చంద్రబాబు పాదయాత్ర పార్టీకి మేలు చేస్తోందా?

  గత 6నెలలుగా చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర వలన తెలుగుదేశం పార్టీ చాలా ప్రయోజనం పొందిఉండవలసినది. కానీ, అదే కారణంతో, అంటే ఆయన పార్టీ కార్యాలయాన్ని, పార్టీ అంతర్గత నిర్వహణ బాధ్యతలను తన సీనియర్లకు అప్పగించి దూరంగా తిరుగుతున్నందున, ఇదివరకు కంటే ఇప్పుడు పార్టీలో ముఠా తగాదాలు, వలసలు, అలకలు, అసమ్మతి, అసంతృప్తులు బాగా ఎక్కువయిపోయాయి. అయినా కూడా చంద్రబాబు తన పాదయాత్రకే ప్రాధాన్యం ఇచ్చి ముందుకు సాగుతుండటం వలన, ఆయనకు బదులు పార్టీని పూర్తీ సాధికారంగా నిర్వహించే అధికారం మరెవరికీ లేనందున, రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట పార్టీలో సమస్యలు తలెత్తుతున్నాయి.   ఒకరోజు అయ్యన్న పాత్రుడు అలిగితే, మరొక నాడు మరో శాసన సభ్యుడో మరొకరో జగన్ పార్టీ వైపు దూకుతారు. ఇక చంద్రబాబు పాదయత్రకి తెలంగాణా లో ఇబ్బందులు ఎదురవుతాయని అందరూ భావిస్తే, అక్కడ అనుకోన్నదానికంటే చాలా ప్రశాంతంగా దిగ్విజయంగా ముగిసింది. కానీ, ఆయన ఆంధ్ర ప్రాంతంలో అడుగిడిన నాటినుండి సమస్యలు మొదలయ్యాయి.   కృష్ణ జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లావరకు సాగిన పాదయాత్రలో ప్రతి చోటా పదనిసలే వినిపించాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ముఠా తగాదాలు బయట పడితే, అదే సమయంలో విశాఖలో అసమ్మతి తలెత్తింది. శ్రీకాకుళం నుండి జగన్ పార్టీలోకి వలసలు అప్పుడే మొదలయ్యాయి. ఇక యం.యల్.సీ. టికెట్ కోసం దాడి వీరభద్రరావు చేస్తున్నహడావుడి కూడా అందరూ చూస్తున్నదే.   చంద్రబాబు పాదయాత్ర చేయకపోతే ఈ సమస్యలు రావని కాకపోయినా, ఆయన పార్టీ కార్యాలయంలో ఉండిఉంటే, ఎప్పటికప్పుడు ఇటువంటి గోటితో పోయే సమస్యలను గొడ్డలి దాక పోకుండానే పరిష్కరించ గలిగే వారని మాత్రం చెప్పవచ్చును. ఇక, ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి చేస్తున్న ఈ పాదయత్రవల్ల చంద్రబాబు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గేవి కావు.   కానీ, ఈ పాదయాత్ర వల్ల చంద్రబాబు చెప్పుకొంటునట్లు, ఆయన ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల కష్ట నష్టాలను స్వయంగా చూసి తెలుసుకోవడం వల్ల కలిగిన మార్పు ఆయనలో శాశ్వితం అయితే అది ఆయన పార్టీకి, ప్రజలకి కూడా తప్పక మేలు చేస్తుందని చెప్పవచ్చును.

రాంసింగ్ ను హత్య చేశారు

      రాంసింగ్ మృతిపై అతని తల్లిదండ్రులు, న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని చంపేశారని, తన కుమారుడిని మృతిని హత్యగా పరిగణించాలని రాంసింగ్ తండ్రి అన్నారు. ఆరు రోజుల క్రితం తాను కోర్టులో తన కుమారుడిని కలిశానని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అతను తనకు చెప్పాడని, తన సహచర ఖైదీలు తన పట్ల అసహజంగా ప్రవర్తించారని తన కుమారుడు తనతో చెప్పినట్లు రాంసింగ్ తండ్రి మాంగే లాల్ సింగ్ చెప్పారు. మరోవైపు రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జైలు అధికారులు సోమవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేకు నివేదిక అందజేశారు.

మోడీకి సుద్దులు చెపుతున్న పెద్దన్న

  ప్రపంచాదేశాలకి తనని తానూ పెద్దన్నగా భావించుకొనే అమెరికా, ఒక దేశంగా ఉద్భవించిన నాటి నుండి ఏదో ఒక దేశంలో తన యుద్ధం సాగిస్తూనే ఉంది. కానయితే, దానికి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’, ‘శాంతి స్థాపన’అనే రెండు హుందా అయిన పేర్లను తగిలించు కొంటుంది.   హిరోషిమా నాగాసాకిల మీద అణుబాంబులు వేసి లక్షలాది ఆమయక ప్రజలను బలిగొన్నఅమెరికా, అప్పుడూ ప్రపంచ శాంతికే ఆ పని చేసానని చెప్పుకొంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆధునిక ఆయుధాలను తయారుచేసుకొనే అమెరికా, శాంతి స్థాపనపేరిట వాటిని ఇతరదేశాలలో సామాన్య పౌరులపైన, పిల్లలు, వృద్ధులు, మహిళలపైన ప్రయోగించి పరీక్షించుకొంటూ తన పైశాచిక మనస్తత్వాన్ని చాటి చెప్పుకొంటూనే, మరో వైపు ప్రపంచానికి శాంతి ప్రవచనాలు చిలకల అప్పజెప్పడానికి ఎన్నడూ సిగ్గుపడలేదు.   అలనాటి వియత్నాం యుద్ధం మొదలుకొని నిన్న మొన్నటి ఇరాక్ యుద్ధం వరకు అమెరికా ప్రపంచ శాంతి స్థాపన కోసం చాలానే యుద్ధాలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంటుంది కూడా. ఇరాక్ లో ప్రజాస్వామ్యం పునరుద్దరించేసి, అక్కడ శాంతి స్థాపన చేసేసి చేతులు దులుపుకొన్నవెంటనే, అమెరికాకు అత్యవసరంగా లాడెన్ కోసం ఆఫ్ఘానిస్తాన్ బయలుదేరవలసి వచ్చింది.   ఇరాక్ యుద్ధంలో తన అత్యాదునిక ఆయుధ సంపత్తిని అక్కడి ప్రజలకి పరిచయం (?) చేసిన అమెరికా, ప్రపంచంలోకెల్లా అత్యంత విలువయిన ప్రాణులయిన తన సైనికుల ప్రాణాలు కాపాడుకొనే గొప్ప ఆలోచనతో ‘డ్రోన్’ వంటి మానవరహిత యుద్ధవిమానాలతో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాలలో ఉగ్రవాదుల కనబడుతున్న ప్రజల నెత్తిన బాంబుల వర్షం కురిపిస్తూ, తన సరికొత్త ఆయుధాలు కూడా సమర్ధంగానే పని చేస్తున్నాయని రూడీ చేసుకొనే అవకాశం పొందింది.   కానీ, పామరులయిన జనాలు మాత్రం అమెరికా చేస్తున్న ఈ శాంతి స్థాపన కార్యక్రమాలను అపార్ధం చేసుకొనడమే కాకుండా, అమెరికా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని గొంతు చించుకొంటున్నారు.   ఇటువంటి నేపద్యంలో మొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో ఒక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరబోతే, ఆయన (కూడా) మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడని కనిపెట్టేసిన అమెరికా ఆయనకు వీసా నిరాకరించింది.   కానీ, తనకు మాత్రం ఆ సూత్రం వర్తించదని మనస్పూర్తిగా నమ్మే దేశం కనుక, తనకు తానే ఒక ‘యూనివర్సల్ వీసా’ మంజూరు చేసుకొని, ఏదేశంలో కావాలంటే ఆ దేశంలోకి తన విమానాలలో గుట్టలుకొద్దీ బాంబులను నింపుకొని జొరబడి అక్కడ తన శాంతి స్థాపన కార్యక్రమాలు మొదలుపెట్టగలదు.   ఎందుకంటే, ప్రపంచానికి పెద్దన్న అయిన తానూ ప్రపంచం దేశాలలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం పరిరక్షణ చేయవలసిన గురుతరమయిన బాధ్యతను తన భుజస్కంధాలపై మోస్తోంది గనుక. అయినా వెర్రి ప్రజ అర్ధం చేసుకోదూ.

పది మంది ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

        శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మొదట కాంగ్రెస్ నుంచి ఆరో అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించుకున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చివరి నిమిషంలో రద్దు చేసుకోవడంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైనట్లే. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, మహ్మద్ సలీం, శమంతకమణి, కాంగ్రెస్ నుంచి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, కొలగట్ల వీరభద్రస్వామి, లక్ష్మీశివకుమారి, సంతోష్‌కుమార్, టీఆర్‌ఎస్ నుంచి మహ్మద్ అలీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఆదిరెడ్డి అప్పారావు ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్లు దాఖలు

        తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికైన ఎమ్మెల్సీ అభ్యర్ధులు యనమల రామకృష్ణుడు, సలీం, శమంతకమణి అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను అందజేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల మీడియాతో మాట్లాడుతూ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన అన్నారు. టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రజల పక్షాన పోరాడటమే పార్టీ ఎజెండా అని యనమల వ్యాఖ్యానించారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ఘాట్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు.

జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోతుంది

        వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైన కాంగ్రెస్ పార్టీలో కలుస్తుందని టిఆర్ఎస్ నేత కేటిఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కలవడానికి విజయమ్మ అ౦గీకరించారని, కుంభకోణాలనుంచి కొడుకుని, అల్లుడిని కాపాడుకొనేందుకే విజయమ్మ తాజా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. జగన్ పార్టీ ఇంతకాలం కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోసి ప్రజలను పిచ్చివాళ్ళను చేసిందన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా వైకాపా కు మద్దతు ఇచ్చిన ప్రజలను విజయమ్మ అవమానించారన్నారు. జగన్ ను జైలు నుంచి బయటకు తెచ్చేందుకే విజయమ్మ కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. వైకాపా, కాంగ్రెస్ ఎత్తులను తెలంగాణ ప్రజలు గమనించాలని కేటిఆర్ చెప్పారు.

తెలంగాణలో ఆత్మహత్యలకు ప్రధానకారణం...

"తెలంగాణలో ఆత్మహత్యలకు ప్రధానకారణం ఆర్థికపరిస్థితులే''                                                                                      - తెహల్కా వెల్లడి.  -డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]     ఆమధ్య, చైనాలో అంతర్భాగామైన టిబెట్ ను ప్రత్యేక దేశంగా గుర్తించి దాన్ని విమోచనచేసి, దానికి స్వాతంత్ర్యం ప్రకటించాలన్న మిషపైన "స్వేచ్చా టిబెట్'' పేరిట ఒక ఉద్యమాన్ని కొందరు టిబెటన్లు నిర్వహించడం, ఆ ఉద్యమానికి ఇండియాను కేంద్రం చేసుకుని నాలుగుదశాబ్దాలుగా "ధర్మశాల''లో మకాంపెట్టిన చైనా వ్యతిరేకి, అమెరికా ప్రోద్భలంతో చైనాకు వ్యతిరేకంగా రకరకాల కార్యకలాపాలు సాగిస్తున్న దలైలామా నాయకత్వం వహించడం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే! అయితే దలైలామా, అమెరికాలు ప్రోత్సహిస్తున్న ఆ కొందరు చైనా వ్యతిరేక "టిబెటన్'' కొంతమంది ఇటీవల "టిబెట్''కు స్వాతంత్ర్యం ప్రకటించాలని కోరుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీళ్ళకు కొమ్ముకాస్తున్న అమెరికా గుట్టు కాస్తా రట్టయింది.   అయితే, ఈ టిబెటన్ల "ఆత్మహత్యల''తో వేర్పాటు ఉద్యమం పేరిట ఇటీవలకాలంలో తెలంగాణలో జరిగిన ఆత్మహత్యలను పోల్చుతూ పరిశోధనా జర్నలిజంలో పరసీమలు చూస్తున్న ప్రసిద్ధ ఆంగ్లవారపత్రిక "తెహల్కా'' ఒక ప్రత్యేక వ్యాసం ప్రచురించింది [సంపుటి 10]. అయితే, "తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని ప్రకటించాలన్న కోర్కె ఒక్కటే తెలంగాణాలో ముఖ్యంగా యువకుల ఆత్మహత్యలకు కారణం కాదనీ, అనేక ఇతర సామాజిక, ఆర్థిక కారణాలు ఈ ఆత్మహత్యలకు కారణమనీ "తెహల్కా'' విశ్లేషించడం విశేషం! ఫిబ్రవరి (2013) 4వ తేదీన ఆత్మహత్య చేసుకున్న వరంగల్ ఇంజనీరింగ్ విద్యార్థి కడవెండి నీరజ్ భరద్వాజ (19 సంవత్సరాలు) ప్రత్యేక తెలంగాణా సమస్యను కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చకుండా ఉన్నదుకు నిరసనగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వదిలివెళ్ళిన చీటీ గురించి ""తెహల్కా'' ఉదాహరిస్తూ "ఇలాంటి చీటీలన్నీ ఆ సమస్యపై కాంగ్రెస్ ను నిందిస్తూ రాసినవేనని పేర్కొంది. కాని, భరద్వాజ లేఖే మొత్తం ఆత్మహత్యల కథకాదని చెప్పింది. 2009 నవంబర్ 2012 జనవరి మధ్య కాలంలో తెలంగాణలో మొత్తం ఆత్మహత్యల సంఖ్యా 849 కాగా, వీటిలో కొన్ని ఆత్మహత్యలు మాత్రమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేరిట జరిగినవనీ కాని అనేక ఆత్మహత్యలు దిగజారిపోతున్న సాంఘిక, ఆర్థిక పరిస్థితులు కారణంగానే జరిగాయని తెహల్కా వెల్లడించింది. ఈ రోజున రైతులు, చేనేత పనివారు, విద్యార్థులూ దారుణ దారిద్ర్యం, రుణబాధలు, వ్యవసాయ సంక్షోభం, ఉపాధి కనుమరుగవుతున్న పరిస్థితులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకపోతే ఇక తమకు భవిష్యత్తే లేదన్నట్టుగా నిరంతరం సాగుతూ వచ్చిన రాజకీయ ప్రచారమూ ఆత్మహత్యలకు దారితీశాయని స్పష్టం చేసింది. ఇలా ఒకవైపున ఆంధ్రప్రదేశ్ జీవితాలు కొడగట్టుకు పోతూండగా ఇంకోవైపున రాష్ట్రంలో రాజకీయపక్షాలు పరస్పరం ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ఉన్నారని రాసింది. ఇందుకు ఒక ఉదాహరణగా ఆ పత్రిక ఒక ప్రయివేట్ వ్యక్తి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, హోంమంత్రి షిండే, కాంగ్రెస్ అధిష్ఠానవర్గ ప్రతినిథి గులామ్ నబీ ఆజాద్ లపైన రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేశాడు. దానిపైన కోర్టు ఎఫ్.ఐ.ఆర్.ను దాఖలు చేయమని పోలీసులను ఆదేశించింది. అందులో అభియోగం ఏమిటి? :"తప్పుడు హామీలు ఇవ్వటం, ప్రజల్ని మోసగించటం, సామాజిక భద్రతకు ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెట్టడా''ని వీరు కారకులన్నది ఆరోపణ. అలాగే తెలంగాణలో ఆత్మహత్యల్ని యు.పి.ఎ. అధ్యక్షురాలు సోనియా ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ కు చెందిన ఒక బిజెపి నాయకుడు కూడా మరో ప్రయివేట్ పిటీషన్ దాఖలు చేశాడు. తెలంగాణా ఉద్యమంలో దళితవర్గాలకు చెందినవారే ఎక్కువమంది బలయ్యారని, వాస్తవానికి తెలంగాణా పేరుమీద ఆత్మహత్యలపాలైన వారిలో దాదాపు అందరూ షెడ్యూల్ కులాలు [ఎస్.సి.లు], తదితర వెనుకబడినవర్గాల యువకులేననీ, కాని వేర్పాటు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కె.సి.ఆర్. కులం తాలూకూ ఒక్కడంటే ఒక్కడూ ఆత్మహత్య చేసుకోలేదనీ "తెహల్కా'' నమోదు చేసింది. తన విద్య తనకు ఉద్యోగం చూపలేదన్న మిషపైన ఒక ముదిరాజ్ కుల విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటనను టీవీలలో చూసిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఆర్థికపరిస్థితులు బాగులేకనో, పండించిన పంటకు తగిన రేటు రాక, అప్పులపాలయిన రైతులు, స్వల్పాదాయపు కుటుంబాలకు చెందిన యువకులు ఉపాధికి దూరమయినందుననో, అనేక ఆత్మహత్యలు జరిగాయి. కాని బూతులతో, తోటి తెలుగువారిపైన దూషణ ద్వారా విపరీతమైన ద్వేషాన్ని ప్రజలలో కల్గించడంద్వారా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావించిన "బొబ్బిలిదొర'' ఒక రాజకీయ నిరుద్యోగిగా వేర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించి వందలమంది విద్యార్థియువకులను ఆత్మహత్యల వైపునకు ప్రోత్సహించాడు. చివరికి అతడు చేసిన పనేమిటి? ఢిల్లీలో కేంద్రకాంగ్రెస్ అధిష్ఠానానికి, వారు లోనుచేసిన ప్రలోభాలకు లోబడిపోయి తాను ఏర్పాటు చేసుకున్న "తెలంగాణా రాష్ట్ర సమితి''ని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్ధమైనవాడు కె.సి.ఆర్. అవకాశవాద రాజకీయ నిరుద్యోగి హోదాలో అతడిప్పుడు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళగల స్థితిలో లేడు. కాని తన ప్రోత్సాహంవల్ల అమూలమైన ప్రాణాలు పోగొట్టుకున్న యువకులే తన పాలిట "యమపాశం''గా మారతారన్న బెంగవల్ల తరచుగా 2014 ఎన్నికలను ప్రస్తావించనారంభించాడు; ఓట్లు, సీట్లు అంటూ 'ఉద్యమాన్ని కాటేస్తున్నాడు. ఈ సరికొత్త పరిణామం మొత్తం తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనే చీలికలకు కారణమవుతోంది. మిలిటెంట్ ఉద్యమాన్ని అతనెలాగూ నడపలేడు! కాని అదే సమయంలో తన నాయకత్వాన్ని "తెలంగాణా సంయుక్త కార్యాచరణ''  సంఘమూ అంగీకరించే స్థితిలోలేదు; కాగా మిలిటెంట్ ఉద్యమానికి నాయకత్వం వహించగల స్థితిలో గత మూడేళ్లుగా నెలసరి భారీ జీతాన్ని ఉస్మానియుయా విశ్వవిద్యాలయంనుంచి పొందుతూ ఉద్యోగానికి రాజీనామా యివ్వగల స్థితిలో లేని ప్రొఫెసర్ కోదండం రామ్ సంకటంలో పడిపోయాడు. ఇక ఆదిలో కె.సి.ఆర్.తో చేతులుకలిపిన కళాకారుడు గద్దర్ కూడా కె.సి.ఆర్.కు దూరంగా జరిగి "ప్రజాఫ్రంట్'' పేరిట ఉనికిని అలాఅలా కృత్రిమంగా కాపాడుకుంటున్నాడు. మరొక వైపున కె.సి.ఆర్. "సంయుక్త కార్యాచరణసంఘం'' (టి.జె.ఎ.సి.)లోని మిలిటెంట్లతో చస్తే పొసగని పరిస్థితి. అలా అని ఒంటరిగా "వేర్పాటు ఉద్యమా''న్ని నిర్వహించగల స్థాయిని కోల్పోతున్నాడు! ఈ దశలో ఇతర మిలిటెంట్ శక్తులు కొన్ని కె.సి.ఆర్.ను మిలిటెంట్ ఉద్యమంలోకి లాగి అతడి శక్తియుక్తుల్ని పరీక్షించజూస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగమే - "ఉద్యమాలు చేద్దాం, రా! ఎన్నికలద్వారా తెలంగానా రాదు, పోరాటాలద్వారానే తెలంగాణా సాధ్యమవుతుంది. తెలంగాణా రాజకీయ జె.ఎ.సీ. తన ఒంటెత్తు పోకడలను మానుకోవాలి; తెలంగాణా ఉద్యమం యింకా క్షేత్రస్థాయిలోకి (ప్రజల్లోకి) వెళ్ళనేలేదనీ, అందరినీ కలుపుకుని పోవలసిన అవసరం ఉందనీ, గద్దర్ ప్రకటనలు విడుదల చేస్తున్నాడు! కాని అటు కె.సి.ఆర్.కూ, ఇటు కోదండరామ్ కూ గద్దర్ వైఖరి నచ్చదు! ఎవరి మధ్యా సమన్వయము లేదు, రాదు. ఇది యిలా ఉండగా తెలంగాణా జె.ఎ.సి.కి పోటీగా నడుస్తున్న "తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్'' నాయకుడు, శాసనమండలి సభ్యుడైన దిలీప్ కుమార్, దళితవర్గాల ప్రతినిధి, గజ్జెల కాంతం ఒక ప్రకటన చేస్తూ "కె.సి.ఆర్. వంటా-వార్పులతోనూ, సడక్ బంద్''లతోనూ తెలంగాణారాదనీ స్పష్టంచేశాడు! ఈ వేర్పాటు ఉద్యమంలో పాల్గొంటున్న వర్గాలేవీ క్షేత్రస్థాయిలో రైతులు, వ్యవసాయకార్మికులు, పంటభూముల గురించి ప్రజాబాహుళ్యం ఎదుర్కొంటున్న ధరవరల గురించీ ఇంతవరకూ ప్రజల గుర్తింపు పొందగల స్థాయిలో తపన పడలేదు. ప్రజాబాహుళ్యం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను గాలికివదిలి తిరుగుతున్న దాని ఫలితమే - గోదావరి నదిపైన మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు పథకాన్ని సకాలంలో పసిగట్టి జాగ్రత్తలు తీసుకొనకపోవటం! వేర్పాటువాద నాయకత్వం రాజకీయ నిరుద్యోగులతో నిండి ఉన్నందుననే ప్రజాసమస్యలకు పరిష్కారం దుర్లభమవుతోంది!   అందుకే "తెహల్కా'' పత్రిక లోతుపాతుల్లోకి వెళ్ళి తెలంగాణా సమస్యను 'జల్లెడ'పట్టింది. అందుకే ఆ పత్రిక యిలా వ్యాఖ్యానించగలిగింది : "తెలంగాణాప్రాంతం ఆత్మహత్యలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా రైతులు, నేతకార్మికులు, వెనుకబడిన కులాలకు చెందినవారి ఆత్మహత్యలకు కేంద్రంగా మారింది. 1996 నుంచి 2007 దాకా ఘటిల్లిన ఆత్మహత్యల్లో మూడింట రెండువంతులు తెలంగాణాలోనే జరగడం విశేషం''

ఢిల్లీలో కారులో యువతిపై గ్యాంగ్ రేప్

    దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అరాచకాలు కొనసాగుతునె ఉన్నాయి. నిర్భయ అత్యాచారంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన ఢిల్లీలో మహిళల పై కీచక పర్వాలు ఆగడం లేదు. ఢిల్లీ లో మరో యువతి పై ప్రయాణిస్తున్న కారులో సామూహిక అత్యాచారానికి దుండగులు పాల్పడ్డారు. అఘాయిత్యం అనంతరం బాధితురాలి(34)ని ప్రగతి మైదాన్ సమీపంలో రహదారిపై పడేసి పోయారు. కారులో మొత్తం ఆరుగురుంటే. వారిలో ఇద్దరు మహిళలేనని పేర్కొన్నారు. పైగా వారంతా తనకు తెలిసిన వారేనని బాధితురాలు తెలిపారు. బాధితురాలిని అక్షరధామ్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన కారులోని దుండగులు ఆమెను లోపలకు లాగేసి ఎక్కించుకున్నారు. అఘాయిత్యం తరువాత ఆమెను రోడ్డుపై పడేసిన దుండగులు.. రెండు మొబైల్ ఫోన్లను, కొన్ని నగలను కూడా దోచుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమెను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.   

చిర౦జీవికి కాంగ్రెస్ షాక్

        ఎమ్మెల్సీ పదవుల పంపకంలో కేంద్ర మంత్రి చిరంజీవి వర్గానికి మరోసారి నిరాశే ఎదురైంది. సామాజిక న్యాయం పేరుతో సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావు పేరును పక్కన పెట్టారు. ఈ విషయం తెలియగానే మంత్రి సి.రామచంద్రయ్య, చిరు వ్యక్తిగత కార్యదర్శి విక్రమ్ హుటాహుటిన వెళ్లి పీసీసీ చీఫ్ బొత్సను ఆయన నివాసంలో కలిశారు.   ఎస్సీ వర్గానికి చెందిన జంగా గౌతమ్ పేరును పరిశీలించాలని రామచంద్రయ్యతో చిరంజీవి కబురు పెట్టారు. స్వయంగా తాను కూడా బొత్సకు ఫోన్ చేసి మాట్లాడారు. గతంలో పీఆర్పీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన గౌతమ్.. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనూ అవే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే సాయంత్రం ప్రకటించిన జాబితాలో చిరంజీవి ప్రతిపాదించిన పేర్లు ఏవీ లేకపోవడం ఆయన వర్గాన్ని నిరాశకు గురి చేసింది.

దాడికి బాధ కలగడం సహజం: చంద్రబాబు

        టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు. మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు, వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు సలీం, మాజీ మంత్రి శమంతకమణి పేర్లు ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ కోసం చాలా మంది పనిచేశారని, అయితే ఈసారీ అందరికీ అవకాశం ఇవ్వలేకపోయామని ఆయన అన్నారు. ప్రాధాన్యత క్రమంలో పదవులు ఇస్తామని చంద్రబాబు అన్నారు. అందరికీ సమన్యాయం, రాజకీయ ప్రాధాన్యత దక్కాలని బాబు అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారు చాలా మంది ఉన్నారన్నారు. కులాలతో సంబంధం లేకుండా అందరూ పార్టీ కోసం పనిచేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. పార్టీలో పేదరికంతో ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్సీ పదవి విషయమై శనివారం దాడి వీరభద్రరావుతో మాట్లాడానని, ఆదివారం కూడా మాట్లాడేందుకు ప్రయత్నించారని, ఆయన అందుబాటులో లేరని చంద్రబాబు అన్నారు. ఉన్నవి మూడు సీట్లు, అందరికీ ఇవ్వలేమని, మూడు ప్రాంతాలకు సమన్యాయం పాటించామని, ఎవరూ అన్యతా భావించవద్దని చంద్రబాబు కోరారు. దాడి వీరభద్రరావుకు బాధకు కలగడం సహజమేనని, ఆయన స్థానంలో ఎవరున్నా అలాగే స్సందిస్తారని చెప్పారు. అభ్యర్థుల ఎంపికలో రాగద్వేషాలకు తావులేదని, అందరూ ఒకటేనని చంద్రబాబు అన్నారు.    

ఎమ్మెల్సీ ఎంపిక పై దాడి అసంతృప్తి

        తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందుకు ఆయన అసంతృప్తికి గురయ్యారు. యనమలకు సీటు ఇవ్వడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, పార్టీలో సీనియర్‌నైన తాను మరోమారు కొనసాగింపు కోరుకోవడంలో తప్పు లేదని, అయితే ఈసారి ఎమ్మెల్సీ పదవి తనకు ఇవ్వడం లేదని ముందుగా చెప్పి వుంటే గౌరవంగా తప్పుకునేవాడినని దాడి అన్నారు. పొలిట్ బ్యూరో సమావేశంలో చెప్పడం మనస్తాపానికి గురైనట్లు చెప్పారు.   పార్టీలో బీసీలకు, పేదలకు న్యాయం జరగలేదని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసే పద్ధతి ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు. నిబద్ధత గల కార్యకర్తగా టీడీపీలో పనిచేస్తానని అన్నారు. కాగా బీసీ డిక్లరేషన్‌ను టీడీపీ ఆదివారం ప్రకటించింది. దాడి వీరభద్రరావు పదవి కాలం ఇంకా రెండు నెలల సమయం ఉన్నా మనస్తాపం కారణంగా ఇప్పుడే రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ: కోటగిరి కోసం చిరు లాబీయింగ్

        గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసి తుది జాబితా తయారు చేసిన నేపధ్యంలో కేంద్రమంత్రి చిరంజీవి వార్తల్లోకెక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన వర్గానికి చెందిన కోటగిరి విద్యాధర రావు, గౌతమ్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వాల్సిందిగా చిరంజీవి బొత్సకు సూచించినట్లుగా సమాచారం. చిరంజీవి కోటగిరికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారట. ఒకవేళ సామాజిక సమీకరణాలు కుదరకపోతే గౌతమ్‌కు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట. గతంలో కూడా కోటగిరి కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరి చివరి నిమిషంలో చిరు ప్రయత్నాలు ఫలిస్తాయా?

టిడిపిలో ఎమ్మెల్సీ చిచ్చు

        తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎంపికలో చిచ్చు రేగింది. దాడి వీరభద్రరావుకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందుకు ఆయన అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి మండలాధ్యక్షులు సుమారు 600 మంది రాజీనామాలు చేశారు. ఆ లేఖలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. దీంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో నామా నాగేశ్వరరావు, సుజనాచౌదరి సమావేశమయ్యారు. వీరభద్రరావుని బుజ్జగించే బాధ్యతను చంద్రబాబు వారిద్దరికీ అప్పగించారు.   దాడి వీరభద్రరావు పదవీ కాలం ముగియడానికి ఇంకా రెండు నెలల సమయం ఉన్నా మనస్తాపం కారణంగా ఇప్పుడే రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దఫా యనమలకు అవకాశం ఇవ్వాలని బాబు నిర్ణయించారు. అయితే, ఈ విషయాన్ని తనతో కొంత ముందుగా చెప్పి ఉంటే బాగుండేదని, పొలిట్ బ్యూరో సమావేశానికి పిలిచి, అప్పుడే చెప్పడం తనను మనస్తాపానికి గురి చేసిందని దాడి ఆవేదన వ్యక్తం చేశారట.  

మంగళసూత్రాలు ఇవ్వలేదంటున్న షర్మిలా

      గుంటూరు జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలా.. చంద్రబాబుకు హామీలు ఇవ్వడం తప్ప అవి తీర్చడం తెలియదని అంటోంది. 1999 ఎన్నికలకు ముందు ప్రచారంలో అధికారంలోకి వస్తే మహిళలకు మంగళసూత్రాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారని వైఎస్ షర్మిల అన్నారు. నిజంగా చంద్రబాబు ఆ హామీ ఇచ్చారో లేదో కాని, ఇప్పుడు షర్మిల ఆ వాగ్దానం చంద్రబాబు అమలు చేయలేదని విమర్శిస్తున్నారు.   మరోవైపు ఈ రోజు మహాశివరాత్రి కావడం, గుంటూరు జిల్లాలో కోటప్పకొండ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని షర్మిల పాదయాత్రకు ఈ రోజు విరామం ప్రకటించారు. తిరిగి సోమవారం పాదయాత్ర ప్రారంభమవుతుంది.

శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

        మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోటప్పకొండ త్రికుటేశ్వరస్వామ్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకోనేందుకు తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.   కీసరకు పోటెత్తిన భక్తులు మహాశివరాత్రి సందర్భంగా కీసర రామలింగేశ్వర స్వామి లయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము 4గంటల నుంచి దర్శనం కోసం ఆలయం వద్ద కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.    వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రం హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామిని దర్శించుకోనేందుకు భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.  శివరాత్రి సంధర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

తూచ్! అవి తెదేపా గురించి కాదు: లోకేష్

  చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ వీలయినంత త్వరగా రాజకీయాలలో తన ఉనికిని చాటుకోవాలని, పార్టీలో ప్రధాన పాత్ర పోషించాలని ఉవ్విళ్ళూరుతున్నసంగతి అందరికీ తెలిసిందే. తన రాజకీయ ఆరంగ్రేటం స్వస్థలం చిత్తూరు జిల్లా కుప్పం గ్రామంలో మొదలుపెట్టడమే ‘తనకు అన్నివిధాల ఆరోగ్యకరం’ అనే ఆలోచనతో కుప్పం నియోజక వర్గంలో గత రెండు రోజులుగా ‘పల్లెపల్లెకు తెలుగుదేశం’ అనే ఒక కార్యక్రమం పెట్టుకొని, చిన్న చిన్న ప్రసంగాలు చేస్తూ తన ‘రాజకీయ ఎప్రంటిస్’ మొదలుపెట్టారు కూడా. కానయితే, శిక్షణ ఇచ్చేందుకు పక్కన గురువు లేకపోవడం, అనుభవ రాహిత్యం వల్ల లోకేష్ చాలాసార్లు తడబడుతున్నారని సమాచారం.   లోకేష్ ముందే ప్రకటించినట్లు, తన తండ్రి పాదయాత్ర ముగించుకొని ఇంటికి వచ్చేవరకు కొంచెం ఓపికపట్టి ఉంటే, చంద్రబాబు ఆయనకి రక్షగా తన అతిరధ మహారధులను తప్పక పంపేవారు. కానీ, యువకుడయిన లోకేష్ అంతకాలం ఒపిక లేనట్లు నేరుగా కార్యక్షేత్రంలో దూకేయడంతో ఆయన యాత్రలో పదనిసలు మొదలయ్యాయి.   మొన్నజరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో, వారిని తమ పార్టీకే ఓటేయమని కోరడంతో నవ్వులు విరబూయించిన ఆయన, ఈ రోజు చిత్తూరు జిల్లా వి.కోటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అలవాటులో పొరబాటుగా కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకి అన్వయించవలసిన లక్షణాలన్నిటినీ స్వయంగా తమ పార్టీకే అన్వయిస్తూ “'అవినీతి, బంధుప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనావుందంటే అది తెలుగుదేశం పార్టీ. అవునా, కాదా?” అంటూ కార్యకర్తలను అడిగారు. ఆయన మాటలకు షాకయిన కార్యకర్తలు గట్టిగా కేకలు వేయడంతో ‘లోకేష్ సర్దుకొని మళ్ళీ రెండు కాంగ్రెస్ పార్టీలకు ఆ అవలక్షణాలు బదలాయించేసి, తెదేపాను, తన తండ్రి చంద్రబాబును పొగుడుతూ ఉపన్యాసం ముగించారు.   ఇటువంటి సువర్ణావకాశం కొరకే ఓపికగా ఎదురుచూస్తున్న సాక్షి మీడియా ఆయన మాటలను వెంటనే ప్రచురించేసింది కూడా. రేపు, ఆయన మాటలను పట్టుకొని రెండు కాంగ్రెస్ పార్టీల నేతలు తెలుగుదేశం పార్టీతో ఆడుకోక వదిలిపెట్టరు కదా!