అజ్మీర్‌లో దారుణం: తల్లే కొడుకు తల నరికింది!

  రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఒక ఘోరం జరిగింది. కన్నతల్లే మూడేళ్ళ వయసున్న తన కొడుకు తల నరికి దారుణంగా హత్య చేసింది. అంతిమా జైన్ అనే ఆ మహిళ.. తన కొడుకు దుకాణానికి వెళ్తానని మారాం చేస్తుంటే వద్దని మందలించింది. అయితే ఆ బాలుడు దుకాణానికి వెళ్తానని మారాం చేయడంతో ఆ తల్లి ఆవేశంతో కొడుకుని తలనరికి చంపేసింది. అయితే కొడుకును చంపిన తర్వాత ఆ నేరం తన మీద పడకుండా వుండటానికి కొడుకు శవాన్ని దూరంగా పశువుల షెడ్డు దగ్గర పడేసింది. స్థానికులు ఆ బాలుడి శవాన్ని చూసి నిర్ఘాంతపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకుని హత్య చేసిన ఆ తల్లి తనకేమీ తెలియనట్టు గుండె బాదుకుని ఏడ్చింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి తన కొడుకుని తానే తలనరికి చంపానని ఒప్పుకుంది. తాను వద్దన్న పని చేస్తానని అన్నందుకు కోపం వచ్చి తాను కొడుకుని చంపేశానని అంగీకరించింది.

స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం: చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే తనముందు వున్న లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం విజయవాడలో ఆయనను ఏపీ ఎన్జీఓలు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగుల పోరాటం అద్వితీయమని కొనియాడారు. సమైక్య ఉద్యమ ఘనత ఎన్జీవోలదే అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డానని, అమెరికాలో ఆఫీస్ ఆఫీస్ తిరిగి కంపెనీలు తీసుకువచ్చానని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చుదిద్దుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు పరిణితి చెందిన నేత: అశోక్‌బాబు

  శనివారం నాడు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీఎన్జీవోలు సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు. ఎన్టీఆర్ వల్లే తెలుగువారికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని, అలాగే చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హైదరాబాద్ అభివృద్ధి పథంలో పయనించాయని అశోక్ బాబు అన్నారు. రాజకీయ కుట్రతో రాష్ట్రాన్ని విభజించారని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి ఉద్యోగులు తమ సంపూర్ణ సహకారం అందిస్తారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అశోక్‌బాబు ఆకాంక్షించారు.

పోలవరం ఆందోళన: కోదండరామ్ ఆగ్రహం!

  పోలవరం బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయంలో తెలంగాణలో బంద్ జరుగుతోంది. తెలంగాణ రాజకీయ ఐకాసా బంద్‌ను పర్యవేక్షిస్తోంది. అధికార పార్టీ కూడా బంద్‌కి మద్దతు తెలుపుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ఐకాసా కన్వీనర్ కోదండరామ్‌ పోలవరం అంశం విషయంలో కేంద్రం తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం నిరంకుశత్వంతో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ బంద్ నేపథ్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పోలవరం అంశం అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదం కాదని, ఆదివాసుల హక్కులపై జరుగుతున్న దాడిగా తాము భావిస్తున్నామని అన్నారు. పోలవరంపై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం వుందని ఆయన చెప్పారు. పోలవరం విషయంలో న్యాయపోరాటం ఆపమని ఆయన స్పష్టం చేశారు.

పోలవరం బిల్లు: వెంకయ్య స్పందన

  పోలవరం ముంపు గ్రామాల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్‌ని తమ ప్రభుత్వం బిల్లు రూపంలో ఆమోదించిందే తప్ప తమ ప్రభుత్వం ఈ విషయంలో కొత్తగా చేసిందేమీ లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యతిరేకంగా మాట్లాడుతూ వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. పోలవరం ఆర్డినెన్స్ అంశాన్ని రాజకీయం చేయడం, రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడం, రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలేలా చేయడం చాలా పొరపాటు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అందరూ గిరిజనులకు పునరావాసం గురించే ఆలోచిస్తే బాగుంటుందని వెంకయ్య నాయుడు అన్నారు. ముంపు బాధితులకు పునరావాసం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఆయన చెప్పారు.

ఫార్మసీ అడ్మిషన్లు: కేసీఆర్‌కి చంద్రబాబు లేఖ

  తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు అడ్మిషన్లను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. జూలై 31లోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ఆ లేఖలో స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం జూలై 31 లోగా అడ్మిషన్లు పూర్తి కావాలి, ఆగస్ట్ మొదటి వారంలో తరగతులు ప్రారంభం కావాలి. ఈ విషయాన్ని చంద్రబాబు తాను రాసిన లేఖలో కేసీఆర్‌కి గుర్తుచేశారు. సకాలంలో అడ్మిషన్లు చేయకపోతే స్టూడెంట్స్ ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తే రెండు రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా నివారించవచ్చని, తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని, మానసిక ఒత్తిడిని తగ్గించినట్లవుతుందని చంద్రబాబు సూచించారు.

ఆ రెండు విమానాలు ఢీకొనేవే!

  పశ్చిమ బెంగాల్‌లోని బగ్డోరా విమానాశ్రయంలో ఒక ఘోర విమాన ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. 250 మంది ప్రయాణికులకు భూమ్మీద నూకలు వుండటంతో ఈ ప్రమాదం తప్పిపోయింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోనే, ఎయిరిండియాకు చెందిన మరో విమానం రన్ వే మీద లాండ్ అవుతోంది. ఈ రెండు విమానాలు ఒకదానితో మరొకటి ఢీకొనబోయాయి. అయితే వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. రెండు విమానాలకూ ఒకేసారి ఏటీసీ క్లియర్స్ ఇవ్వడం వల్ల ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. రెండు విమానాలూ ఢీకొనబోతున్నాయన్న విషయాన్ని రెండు విమానాల్లోనూ వున్న పైలెట్లు గ్రహించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఎయర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటన మీద అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇడుపులపాయ: జగన్ గెస్ట్‌హౌస్‌లో తనిఖీలు

  నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఆదివారం నాడు జరగబోతోంది. ఈ నేపథ్యంలో 30 మంది నెల్లూరు జిల్లా వైకాపా జడ్పీటీసీ సభ్యులతో జగన్ పార్టీ ఇడుపులపాయలోని జగన్‌కి చెందిన గెస్ట్ హౌస్‌లో క్యాంపు ఏర్పాటు చేసింది. జడ్పీటీసీ అయిన తన భార్యని జగన్ గెస్ట్ హౌస్‌లో బంధించారని కావలి జడ్పీటీసీ సభ్యురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఇడుపులపాయలోని జగన్‌కి చెందిన గెస్ట్ హౌస్‌లో తనిఖీలు జరపడానికి పోలీసులు వెళ్ళారు. అయితే పోలీసులను గెస్ట్ హౌస్ లోపలకి వెళ్ళనీయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయినప్పటికీ గెస్ట్ హౌస్‌లో పోలీసులు తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది.

జపాన్‌లో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక!

  జపాన్‌లో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం కారణంగా సునామీ కూడా వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. శనివారం తెల్లవారుజామున టోక్యోకు ఈశాన్యప్రాంతంలో ఉన్న ఫుకుషిమా తీరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చింది. 2011లో 19 వేల మంది ప్రాణాలను బలితీసుకున్న పెను భూకంపం, సునామీ వచ్చి అణు విద్యుత్ ప్లాంటు విధ్వంసం జరిగిన ఫుకుషిమా ప్రాంతంలోనే తాజాగా ఈ భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు మీద భూకంపం తీవ్రత 6.8గా నమోదైందని వచ్చినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా జపాన్ ఉత్తర తీరం మొత్తానికి సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఫుకుషిమాలోని అణు విద్యుత్ ప్లాంటుకు కూడా ఏమైనా ప్రమాదం వాటిల్లిందేమోనని నిపుణులు పరిశీలిస్తున్నారు.

కడప జిల్లాకు వైఎస్సార్ పేరు కట్?

  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత కడప జిల్లాకు ‘వైఎస్సార్ కడప జిల్లా’గా పేరు మార్చడం మీద అప్పట్లోనే ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎంతోమంది మహానుభావులు జన్మించిన కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టడమేంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవేళ కడప జిల్లాకు ఎవరైనా ప్రముఖుల పేరు పెట్టాలంటే, వైఎస్సార్‌ని మించిన ప్రముఖులు ఎందరో కడప జిల్లాలో వున్నారని, కేవలం అధికారపార్టీ నాయకుడు కాబట్టి వైఎస్సార్ పేరును కడప జిల్లాకు పెట్టడం అన్యాయమని వాదనలు వినిపించాయి. అసలు కడప జిల్లాకు ఆ పేరు వేంకటేశ్వర స్వామి ‘దేవుని గడప’ అనే మాట నుంచి వచ్చిందని, ఆ పేరును మార్చడం మనోభావాలను గాయపరచడమేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా కడప జిల్లా పేరును పునరుద్ధరించాలన్న డిమాండ్ మరోసారి తెరమీదకి వచ్చింది. కడప జిల్లాకు పాత పేరును పునరుద్ధరించాలని కడప జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. మొత్తమ్మీద రాబోయే కాలంలో కడప జిల్లాకు వైఎస్సార్ పేరును కట్ చేసే అవకాశాలు వున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి.

పోలవరం కట్టి తీరుతాం: చంద్రబాబు

  పోలవరం ప్రాజెక్టును కట్టితీరుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాగే బహుళార్థసాధక పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. లోక్‌సభలో పోలవరం ప్రాజెక్టు బిల్లుకు ఆమోదముద్ర లభించిన నేపథ్యంలో చంద్రబాబు, యనమల మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వున్న నిబద్ధతను స్పష్టం చేశారు. అలాగే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉపయోగపడనున్న పోలవరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం తగదని ఆంధ్రప్రదేశ్‌ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్‌ ఆమోదించి ఇప్పుడు రచ్చ చేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

గర్ల్స్ హాస్టల్లో బాబోయ్ పాము..!

  గర్ల్స్ హాస్టల్లో పాము దూరింది. నానా హడావిడి చేసింది. ఆ పామును చూసి అమ్మాయిలందరూ కెవ్వుమని కేకలు వేస్తే చెల్లాచెదురైపోయారు. చివరికి గర్ల్స్ హాస్టల్‌లోకి వచ్చిన ఆ పాము చచ్చింది. ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లోకి ఈరోజు ఉదయాన్నే ఓ పాము వచ్చింది. పాముని చూసి హాస్టల్లోని బాలికలు తీవ్ర భయాందోళనకు గురై హాస్టల్ బయటకి పరుగులు పెట్టారు. హాస్టల్ వార్డెన్, హాస్టల్ సిబ్బంది పాము కోసం తీవ్రంగా గాలించారు. పాము దొరికినట్టే దొరికి చాలాసార్లు తప్పించుకుంది. చివరికి హాస్టల్‌లోని ఓ గదిలో నక్కిన పామును చంపేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు: రాహుల్‌గాంధీకి సమన్లు

  ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ తన నోటికొచ్చినట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిలో చాలా ప్రధానమైనది మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ వ్యక్తులే చంపారనడం. లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా మార్చి 6న జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు పరువునష్టం కలిగించే విధంగా వున్నాయని అప్పట్లోనే కేసు నమోదైంది. రాహుల్‌ చరిత్రను వక్రీకరించడమే కాకుండా, ఆర్‌ఎస్‌ఎస్‌కి పరువు నష్టం కలిగించారని ఆర్‌ఎస్‌ఎస్ భివాండి యూనిట్ కార్యదర్శి రాజేశ్ కుంతే కేసుపెట్టారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ రాహుల్ గాంధీకి థానే జిల్లాలోని భివాండి కోర్టు సమన్లు జారీచేసింది. దీనిపై విచారణ నిర్వహిస్తున్న మెజిస్టేరియల్ కోర్టు ఈ మేరకు అక్టోబరు 7న హాజరు కావాలంటూ రాహుల్‌ గాంధీకి సమన్లు జారీ చేసింది.