పాపం చిదంబరాన్ని పట్టుకొని ఎంత మాటనేసారు...
posted on May 30, 2014 @ 6:51PM
మాజీ ఆర్ధికమంత్రి పీ. చిదంబరం లెక్కలలో చాలా దిట్ట. ఆయన కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చాలా ముందుగానే చాలా ఖచ్చితంగా లెక్కగట్టారు. అందుకే ఈసారి ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ తన ముద్దుల కొడుకు కార్తిని తన స్థానంలో తమిళనాడులో శివగంగ పార్లమెంటు నియోజక వర్గం నుండి పోటీకి దింపారు. ఎందుకంటే ఓడిపోయినా కాసింత ఎన్నికల అనుభవమయినా వస్తుంది కదాని! ఆయన లెక్క తప్పలేదు. కొడుకు ఓడిపోయాడు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది.
కాంగ్రెస్ ఇప్పుడు ‘ఆత్మవిమర్శ మోడ్’ లో ఉంది. అంటే ‘ఓటమికి కారణాలు కనిపెట్టుకోవడం, వాటిని సరిదిద్దుకోవడం’ అని అందరూ పొరపడుతుంటారు. కానీ దానర్ధం ‘ఈ ఓటమికి మీదే బాధ్యత అంటే కాదు మీదే’ అని వాదించుకోవడం అన్నమాట.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సోనియా, రాహుల్ గాంధీలు మీడియా వాళ్ళను పిలిచి ‘ఈ ఓటమికి మాదే బాధ్యత’ అని ప్రకటించినపటికీ, వీరవిధేయ కాంగ్రెస్ నేతలు మాత్రం ‘ఆ నేరం, భారం మా నెత్తినే వేసుకొంటాము, మీరే మమ్మల్ని ఏలండి ప్లీజ్!’ అని వేడుకొన్నారు. అలాగని ఏ ఒక్కరూ ఓటమికి బాధ్యత తమదేనని చెప్పుకొన్న దాఖలాలు లేవు. ప్రతీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి, ‘ఓటమికి మీదే బాధ్యత అంటే కాదు మీదే’ నని వాదించుకొంటూ ఎన్నికల కిక్కుని, వేడిని దించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక మళ్ళీ కధలోకి వస్తే ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే పనిలో చాలా బిజీగా ఉన్నారు. “తమిళనాడులో కాంగ్రెస్ ఘోరపరాజయానికి ప్రధాన కారణం రాష్ట్ర పీసీసీ అసమర్దతే. ఎన్నికలలో పార్టీ నేతలందరిని ఏకత్రాటిపై నడిపించడంలో ఘోరంగా విఫలమయిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్, ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవి నుండి తప్పుకోవాలి,” అని చిదంబరం తనయుడు కార్తి, వారి అనుచరులు కొందరు కలిసి డిమాండ్ చేసారు.
అందుకు అటువైపు నుండి అంతే ధీటుగా, చాలా ఘాటుగా చిదంబరం బుర్ర తిరిపోయేలా సమాధానం వచ్చింది. “తమిళనాడు రాష్ట్రంలో పార్టీ ఓటమికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ కారణమని ఆరోపిస్తున్న వారందరూ, ఆయన (చిదంబరం) అవలంభించిన లోపభూయిష్టమయిన ఆర్ధిక విధానాల వల్లనే దేశమంతటా పార్టీ ఊడ్చిపెట్టుకొని పోయిందని గ్రహించాలి. ఆయన విధానాల వల్లనే దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ ఆయన వాటిని నియంత్రించాలని ఎన్నడూ గట్టిగా ప్రయత్నం చేయలేదు. తత్ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురయ్యి తుడిచిపెట్టుకుపోయింది."
"అంతే కాదు ఆయన నిర్వాకం వల్ల కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన కాంగ్రెస్ అధిష్టాన్ని తప్పు దారి పట్టించారు. అందుకే రెండు ప్రాంతాలలో పార్టీ ఘోరపరాజయం పాలయింది. ఈవిధంగా కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగించిన ఆయన ఏవిధంగా తమిళనాడులో పార్టీ ఓటమికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ బాధ్యులని ఆరోపిస్తున్నారు?"
"కేంద్రమంత్రిననే అహంతో ఆయన ఏనాడు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కేవలం తన కొడుకు పోటీ చేస్తున్న శివగంగలో మాత్రమే ప్రచారం చేసుకొన్నారు. అయినప్పటికీ ఆయన తన కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారు. అటువంటి వ్యక్తి ఏవిధంగా ఇతరులను నిందిస్తారు?” అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ అనుచరులు చిదంబరాన్ని ఎదురు ప్రశ్నించారు.
చిదంబరం అధికారంలో ఉన్నంత కాలం చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఒకవెలుగు వెలిగారు. దేశంలో పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలను తన చిటికన వ్రేలుతో ఆడించారు. స్టాక్ మార్కెట్లను తన కనుసైగతో కదిలించేవారు. అటువంటి పెద్దమనిషిని పట్టుకొని స్వంత రాష్ట్రం వాళ్ళే ఎంతమాట అనేశారు? పాపం... చిదంబరం.