కేంద్రమంత్రులను కలిసేందుకు బాబు డిల్లీ ప్రయాణం
posted on May 30, 2014 7:26AM
ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు డిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు అవసరమయిన నిధులు, వివిధ అంశాల గురించి మాట్లాడబోతున్నారు. త్వరలో రెండు రాష్ట్రాలు విడిపోతునందున రెండు రాష్ట్రాల నడుమ వివాదం సృష్టిస్తున్న విద్యుత్, ఉద్యోగ, జలవనరుల పంపకాలు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం కోసం నిధులు విడుదల, రాష్ట్రంలో ఉన్నత విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు వంటి అనేక అంశాల గురించి వివిధ శాఖల మంత్రులతో చర్చించనున్నారు. ఆఖరుగా ప్రధానిమంత్రి నరేంద్ర మోడీని కలిసి తమ చర్చల సారాంశం ఆయనకు వివరించి, ఆయన సహాయ, సహకారాలు కోరనున్నారు. ఈరోజు చంద్రబాబు ఉదయం 10.30గంటలకు ఆర్ధికమంత్రి-అరుణ్ జైట్లీ, ఆ తరువాత వరుసగా జలవనరుల శాఖ మంత్రి-ఉమాభారతి, ప్రణాళికా సంఘం మంత్రి- జితేంద్ర ప్రసాద్, విద్యుత్ శాఖా మంత్రి- అనంత గీతే, పెట్రోలియం శాఖ మంత్రి-ధర్మేంద్ర ప్రాధాన్ తదితరులను కలవనున్నారు. చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారు.