ఎన్నికల ప్రచారం: కేసీఆర్ నోరు కుట్టేస్తారా?
posted on Apr 16, 2014 @ 12:44PM
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ నోటిని కుట్టేయడానికి ఎన్నికల సంఘం ఆలోచిస్తోందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవకాశాలున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా ప్రాంతీయ విద్వేషాలు రగిలేలా మాట్లాడ్డం, అలా మాట్లాడ్డం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అలవాటైపోయింది.
ఆ అలవాటును ఆయన ఈ ఎన్నికల సందర్భంగా కూడా కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నాలుగైదు సందర్భాలలో మీడియాతో మాట్లాడినప్పుడు, బహిరంగసభలో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సీమాంధ్రులకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. తెలంగాణలో ఓట్లు దండుకోవడానికే కేసీఆర్ ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అయితే కేసీఆర్ ధోరణిని తెలంగాణ టీడీపీ వ్యతిరేకిస్తోంది.
ఎన్నికలు పూర్తయ్యేవరకూ కేసీఆర్ బహిరంగ సభల్లో మాట్లాకుండా నిషేధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేసింది. కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాంతీయ విద్వేషాలు తలెత్తేలా మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేసింది. సోమవారం రోజున నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన తీరును టీ టీడీపి ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నోటికి తాళం వేయాలని ఎన్నికల కమిషనర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.