Read more!

తెలంగాణలో స్వార్థం గెలిచింది: గద్దర్

 

 

 

తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయనకు ఆ ఆనందాన్ని తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువకాలం ఉంచేట్టు లేరు. కేసీఆర్ని నీడలా వెంటాడి, తెలంగాణ ప్రజలకు ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, ఆయన చేసిన వాగ్దానాలలో 25 శాతమైనా నెరవేర్చాలని తాము కోరుకుంటున్నామని, అలా జరగకుంటే తెలంగాణ ప్రజలు ఉద్యమబాటలో పయనిస్తారని చెప్పారు.

 

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం మీద గద్దర్ స్పందిస్తూ, తెలంగాణ కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని, అయితే ఈ ఎన్నికలలో త్యాగం గెలవలేదని, స్వార్థమే గెలిచిందని అన్నారు. ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎన్నికలలో ఓడిపోవడం, తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలు చేయని వాళ్ళు గెలవటం దీనికి ఉదాహరణ అని గద్దర్ అన్నారు. త్యాగానికి ప్రతీక అయిన శంకరమ్మ ఓడిపోవడానికి, ఎలాంటి త్యాగాలూ చేయనివాళ్ళు గెలవటానికి రాజకీయ గారడీలే కారణమని ఆయన చెప్పారు.