ఎన్టీఆర్ మీద పడి ఏడుస్తున్న జగన్ పార్టీ!
posted on Jul 7, 2014 @ 5:38PM
వైఎస్ జగన్‌కి, ఆయన పార్టీ వాళ్ళకి ఈమధ్య అన్నిటి మీదా పడి ఏడవటం ఎక్కువైపోయిందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం వస్తుందని కలలు కని, చివరికి ఆ కలలన్నీ కల్లలు కావడంతోపాటు, జగన్ బాబుకి త్వరలో జైలు నుంచి ఆహ్వానం తప్పదన్న వార్తలు వస్తూ వుండటంతో ఆయన పార్టీయులు సహనం కోల్పోయి ఏదో ఒక హడావిడి చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ నాయకులు, జగన్ మీడియా ఒక అంశాన్ని టేకప్ చేసింది. ఆ అంశం మీద నానా రచ్చా చేస్తోంది. తెలుగుజాతి వున్నంతకాలం ఆయన పేరు వినిపిస్తూనే వుంటే మహా నటుడు, మహా నాయకుడు అయన నందమూరి తారక రామారావు పేరును కృష్ణ లేదా గుంటూరు జిల్లాకు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వుంది. ఈ విషయంలో ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో ప్రభుత్వాలని కోరుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఈ రెండు జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు, జగన్ మీడియా రంగంలోకి దిగింది. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టడం చాలా ఘోరం, నేరం అయినట్టుగా ప్రచారం మొదలుపెట్టింది. వైసీపీ నాయకుడు జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును కడప జిల్లాకు పెట్టడం కరెక్ట్ అయినప్పుడు, అటు సినిమా రంగం మీద, ఇటు రాజకీయ రంగం మీద తనదైన ముద్ర వేసి, అంతర్జాతీయ స్థాయిలో తెలుగువాడి ఖ్యాతిని పెంచిన నందమూరి తారక రామారావు పేరును ఒక జిల్లాకు పెట్టడంలో ఎందుకు కరెక్ట్ కాదో వైసీపీ నాయకుల బుర్రలకి ఎంతమాత్రం తట్టడం లేదు. ప్రస్తుతం ఏ పనీ లేక ఖాళీగా వున్న వైసీపీ నాయకులు ఎన్టీఆర్ మీద పడి ఏడవటం కంటే జనానికి పనికొచ్చే పనులేవైనా చేస్తే మంచిదని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.