బాబు పాదయాత్ర ముగింపుకు ముహూర్తం

        టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రకు ముగింపు ముహూర్తం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గాంధీ జయంతి నాడు మొదలు పెట్టిన పాదయాత్ర ను తన జన్మదినం రోజున ముగించాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 19 నాటి కి బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏప్రిల్ 19న విశాఖ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 20న విశాఖలో జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు.   అయితే ఆయన మే 1 వరకు పాదయాత్ర చేసి టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడు ఊరు నిమ్మాడ దాకా వెళతారని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పాదయాత్ర ముగించి హైదరాబాద్ వచ్చి సమీక్షలు చేస్తారని, ఆ తరువాత మిగిలిపోయిన ఆరుజిల్లాలలో పాదయాత్ర చేయాలా ? లేక బస్సు యాత్ర చేయాలా ? అనేది నిర్ణయిస్తారని తెలుస్తోంది.  

కోర్ట్ లో లో౦గిపోయిన నిర్మాత బండ్ల గణేష్

    ఎన్టీఆర్ 'బాద్ షా' ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈరోజు రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. 'బాద్ షా' ఆడియో ఫంక్షన్ లో తొక్కిసలాట జరిగి అభిమాని మరణించడంతో రాయదుర్గ పోలీసులు గణేష్ పై 304(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమైనందున వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బండ్ల గణేష్తో పాటు బాద్షా ఆడియో ఫంక్షన్ నిర్వాహకుడు కూడా కోర్టులో లొంగిపోయాడు. తొక్కిసలాటలో మరణించిన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ ఐదు లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ ఐదు లక్షలు చొప్పున రాజు తల్లి ఈశ్వరమ్మ కి మొత్తం పది లక్షలు ఆర్ధిక సహాయం చేశారు.  

యూపిఏ కు డీఎంకే షాక్

        యూపిఏ ప్రభుత్వానికి డీఎంకే షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలుగుతున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి ఈరోజు వెల్లడించారు. శ్రీలంకలోని తమిళ హక్కుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగింది. కేంద్ర మంత్రి వర్గం నుంచి డీఎంకే కు చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. జెనీవాలో జరిగే ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ భేటీలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కరుణానిధి మరోసారి డిమాండ్ చేశారు. 18 ఎంపీల బలం వున్న డీఎంకే యూపిఏ లో రెండో అతిపెద్ద భాగస్వామి. డీఎంకే నిర్ణయంతో యూపిఏ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

రాములమ్మ తెలంగాణా రాజకీయాలు

  ఇటీవల జూ.యన్టీఆర్ నటించిన ‘బాద్షా’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా వరంగల్ కు చెందిన రాజు అనే జూ.యన్టీఆర్ అభిమాని మరణించినపుడు, యన్టీఆర్ తో సహా ఆకార్యక్రమానికి వచ్చిన అందరూ చాలా బాధ పడ్డారు. తోబ్బుట్టువులు లేని తనకు తన అభిమానులే తోబ్బుట్టువులని, రాజు మరణం తనకు చాల బాధ కలిగించిందని అన్నారు. రాజును కోల్పోయిన ఆ కుటుంబానికి తానే అతని స్థానంలో నిలిచి అండగా ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో పొరపాటు వలన జరిగిన ఈ ప్రమాదానికి తనను క్షమించమని కోరారు.   ఆ తరువాత మాట్లాడిన నిర్మాత బండ్ల గణేష్ కూడా జరిగిన సంఘటనకు చాల బాధ వ్యక్తం చేస్తూ, చనిపోయిన వ్యక్తిని తానూ తిరిగి తీసుకు రాలేక పోయినప్పటికీ, రూ.5 లక్షలు రాజు కుటుంబానికి సహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.   తదనంతరం వారు రెండు నిమిషాలు మౌనం పాటించి చనిపోయిన అభిమానికి శ్రద్దాంజలి ఘటించి ఉంటే బహుశః రాములమ్మ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉండేది కాదేమో. కానీ, వారు పొరపాటునో లేక జరిగిన సంఘటనకు షాకుకు గురయి ఉనందునో ఆ కార్యక్రమం చేయలేదు. అందరూ విషాదవదనాలతోనే క్లుప్తంగా ఆడియో విడుదల కార్యక్రమాన్నిముగించేసి వెళ్ళిపోయారు.   సాటి మనిషి మరణిస్తే బాధపడని వారెవరూ ఉండరు. అటువంటప్పుడు, ఏ సినిమా హీరోకయినా తన అభిమాని ఈ విధంగా మరణించడం చాలా బాధ కలిగించేదే. అయితే, అందుకు బాధ వ్యక్తం చేయడం, వీలయితే ఆ కుటుంబానికి సహాయ పడటం మాత్రమే ఎవరయినా చేయగలరు. జూ.యన్టీఆర్, నిర్మాత బండ్ల గణేష్ ఇద్దరూ కూడా అదే చేసారు. ఆ కార్యక్రమానికి వచ్చిన మిగిలిన వారు కూడా అదే విధంగా బాధ పడ్డారు.   అయినప్పటికీ, ప్రతీ అంశంలో కేవలం ‘తెలంగాణా’ కోసమే భూతద్దం వేసుకొని వెతికే అలవాటున్న తెరాస పార్టీకి చెందిన విజయశాంతి కూడా అదే పని చేసింది. తమ తెలంగాణా వ్యక్తి చనిపోయినా కనీసం సానుభూతి కూడా చూపని కారణంగా ‘బాద్షా’ సినిమాను తెలంగాణా లో అందరూ బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు.   ఆమె పిలుపుకు తెలంగాణాలో విలువుందా లేదా అనేది వేరే సంగతి. కానీ, ఒక విషాదకరమయిన సంఘటనను కూడా తెలంగాణా పేరుతొ ఆమె రాజకీయం చేయాలనుకోవడం చాలా హీనాతిహీనమయిన పని. ఏ సినీపరిశ్రమ వలన ఆమెకు ఈ రోజు ఇంతటి పేరు ప్రఖ్యాతులు, సంఘంలో ఒక గుర్తింపు కలిగేయో ఆ పరిశ్రమకు చేతనయితే తగిన సలహాలు, సహాయాలు అందించి కృతజ్ఞత చూపకపోగా సినిమాను బహిష్కరించమని పిలుపు ఈయడం విచారకరం.   సినీ పరిశ్రమలో ఉండే కష్ట నష్టాలన్నీ ఆమెకు స్వయంగా తెలిసినపటికీ, రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత ఆమె సినీ పరిశ్రమకు చేసిన సహాయం ఏమిలేకపోగా, తెలంగాణా ఉద్యమకారులు, ముఖ్యంగా ఆమె పార్టీకే చెందిన తెరాస కార్యకర్తలు సినిమా షూటింగులకు అడ్డుపడి రసబాస చేస్తుంటే ఆమె ఏనాడు కలుగజేసుకొని సినీ పరిశ్రమకు అండగా నిలిచిన సందర్భం లేనేలేదు. అందుకు ఆమెను ఎవరూ, ఏనాడు కూడా నిందించలేదు. ఆమె సినీ పరిశ్రమకు సాయం చేయకబోతే పోయె కనీసం నష్టం కల్గించకుండా ఉంటే అదే ఆమె చేసే గొప్ప సహాయం అవుతుంది.   ఇప్పుడు ఆమె స్వయంగా సినిమాను బహిష్కరించమని పిలుపును కూడా ఇవ్వడం చాలా అహేతుకం. ఒకవేళ ఆ చనిపోయినది ఏ ఆంధ్ర వ్యక్తో అయితే బహుశః ఆమె పట్టించుకోనేది కూడా కాదేమో. కానీ, అప్పుడు కూడా సదరు నిర్మాత, నటులు అందరూ కూడా ఇదే విధంగా బాధపడి ఆర్ధిక సహాయం చేసేవారని తప్పక చెప్పవచ్చును.   మరణించిన వ్యక్తీ ఎవరయినప్పటికీ,మానవత్వం ఉన్న అందరినీ అది బాధ కలిగిస్తుంది. వ్యక్తుల మరణంతో రాజకీయాలు చేయడం చాలా హేయమయిన పని అని ఆమె తెలుసుకొంటే మంచిది.

విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం

  పరస్పర అంగీకార శృంగారానికి అవసరమైన వయసు 16కు తగ్గించాలని గురువారం జరిగిన కేబినేట్ సమావేశంలో నిర్ణయించిన విషయం విదితమే. అయితే నెర న్యాయ (సవరణ) బిల్లు-2013కి సంబంధించి ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన అఖిలపక్ష సమావేశంలో భారతీయ జనతా పార్టీ, ఎస్పీతో పాటు వివిధ పార్టీలు పరస్పర అంగీకార శృంగార వయస్సును 18 నుండి 16కు తగ్గించాలనే నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీంతో ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం పరస్పర అంగీకార శృంగార వయస్సును 18గా కొనసాగేందుకు నిర్ణయం తీసుకుంది. అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తాజాగా కొత్త బిల్లును మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వెంటపడి వేధించడం, ఇతరుల శృంగార కార్యకలాపాల్లోకి తొంగిచూడటం వంటి సెక్షన్లను ప్రభుత్వం నీరుగార్చింది. తాజా బిల్లు ప్రకారం తొలిసారి ఈ రెండు నేరాలకు పాల్పడినవారికి బెయిల్ తీసుకోవటానికి అవకాశముంటుంది.  తరచుగా ఈ నేరాలకు పాల్పడితే మాత్రం బెయిల్ లభించదు. గరిష్టంగా ఐదేళ్ళ వరకు జెలు శిక్ష పడుతుంది.బహిరంగ ప్రదేశాల్లో స్త్రీని వివస్త్రను చేయటాన్ని శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ వచ్చారు.   కాని బహిరంగ ప్రదేశం ప్రస్తావన దుర్వినియోగానికి గురవుతోందనే అభిప్రాయంతో తాజా బిల్లు ప్రకారం ఇంట్లోగానీ, రహస్య ప్రాంతంలో గానీ బలవంతంగా స్త్రీని వివస్త్రను చేస్తే శిక్షార్హ నేరంగా పరిగణించి ఈ నేరానికి పాల్పడిన వారికి ఏడేళ్ళ వరకు జైలుశిక్ష విధించవచ్చు.

ఎస్.పి. త్యాగిపై ఆంక్షలు ... సిబీఐ

  వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఎస్.పి.త్యాగి ఇటలీ సంస్థ అగస్తా వెస్ట్ ల్యాండ్ నుండి వివిఐపి హెలికాప్టర్ల కొనగోలు చేసేందుకు కుదుర్చుకున్న 3,600 కోట్ల రూపాయల ఒప్పందంలో ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఆయనతో సహా సహనిందుతులు భారతదేశం విడిచి వెళ్ళరాదని, ఒకవేళ వెళ్ళవలసివస్తే సిబీఐకి ముందుగా తెలియజేయాలని సిబీఐ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు వెళ్ళవచ్చా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. హెలికాప్టర్ల కొనగోళ్ళ కుంభకోణంలోని వారు దేశం విడిచి వెళ్ళకుండా లుక్ ఔట్ సిబీఐ జారీ చేసిందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆ వార్తలన్నీ ఊహాగానాలే తప్ప ఇప్పటివరకూ అటువంటి నోటీసులు ఏవీ జారీ చేయలేదని మీడియాకు తెలిపారు.

విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమిస్తున్న వామపక్షాలు

  విద్యుత్ సర్ ఛార్జీ నెపంతో ప్రజల నుండి రూ.33 వేల కోట్లకు వసూలుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వానికి వామపక్షాలు గట్టి షాక్ ఇవ్వబోతున్నాయి. వామపక్ష సిపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అధ్యక్షతన సోమవారం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష నేతలు బి.వి.రాఘవులు, గాదె దివాకర్ (న్యూ డెమోక్రసీ), వై.వెంకటేశ్వరరావు (సిపియం), కె. రామకృష్ణ (సిపీఐ), బండ సురేందర్ రెడ్డి, దయానంద్ (ఫార్వర్డ్ బ్లాక్), జానకిరాములు (ఆర్.ఎస్పీ), ఎండి గౌస్ (ఎంసిపిఐ-యు), మురహరి (ఎస్.యూ.సి.ఐ.) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యుత్ చార్జీల పెంపు, సర్ చార్జీ భారం, కరెంటు కోతలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టాలని, కేంగ్రేసేతర పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు బిజెపి సహా అన్ని విపక్షాల నేతలకు లేఖ రాయడంతో పాటు వారిని స్వయంగా కలవాలని తీర్మానించింది. విద్యుత్ చార్జీలపై విడివిడి పోరాటాలతో ప్రభుత్వాన్ని కదిలించలేరని, అందరూ కలిసి ఒకేరోజు ఉద్యమిస్తేనే ప్రభుత్వంలో కదలిక వస్తుందని వామపక్ష నేతలు తీర్మానించారు.

ములాయంకు టెర్రరిస్ట్ లతో సంబంధాలు ... బేణీ ప్రసాద్

  కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీప్రసాద్ వర్మ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. "ములాయం సింగ్ యాదవ్ కు టెర్రరిస్ట్ లతో సంబంధాలు ఉన్నాయని, తీవ్రవాదానికి మతం, రంగు లేదు, గోద్రా ఘటన అనంతరం చోటుచేసుకున్న అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేత అన్నీ తీవ్రవాద ఘటనలేనని, బాబ్రీ మసీదును కూల్చివేసిన కళ్యాన్ సింగ్ లాంటి వారితో ములాయం సింగ్ చేతులు కలిపారని, గుజరాత్ లో బిజెపి విజయం సాధించేందుకు ములాయం సింగ్ పార్టీ (సమాజ్ వాదీ పార్టీ) పరోక్షంగా తోడ్పందని'' సోమవారం పార్లమెంట్ లో అన్నారు. ఈ వ్యాఖ్యలతో సమాజ్ వాదీ పార్టీ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతూ బేణీ ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. కేంద్ర మంత్రివర్గంనుండి బేణీ ప్రసాద్ వర్మను వెంటనే తొలగించాలని పట్టుబట్టారు. బేణీ ప్రసాద్ క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు.

బ్రిటన్ హెచ్చరిక-భారత్ కు మరో చెంప దెబ్బ

  బ్రిటన్ హెచ్చరిక-భారత్ కు మరో చెంప దెబ్బ ఇంతవరకు వివిధ దేశాల ప్రభుత్వాలు భారత్ లో పర్యటిస్తున్న తమ పౌరులను ఉగ్రవాదుల దాడులను దృష్టిలో ఉంచుకొని రద్దీగా ఉండే ప్రాంతాలలో సంచరించ వద్దని హెచ్చరించడం విన్నాము. కానీ, ‘ఉగ్రవాదుల దాడిని అరికట్టడం మన చేతుల్లో లేదు’ అని మనకు మనం సర్ది చెప్పుకొని విదేశీ ప్రభుత్వాలు చేసిన హెచ్చరికలను మనకి అవమానకరంగా భావించక తేలికగా తుడిచేసుకోగలిగాము. కానీ, ఇప్పుడు బ్రిటన్ దేశ ప్రభుత్వం భారత్ లో పర్యటించే తన మహిళా పర్యాటకులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం మనకి చెంపపెట్టు వంటిదేనని చెప్పవచ్చును.   మొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్విట్జర్లాండ్ మహిళా పర్యాటకురాలిపై జరిగిన సామూహిక అత్యాచారంతో ఉలిక్కి పడిన బ్రిటన్ ప్రభుత్వం, భారత్ లో పర్యటించే తన మహిళా పర్యాటకులను బీచుల వద్ద, మారుమూల ప్రాంతాలలో ఒంటరిగా తిరుగవద్దని హెచ్చరికలు జారీ చేసింది. తగిన రక్షణ లేకుండా ఒంటరిగా తిరుగవద్దని, తమ భద్రతా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. ఇది, బ్రిటన్ దేశం తన పర్యాటకులకు చేస్తున్న ఒక హెచ్చరికగా పైకి కనిపిస్తున్నపటికీ, మన దేశంలో మహిళలపై నానాటికి పెరిగిపోతున్న అత్యాచారాలను అంతర్జాతీయ సమాజం కూడా నిశితంగా గమనిస్తోందని సూచిస్తోంది. ఈ హెచ్చరిక మన దేశానికి చెంప దెబ్బ వంటిదని గుర్తించవలసి ఉంది.   డిల్లీ సంఘట జరిగిన తరువాత దానిని నుండి మనం కొత్తగా నేర్చుకొన్న గుణపాఠం ఏమి లేకపోగా శృంగారానికి 16 ఏళ్ల వయసు ఆమోదకరమా లేక 18 ఏళ్ల వయసే అమోదకరమా? అంటూ మన కేంద్ర ప్రభుత్వం చర్చలలో మునిగిపోయుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్లిప్త వైఖరి అవలంబిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యుద్ధ ప్రాతిపదికన తగిన చర్యలు, ప్రణాళికలు తీసుకోవలసిన ప్రభుత్వాలు, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తాము చాల బాద్యతాయుతంగానే ఉన్నామని చెప్పుకోవడానికి ప్రజల ముందు ఏదో హడావుడి చేయడం, గంభీరమయిన ప్రకటనలు చేయడం తప్ప ఇటువంటి వాటిని శాశ్వితంగా నిరోధించడానికి చేపట్టవలసిన ప్రణాళికలు కానీ ఆలోచనలు కానీ చేయడం లేదు.   ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి మద్య ఉన్న సన్నటి గీత ఎప్పుడో చెరిగిపోయి నందున, ఇప్పుడు ప్రభుత్వాలు అంటే వాటిని నడిపిస్తున్న సదరు రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మానవీయ కోణంలో చూడకపోగా, తమ ప్రత్యర్ది పార్టీలు ఈ అంశాన్ని తీసుకొని తమను ఏవిధంగా ఇరుకున పెడతాయి, దానిని తాము సమర్ధంగా ఏవిధంగా ఎదుర్కోవాలి అనే ఆలోచిస్తు, ఇటువంటి సామాజిక రుగ్మతలను కూడా రాజకీయం చేస్తూ అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి.   రాష్ట్ర ప్రభుత్వాలే ఈవిధంగా ఉన్నపుడు వాటి కనుసన్నలలో నడిచే సదరు పోలీసు శాఖలు అంతకంటే గొప్పగా ఎలా ఆలోచించగలవు? నానాటికి పెరిగిపోతున్న అత్యాచారాలను కేవలం ‘కేసులుగా’నే పరిగణిస్తున్నారు పోలీసులు.   యధా రాజ తధా ప్రజా అన్నట్లు డిల్లీ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన ప్రజలు నేడు ఇటువంటి సంఘటనలు దేశంలో ఎన్ని జరుగుతున్నపటికీ స్పందించడం లేదు.   డిల్లీ సంఘటన తరువాత మన దేశంలో మాహిళలపై పెరుగుతున్న సామూహిక అత్యాచారాలను మన ప్రభుత్వాలు పట్టించుకోనందునే నేడు విదేశీ ప్రభుత్వాలు కూడా నేడు మనకి సుద్దులు చెప్పగలుగుతున్నాయి. ఇప్పటికయినా, మన ప్రజల, ప్రభుత్వాల, వ్యవస్థల ఆలోచనలో మార్పు వస్తుందో లేదో చూడాలి.

పురందేశ్వరికి పొగ పెడుతున్న టి.సుబ్బిరామిరెడ్డి

  ఇంకా సాధారణ ఎన్నికలకి ఒక సం. సమయం ఉండగానే, విశాఖలో రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామి రెడ్డికి, విశాఖ లోక్ సభ సభ్యురాలు మరియు కేంద్ర మంత్రి పురందేశ్వరికి మద్య విశాఖ లోక్ సభ స్థానం గురించి యుద్ధం మొదలయింది. తనకు గతంలోనే కేంద్రం మాట ఇచ్చింది గనుక వచ్చే ఎన్నికలలో విశాఖ నుండి తానేపోటీ చేయబోతున్నాని ప్రకటించుకోవడంతో బాటు, ఆమెను పక్కనున్న నర్సాపురం నుండో మరో నియోజక వర్గం నుండో పోటీ చేయమని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. పురందేశ్వరి కూడా తానూ విశాఖ నుండే పోటీ చేయాలనుకొంటున్నట్లు ప్రకటించడంతో ఇద్దరి మద్య యుద్ధం అనివార్యం అయింది.   ఈ నేపద్యంలో ఆయన అనుచరుడయిన భీమిలి శాసన సభ్యుడు మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖకు వచ్చినప్పుడు పురందేశ్వరి వల్ల జిల్లాలో పార్టీకి చాల నష్టం జరుగుతోందని పిర్యాదు కూడా చేసారు. సుబ్బిరామి రెడ్డి వెనుకుండి ఈ కధ అంతా నడిపించారని మీడియాలో ఊహాగానాలున్నాయి.   ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆయన సోదరుడు బొత్స లక్ష్మణరావు వచ్చే ఎన్నికలలో భీమిలి నుండి శాసన సభకు పోటీ చేయాలనీ కోరుకొంటున్నందున త్వరలో ఆయన భీమిలి సమీపంలో గల ఆనందపురం అనే ప్రాంతానికి తరలి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.   భీమిలికి ప్రస్తుతం ప్రాతినిద్యం వహిస్తున్న అవంతి శ్రీనివాస్ ను అక్కడి నుండి తప్పించే ప్రయత్నంలో బొత్సకు బావగారయిన శంకర్ రావు తన మద్దతు దారులుతో కలిసి మొన్న ఆనందపురంలో ఒక సభ ఏర్పాటు చేసి భీమిలి శాసన సభ్యుడు అవంతి శ్రీనివాస్ చేస్తున్న బ్లాక్ మెయిలింగు రాజకీయాల వలన పార్టీకి స్థానికంగా చాలా నష్టం కలుగుతోందని, ఆయనను వెంటనే తప్పించడం చాల అవసరం అని అన్నారు. అంతే కాకుండా భీమిలి మాజీ శాసన సభ్యుడు కర్రి సీతారంను వేదిక మీదకు తీసుకువచ్చి, వచ్చే ఎన్నికలలో ఆయనకు పురందేశ్వరి మద్దతు తెలుపాలని కూడా అయన కోరారు. ప్రస్తుతం కర్రి సీతారాంను తమ డమ్మీ అభ్యర్ధిగా అడ్డం పెట్టుకొని అవంతి శ్రీనివాస్ తో బొత్స సోదరులు యుద్ధం మొదలు పెట్టినప్పటికీ, పార్టీ టికెట్లు ఇచ్చే సమయానికి ఆయనను పక్కకు తప్పించి బొత్స సత్యనారాయణ తన సోదరుడికే టికెట్ ఇప్పించుకొంటారనేది అందరూ ఊహిస్తున్నదే.     అందువల్ల, ఆయన వర్గం ప్రస్తుతం సుబ్బిరామి రెడ్డి వర్గానికి చెందిన అవంతి శ్రీనివాస్ ను డ్డీ కొనే ప్రయత్నంలో పురందేశ్వరికి చేరువకావడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగానే, ఆమెను ఇటీవల భీమిలి పరిధిలోకి వచ్చే ఆనందపురం సభకు ఆహ్వానించినపటికీ, అవంతి శ్రీనివాస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు.   అయితే, ఆమె విశాఖ నుండి మళ్ళీ పార్లమెంటుకు పోటీ చేయాలనుకొంటే పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అండదండలు కోరుకోవడంలో అసహజమేమి లేదు. అందుకు ప్రతిగా, ఆయన సోదరుడికి ఆమె తన మద్దతు తెలుపడం కూడా తప్పక పోవచ్చును. అప్పుడు కేంద్రంలో మంచి పలుకుబడి కల సుబ్బిరామి రెడ్డి కూడా తనకు, తన అనుచరుడయిన అవంతి శ్రీనివాస్ కు అనుకూలంగా పావులు కదపవచ్చును.

ఉన్నవాటికి విద్యుత్ ఇవ్వలేరు కానీ...

            తాను దూరకంత లేదు తన మెడకో డోలన్నట్లు, విద్యుత్ సంక్షోభం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోఅనేక పరిశ్రమలు మూతబడుతుంటే, మళ్ళీ నిన్న కొత్తగా రెండు పరిశ్రమలు రాష్ట్రంలో స్థాపించబోతున్నందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాల సంతోషం వ్యక్తం చేసారు. ఆయన స్వస్థలమయిన చిత్తూరు జిల్లాలో ఒకటి, భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతారెడ్డి స్వంత జిల్లా మెదక్ లో జహీరాబాద్ వద్ద మరొక పరిశ్రమ స్థాపనకు రంగం సిద్ధం అయింది. రెండు పరిశ్రమలు కూడా వాహన తయారీ రంగానికి చెందినవే కావడం మరో విశేషం.   చిత్తూరు జిల్లాలో పీలేరువద్ద ‘ఇసుజి’ తన వాహన తయారీ సంస్థను స్థాపించడానికి ముందుకు రాగా, దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా’ తన ట్రాక్టర్ల తయారీ సంస్థను జహీరాబాదు వద్ద స్థాపించేందుకు సిద్ధం అవుతోంది. గత రెండు సం.లలో కొత్తగా వస్తున్న పెద్ద పరిశ్రమలు ఈ రెండు మాత్రమే. అయితే, ఉన్నవాటికి విద్యుత్ సరఫరా చేయలేక చేతులెత్తేసిన మన రాష్ట్ర ప్రభుత్వం, పూర్తిగా విద్యుత్ మీదనే ఆధారపడి పనిచేసే ఈ రెండు భారీ పరిశ్రమలకు ఏవిధంగా విద్యుత్ సరఫరా చేస్తారో వివరించలేదు.   వాహన తయారీ సంస్థలు తమ వాహన విడిభాగాల ఉత్పత్తికి ప్రధానంగా వాటికి అనుబంధంగా ఏర్పడే చిన్న పరిశ్రమలు, వర్క్ షాపులపైన ఆధారపడి ఉంటాయి. అవికూడా పూర్తిగా విద్యుత్ మీద ఆధారపడి పనిచేసేవేనని ప్రత్యేకంగా చెప్పకరలేదు. గత నాలుగు సంలలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చిన్న పెద్దా పరిశ్రమలు పవర్ హాలీడేస్ మరియు సరయిన విద్యుత్ సరఫరా లేని కారణంగా దివాలా స్థితికి చేరుకొంటున్నాయి. ఇక చిన్నచిన్న వర్క్ షాపులు అనుబంధ పరిశ్రమల సంగతి అంతకంటే దారుణంగా ఉంది. విద్యుత్ కోతలతో తీవ్ర నష్టలపలవుతున్న చిన్న పరిశ్రమలు, విద్యుత సరఫరా సరిగ్గా ఉన్నా లేకపోయినా కూడా భారీగా వస్తున్నా విద్యుత్ బిల్లులతో కుదేలవుతున్నారు.   పెద్ద పరిశ్రమలపై ఆధారపడిపనిచేసే ఆ చిన్న సంస్థలు, విద్యుత్ సమస్య వల్ల ఆర్డర్లు తీసుకోవడానికి వెనుకంజ వేస్తుంటే, మరో వైపు సకాలంలో ఆర్డర్లు పూర్తి చేయని కారణంగా వాటిని పెద్ద పరిశ్రమలు బ్లాక్ లిస్టులో పెట్టక తప్పట్లేదు. ఇక, కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకోనేవారు, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తరలిపోతుంటే, ఉన్న పరిశ్రమలు మెల్ల మెల్లగా తమ ఉత్పత్తి కార్యక్రమాలు తగ్గించుకొంటూ అంతిమంగా మూసేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇక, ఇటువంటి సమయంలో మరి ఈ రెండు భారీ పరిశ్రమలు ఏ భరోసాతో మన రాష్ట్రంలో అడుగుపెట్టాయో వాటికి విద్యుత్ ఏవిధంగా అందిస్తారో ఎవరికీ తెలియదు.

రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ ముఖ్యంశాలు

      రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టింది. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రూ. 25,962 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రణాళిక వ్యయం రూ.17,694 కోట్లు, ప్రణాళేకతర వ్యయం రూ.8,267 గా ఉంది. వ్యవసాయ రుణ లక్ష్యం రూ.75,450 కోట్లుగా మంత్రి కన్నా వివరించారు. ప్రకృతి వైపరిత్యాలలో నష్ట పరిహారం కింద రూ.589 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మద్దతు లభించని సమయంలో రైతులకు సాయం కోసం రూ.100 కోట్లతో ఆలంబన నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు : - విద్యుత్ రాయితీ కోసం - రూ.3,621 కోట్లు - షుగర్ ఫ్యాక్టరీ - రూ.52.05 కోట్లు - ఫుడ్ ప్రాసెసింగ్ - రూ.120 కోట్లు - వడ్డీలేని పంట రుణాలకు రైతుశ్రీ పథకం పురుతో రూ. 500 కోట్లు - వ్యవసాయ యంత్రీకరణ - రూ.450 కోట్లు - పట్టు పరిశ్రమలకు - రూ.79.20 కోట్లు - రాష్ట్రంలో కొత్తగా ఆరు రైతు బజార్ల ఏర్పాటు - మత్స్యశాఖ - రూ.184.35 కోట్లు - ఆహార ధాన్యాల నిల్వలకు - రూ.39 కోట్లు - విత్తనాభివృద్ధి - రూ.308 కోట్లు - భూసార అభివృద్ధి నిర్వహణకు - రూ.2309 కోట్లు - అటవీశాఖ - రూ.492 కోట్లు - పశుసంవర ్థక శాఖ - రూ.924 కోట్లు - సోలార్ పంపు సెట్లకు - రూ.150 కోట్లు - వర్షాధారిత వ్యవసాయాభివృద్ధికి - రూ.2903 కోట్లు - గోదాముల నిర్వహణకు - రూ.42 కోట్లు - రైతులకు 50 శతం సబ్సీడీ విత్తనాలు

రూ.1,61,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్

      శాసనసభలో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి రూ.1,61,348 కోట్లతో సోమవారం ఉదయం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అగ్రాసనం వేస్తుందన్నారు. వ్యవసాయం రంగంలో ఆరు శాతం వృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. ఉగాది నుంచి పేదలకు రేషన్ కార్డు ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని, దాని కోసం రూ.660 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్‌లో మెరుగైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.   బడ్జెట్‌లోని అంశాలు : - హోంశాఖ - రూ.5,386 కోట్లు - ఐటీ - రూ.207 కోట్లు - పరిశ్రమలు, వాణిజ్యం - రూ.1,120 కోట్లు - సాగునీరు - రూ.13,800 కోట్లు - ఇంధనం - రూ.7,117 కోట్లు - మౌలిక సదుపాయాల కల్పనకు - రూ. 180 కోట్లు - పర్యావరణం, అడవులు, శాస్త్రసాంకేతిక రంగానికి - రూ.551 కోట్లు - పాఠశాల విద్య - రూ.16990 కోట్లు - ఉన్నత విద్య - రూ.4082 కోట్లు - వైద్య, ఆరోగ్య శాఖ - రూ.1,738 కోట్లు - కార్మిక శాఖ - రూ.562 కోట్లు - పట్టణాభివృది - రూ.6770 కోట్లు - ఎన్ఆర్ఈజీఎస్ - రూ.11200 కోట్లు - పౌరసరఫరా - రూ.3231 కోట్లు - గృహనిర్మాణం - రూ. 2326 కోట్లు - సాంస్కృతిక రంగం - రూ.69 కోట్లు - పర్యాటక రంగం - రూ. 163 కోట్లు - యువజన సేవలకు - రూ.280 కోట్లు - వికలాంగులకు - రూ.73 కోట్లు - మహిళా శిశు సంక్షేమానికి - రూ.1027 కోట్లు - బీసీ సంక్షేమానికి - రూ.4027 కోట్లు - ఎస్సీ సంక్షేమానికి - రూ.4,122 కోట్లు - గిరిజన సంక్షేమానికి - రూ.2,126 కోట్లు - వ్యవసాయానికి - రూ.6,28 కోట్లు - మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.1,980 కోట్లు - కృష్ణా జలాల తరలింపునకు రూ.1,676 కోట్లు - కొత్తగా 18 రెవెన్యూన్యూ డివిజన్లు, 52 అర్బన్ మండలాలు - 2 కలెక్టరేట్‌లు, 144 తహశీల్దార్ భవనాలు నిర్మిస్తాం - రెవెన్యూ అధికారుల శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటు - ఈ ఏడాది 27,903 కొత్త ఉద్యోగాలు - తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రికి 100 పడకల పెంపు - నెల్లూరులో 150 పడకలతో ఆస్పత్రి - వికలాంగులకు వివాహం చేసుకుంటు 50 వేలతో ప్రోత్సాహం - 2291 సబ్ఇన్‌స్పెక్టర్లు, 736 కానిస్టేబుళ్ల నియామానికి త్వరలో నోటిఫికేషన్ - నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్ల నిర్మాణం - వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ.262 కోట్లు - తిరుపతి, జహీరాబాద్‌లలో హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్ - రాజీవ్ యువ కిరణాలు ద్వారా 2014-15 నాటికి 15 లక్షల మందికి ఉపాధి - గ్రామీణ, నగర ప్రాంతాల్లో అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్

        శాసనసభ సజావుగా సాగేందుకు సహకరించని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చెప్పినా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినకపోవడంతో వారిని ప్రభుత్వం ఒకరోజు పాటు సస్పెండ్‌ చేసింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అయితే తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా సీపీఐ, బీజేపీ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈనెల 21న తలపెట్టిన సడక్ బంద్కు అనుమతి ఇవ్వాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు ఉదయం హోంమంత్రిని కోరారు.

ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాన్ని బహిష్కరిస్తున్నాం

        'బాద్ షా' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మరణించిన వరంగల్ కు చెందిన అభిమానికి సంతాపం ప్రకటించకపోవడంపై సినీనటి, ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయశాంతి మాట్లాడుతూ…బాద్‌షా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో తెలంగాణ బిడ్డ మరణించినా సంతాపం తెలపకుండా ఆడియో ఫంక్షన్‌ నిర్వహించడం సీమాంధ్ర అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బాద్‌షా సినిమాను బహిష్కరిస్తున్నామన్నారు. కాగా బాద్‌షా ఆడియో రిలీజ్‌ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రాజు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ దర్శకావతారం

        కామెడీ ప్రపంచానికే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ 'తొక్కలో ప్రేమ' అనే సినిమా తో దర్శకా వతారంలో మన ముందుకు రాబోతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని కొత్త ప్రొడక్షన్ హౌస్ మన ముందుకు తీసుక రాబోతుంది. ప్రస్తుతం తెలుగువన్.కాం క్రియేటీవ్ హెడ్ గా ఆయన చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు యెందరో ప్రముఖుల ప్రశంసలు పొందాయి.   తెలుగు కార్టూన్ ప్రపంచంలో మల్లిక్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు! ఇంకా చెప్పాలంటే మల్లిక్ ని మించినవారు లేరని చెప్పవచ్చు. మల్లిక్ గారు సృష్టించిన చిట్టి, టింగు తెలియనివారంటూ ఉండరు. ఒకానొక సమయంలో ప్రముఖ దిన,వార మాస పత్రికలు కేవలం మల్లిక్ కార్టూన్లు చదవడానికే కొనేవారన్నది అక్షరసత్యం. ఐదు వందలకు పైగా కధలు వివిధ పత్రికలకు వ్రాసారు. అలాగే యెన్నో ధారావాహికాలు కూడా ప్రచురింపబడ్డాయి. "పరుగో పరుగు”, "జీవితమే ఒక ఢమాల్" కధలు సినిమాలుగా తీయబడి జనాదరణను పొందాయి. అలాగే "మని", సిసింద్రీ" చిత్రాలకు పబ్లిసిటీ డిసైనర్ గా ఛాయాచిత్రాలను అందించారు. ఆల్ ఇండియా రేడియో వారికి ముఫైకి పైగా నాటికలు వ్రాసారు. అందులో "ఇంపోర్టెడ్ కెమేరా" రేడియో శ్రోతకు బాగా తెలిసిందే! ఇంకా యెన్నో టీ.వి ధారావాహికాలకు కధను అందించారు.