చంద్రబాబు కోర్కెల చిట్టా
posted on May 31, 2014 @ 11:07AM
నిన్న డిల్లీలో వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసిన చంద్రబాబు నాయుడు, చివరిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని వివరించి, రాష్ట్రాన్ని ఆదుకొనే బాధ్యత కేంద్రానిదేనని మరోమారు గుర్తు చేసారు. మోడీతో సహా కేంద్రమంత్రులందరూ ఆయన అభ్యర్ధనకు సానుకూలంగానే స్పందించారు. వారితో సమావేశం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం ముందు ఉంచిన తన జాబితా గురించి వివరించారు.
వాటిలో ప్రధానంగా రాష్ట్రా ఆర్ధిక లోటును కేంద్రమే భరించడం, రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించడం, కొత్త రాజధాని నగరం కోసం ప్రత్యేకంగా 30 టీయంసీల నీరు కేటాయింపు, విద్యుత్ లోటును భర్తీ చేస్తూ రాష్ట్రానికి అదనపు విద్యుత్ మరియు నిధులు కేటాయింపు, వ్యవయంలో లోటును భర్తీ చేస్తూ కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు ఒక ప్రత్యేక అధారిటీని ఏర్పాటు చేసి, నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం, కృష్ణ, గోదావరి నదీ జలాల పంపకానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయడం, రాష్ట్రానికి వెనువెంటనే ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, పెట్రోలియం విశ్వవిద్యాలయ ఏర్పాటు, పారిశ్రామిక సంస్థలకు పన్ను రాయితీలు, యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చియా ఐదేళ్ళ ప్రత్యేక హోదాను అవసరాన్ని బట్టి మరికొన్నేళ్ళు పొడిగింపు, విభజన బిల్లులో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడం, ఈ పనులన్నిటినీ నిరంతరంగా పర్యవేక్షించేందుకు ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారులతో కూడిన ఒక ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడంవంటివి తాను కోరానని చంద్రబాబు తెలిపారు.