లాలూ ప్రసాద్ యాదవ్‌కి తీవ్ర అస్వస్థత

  బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం నాడు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. దాంతో లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన కుటుంబ సభ్యులు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. ఆయనని పరీక్షించిన వైద్యులు అంత గాభరా పడాల్సిన విషయమేమీ కాదని తేల్చారు. లాలూనూ సాధారణ స్థితికి తెచ్చేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. బీహార్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరుగుతోంది. ఈ ఎన్నికలు లాలూకి చాలా ప్రతిష్ఠాత్మకమైనవి. ఈ సందర్భంగా లాలూ టెన్షన్‌కి గురి కావడం వల్ల అనారోగ్యానికి గురై వుంటారని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.

ధన్యజీవి కంఠంనేని నాగేంద్రమ్మ కన్నుమూత

  కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలో దొడ్డ ఇల్లాలిగా కీర్తి ప్రతిష్ఠలున్న ధన్యజీవి శ్రీమతి కంఠంనేని నాగేంద్రమ్మ కన్నుమూశారు. వయసు మీదపడటం వల్ల కలిగిన అనారోగ్యం కారణంగా ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. సంతృప్తి నిండిన సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించిన ఆమె 83 సంవత్సరాల పండు వయసులో తమ స్వగ్రామమైన దివిసీమలోని రావివారిపాలెంలో ప్రశాంతంగా కన్నుమూశారు. శ్రీమతి కంఠంనేని నాగేంద్రమ్మ భర్త కంఠంనేని వెంకటేశ్వరరావు గత సంవత్సరం దివంగతులయ్యారు. దివిసీమ ప్రాంతంలో కంఠంనేని వంశానికి వున్న పేరు ప్రతిష్టలను ఈ పుణ్య దంపతులు ఇనుమడింపజేశారు. ఈ దంపతులు సమాజంలో వున్న నలుగురికీ ఉపయోగపడుతూ ధన్యజీవులుగా పరిపూర్ణ జీవితాన్ని గడిపారు.   శ్రీమతి నాగేంద్రమ్మ, వెంకటేశ్వరరావు దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కంఠంనేని శివశంకర్. ప్రముఖ తెలుగుదేశం నాయకుడు, తెలుగువన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయిన కంఠంనేని రవిశంకర్ శ్రీమతి నాగేంద్రమ్మ ద్వితీయ కుమారుడు. శివపార్వతి, శివరాణి అనే ఇద్దరు కుమార్తెలు కూడా శ్రీమతి నాగేంద్రమ్మకు వున్నారు. కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు, మనవరాళ్ళతో వర్ధిల్లుతున్న కంఠంనేని కుటుంబం శ్రీమతి నాగేంద్రమ్మ కన్నుమూతతో పెద్ద దిక్కును కోల్పోయింది. మాతృమూర్తి మరణంతో పుట్టెడు దు:ఖంలో వున్న కంఠంనేని శివశంకర్, కంఠంనేని రవిశంకర్, ఇతర కుటుంబ సభ్యులకు పలువురు రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు అభిమానులు సానుభూతిని తెలిపారు. శ్రీమతి కంఠంనేని నాగేంద్రమ్మ దివ్యాత్మకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

‘గాంధీ’ దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో కన్నుమూత

  ప్రముఖ బ్రిటీష్ దర్శకుడు, నటుడు, నిర్మాత, ఆస్కార్ అవార్డు విజేత ‘గాంధీ’ చిత్ర దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో లండన్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. మహాత్మాగాంధీకి నివాళిగా ఆయన రూపొందించిన ‘గాంధీ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అనేక ఆస్కార్ అవార్డులను కూడా పొందింది. ఆగస్టు 29, 1923న ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో అటెన్‌బరో జన్మించారు. తన 91వ పుట్టినరోజుకు నాలుగు రోజుల ముందు కన్నుమూశారు. ‘గాంధీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆయన స్టీవెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన ‘జురాసిక్ పార్క్’ సినిమాలో జురాసిక్ పార్క్ ఓనర్‌గా నటించారు. అటెన్‌బరో తల్లి సినిమా నేపథ్యంతో వుండేవారు. నాలుగేళ్ళ వయసులో నటుడిగా అటెన్‌బరో సినిమా రంగప్రవేశం చేశారు. రిచర్డ్ అటెన్‌బరో మరణంతో బ్రిటీష్ సినిమా రంగంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది.

మంత్రి నారాయణకు అస్వస్థత

  ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులతో మంత్రి నారాయణ హైదరాబాద్‌కు బయలుదేరారు. బయలుదేరిన ఐదు నిమిషాలకే నారాయణకు వాంతులయ్యాయి. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు. తిరుపతి విమానాశ్రయంలోనే సీఎం కాన్వాయ్‌లో ఉన్న స్విమ్స్‌ వైద్యులు మంత్రికి అత్యవసర వైద్య సేవలు అందించారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని, గ్యాస్ట్రిక్ సమస్యతోనే వాంతులు అయ్యాయని వైద్యులు తెలిపారు. కోలుకున్న తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. తనకు ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదన్నారు.

కేసీఆర్ రిటర్స్న్

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కి తిరిగొచ్చారు. సింగపూర్‌, మలేసియా దేశాల పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి హైదరాబాద్‌ చేరారు. కేసీఆర్‌ జీవితంలో తొలిసారి చేసిన ఈ విదేశీ పర్యటన ఇది. ఐఐఎం పూర్వ విద్యా్ర్థుల సమ్మేళనంలో పొల్గొనడం, తెలంగాణకు విదేశీ పరిశ్రమలను ఆహ్వానించడం, తెలంగాణలోని జన జీవనాన్ని మెరుగుపర్చడానికి సింగపూర్, మలేసియాల్లోని పరిస్థితులను అధ్యయనం చేయడంకోసం ఈ పర్యటన జరిపారు. కేసీఆర్ తన పర్యటన మొదటి రోజు 20వ తేదీన సింగపూర్‌లో అక్కడి జేటీసీ కార్యాలయాన్ని సందర్శించారు. 21న పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. 22న ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. 23న సింగపూర్‌ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు కారులో ప్రయాణించి మార్గమధ్యన ఉన్న శాటిలైట్‌ టౌన్‌షిప్స్‌ను పరిశీలించారు. పర్యటనలో చివరి రోజు ఆదివారం నాడు మలేషియా మోనో రైల్‌ ప్రాజెక్టు, పుత్రజయ ప్రాంతాన్ని పరిశీలించారు.

మహారాష్ట్ర కొత్త గవర్నర్ కోహ్లీ

  మహారాష్ట్ర నూతన గవర్నర్గా గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యాక్రమంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ ఎస్ షా ఆయనే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇతర మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు తనను మహారాష్ట్ర నుంచి బదిలీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మహారాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణ ప్రకటించారు. అయినప్పటికీ ఆయనని కేంద్ర ప్రభుత్వం మిజోరం రాష్ట్రానికి బదిలీ చేసింది. దాంతో తాను చెప్పినట్టే శంకర్ నారాయణ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో యుపిఎ హయాంలో నియమితులైన గవర్నర్లలో మరో వికెట్ పడినట్టు అయింది. శంకర్ నారాయణ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా యుపిఎ హయాంలో నియమితులైన శంకర్ నారాయణ తన పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఎన్డీయే గవర్నమెంట్ కోరినప్పటికీ అలా చేయకుండా ఇంతకాలం భీష్మించుకుని కూర్చున్నారు. 82 సంవత్సరాల వయసున్న శంకర్ నారాయణ పదవీ కాలం సాధారణంగా అయితే 2017 వరకూ వుంది.

బిగ్ బజార్ దొంగలు దొరికారు

  హైదరాబాద్‌ కాచిగూడలోని బిగ్ బజార్‌లో భారీ చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా నందిగామలో వీరిని పోలీసులు ఆదివారం నాడు పట్టుకున్నారు. గతంలో బిగ్ బజార్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన వారే 50 లక్షలకు పైగా విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను శుక్రవారం అర్థరాత్రి పథకం ప్రకారం దోచుకున్నారు. గతంలో బిగ్‌బజార్‌‌లో పనిచేసిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పక్కా ప్రణాళికతో చోరీ చేశారని సీసీ కెమెరా ఫూటేజ్‌ల ద్వారా వెల్లడైంది. అస్సోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్‌‌తో పాటు మరో ఇద్దరిని కాచిగూడ పోలీసులు కృష్ణాజిల్లా నందిగామలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.50 లక్షల విలువైన ల్యాప్ టాప్‌లు, కెమెరాలు, ఐఫోన్ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు.

మందుకొట్టిన ‘అజయ్’ నేను కాదు బాబోయ్..

  ప్రముఖ నటుడు ‘అజయ్’ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయాడన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను నటుడు అజయ్ తీవ్రంగా ఖండించారు. ‘అజయ్’ అనే పేరు వున్న ఎవరో మరో నటుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోతే మీడియా మొత్తం తన ఫొటో వేసి వార్తలను ప్రచురించిందని ఆయన వాపోయారు. తనకు ఏ పాపం తెలియదని అజయ్ మొత్తుకున్నాడు. ఈమధ్యకాలంలో ఇలాంటి అలవాటులో పొరపాటులు మామూలైపోయాయి. మొన్నీమధ్య సినీ హీరో అల్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దానికి కూడా అల్లు అర్జున్ మీడియాకు వివరణ ఇచ్చారు. తాను దొరికిపోలేదని, బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించిన అనంతరం తనను పోలీసులు వెళ్ళిపొమ్మన్నారని, అయితే మీడియా మాత్రం తాను దొరికిపోయినట్టుగా వార్తలను ప్రసారం చేసిందని పేర్కొన్నారు. ఇప్పుడేమో అజయ్ ఇలా....

నా భర్త హత్య వెనుక వైఎస్సార్ హస్తం.. సునీత...

  తన భర్త పరిటాల రవి హత్య వెనుక అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హస్తం వుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. ప్రసుత్తం శాసనసభలో జగన్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, జగన్ బిహేవియర్ చూసి ఆయన పార్టీ నాయకులే సిగ్గుపడుతున్నారని అన్నారు. జగన్ తన దౌర్జన్యకాండని అసెంబ్లీలో కూడా కొనసాగించాలని చూస్తే ఉపేక్షించమని ఆమె హెచ్చరించారు. జగన్ తన ప్రవర్తనకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సునీత అన్నారు. ప్రజలకు సమస్యలేవీ లేనట్టుగా వ్యక్తిగత గొడవల్లో చనిపోయిన వారి విషయాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ జగన్ లేనిపోని హడావిడి చేస్తున్నారని పరిటాల సునీత ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌కి అండగా వుంటాం.. వెంకయ్య...

  అడ్డగోలు విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అండగా వుంటుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలా సహకరిస్తారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం నెల్లూరులో సర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్య నాయుడు అని కొనియాడారు. స్వర్ణభారతి ట్రస్ట్ యువతలో నైపుణ్యాన్ని వెలికితీసే కార్యక్రమం చేపడుతోందన్నారు. నైపుణ్యం గల పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఉండటం మనకు గర్వకారణమని చంద్రబాబు అన్నారు.

ప్రేమ ప్రయాణం... విషాదాంతం...

  తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరు గ్రామానికి చెందిన యువతీ యువకులు ప్రేమ ప్రయాణం విషాదాంతమైంది. ఆ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వాళ్ళిద్దరి తరఫు పెద్దలు వీరి ప్రేమకి, పెళ్ళికి నో చెప్పారు. దాంతో వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. శనివారం నాడు వీళ్ళిద్దరూ చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో బైకు మీద ఆంబూరు వైపు వెళుతుండగా వేలూరు సమీపంలోని అలిమేలుమంగాపురం వద్ద ముందు వెళుతున్న లారీని బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించగా, ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా వున్నట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న ఇద్దరి పెద్దలు వీరి ప్రేమకు తాము అంగీకారం తెలిపినా ఇంత ఘోరం జరిగివుండేది కాదని బాధపడుతున్నారు.

తప్పతాగి డ్రైవింగ్.. దొరికిపోయిన సినీ నటుడు

    ఈమధ్యకాలంలో సినీ నటులు తప్పతాగి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. గతంలో అయితే సినీ నటులు తప్పతాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయినా పోలీసులు నమస్తే సార్ అని పంపించేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో తప్పతాగి డ్రైవింగ్ చేస్తున్న ఎవరినీ పోలీసులు వదలటం లేదు. తాజాగా శనివారం నాడు బంజారాహిల్స్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు సినీనటుడు అజయ్ అడ్డంగా దొరికిపోయాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అజయ్ విపరీతంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్టు తేలింది. అజయ్ మీద కేసు నమోదు చేసి జరిమానా విధించిన అనంతరం పోలీసులు విడిచిపెట్టారు.

సరిహద్దుల్లో 50 మీటర్ల సొరంగం...

  జమ్ము - కాశ్మీర్‌లోని భారత - పాకిస్థాన్ సరిహద్దుల్లో 50 మీటర్ల పొడవున్న ఒక సొరంగాన్ని భారత సైనికులు కనుగొన్నారు. పాకిస్థాన్‌లోంచి తీవ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారా భారతదేశంలోకి పంపించడానికే ఈ సొరంగాన్ని తవ్వుతున్నారని సైనికులు అనుమానిస్తున్నారు. జమ్ము కాశ్మీర్‌లోని అత్యంత సున్నితమైన ఫల్లన్ వాలా సెక్టార్లో ఈ సొరంగాన్ని భారత సైనికులు కనిపెట్టారు. అయితే ఈ సొరంగం అసంపూర్తిగా వుంది. ఇద్దరు మనుషులు పాక్కుంటూ ప్రయాణం చేయడానికి వీలుగా ఈ సొరంగం వుంది. ఈ ప్రాంతంలో తీవ్రవాదులు, పాకిస్థాన్ సైనికులు మందుపాతరలు అమర్చి వుంటారన్న అనుమానాలు వుండటం వల్ల మరింత లోతుగా ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి కొంత సమయం పట్టవచ్చని భారత సైన్యం భావిస్తోంది.

లిబియాలో పడవ మునక.. 170 మంది గల్లంతు...

  లిబియాలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు రెండు వందల మందితో ప్రయాణిస్తున్న ఓ బోటు మునిగిపోవడంతో 20 మంది మరణించారు. 170 మంది గల్లంతయ్యారు. ట్రిపోలి ప్రాంతంలోని సముద్రంలో ఈ ఘటన జరిగింది. బోటులో వున్నవారందరూ లిబియా నుంచి ఇతర ఆఫ్రికా దేశాలకు వలస వెళ్తున్న శరణార్థులని తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గల్లంతయిన 170 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరందరూ మరణించి వుండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లిబియాలో అనిశ్చిత పరిస్థితులు వుండటంతో చాలామంది దేశం వదలి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్తున్నవారే ఇప్పుడు ప్రమాదానికి గురయ్యారు.

కోఠీలో 45 లక్షల చోరీ.. కళ్ళలో కారం..

  హైదరాబాద్‌లోని కోఠీ ప్రాంతంలో భారీ దారిదోపిడీ జరిగింది.45 లక్షల రూపాయలున్న బ్యాగ్‌తో బైక్ మీద వెళ్తున్న వ్యక్తుల కళ్ళలో కారం చల్లిన దుండగులు ఆ 45 లక్షల రూపాయలున్న బ్యాగ్‌ను దోచుకుని పారిపోయారు. పూర్తి జనసమ్మర్థం వున్న సమయంలోనే ఈ చోరీ జరగడం దొంగల తెగింపును సూచిస్తోంది. బేగంపేటలోని తరుణి డెయిరీలో పనిచేసే శ్యాం సుందర్ అనే వ్యక్తి తన సంస్థకు చెందిన 45 లక్షల రూపాయలను కోఠీలోని విజయాబ్యాంకులో జమ చేయడానికి తన బావ దిలీప్‌తో కలసి బైక్ మీద బయలుదేరాడు. కోఠీలోని ఉస్మానియా వైద్య కళాశాల దగ్గరకు వీరి బైక్ రాగానే రెండు బైక్స్ మీద వచ్చిన దుండగులు వీరిద్దరి కళ్ళలో కారం జల్లి, శ్యాం సుందర్ తలమీద కత్తితో గాయం చేసి క్యాష్ బ్యాగ్‌తో పారిపోయారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా వున్న వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు.