అందుకే ఈ హడావుడి అంతా?
posted on Jul 7, 2014 6:27AM
ఇటీవల జరిగిన మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలను అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, చైర్మన్ పదవులను హస్తగతం చేసుకొనే ప్రయత్నం చేయడంతో, రెండు పార్టీలు తీవ్ర ఘర్షణ పడ్డాయి. ఈ ప్రయత్నంలో జరిగిన సభ్యుల కిడ్నాపులు, పార్టీ ఫిరాయింపులను ఖండిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు గవర్నర్ నరసింహన్ను ఈరోజు కలిసి పిర్యాదు చేయనున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని, అందువలన రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని వైకాపా కోరుతోంది.
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలనే తపన గురించి తెలియనివారు లేరు. కానీ అందుకోసం ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని నెలరోజులు గడవక మునుపే ఏవో సాకులతో రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం చాలా హాస్యాస్పదం. గత ఐదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న వైకాపా మరో ఐదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉండవలసి రావడం చాలా కష్టమే. అన్నేళ్ళు పార్టీలో సభ్యులు గోడ దూకేయకుండా కాపాడుకొంటూ, పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే ఈ మాత్రం హడావుడి తప్పదు మరి.