గుంటలో పడ్డ మాగుంట?
posted on Apr 15, 2014 @ 4:57PM
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు మాగుంటకు పసుపు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మాగుంట చంద్రబాబుని పొగిడితే, చంద్రబాబు మాగుంటని మునగ చెట్టెకించారు. అయితే మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఆయన సన్నిహితులకు ఎంతమాత్రం ఇష్టం లేనట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో చేరడం అంటే మాగుంట తెలిసీ తెలిసీ గుంటలో పడ్డట్టేనని వారు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో ఏ సంస్థ సర్వే నిర్వహించినా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానాన్ని గెలుస్తుందని ఫలితాలు వచ్చాయని, ఆ ఒక్క ఎంపీ ఎవరో కాదు.. మాగుంట శ్రీనివాసులురెడ్డేనని వారు భావిస్తున్నారు.
ఎలాగూ గెలిచే అవకాశం వున్న మాగుంట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల తన ఇండివిడ్యువాలిటీని కోల్పోయే ప్రమాదం వుందని, అలాగే చంద్రబాబు నియంతృత్వాన్ని కూడా భరించాల్సి రావొచ్చునని భయపడుతున్నారు. పార్టీ మారేదేదో తెలుగుదేశంలోకి కాకుండా భారతీయ జనతాపార్టీలోకి మారి వుంటే బాగుందేదని వారు భావిస్తున్నారు.