జూ.యన్టీఆర్ పై తెదేపాలో అప్రకటిత నిషేధం ఉందా?
posted on Apr 15, 2014 @ 4:44PM
చంద్రబాబు నాయుడు ఈసారి పార్టీ ప్రచారం కోసం జూ.యన్టీఆర్ ని ఆహ్వానించకపోయినా కనీసం అతని గురించి సానుకూలంగా కూడా మాట్లాడలేదు. నారా లోకేష్ కూడా ‘అతను వస్తే రావచ్చునన్నట్లు’ మాట్లాడారే తప్ప రమ్మని పిలవలేదు. ఇక బాలకృష్ణ సంగతి సరేసరి! జూ.యన్టీఆర్ అనే ఒక వ్యక్తి ఉన్నడనే సంగతి కూడా ఆయనకు గుర్తులేనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఈ ముగ్గురు ప్రముఖుల అనాసక్తి చూసిన మిగిలిన నేతలు కూడా ఎక్కడా కూడా అసలు జూ.యన్టీఆర్ ప్రసక్తి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ, ప్రజల తరపున అడిగేందుకు మీడియా ఉండనే ఉంది.
మొన్న వల్లభనేని వంశీకి గన్నవరం టికెట్ ఖాయం అయిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతున్నపుడు, “మీకు జూ.యన్టీఆర్ చాల మంచి స్నేహితుడు కదా! ఆయనను మీరయినా గన్నవరంలో ప్రచారానికి ఆహ్వానిస్తారా?” అని హటాత్తుగా మీడియా వాళ్ళు ప్రశ్నించేసరికి ఆయన కొంచెం ఇబ్బందిపడ్డారు. అయితే మళ్ళీ తేరుకొని “రాజకీయాలు వేరు వ్యక్తిగత విషయాలు వేరు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే తగిన నిర్ణయం తీసుకొంటారు” అని జవాబిచ్చారు.
ఇది చూస్తే పార్టీలో జూ.యన్టీఆర్ పై ఎంతగా అప్రకటితమయిన నిషేధం ఉందో స్పష్టమవుతోంది. పార్టీ నుండి ఏమీ ఆశించకుండా, కోట్లు వచ్చే తన సినిమాలను కూడా పక్కనబెట్టి పార్టీకి ప్రచారం చేసిన జూ.యన్టీఆర్ వంటి పార్టీ విధేయుడిని పార్టీకి దూరంగా పెట్టడం వలన అతనికేమీ నష్టం ఉండబోదు. కాకపోతే అతనిని వేరే పార్టీ వాళ్ళు ఆకర్షించి తమవైపు తిప్పుకొంటే, అప్పుడు తెదేపానే తీరికగా చింతించవలసి ఉంటుంది.