వైజాగులో డిసాలినేషణ్ ప్లాంటు
posted on Jul 7, 2014 @ 5:11PM
వైజాగ్ ప్రజల చిరకాల డిమాండ్- డిసాలినేషణ్ ప్లాంటు (సముద్రపు నీటిని త్రాగు నీటిగా మార్చే కర్మాగారం) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతించారు. దాదాపు వెయ్యి కోట్ల పెట్టుబడితో పెట్టబోయే ఈ ప్లాంటు ద్వారా 100 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధిచేసి సరఫరా చేయవచ్చును. కానీ ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కనుక ఇంతవరకు ఇది ఏర్పాటు కాలేదు. కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాల సహాయపడేందుకు సిద్దంగా ఉంది గనుక ఈ ప్లాంటు ఏర్పాటుకి అవసరమయిన నిధులను కేంద్రం మంజూరు చేయవచ్చును.
ప్రస్తుతం నగరంలో రోజుకి 80 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం కాగా కేవలం 56-60 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా, గోదావరి జలాలపై ఆశపెట్టుకొనే పరిస్థితులు లేవు గనుక, వైజాగులో నానాటికీ పెరుగుతున్న నీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు డిసాలినేషణ్ ప్లాంటు ఏర్పాటుకి అనుమతిచ్చారు. నగర మున్సిపల్ మరియు నీటి సరఫరా అధికారులు దీని కోసం ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ప్లాంటు ఏర్పాటుకి తగిన్స స్థలం, నిధులు అన్నీ కుదరగానే (బహుశః మూడు నాలుగు నెలలలో) పనులు మొదలుకావచ్చును.