నాలుగు రాష్ట్రాల్లో నేడు ఉప ఎన్నికలు
posted on Aug 21, 2014 @ 12:09PM
కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్... ఈ నాలుగు రాష్ట్రాల్లో గురువారం నాడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లో మూడేసి స్థానాలకు, పంజాబ్‌లో రెండు స్థానాలకు, బీహార్‌లో పది స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి శత్రువైన భారతీయ జనతాపార్టీని ఎదుర్కొనడానికి ఒకరికొకరు పెద్ద శత్రువులైన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఉప ఎన్నికల సందర్భంగా దోస్తీ కట్టారు. వీరి దోస్తీ ఫలిస్తుందో, వికటిస్తుందో ఈ ఉప ఎన్నికల ఫలితాలు చెబుతాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఉప్పు, నిప్పులా వున్న వీరిద్దరూ ఈ ఎన్నికల కోసం చెట్టపట్టాల్ వేసుకున్నారు. బీహార్‌లోని పది స్థానాల్లో నితీష్, లాలూ పార్టీలో చెరో నాలుగేసి స్థానాల్లో పోటీ చేస్తుండగా, వీరిద్దరితో స్నేహం కలిపిన కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. అలాగే పది స్థానాల్లో భారతీయ జనతాపార్టీ తొమ్మిది స్థానాల్లో, ఒక స్థానంలో ఎల్‌జేపీ పోటీ చేస్తున్నాయి. ఈనెల 25న ఈ నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు వుంటుంది.