతినడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు కారణం ఎన్నికలలో పోటీ చేయాలనే పొట్లూరి పట్టుదలే!   పొట్లూరి ఎన్నికలలో ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేయాలనుకోవడంలో తప్పు లేదు, అది నేరమూ కాదు. అయితెహ్ ఆయన పోటీ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ పార్టీకి పెట్టుబడి పెట్టడం వ్యాపార లక్షణమే. అయితే ఏ వ్యాపారస్తుడు కూడా తను పెట్టిన పెట్టుబడి నష్టపోవాలనుకోడు గనుకనే ఆయన ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. ఇదే పని ఆయన తెదేపా, వైకాపాలు టికెట్ నిరాకరించిన్నపుడే చేసి ఉండి ఉంటే నేడు ఆయనను ఎవరూ ఈవిధంగా విమర్శించే అవకాశం ఉండేదే కాదు.   అయన ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతున్నపటికీ, ఆయనతో పవన్ కళ్యాణ్ కి ఉన్న స్నేహ, (సినీ) వ్యాపార సంబంధాల కారణంగా లేదా ఆయన తన పార్టీ స్థాపనకు భారీగా డబ్బు ఖర్చు చేసినందున ఆయన తరపున ప్రచారం చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే అది అందరికీ ఇబ్బందికరమే.

సీమాంధ్ర ఎన్నికల బరిలో ‘జనసేన’

      'జనసేన' తరఫున కొన్ని చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది. పొట్లూరి వరప్రసాద్‌తోపాటు మరో ఆరుగురిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఏడుగురు అభ్యర్థులు పవన్‌తో భేటీ అయి, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం లోగా నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం.   పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇస్తూనే, జనసేన తరఫున స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. మల్కాజ్‌గిరిలోకూడా లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు తన మద్దతు ఉండబోతుందని నిన్న బెంగుళూరులో పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే పొట్లూరి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేమిటీ, సంవత్సరాలా కొలది జైల్లో ఉన్నవాళ్లు బయటకు వచ్చి పోటీ చేస్తున్నప్పుడు పొట్లూరి ఎందుకు పోటీ చేయకూడదని ఆయన ప్రశ్నించిన విషయం విదితమే. బుధవారం ఉదయం పొట్లూరితో సమా పలువురు జనసేన నేతలు పవన్ కల్యాణ్‌కు కలుసుకుని స్వతంత్ర అభ్యర్థులుగానే ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పినట్లుగా సమాచారం. వారు చెప్పినటువంటి ప్రతిపాధనలన్నింటికి పవన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఈరోజు పవన్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.

టిఫిన్ బాక్స్ బాంబుల కలకలం

      ఛత్తీస్‌ఘడ్‌లో మూడు పార్లమెంటు సీట్లకు గురువారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాన్కర్ జిల్లాలో శోధన నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి భారీగా మందుగుండు కూరిన రెండు టిఫిన్ బాక్స్ లు కనిపించాయి. రెండు బాంబులు కలపి పది కిలోల బరువు కలిగి వున్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వీర్యం చేశారు.   ఎన్నికల సందర్భంగా విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టులు ఈ టిఫిన్ బాక్సు బాంబులను ఏర్పాడు చేశారని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో కొంతమంది మావోయిస్టులు మరణించారు. దానికి ప్రతీకారంగా మావోయిస్టులు ఈ టిఫిన్ బాక్స్ బాంబులు ఏర్పాటు చేసి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. టిఫిన్ బాక్స్ బాంబులు లభించడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలను ముమ్మరం చేశారు. అనుమానిత వస్తువులు, వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వాలని పౌరులకు సూచించారు. టిఫిన్ బాక్స్ బాంబులు పోలీసులకు దొరికాయన్న వార్త ఛత్తీస్‌ఘడ్‌లో సంచలనం సృష్టించింది.

కరీంనగర్ సభలో సోనియాగాంధీ సారీ చెప్పాల్సిందే

      సీమాంధ్రని చావగొట్టి చెవులు మూసి మరీ తెలంగాణ ఇచ్చానని, మీ ఓట్లు మా పార్టీకే వేయండని చెప్పుకోవడాని కరీంనగర్ వస్తున్న సోనియాగాంధీ మీద టీఆర్ఎస్ మాటల దాడి ప్రారంభించింది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకోవడానికి ముందు 1200 మంది బలిదానాలకు కారణమైన సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలని నయవంచన చేసిందని, అందువల్లే ఈ ప్రాంత ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నాడు. అంచేత కరీంనగర్ సభలో సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పడంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్నామని ప్రకటించాలని, పోలవరం డిజైన్ మారుస్తున్నట్టు, ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సిందేనని కేటీఆర్ గర్జించాడు.

కాంగ్రెస్‌కి భారమైపోయిన చిరంజీవి!

      పెద్దవాళ్ళు ఏదైనా పని చేస్తుంటే కాళ్ళకి అడ్డం పడే పిల్లలు వుంటారు చూశారా... ప్రస్తుతం సీమాంధ్ర కాంగ్రెస్‌లో చిరంజీవి పరిస్థితి అలాగే వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సీమాంధ్రలో నిండా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీని చిరంజీవి తన గ్లామర్‌తో పైక తేలుస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. అయితే చిరంజీవి నుంచి అలాంటి మేలు కొంత అయినా జరిగిన దాఖలాలు ఇప్పటి వరకూ కనిపించడం లేదు. పార్టీ అంతర్గత మీటింగ్స్ లో ఆవేశంగా మాట్లాడ్డం తప్ప ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్ళేలా చిరంజీవి చేయలేకపోతున్నారని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.   కాంగ్రెస్ పార్టీకి బలంగా వుంటారని చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీ తనలో విలీనం చేసుకుంది. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతోపాటు ఆయనతో పాటు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలని తగిన రీతిలో గౌరవించింది. అయితే చిరంజీవి వెంట వచ్చిన ఎమ్మెల్యేలలో దాదాపు అందరూ కాంగ్రెస్ పార్టీని  విడిచి వెళ్ళిపోయారు. చిరంజీవి కనీసం వాళ్ళని ఆపే విషయంలో కూడా ఫెయిలైపోయారు. చిరు వర్గం ఎమ్మెల్యేలు పోతే పోయారు చిరంజీవి గ్లామర్ అయినా పార్టీకి ఉపయోగపడుతుందన కాంగ్రెస్ అనుకుంటే, ఆయనగారి మీటింగ్స్ కి జనలే కరువైపోతున్నారు. సరే ఈ విషయంలో కూడా సరిపెట్టుకుందాం. చిరంజీవి పార్టీ అభివృద్ధికి ఏవైనా మంచి సలహాలు ఇస్తారా అంటే, రాజకీయ అనుభవ శూన్యుడైన చిరంజీవి పాలిటిక్స్ ట్రిక్స్ దేనినీ ప్రదర్శించలేకపోతున్నారు. మొత్తమ్మీద సీమాంధ్ర కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో పాల్గొని సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ సూపర్‌గా వుందని అనడం తప్ప ఆయన చేస్తున్నదేమీ లేదు. ఇలాంటి చిరంజీవి తమ కాళ్ళకు అడ్డు పడిపోవడం తప్ప పార్టీని బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ లేవని  సీమాంధ్ర కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

నాకు టికెట్ ఇవ్వాల్సిందే: హరికృష్ణ

      ఎన్టీఆర్ కుమారుడు, తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మరోసారి పార్టీలో హడావిడి సృష్టించడానికి సిద్ధమయ్యారు. హిందూపురం టిక్కెట్ తనకి కేటాయించాలని చంద్రబాబుని ఓ పదిరోజుల క్రితం హరికృష్ణ కోరినప్పటికీ చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతకుముందు కృష్ణాజిల్లాలోని పెనమలూరు స్థానాన్ని కోరినప్పుడు కూడా ఆయన మాటని పట్టించుకునే వారే లేకుండా పోయారు. దాంతో హరికృష్ణ హడావిడి సృష్టించడానికి రంగంలోకి దిగారు. తాను ఏ స్థానం నుంచి టిక్కెట్ అడిగినా ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనకు టికెట్ ఇవ్వకపోగా..తాను టికెట్ అడగలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే పార్టీలో తన త్యాగాన్ని గుర్తించినవారే లేకుండా పోయారని ఆయన బాధపడిపోతున్నారు. హరికృష్ణ వ్యక్తం చేస్తున్న ఈ ఆవేదనని అయినా పట్టించుకునేవారు తెలుగుదేశం పార్టీలో వున్నారో లేరో!

తెల్లగడ్డం.. పిల్లిగడ్డం.. నల్లగడ్డం!

      మీ ఓట్లు మాకే వేయండి అని ఓటర్లను గడ్డం పట్టుకుని బతిమాలడానికి మూడు రకాల గడ్డాలు ఒకే వేదిక మీదకి రాబోతున్నాయి. ఆ మూడు గడ్డాలు ఏవంటే... తెల్లగడ్డం, పిల్లిగడ్డం, నల్లగడ్డం. ఈపాటికి అందరికీ అర్థమైపోయే వుంటుంది. తెల్లగడ్డం అంటే నరేంద్రమోడీ, పిల్లిగడ్డం అంటే చంద్రబాబు నాయుడు, నల్లగడ్డం అంటే పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురూ కలసి పాల్గొనే బహిరంగ సభలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సీమాంధ్ర, తెలంగాణల్లో జరిగే బహిరంగ సభల్లో ఈ ముగ్గురూ ఒకే వేదిక మీద నుంచి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతారని తెలుస్తోంది. ఈ బహిరంగ సభలకు సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటించాల్సి వుంది. తమ గడ్డాలు పట్టుకుని బతిమాలడానికి ఒకేసారి వస్తున్న మూడు రకాల గడ్డాలను ఒకే వేదిక మీద చూడటానికి తెలుగు ఓటర్లు గడ్డాలు నిమురుకుంటూ ఎదురుచూస్తున్నారు.

కరీంనగర్‌లో సోనియాగాంధీ కళ్ళు తిరగాలి

      బుధవారం సాయంత్రం కరీంనగర్‌లో జరగబోతున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలో సోనియాగాంధీకి కళ్ళు తిరిగేలా చేయాలని టీ కాంగ్రెస్ నాయకులు గట్టి పట్టుదల మీద వున్నట్టు సమాచారం. సోనియా కళ్ళు తిరగడం అంటే, సభకు హాజరైన జనాన్ని చూసి సోనియాగాంధీ ఆశ్చర్యపోవడంతోపాటు ఆనందించాలన్నది టీ కాంగ్రెస్ నాయకుల అసలు ఉద్దేశం.   ఢిల్లీలో కూర్చున్న సోనియా తాను అడ్డదారిలో తెలంగాణ ఇచ్చేయడం వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలు తనను దేవతలా భావిస్తున్నారని భావిస్తున్నారు. అలాంటి సోనియాగాంధీ తన బహిరంగ సభలో జనం తక్కువగా కనిపిస్తే హర్టయి, టీ కాంగ్రెస్ నేతలకు క్లాసు పీకే అవకాశం వుంది కాబట్టి టీ కాంగ్రెస్ నాయకులు  సభ నిండుగా వుండేలా సకల చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించిన టీ కాంగ్రెస్ నేతలు దానికోసం ఎవరి వంతు కృషి వారు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి మాత్రమే కాకుండా, కరీంనగర్‌కి సమీపంలో వున్న ఇతర తెలంగాణ జిల్లాల నుంచి కూడా జనాన్ని భారీగా సమీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  

పొట్లూరి ప్రసాద్‌ని ఓదార్చిన పవన్ కళ్యాణ్

      కర్నాటకలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని హైదరాబాద్‌కి వచ్చిన పవన్ కళ్యాణ్‌తో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం టిక్కెట్ ఆశించి భంగపడిన పొట్లూరి ప్రసాద్ సమావేశమయ్యారు. టిక్కెట్ వచ్చినట్టే వచ్చి మిస్ కావడం పట్ల పొట్లూరి ప్రసాద్ పవన్ కళ్యాణ్ దగ్గర తన ఆవేదనని వ్యక్తం చేయగా, పవన్ కళ్యాణ్ అతని ఓదార్చినట్టు తెలుస్తోంది. ఈ టిక్కెట్ విషయంలో చంద్రబాబు తన చాణక్య నీతిని ప్రదర్శించారని, తాను ఎవరికి టిక్కెట్ ఇవ్వదలుచుకున్నారో అతనికే ఇచ్చారని పొట్లూరి ప్రసాద్ పవన్‌తో అనగా, మనకీ అవకాశం వస్తుందని, అప్పుడు మన పవర్ చూపిద్దాం అని పవన్ అన్నట్టు సమాచారం. నామినేషన్లకు ఇంకా సమయం వుంది కాబట్టి చివరి నిమిషం వరకూ ఆశలు కోల్పోవద్దని పవన్ కళ్యాణ్ పొట్లూరి ప్రసాద్‌కి చెప్పినట్టు తెలుస్తోంది.

హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్

      నటుడు, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ ఈరోజు హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టాలన్నబాలకృష్ణ చిరకాల కోరిక ఈరోజు హిందూపూర్ నుండి నామినేషన్ వేయడంతో నెరవేరింది. హిందూపురంలో సుగూర ఆంజనేయ స్వామి దేవాలయంలో బాలయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. బాలకృష్ణను చూసేందుకు హిందూపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో హిందూపురం రోడ్లు జనసంద్రమయ్యాయి. అభిమానులు, కార్యకర్తలు రోడ్ల మీదే కాకుండా బిల్డింగులు, చెట్లపైకి ఎక్కి బాలయ్యకు అభివాదం చేస్తూ... పూల వర్షం కూరిపించారు.

ఎన్నికల ప్రచారం: కేసీఆర్ నోరు కుట్టేస్తారా?

      తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ నోటిని కుట్టేయడానికి ఎన్నికల సంఘం ఆలోచిస్తోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవకాశాలున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ప్రాంతీయ విద్వేషాలు రగిలేలా మాట్లాడ్డం, అలా మాట్లాడ్డం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అలవాటైపోయింది.   ఆ అలవాటును ఆయన  ఈ ఎన్నికల సందర్భంగా కూడా కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నాలుగైదు సందర్భాలలో మీడియాతో మాట్లాడినప్పుడు, బహిరంగసభలో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సీమాంధ్రులకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. తెలంగాణలో ఓట్లు దండుకోవడానికే కేసీఆర్ ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే కేసీఆర్ ధోరణిని తెలంగాణ టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఎన్నికలు పూర్తయ్యేవరకూ కేసీఆర్ బహిరంగ సభల్లో మాట్లాకుండా నిషేధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేసింది. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాంతీయ విద్వేషాలు తలెత్తేలా మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేసింది. సోమవారం రోజున నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన తీరును టీ టీడీపి ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నోటికి తాళం వేయాలని ఎన్నికల కమిషనర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

కరీంనగర్‌ లో సోనియా ఏం చెబుతారో

      రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిసారిగా తెలంగాణాలో అడుగుపెట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైన తరువాత సోనియా బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఈ రోజు కరీంనగర్‌ లో తెలంగాణ గురుంచి తొలిసారిగా మాట్లాడుతుండడంతో, ఆమె ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి అటు కాంగ్రెస్ నేతల్లోను ఇటు ప్రతిపక్ష నేతల్లోను నెలకొంది. తెలంగాణ ఏర్పాటుతో పాటు భవిష్యత్‌లో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కూడా సోనియాగాంధీతో ఇక్కడ నుంచి ప్రకటన చేయించే దిశగా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు లక్షా 50 వేల మందిని సమీకరించాలనే లక్ష్యం పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 40 వేల వరకు జనసమీకరణ జరపాలని చూస్తున్నారు. సోనియా గాంధీ ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ రానున్నారు.4 నుంచి 4:30 వరకూ సభలో పాల్గొంటారు.

నేడే బాలకృష్ణ నామినేషన్

  ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టాలన్నబాలకృష్ణ చిరకాల కోరిక ఈరోజు హిందూపూర్ నుండి నామినేషన్ వేయడంతో నెరవేరనుంది. ఆయన ఈరోజు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి విమానంలో బెంగుళూరు వెళ్లి అక్కడి నుండి రోడ్డు మార్గాన్న హిందూపురం చేరుకొంటారు. మధ్యాహ్నం 11.30గంటలకు నామినేషన్ వేస్తారు. బాలకృష్ణ మొట్ట మొదటిసారిగా హిందూపురం నుండే ఎన్నికలలో పోటీ చేస్తున్నందున అక్కడ తెలుగు తమ్ముళ్ళు చాలా ఉతాషంగా ఉన్నారు. బాలకృష్ణను భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో చాలా అట్టహాసంగా ఊరేగింపుతో వెళ్లి నామినేషన్ వేయించేందుకు స్థానిక నేతలు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ వేసిన తరువాత బాలకృష్ణ హిండుపురంలో పార్టీ శ్రేనులని, అభిమానులతో సమావేశం అవుతారు.

ప్రియాంక తప్పతాగుతుంది: సుబ్రహ్మణ్యస్వామి

      తన వ్యాఖ్యలతో ఎప్పుడూ సంచలనం సృష్టిస్తూ వుండే సుబ్రహ్మణ్యస్వామి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక మీద సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక, ఆమె భర్త తప్పతాగి తిరుగుతూ వుంటారని, వారణాసిలో ప్రియాంక కనుక పోటీ చేస్తే అక్కడి జనం పచ్చి తాగుబోతు అయిన ఆమెని తరిమికొట్టేవారని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేయకుండా అడ్డుకుని ఆమె కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంచి పని చేశారని, ఆమె అక్కడ నుంచి పోటీచేస్తే అవమానాల పాలై వుండేదని అన్నారు. తప్పతాగి తిరిగే వారిగా ప్రియాంకకి, ఆమె భర్తకి ఇప్పడికే చాలా చెడ్డ పేరు వచ్చేసిందని సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. సుబ్రహ్యణ్య స్వామి ప్రియాంక మీద చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహం రగిల్చింది.

టీడీపీ మీద పగబట్టిన పవన్ కళ్యాణ్?

      విజయవాడ ఎంపీ టిక్కెట్‌ని తన స్నేహితుడు పొట్లూరి ప్రసాద్‌కి ఇస్తానని చెప్పి, చివరికి హేండ్ ఇచ్చిన టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ పగబట్టినట్టున్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రంగంలో వున్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నాడు.   ఈ నియోజకవర్గం నుంచి పోటీలో వున్న లోక్‌సత్తా అభ్యర్థి జయప్రకాష్ నారాయణకి అనుకూలంగా తాను ప్రచారం చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించడం పవన్ మనసులో వున్న ‘పగ’కి అద్దం పడుతోంది. మల్కాజ్‌గిరి నుంచి తొలుత తాను పోటీ చేయాలని పవన్ భావించాడట. అయితే జయప్రకాష్ నారాయణ అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు తెలియడంతో పవన్ కళ్యాణ్ తన పోటీ ఆలోచనని మానుకున్నాడట. ఇప్పుడు జేపీ గెలుపు కోసం ప్రచారం కూడా చేయబోతున్నాడట. మల్కాజ్‌గిరిలో జేపీకి ప్రచారం చేస్తే అది ఎన్డీయేకి, బీజేపీకి, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్టే అవుతుంది. రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ – టీడీపీ  కూటమిని గెలిపించాలని ప్రచారం చేస్తూనే, మరోవైపు మల్కాజ్‌గిరిలో టీడీపీ అభ్యర్థిని ఓడించాలంటూ ప్రచారం చేస్తానని పవన్ ప్రకటించడం ఏంటో అర్థంకాక బీజేపీ, టీడీపీ వర్గాలు జుట్టు పీక్కుంటున్నాయి. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో చెప్పినట్టు పవన్ కళ్యాణ్‌కి కొంచెం కాదు.. చాలా తిక్కుందని.. దానికి అసలు లెక్కేలేదని అనుకుంటున్నారు.

కేశినేని ఇక పండగ చేసుకోవచ్చా?

  ఈసారి ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో తప్ప మిగిలిన అన్ని పార్టీలలో అభ్యర్ధులకు టికెట్స్ టెన్షన్ తప్పలేదు. రెండేళ్ళ క్రితమే విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు కేశినేని నానికి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ, చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పొట్లూరి వర ప్రసాద్ టికెట్ ఇమ్మని పట్టుబట్టడంతో కేశినేనికి కూడా చివరి నిమిషం వరకు టెన్షన్ తప్పలేదు. కానీ, ఆయన పట్టిన పట్టు విడవకుండా గట్టిగా నిలబడటంతో చివరికి ఆయనకే చంద్రబాబు టికెట్ ఖరారు చేసి బీ-ఫారం కూడా అందజేసారు. దీనితో ఒక అధ్యాయం ముగిసింది. అయితే ఇల్లలకగానే పండగ కాదన్నట్లు, ఇక బలమయిన వైకాపా అభ్యర్ది కోనేరు ప్రసాదుని ఎన్నికలలో డ్డీ కొని ఓడించాల్సి ఉంటుంది. అప్పుడే పండగయినా!

పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేంటి? పవన్ కళ్యాణ్ ప్రశ్న!

  విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడైన పొట్లూరి ప్రసాద్ విజయవాడ నుంచి తెలుగుదేశం ఎంపీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్కామ్స్ లో వున్న పొట్లూరి ప్రసాద్ ఎన్నికలలో పోటీ చేయడమేంటి? దానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడమేంటన్న ప్రశ్నలు వినిపించాయి. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. పొట్లూరి ప్రసాద్ తన మిత్రుడే తప్ప తాను పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ ఎంపీ టిక్కెట్ కోసం రికమండ్ చేయలేదని చెప్పారు. అలాగే పొట్లూరి ప్రసాద్‌కి సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని, లక్షల కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్న జగన్ ఎన్నికలలో పోటీచేయగా లేని తప్పు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిన పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

గుంటలో పడ్డ మాగుంట?

      కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు మాగుంటకు పసుపు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మాగుంట చంద్రబాబుని పొగిడితే, చంద్రబాబు మాగుంటని మునగ చెట్టెకించారు. అయితే మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఆయన సన్నిహితులకు ఎంతమాత్రం ఇష్టం లేనట్టు తెలుస్తోంది.   తెలుగుదేశం పార్టీలో చేరడం అంటే మాగుంట తెలిసీ తెలిసీ గుంటలో పడ్డట్టేనని వారు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో ఏ సంస్థ సర్వే నిర్వహించినా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానాన్ని గెలుస్తుందని ఫలితాలు వచ్చాయని,  ఆ ఒక్క ఎంపీ ఎవరో కాదు.. మాగుంట శ్రీనివాసులురెడ్డేనని వారు భావిస్తున్నారు. ఎలాగూ గెలిచే అవకాశం వున్న మాగుంట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల తన ఇండివిడ్యువాలిటీని కోల్పోయే ప్రమాదం వుందని, అలాగే చంద్రబాబు నియంతృత్వాన్ని కూడా భరించాల్సి రావొచ్చునని భయపడుతున్నారు.  పార్టీ మారేదేదో తెలుగుదేశంలోకి కాకుండా భారతీయ జనతాపార్టీలోకి మారి వుంటే బాగుందేదని వారు భావిస్తున్నారు.

జూ.యన్టీఆర్ పై తెదేపాలో అప్రకటిత నిషేధం ఉందా?

  చంద్రబాబు నాయుడు ఈసారి పార్టీ ప్రచారం కోసం జూ.యన్టీఆర్ ని ఆహ్వానించకపోయినా కనీసం అతని గురించి సానుకూలంగా కూడా మాట్లాడలేదు. నారా లోకేష్ కూడా ‘అతను వస్తే రావచ్చునన్నట్లు’ మాట్లాడారే తప్ప రమ్మని పిలవలేదు. ఇక బాలకృష్ణ సంగతి సరేసరి! జూ.యన్టీఆర్ అనే ఒక వ్యక్తి ఉన్నడనే సంగతి కూడా ఆయనకు గుర్తులేనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఈ ముగ్గురు ప్రముఖుల అనాసక్తి చూసిన మిగిలిన నేతలు కూడా ఎక్కడా కూడా అసలు జూ.యన్టీఆర్ ప్రసక్తి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ, ప్రజల తరపున అడిగేందుకు మీడియా ఉండనే ఉంది.   మొన్న వల్లభనేని వంశీకి గన్నవరం టికెట్ ఖాయం అయిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతున్నపుడు, “మీకు జూ.యన్టీఆర్ చాల మంచి స్నేహితుడు కదా! ఆయనను మీరయినా గన్నవరంలో ప్రచారానికి ఆహ్వానిస్తారా?” అని హటాత్తుగా మీడియా వాళ్ళు ప్రశ్నించేసరికి ఆయన కొంచెం ఇబ్బందిపడ్డారు. అయితే మళ్ళీ తేరుకొని “రాజకీయాలు వేరు వ్యక్తిగత విషయాలు వేరు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే తగిన నిర్ణయం తీసుకొంటారు” అని జవాబిచ్చారు.   ఇది చూస్తే పార్టీలో జూ.యన్టీఆర్ పై ఎంతగా అప్రకటితమయిన నిషేధం ఉందో స్పష్టమవుతోంది. పార్టీ నుండి ఏమీ ఆశించకుండా, కోట్లు వచ్చే తన సినిమాలను కూడా పక్కనబెట్టి పార్టీకి ప్రచారం చేసిన జూ.యన్టీఆర్ వంటి పార్టీ విధేయుడిని పార్టీకి దూరంగా పెట్టడం వలన అతనికేమీ నష్టం ఉండబోదు. కాకపోతే అతనిని వేరే పార్టీ వాళ్ళు ఆకర్షించి తమవైపు తిప్పుకొంటే, అప్పుడు తెదేపానే తీరికగా చింతించవలసి ఉంటుంది.