సిగ్గుపడుతున్నా.. తలదించుకుంటున్నా.. జాకీచాన్
posted on Aug 21, 2014 @ 5:59PM
హాలీవుడ్ నటుడు, కుంగ్ ఫూ స్టార్ జాకీచాన్ కుమారుడు, నటుడు అయిన జేసీ చాన్ ఈనెల 14వ తేదీన డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిపోయాడు. క్రమశిక్షణతో కెరీర్ మలచుకున్న జాకీచాన్ కుమారుడు ఇలాంటివాడని తెలుసుకుని ప్రపంచం మొత్తం విస్తుపోయింది. చాకీచాన్ గతంలో చైనాలో డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన కుమారుడే డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిపోవడం కంటే అవమానకరమైన విషయం మరొకటి వుంటుందా? తన కుమారుడు ఇలా దొరికిపోయిన విషయం తెలుసుకున్న జాకీచాన్ షాక్‌కి గురయ్యారు. ఇన్నిరోజులూ బయటి ప్రపంచానికి ముఖాన్ని చూపించలేకపోయారు. ఇప్పుడు మనసు దిటవు చేసుకుని ఈ సంఘటన మీద తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘నా కుమారుడు జేసీ చాన్ చేసిన ఘనకార్యం వల్ల నేను సిగ్గుతో తల దించుకుంటున్నాను. ఈ వార్త వినగానే నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఇంతకాలం ప్రజల ముందు తలెత్తుకుని జీవించిన నేను ఇప్పుడు సిగ్గుతో తల వంచుకుంటున్నాను. నన్ను అందరూ క్షమించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను చాలా విషాదంలో మునిగిపోయి వున్నాను. జేసీ చాన్ తల్లి అయితే దు:ఖంలో మునిగిపోయి వున్నారు. జేసీ చాన్ చేసిన తప్పు నుంచి నేటి యువతరం పాఠాలు నేర్చుకుని సక్రమమైన మార్గంలో నడుస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.