అవినీతి నాయకుడు లేక సమర్ధవంతమైన నేత

        టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు 'నారా లోకేష్' చిత్తూరు జిల్లాలోని కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడారు. “ఒకరు అసమర్ధ నాయకుడు, మరొకరు అవినీతి నాయకుడు, వారిని ఎంపిక చేసుకుంటారా?లేక సమర్ధవంతమైన నేతను ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సుధీర్ఘ పాదయాత్ర చేస్తూ ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్నారని, అధికారం కోల్పోయి పదేళ్లు అవుతున్నా తెలుగుదేశం పార్టీ అభివృద్దిని నినాదంగా చెబుతుందని అన్నారు. గత మూడేళ్లలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు కోట్లు వెచ్చించి చేపట్టామని అన్నారు. అప్పుడప్పుడు చిత్తూరు జిల్లాకు వచ్చి కార్యకర్తలతో భేటీ అవుతున్న నారా లోకేష్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది.

శ్రీలక్ష్మి విచారణ: కేంద్రం మరో అస్త్రం..?

  కేంద్రం ఈ రోజు ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్ కు అనుమతి మంజూరు చేయడంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి హయంలో ఒక వెలుగు వెలిగి చక్రం తిప్పిన రాజకీయ నాయకులలో, ప్రభుత్వ అధికారులలో మళ్ళీ కలవరం మొదలయింది. గనుల శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన శ్రీలక్ష్మి ఓబులాపురం మైనింగ్ కంపెనీకి ఉదారంగా గనుల త్రవ్వకాలకి అనుమతులు మంజూరు చేసినందున ఆమె జైలు పాలయ్యారు.   ఆమె కొద్ది నెలల క్రితం బెయిలు కోసం దరఖాస్తు చేసుకొన్నపుడు, తానూ కేవలం ప్రభుత్వాదేశాలను తూచా తప్పకుండా అమలు జేసానే తప్ప, తనంతట తానుగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని, గాలి జనార్ధన్ రెడ్డి సంస్థలకి గనుల త్రవ్వకాలకి అనుమతులు జారీ చేయాలని పైనుండి వచ్చిన ఆదేశాలను ప్రభుత్వాదికారిగా అమలుచేయడం వల్లనే నేడు తనకీ దుస్థితి కలిగిందని ఆమె కోర్టులో విలపించారు కూడా. అయితే, కోర్టులు వ్యక్తుల భావోద్వేగాలను కాక సాక్ష్యాలనే ప్రామాణికంగా తీసుకొంటాయి గనుక ఆమె నిస్సహాయతను అర్ధం చేసుకొన్నపటికీ, ఆమెపై కేసు మాత్రం కొనసాగించాయి.   వైయస్. రాజశేఖర్ రెడ్డి సూచనలు లేదా సలహాల మేరకు శ్రీలక్ష్మి వ్యవహరించినందున ఆమెకు ఓబులాపురం గనుల అక్రమ త్రవ్వకాలలో గాలి జనార్ధన్ రెడ్డి కాకుండా ఇంకా లబ్ది పొందినవారి వివరాలు కూడా సహజంగానే తెలిసి ఉంటాయి, గనుకనే ఆమెను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరుతోంది. కేంద్రం ఈ రోజు అందుకు అనుమతించడంతో నేడో రేపో సీబీఐ ఆమెకు సమన్లు జారీ చేయవచ్చును. ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటపడుతుందా లేదా? అనే విషయాన్నీ పక్కన పెడితే, విచారణలో ఆమె ఇంకా ఎవరిరెవరి పేర్లు బయటపెడతారోనని ఈ గనుల కుంభకోణంలో ‘తీర్ధ ప్రసాదాలు’ స్వీకరించిన వారందరూ ఇప్పుడు బెంగ పెట్టుకొన్నారు.   ఈ వ్యవహారం యావత్తు దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి హయంలోనే జరిగింది గనుక, తొలుత కాంగ్రెస్ పార్టీలో పెద్దలు, ఆతరువాత వైయస్ కుటుంబ సభ్యుల పేర్లు బయటపడే అవకాశం ఉంది.   ఓబులాపురం కేసు కధ ఇంకా కోర్టుల్లో నలుగుతున్నందున దోషుల పేర్ల పట్టిక ఇంకా బయటపడనప్పటికీ, కేంద్రం గనుల అక్రమార్కుల పేర్లు తెలుసుకోలేనంత అమయుకురాలు కాదు. అందువల్ల కేంద్రం శ్రీలక్ష్మిని విచారించేందుకు కాకతాళీయంగా అనుమతినిచ్చినట్లు పైకి కనిపిస్తున్నపటికీ, ఇంకా లోతయిన కారణాలతోనే అనుమతినిచ్చి ఉండవచ్చును. తెలంగాణా అంశం మరియు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే పార్టీలో, విపక్షంలో తనను ఇబ్బందిపెడుతున్న కొందరు రాజకీయ నాయకులను, ప్రభుత్వాధికారులను దారికి తెచ్చుకొనే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ‘శ్రీలక్ష్మిని విచారించేందుకు తగిన సమయంగా’ భావించి ఈ విధంగా ‘తగిన నిర్ణయం’ తీసుకొని ఉండవచ్చును.   బహుశః కేంద్రం అమ్ములపొదిలో ఇటువంటి అస్త్రాలు చాలానే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. రానున్న రోజుల్లో శ్రీలక్ష్మి బయట పెట్టే వ్యక్తుల పేర్లను బట్టి కేంద్రం ఎవరిమీదకి ఈ బాణం ప్రయోగించిందో అర్ధం అవుతుంది.

ఏ భార్య పై ప్రమాణం చేస్తావు?: రేవంత్

        మొదటి భార్యను మోసం చేసి రెండో భార్యను చేసుకున్నావు. ఇప్పుడు అక్రమాల ఆరోపణలు వస్తే బైబిల్ మీద, భార్యాపిల్లల మీద ప్రమాణం చేస్తా అని అంటున్నావు. మరి ఏ భార్యా బిడ్డల మీద ప్రమాణం చేస్తావు. మొదటి భార్య, పిల్లల మీదా ? రెండో భార్యా పిల్లల మీదా” అని వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ను టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.   బ్రదర్ అనిల్ కుమార్ చేసే ప్రమాణాల మీద నమ్మకం లేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిగానీ అక్రమాలు చేయలేదని షర్మిల, భారతి, విజయమ్మ, అనిల్ లు బైబిల్ మీద ప్రమాణం చేస్తారా ? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్, బ్రదర్ అనిల్ కుమార్ లు అబద్దాలు చెప్పడం మాని నిజాలు వెల్లడిస్తే వారికి కొంత శిక్ష అయినా తగ్గుతుందని అన్నారు. రాజకీయాలు, మత ప్రచారంతో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, మత ప్రచారమా, రాజకీయాలా ? ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని సూచించారు.

నందమూరివారికి పార్టీని అప్పగించితేనే బెటర్!

  ‘తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబ సభ్యులు నాయకత్వం వహిస్తేనే మేలు!’ జరుగుతుందని ఒక పెద్దాయన అభిప్రాయ పడ్డారు. కాకపొతే ఆ మాటన్నది వయా ప్రజారాజ్యం-కాంగ్రెస్ పార్టీలో చేరి దేవాదాయశాఖ తీర్ధం పుచ్చుకొన్నసి.రామచంద్రయ్య కావడమే విశేషం.   ఇటీవల ఆయన వైజాగ్ వచ్చినప్పుడు మీడియావారితో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు రోజుకొక కొత్త వాగ్దానం చేస్తూ ఎలాగయినా ప్రజలను మభ్యపెట్టి తిరిగి అధికారంలోనికి రావాలని పాపం ఆయన ఆశ పడుతున్నారు. అయితే, ఆయన కల కలగానే మిగిలిపోక తప్పదు. నిజంగా ఆయన తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకొంటే, పార్టీ బాధ్యతలను నందమూరి కుటుంబ సభ్యులెవరికయినా అప్పగించి తానూ పార్టీ నుండి తప్పుకొంటే ఆ పార్టీకి గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఆయన ఇప్పుడు చేస్తున్న వాగ్దానాలతో పాటు మరో ప్రకటన కూడా చేయడం మంచిది. అది ‘త్వరలో తెలుగు దేశం పార్టీ చచ్చిపోబోతోందని’ ప్రకటించడం. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ అధికారంలోకి రాదని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.   తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, “అసలు ఆ పార్టీ నేతలు తమ పార్టీ అధికారం లోకి రాగలదని ఎలా విశ్వసిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకపక్క వారి అధినేత అక్రమాలకూ పాల్పడి జైల్లో ఉన్నపటికీ, ప్రజలు అవేమి పట్టించుకోకుండా ఆయన పార్టీకే ఓటేస్తారని ఎలా నమ్ముతున్నారు? ప్రజలకి ఆయన అక్రమార్జనల గురించి ఏమీ తెలియదని భావిస్తున్నారా లేక వాటిని పట్టించుకోరని భావిస్తున్నారా? వారే చెప్పాలి.”   “వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించడం ఖాయం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల ప్రయోజనాలను కాపాడగలదు. దేశాన్ని ముందుకు నడిపించగల శక్తి గలది,” అని తెలిపారు.   రామచంద్రయ్య గారు ప్రస్తుతం కాంగ్రెస్ గొడుగు క్రింద సేద తీరుతున్నారు గనుక, కాంగ్రెస్ పార్టీకి ‘టముకు’ వేసుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ప్రతిపక్ష పార్టీ ఎవరిని అధినేతగా పెట్టుకొవాలో ఆయన చెప్పడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గౌరవం లేదని నిత్యం వాపోయే ఆయన, ముందు తన సంగతి గురించి ఆలోచించక ప్రతిపక్ష నేతల గురించి,వారి పార్టీల గురించి ఆలోచించి ఎందుకు శ్రమ పడుతున్నారో ఆయనకే తెలియాలి.   ప్రజారాజ్యం పార్టీ గత ఎన్నికల సమయంలో దాదాపు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నపుడు ఆపార్టీకి చెందిన ప్రభాకర్, హరిరామ జోగయ్యవంటి అనేక మంది సీనియర్లు చిరంజీవికి తగిన సలహా ఇచ్చేందుకు ప్రయత్నించినప్పుడు, రామచంద్రయ్య గారు మాత్రం తన టికెట్టు, గెలుపు సంగతే చూసుకొన్నారు. తత్ఫలితంగా చిరంజీవికి మంచి చెప్పినవారు బయటకిపోవలసి వచ్చింది. రామచంద్రయ్యవంటివారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపేందుకు మాత్రం చాలా శ్రమ పడినందుకు మంత్రి పదవులు పుచ్చుకోగలిగారు.   స్వంత పార్టీ అధినేతకు కనీసం మాట సహాయం కూడా చేయని ఆ పెద్దమనిషి ఇప్పుడు ప్రతిపక్షం గురించి అడగకుండా ఉచిత సలహాలు ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఆయనకు టికెట్ ఈయకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉంటారని హామీ ఈయగలారా?అని తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లు అడగితే ఆయన ఏమి సమాధానం చెపుతారు?

వాయలార్ దోశపై కేసిఆర్ నిప్పులు

        ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేతలు తెలంగాణ గురించి తమకు తోచిన పదజాలంతో మాట్లాడుతుంటే…ఇన్ని రోజులూ మౌనంగా ఉండిన టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇకపై తెలంగాణ గురించి దోశ, వడ అంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించాడు. ఇలాంటి మాటలు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఆజాద్‌, వయలార్‌ రవిలపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. వారి మాట తీరును తప్పుపడుతూ… తెలంగాణను దోశ, వడ అంటూ కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునేదిలేదని ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ మహిళా ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. యధావిధిగా ఆర్టీసీ రిక్రూట్‌మెంట్‌లోనూ తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని కేసీఆర్ ఆందోళనవ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పారు.

'బాబ్లీ' కథ వెనక రాజకీయ గాథ!

- డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]         "రెండు రాష్ట్రాల మధ్య స్థానిక పరిస్థితులనుబట్టి పరస్పరం స్వార్థాలు బలిసి ఉంటాయి కాబట్టి, నదీజల పరివాహక ప్రాంతాల పరిథిలో ఉన్న రాష్ట్రాల హక్కులకు సంబంధించిన చట్టాలు తగాదాల పరిష్కారానికి తోడ్పడవు. హక్కుల్ని సమానతా సూత్రం ఆధారంగా మాత్రమే నీటిపంపిణీకి సంబంధించిన తగాదాలు పరిష్కారం కావాలి. తగాదాలో ఉన్న రాష్ట్రాలు దేనికదే తన రాష్ట్రంలోని రెండు ప్రాంతాలమధ్యనే నీటి తగాదా వస్తే తానేం చేస్తుందో ఆలోచించుకొని, ఆ సూత్రాన్నే రెండు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కూడా వర్తింపచేసుకోవాలి''!      - జస్టీస్ బట్లర్ (1930): అమెరికాలోని మసాచూసెట్స్ X కనేట్ కట్ రాష్ట్రాల మధ్య జలపంపిణీ వివాదంలో యిచ్చిన తీర్పు."నీటి తగాదాలు న్యాయస్థానాల తీర్పులతో సంతృప్తికరంగా పరిష్కారం కాజాలవు''                     - బర్బర్ (1959): అంతర్జాతీయ జలతగాదాల చరిత్ర''   దొంగలుపడిన ఆరునెలలకు 'అవేవో' తెగ మొరగడం మొదలెట్టాయట! నదీజలాల పంపిణీ విషయంలో ఇరుగుపొరుగుతో సమస్యలను పరిష్కరించుకోవటంలో అంతూపొంతూ లేని తాత్సారానికి అలవాటుపడిన ఆంధ్రప్రదేశ్ పాలనావ్యవస్థల తంతు కూడా అలాగే రూపుదిద్దుకుంటూ వచ్చింది. ఎడారిభూముల్ని సహితం సస్యశ్యామలం చేసుకుంటున్న ఈ ఆధునిక కాలంలో కూడా ఇరుగుపొరుగు రాష్ట్రాలమధ్య నదీజలాల పంపిణీకి సంబంధించిన వివాదాలు పరిష్కారం కాకుండా ఏళ్ళువూళ్ళో గడిచిపోవటానికి ప్రధాన కారణం - పాలకపక్షాల మధ్య, పాలనా యంత్రాంగానికి దూరంగా ఉండే ప్రతిపక్షాల నాయకుల మధ్య పరస్పరం రాజకీయ ఎకవాక్యత కొరవడడమూ, జాతీయ దృక్పథం లేకపోతే మానె, కనీసం రాష్ట్ర రైతాంగ, సేద్యపునీటి అవసరాల పట్ల శ్రద్ధ లేకపోవటమూ! ఈలోగా, అవే కారణాలపైన ప్రాంతీయ తగాదాలు ముదురిపోవటమూ; ఈ తగాదాలకు దోహదం చేస్తున్న కారణాలలో రాష్ట్రాలమధ్య జలవివాదాలు ఒక భాగం కాగా, ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాలమధ్య జలపంపిణీ తాలూకు తగాదాలు ఎంతకూ ఒక కొలిక్కి రాకపోవటం మరో భాగం! ఈ లంపటంలో అంతర్భాగంగా ఇటీవల కాలంలో కొత్తగా తెలెత్తిన వివాదం మహారాష్ట్ర-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తెలంగాణా ప్రాంతపు భూములకు సేద్యపునీటిని అందించవలసిన గోదావరిపైన మహారాష్ట్ర చడీచప్పుడు కాకుండా నిర్మించుకున్న బాబ్లీ ప్రాజెక్టు. తెలుగు 'సన్నాసులు' ప్రాంతీయ తగాదాల్లో 'మునగానాం-తీలానాం'గా ఉన్న సమయాన్ని కనిపెట్టి తెలివితో తేకువతో మహారాష్ట్ర పాలకులు అక్కడి రాజకీయ పక్షాలూ తెలుగువాడిని ఎక్కడ దెబ్బతీయాలో అక్కడనే తెలుగుజనాలకు జీవనాధారమైన నీటి అవసరాల మీదనే దెబ్బతీశారు! ప్రజాబాహుళ్యపు మౌలిక సమస్యలయిన తిండి, బట్ట, ఉపాథి, వసతి అవసరాలను ఈడేర్చడంపైన కేంద్రీకరించకుండా పనికిమాలిన పక్కదారులలోకి రాజకీయ నిరుద్యోగులు మళ్ళిపోవడంవల్లనే తెలంగాణాకు చెందిన అయిదారు జిల్లాలేగాక [ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు] కోస్తాంధ్రలోని గోదావరిజిల్లాలు కూడా సాగునీటి, మంచినీటి ఎద్దడిని ఎదుర్కోవలసి వస్తుంది! మహారాష్ట్ర నిర్మించిన ఈ బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణస్థలం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ లోని శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు ఉన్న బ్యాక్ వాటర్ స్థలంలోనే ఉంది. శ్రీరాంసాగర్ గోదావరి నదిపైన మనం కట్టుకున్న తొలి సాగునీటి ప్రాజెక్టు. శ్రీరాంసాగర్ నిర్మాణ సమయంలో ఈ బ్యాక్ వాటర్ ఉన్న భూమిని మనం డబ్బిచ్చి కొనుకున్నదేగాని ఎవడూ ఉచితంగా దానం చేసిందికాదు! అయినా, "చూస్తూ ఉంటే మేస్తూ పోయిందన్న'' సామెతలా, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాడుకోవలసిన నీటి కేటాయింపు పరిథిని అధిగమించి మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని శ్రీరాంసాగర్ పరిథిలోని బ్యాక్ వాటర్ స్థలంలో తలపెట్టింది! అయినా మన రాజకీయ నిరుద్యోగులకూ పాలకులకూ ఇది పట్టలేదు. ఇది రెండు రాష్ట్రాలమధ్య సమస్యకు దారితీసింది. అసలు అటు కృష్ణా జలాల పంపిణీకి చెందిన బచావత్ ట్రిబ్యునల్ గాని, ఇటు గోదావరి జలాల నిర్థారణకు సంబంధించిన ట్రిబ్యునల్ గానీ ఆంధ్రప్రదేశ్-కర్నాటక, ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలమధ్య జలసమస్యలను తమ ఓపాన శక్తికొలదీ పరిష్కరించడానికి ప్రయత్నించాయి. కాని వచ్చిన చిక్కు అంతా అటు పాలకపక్షాలుగానీ, ఇటు ప్రతిపక్షాలుగానీ పరస్పరం రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా జలసమస్యల్ని పట్టించుకోకుండా చూస్తూ వచ్చాయేగాని రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పరిశీలించకపోవడం వల్లనే వచ్చిపడింది. రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లో సాగునీటి ప్రాజెక్టులపై తీసుకున్న పాటి శ్రద్ధను తరువాత వచ్చిన పాలకపక్షాలు [ఒక్క ఎన్టీఆర్, వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాలనలలో మినహాయించి] చూపలేదు! పైగా కృష్ణాజలాల విషయంలో కర్నాటక, గోదావరి జలాల వినియోగం విషయంలో మహారాష్ట్ర పాలకులు తమ రాష్ట్రాల ప్రయోజనాలను రక్షించుకున్నంతగా మన రాష్ట్రపాలకులూ, ప్రతిపక్షాలూ శ్రద్ధ వహించకుండా ఎంతసేపూ పనికిమాలిన స్పర్థలతోనే కాలక్షేపం చేస్తూ వచ్చారు. 'సందట్లో సడేమియా' అన్నట్టు, కాగల కార్యాన్ని కాస్తా ఆల్మట్టి విషయంలో కర్నాటక, 'బాబ్లీ' విషయంలో మహారాష్ట్ర పాలకులు "గంధర్వులై'' గుట్టుచప్పుడు కాకుండా నెరవేర్చేశారు!   ఆంధ్రప్రదేశ్-మహారాస్ష్ట్రలమధ్య కుదిరిన 1955 నాటి ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణాన్ని తలపెట్టినప్పటికీ గోదావరి జలాల ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 60 శతకోటి ఘనపుటడుగుల నీటిని తన ప్రాజెక్టులకు వాడుకునే హక్కు మహారాష్ట్రకు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు జలాశాయంలోనే రహస్యంగా మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు నిర్మించడం తీవ్రమైన ఉల్లంఘన. ఈ ఉల్లంఘనకు కేంద్రప్రభుత్వ జలవనరుల సంఘం కూడా అభ్యంతరం చెప్పింది; తీరా చేతులు కాలిన తరువాత ఆంధ్రప్రదేశ్ పాలకులు గుడ్లు అప్పగించి చూస్తుండిపోవటమేగాక, ప్రాంతీయ తగాదాల్లో మునిగిపోయిన రాజకీయ నిరుద్యోగ నాయకులూ ఇటీవల కాలంలోనే ఇందుకు కారకులు.   మహారాష్ట్ర పూర్తి చేసుకున్న 12 బాబ్లీగేట్ల నిర్మాణాన్ని, నేను సలహాదారుగా పనిచేసిన ఓకే దినపత్రిక సీనియర్ పాత్రికేయులయిన ఎం.ఎస్.సి.హెచ్. బాబ్జీ రహస్యంగా మారువేషాల్లో వెళ్ళి బాబ్లీ కథ ముగిసిన వైనాన్ని సాధికారికంగా ఫోటోలతోసహా అయిదారు రోజులపాటు వార్తాకథనాన్ని రాష్ట్రప్రజలకు వెల్లడించేదాకా తగాదాల్లో ఉన్న తెలంగాణాప్రాంత నాయకులు ఒక్కరూ నోరెత్తకపోవటం మరో విశేషం! ఈ విషయంలో మిగతా రాష్ట్ర రాజకీయ నాయకులూ "నిమ్మకునోరెత్తినట్టే'' కూర్చున్నారు! అంతకుముందే విషయం తెలిసిన ఆనాటి "తెలుగుదేశం'' ప్రభుత్వం ఏమీ ఎరగనట్టే బయటకు పొక్కనివ్వలేదు. తరువాత విషయాన్ని గ్రహించిన వై.ఎస్.ప్రభుత్వం సుప్రీంకోర్టు జోక్యాన్ని అర్థించింది. ఆ పిమ్మట సుప్రీంకోర్టు తాత్కాలిక 'స్టే'ద్వారా బాబ్లీ నిర్మాణపనుల్ని వివాదం తేలేవరకూ తాత్కాలికంగా ఆపుచేయించింది. కాని ఫిబ్రవరి (2013)లో సుప్రీమ్ ఉభయపక్షాల వాదనలను విన్న తరువాత బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్రకు గోదావరి జలాల్లో నిర్ణయించిన 60 శతకోటి ఘనపుటడుగుల నీటిని ఆ రాష్ట్రం వాడుకోడానికి గల హక్కును గుర్తిస్తూనే మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక షరతు విధించి, ఆ షరతు అమలు జరిగేట్టు చూసే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి సహా ముగ్గురు ఉన్నతస్థాయి సభ్యులతో కూడిన పర్యవేక్షక సంఘానికి అప్పగించింది. దీని ప్రకారం బాబ్లీ బరాజ్ నిర్వహణ తీరును ఈ సాధికార సంఘం పరిశీలిస్తూ 60టి.ఎం.సి. నీటి కేటాయింపులో బరాజ్ వద్ద నీటినిల్వ (కెపాసిటీ) సామర్థ్యాన్ని 2.74 టి.ఎం.సి.కి ఎట్టిపరిస్థితుల్లోనూ మించకుండా చూడాలని సుప్రీమ్ ఆదేశించింది. అయితే, శ్రీరాంసాగర్ జలాశయం భూభాగంలో అక్రమంగా నిర్మించిన బాబ్లీ కట్టడాన్ని తొలగించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినతిని మన్నించకపోవడం విచారకరం. అందుకే రెండు రాష్ట్రాలమధ్య నదీజల పంపిణీ వివాదాలను సామరస్యంతో ఆయా ప్రభుత్వాలను నిర్వహించే పాలకులు పరిష్కరించుకోవాలి గాని కోర్టులు పరిష్కరించజాలవు.   ఇందుకు ఉదాహరణలు - ఆల్మట్టి నిర్మాణం విషయంలో (కృష్ణా జలాల పంపిణీ)  బరాజ్ ఎత్తును ఆంధ్రప్రదేశ్ కోరికమేరకు నిర్దిష్టు పరిమితికి మించి పెంచరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని కర్నాటకలోని హెగ్డే, దేవెగౌడ ప్రభుత్వాలు, బాబ్లీ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వమూ తుంగలో తొక్కాయి. అసలు ఈ తొక్కిసలాటకంతకూ ప్రధాన కారణం - నదీజలాల వినియోగం విషయంలో పాలకులకు జాతీయ దృక్పధంకన్నా సంకుచితమైన వైఖరీ, ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలమధ్య దామాషాన పంపిణీ కావలసిన ఉమ్మడి జలరాశి విషయంలో ఎవరికీ వారికి ఉమ్మడి రాష్ట్రప్రయోజనాల పట్ల సమగ్రమైన దృక్పధం బొత్తిగా కొరవడటమూ! రాజకీయ నిరుద్యోగులు ప్రజలపేరిట ప్రజలపైన తమ స్వార్థంకొద్దీ ఉద్యమాలవల్ల మొత్తం రాష్ట్రప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. బాబ్లీ విషయంలో దాదాపుగా అందరూ దొంగలే, నంగనాచులే, కొంగజపాలరాయుళ్ళే! మనకు ధర్మరాజులకన్నా శకునులు ఎక్కువైపోయారు! మన రాష్ట్ర చిత్రపటం ఇలా తగలడబట్టే ఏనాడో, దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికే, ఆ తరవాతి దశలో కూడా దశాబ్దాలక్రితం శొంఠి రామమూర్తి యావదాంధ్రుల (తెలుగువారి)కోసం రూపకల్పన చేసిన రామపాదసాగర్ ప్రాజెక్టు ఈ రోజుకీ పోలవరం ప్రాజెక్టుగా పూర్తిగా ప్రాణం పోసుకోలేకపోతుంది! కొంతమంది తెలివితక్కువ ప్రాంతీయవాదులు పోలవరాన్ని తెలుగుప్రాజెక్టుగా భావించుకోలేక పోతున్నారు; కృష్ణా, గోదావరులు సేద్యపునీరుగా, తాగునీరుగా యావత్తు తెలుగుప్రజల అనుభవంలోకి రావలసిన బృహత్ నిర్మాణాన్ని జలరాశిగా భావించుకొనక పోవడంవల్లనే ఎటా లక్షలాది క్యూసెక్కుల నీరు శిశువుకు దక్కని తల్లిపాలలా సముద్రం పాలవుతున్నా రాజకీయ స్వార్థం బలిసిపోయి కించిత్తు బాధను కూడా వ్యక్తం చేయలేకపోతున్నారు! ఇలా బలిసిపోయిన నిరాసక్త ధోరణి వల్లనే తెలంగాణాలోని రాజోలిబండకు సహితం ఉపయోగపడగల కృష్ణనీటికి గండికొట్టేందుకు కర్నాటక పన్నిన కుట్రలో భాగంగా తుంగభద్ర నోర్డును (ఇది ఆంధ్రప్రదేశ్-కర్ణాటకల సంయుక్త మండలి) కర్నాటక ప్రభుత్వం ఏకపక్షంగా నర్మగర్భంగా రద్దు చేయబోయినప్పుడు కూడా నేటి వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు సహా రాష్ట్రనాయకులెవరూ నోళ్ళు విప్పలేక పోయారు! అప్పుడు కూడా నేను ఒక ప్రముఖ దినపత్రికకు సంపాదకునిగా ఉన్నప్పుడు విశ్వేశ్వర్రావు (అనంతపురం)లాంటి సీనియర్ పాత్రికేయ మిత్రులద్వారా మొదటిసారిగా పెద్దస్థాయిలో ఆ కుట్రను బహిర్గతం చేస్తూ వార్తా కధలు ప్రచురించాల్సి వచ్చింది' అలాగే ఇటీవల కాలంలోనూ మరొక పత్రికద్వారా పాత్రికేయ మిత్రులను రహస్యంగా బాబ్లీకి పంపించి మొట్టమొదటిసారిగా తిరుగులేని దృశ్యమాలికల ద్వారా "బాబ్లీ కథకు తెరదించిన మాయల మరాఠీ'' అన్న మకుటంతో [19-06-2010 నుంచి 26-07-2010 దాకా] ప్రముఖంగా ఏడు వార్తాకథనాలు ప్రచురించాల్సి వచ్చింది. అంతవరకూ సాగుతున్న తంతును ఆ వార్తలో యిలా నమోదు చేయవలసివచ్చింది: "రాష్ట్రం తెలంగాణా ఉద్యమ ఆందోళనలు, అల్లర్లతో అట్టుడికిపోతున్న సమయంలో మహారాష్ట్ర గుట్టుచప్పుడు కాకుండా తనపనిని పూర్తీచేసుకుని మనల్ని 'వెవ్వెవ్వ' అంటూ వెక్కిరించింది. మహారాష్ట్ర నిర్వాకంతో ఒక్క తెలంగాణా మాత్రమే కాకుండా అన్నపూర్ణగా పిలుచుకునే ఉభయగోదావరి జిల్లాలు సహా గోదావరిజలాలపైన ఆధారపడిన జనావాసాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని పారిశ్రామిక వాడలూ తీవ్ర సంకటస్థితిని ఎదుర్కోనున్నాయి. మహారాష్ట్రకు దిగువన గోదావరినదిపై ఉన్న నీటిప్రాజెక్టులకు ఇక ఇసుకతిన్నెలే గతి. అక్కడ పూర్తయింది బాబ్లీ ప్రాజెక్టు కాదు, నేలకూలిన తెలుగుప్రజల ఆత్మగౌరవం ... అన్ని రాజకీయపార్టీలూ దీన్ని జలరాజకీయం చేసి ప్రయోజనం పొందాయే తప్ప ఈ దారుణాన్ని ఆపలేకపోయాయి, నిర్మాణాన్ని నిలపలేకపోయాయి'' అంతేగాదు, పాత్రికేయుడు బాబ్జీ ఈ బాబ్లీ గాథను వెలికితీయడానికి పడినశ్రమనూ, ఎదుర్కొన్న కష్టాలను కూడా ఆ నివేదికలోనే ఇలా వెల్లడించం : "సుప్రీంకోర్టు చెప్పనున్న తీర్పుతో ఇక ఇప్పుడు కొత్తగా ఒరిగేదేమీ కనిపించడం లేదు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించిన ఈ ప్రత్యేక ప్రతినిధికి కళ్ళు తిరిగే దృశ్యాలు కనిపించాయి. ఇప్పటివరకూ రెండు కిలోమీటర్ల దూరం నుంచే ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ వ్యక్తి అయినా ఫోటోలు తీయగలిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క పురుగును కూడా అనుమతించని మరాఠా పోలీసులు ప్రాజెక్టు కాంట్రాక్టర్ గూండాలు, 'బాబ్లీ పరిరక్షణ సమితి' కళ్ళు కప్పి ఎన్నో వ్యయప్రయాసల కోర్చాల్సివచ్చింది. అక్కడకు చేరుకున్న తర్వాత, ప్రారంభోత్సవానికి పెళ్ళికూతురులా ముస్తాబయి కూర్చున్న బాబ్లీ ప్రాజెక్టు దర్శనమిచ్చింది. ఈ ప్రాజెక్టును చేరుకోడానికి అడుగడుగునా సోదాలు, గూండాల నిలవరింతలు, గ్రామస్తుల నిలదీతలు ఈ ప్రత్యేక ప్రతినిధికి లభించాయి. ఒక దశలో ఈ ప్రతినిధి ప్రాణాలకు కూడా తెగించాల్సి వచ్చింది. స్థానికంగా పరిచయమైనా ఇద్దరు మరాఠీ మిత్రులతో కలిసి తెలుగు మాట్లాడకుండా జాగ్రత్తపడుతూ బాబ్లీని చేరుకోవాల్సి వచ్చింది. బోధన నుంచి సాలూర,మహారాష్ట్రలోని బిలాని నుంచి అర్జాపూర్ మీదుగా షేర్ గావ్, కొండల్ వాడికి చేరుకున్నాం. అక్కడినుంచి గ్రామస్తులతో కలసి వారి వేషభాషలతోనే బాబ్లీ ప్రాజెక్టుకు కాలినడకన చేరాల్సివచ్చింది ... 2.70 టి.ఎం.సి.ల నీటి సామర్థ్యాన్ని మించేలా గేట్లు గనుక దించితే మరికొన్ని వందల టి.ఎం.సి.ల నీరు నిల్వ అయ్యేలా వేలాది ఎకరాల భూమిని సిద్ధం చేశారు. ముంపునకు గురి అయ్యే గ్రామాలను తరలించేశారు. నిర్మాణం పూర్తికావడంతో నిర్మాణ సామాగ్రి యంత్రాలు, వాహనాలను తరలించేశారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలమైనా, ప్రతికూలమైనా తమ ప్రయత్నం సఫలమయిందని కోర్టుతీర్పు ఏవిధంగా వచ్చినా ఫర్వాలేదనీ బాబ్లీ పరిరక్షణ సమితి సభ్యుడొకరు చెప్పారు. నిర్మాణం ఆగిపోయిందనే భ్రమలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది తిరుగులేని షాక్. సింగూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయరు హైదరాబాద్ మంచినీటి సరఫరాకు అంకితమైంది. కాగా బాబ్లీ నిర్మాణంతో శ్రీరాంసాగర్ ఎడారికానుంది. ఇక రాష్ట్రంలో రూ.200 కోట్ల వ్యయంతో అత్యంత ఆర్భాటంతో ఆరంభించిన ఆలీసాగర్ ఎత్తపోతల పథకం నీరు రాక వెక్కిరిస్తోంది. జలయజ్ఞానికే తలమానికంగా భావించిన ఈ ఎత్తిపోతల పధకాన్ని బాబ్లీ పూర్తిగా కబళించివేసింది'' [19 జూన్ 2010]! ఇలా పాలకపక్షాలలో, ప్రతిపక్షాల్లో ఉన్న స్వార్థపర రాజకీయ నిరుద్యోగుల మూలంగా రాష్ట్ర సేద్యపు నీటి ప్రాజెక్టులు ఎన్నింటినో నిర్మించుకోలేక రైతాంగమూ, సాధారణ ప్రజాబాహుళ్యమూ ఎంతగానో ఇన్నేళ్ళుగా నష్టపోతూ వచ్చారు. నేటి బాబ్లీ విషయంలో మాదిరే మిగతా ప్రాజెక్టుల విషయంలో కూడా పాలక, ప్రతిపక్షాలలోని రాజకీయ నిరుద్యోగుల మధ్య ఎకవాక్యత లేకపోవడంవల్ల పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మరింత చులకనైపోయాం! దానికితోడు కృష్ణ, గోదావరి నదుల్లో పారే జలరాశిలో నిక్కచ్చిగా ఆధారపడదగిన (డిపెండబిలిటీ) మొత్తాన్ని అంచనా వేయడంలో లోపం ఉందని భ్రమకు లోనుకారాదనీ డాక్టర్ కె.ఎల్,రావు లాంటి సుప్రసిద్ధ ఇంజనీర్లు కూడా అభిప్రాయపడుతూ వచ్చారు. అలాగే, ప్రాజెక్టులు తలపెట్టడంలో జాప్యంవల్ల కొన్నాళ్ళు, తలపెట్టిన తర్వాత ప్రారంభంకాక కొన్నాళ్ళు, ప్రారంభించిన తర్వాత సకాలంలో నిర్మాణం పూర్తికానందువల్ల తడిసిమోపెడైన ఖర్చులవాళ్ళ కొన్నాళ్ళు గడిచిపోవడం వల్ల కూడా రాష్ట్రంలో ప్రాంతాల మధ్య తగాదాలు తలెత్తడమూ జరిగింది. అలాగే నదులలో "అదనపు జలరాశి'' అన్నది ఒక మిథ్యగా తయారవడం వల్ల, ఆ ''మిథ్య'' ఆధారంగా ట్రిబ్యునళ్ళు రాష్ట్రాల మధ్య జలపంపిణీని నిర్ణయించడం వల్ల కూడా ఆచరణలో సమస్యలు తలెత్తుతూ వచ్చాయని మరచిపోరాదు. అలాగే కేంద్ర వాటర్ కమీషన్ చీఫ్ ఇంజనీరు, తుంగభద్ర బోర్డు చైర్మన్ గా పనిచేసిన గాడ్ బోలే అంచనా ప్రకారం "మన దేశంలో దాదాపు ఏ ప్రాజెక్టు కిందా మనం ఇసుకమేటలు సకాలంలో తొలగించిన పాపాన పోలేదు''! అందుకే ఈ రోజుకీ అటు ఉత్తరాంధ్రలోని వంశధార రెండవ దశగానీ, ఇటు తెలంగాణాలోని శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు రెండవదశగానీ పరిపూర్తి కాకపోవడానికి కారణం ప్రాంతాలమధ్య వివక్షవల్ల కాదు, పాలనావ్యవస్థల ముందుచూపులేని విధానాలవాళ్ళ మాత్రమే! అందుకే మూడుప్రాంతాలలోని చిన్నవీ, మధ్యరకం, భారీ నీటిపథకాలు నిర్మాణం కోసం, ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నవీ ఎన్నో ఉన్నాయి. వేర్పాటు ఉద్యమాలే మౌలిక సమస్యలను పరిష్కరించజాలవు. సమస్యల మూలాలలోకి, పెట్టుబడీదారీ విధానాల తీరుతెన్నులలోకి వెళ్ళి పరిశీలించకుండా గావుకేకల వల్ల ప్రయోజనం శూన్యం! ఇది నేటి మాటే కాదు, హెచ్చరికగా రేపటి మాట కూడా. కులాసా కబుర్లనుంచీ, విలాసక్షేత్రాలనుంచీ (ఫామ్ హౌసెస్) నీరు పారదు, కనుకనే పాలనా విధానాల, ఉత్తుత్తి ఉద్యమాల తీరూమారదు!

టిడిపి శాసనసభాపక్షం భేటి

        ఈ నెల 13వ తేది నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించేందుకు తెలుగుదేశం శాసనసభాపక్షం ఈ రోజు సమావేశం కానుంది. కృష్ణా జిల్లాలో వస్తున్నా మీ కోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు అధ్యక్షతన కైకలూరు మార్గంలో దాకరంలో ఉదయం 11గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వస్తున్న౦దున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఈ సమావేశాలకు దూరంగా ఉంటున్న౦దున శాసనసభలో పార్టీ వైఖరి, అవిశ్వాసంపై పార్టీ విధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సభలో పార్టీని ముందుకు నడిపించే అంశంపై నిర్ణయం తీసుకున్నారు.

షర్మిల, చంద్రబాబులతో కేసీఆర్ పోటీ

  ఒకవైపు చంద్రబాబు, షర్మిల నిర్విరామంగా పాదయాత్రలు చేస్తూ స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వాగ్దానాలు చేసుకుపోతున్నారు. వారిద్దరిలో అధికారంలోకి వచ్చేదెవరో, వచ్చినప్పుడు చేసిన వాగ్దానాలను తీర్చేదెప్పుడో ఎవరికీ తెలియదు. గానీ, ఆకాశం నుండి జడివాన కురుస్తున్న తీరుగా ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీలుపడుతూ మరీ వాగ్దానాలు చేసేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.   ఇక, వీరిద్దరూ ‘వాగ్దానాల బాట’లో సాగిపోతుంటే, ‘తెలంగాణా బాట’లో సాగిపోతున్న కేసీఆర్ కూడా ఎక్కడ పదిమందిని ఉద్దేశించి ప్రసంగించినా ముందు ఆంధ్రోల్లను నాలుగు బూతులు లంకించుకొన్న తరువాత, ఎదురుగా ఉన్న జనాలను బట్టి వారికి తగిన వాగ్దానాలు చేసేస్తుంటారు. సభికులు ప్రభుత్వోద్యోగులయితే వారికి ఇంక్రిమెంటులు, ప్రమోషన్లూ, విద్యార్దులయితే ఉచిత విద్య, ముసలి వారయితే, పెన్షన్లు పెంపుదల, యస్సీ, ఎస్టీ, బీసీ లయితే, ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపుదలవంటివి ఉంటాయి.   ఆయన నిన్న హైదరాబాదులో ఆర్టీసీ మహిళా కాంట్రాక్టు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, కేసీఆర్ వారందరి ఉద్యోగాలు పర్మనంట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ పర్మనెంట్ చేయగా ఇంకా ఎవరయినా కాంట్రాక్టు ఉద్యోగులుగా మిగిలిపోతే వారందరికీ ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక, మహిళలకి (తెలంగాణా మహిళలకి) ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్ల అమలు చేస్తామని హామీ ఇచ్చారు.   ఈ ముగ్గురు నేతలు ప్రస్తుతం చేస్తున్న వాగ్దానాలను కనీసం మీడియావారయినా శ్రమ అనుకోకుండా రికార్డు చేసి భద్రపరిస్తే ఎవరు అధికారంలోకి వస్తే వారికి వారు చేసిన వాగ్దానాల లిస్టులు అందించి వాటిలో ఏమయినా అమలు చేయగలరేమోనని జ్ఞాపకం చేసే అవకాశం ఉంటుంది.

ఆయనకీ నిద్రలో కూడా అవే ఆలోచనలట!

  గత ఐదు నెలలుగా నిర్విరామంగా పాదయాత్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి నిద్రలోకూడా అవే ఆలోచనలని చెప్పారు. అంటే కాదు మెలుకువగా ఉన్నపుడు కూడా అవే ఆలోచనలుట! అపార్ధం చేసుకోవద్దు, ప్రజల సమస్యల గురించే ఆ ఆలోచనలుట.   మెలకువగా ఉన్న, నిద్రపోతున్నా ప్రజల సమస్యలే తన మెదడును ఆక్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. అందువల్ల ఈ సమస్యలన్నిటినీ ఒకేసారి పరిష్కరించి పడేసేందుకు అప్పుడే ఆయన  చాలా ప్రణాలికలు కూడా సిద్దం చేసుకోన్నానని ఇటీవల పాదాయత్రలో ప్రజలకు తెలిపారు. ఇక, ప్రజలు కూడా సిద్దమయితే వెంటనే అన్ని సమస్యలను తానూ చక చకా పరిష్కరించేయదలుచు కొన్నట్లు  చెప్పారు.   ఇదివరకు అధికారంలో ఉన్నపుడు ప్రజల మైండ్ సెట్ మారాలని చెపుతూ వచ్చిన చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత ఇప్పుడు తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఇప్పుడు తానూ మారిన మనిషినని ఆయన అన్నారు.   ఇక తన జీవితం సర్వస్వం ప్రజలకే అంకితం అని చెప్పారు. అసలు మన స్వంత బంధువులు, స్నేహితులే మన సమస్యలని పట్టించికోని ఈ రోజుల్లో మన మొహం కూడా ఎన్నడూ చూడని చంద్రబాబు ఈ విధంగా మన కోసం (?) పాపం రాత్రనకా, పగలనకా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక పాదయాత్రలు చేయడం, మన కోసమే ఆలోచించడం నిజంగా తెలుగు ప్రజల పూర్వ జన్మ సుకృతమేనేమో.

ప్రభువే కాపాడును నన్ను: అనిల్

  తనపై క్రమంగా ఉదృతమవుతున్న బీజేపీ దాడులకు బ్రదర్ అనిల్ కుమార్ మొట్టమొదటిసారి స్పందిస్తూ తానూ ఏపాపము చేయలేదని, తన స్నేహితుడికి చెందిన సంస్థలో ఎవరో వ్యక్తీ చనిపోయినా కూడా అది తనకే ముడిపెట్టి తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. మహాపురుషుడయిన రాజశేఖర్ రెడ్డి కుటుంబములో సభ్యుడినయినందుకు తానూ చాలా గర్వ పడుతున్నానని, తమ కుటుంబములో ఎవరూ కూడా తప్పులు చేయలేదని అన్నారు. దైవసేవలో నిమగ్నమయి ఉన్న తనపై ఈ విధంగా లేనిపోని అభాండాలు వేయడం చాలా అన్యాయమని, తనను ఆ ప్రభువే కాపాడుకొంటాడని అనిల్ అన్నారు.   కానీ, బీజేపీ మాత్రం బ్రదర్ అనిల్ కుమార్ కి వ్యతిరేఖంగా తన వద్ద ఖచ్చితమయిన ఆధారాలున్నాయని చెపుతోంది.   ఇక మరో వైపు బీజేపీ, బ్రదర్ అనిల్ యొక్క బినామి సంస్థగా ఆరోపిస్తున్న బెనిటా ఇండస్ట్రీస్ ఎండీ వీరభద్రారెడ్డి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసులు కూడా రంగంలో దిగి కడప, పెండ్లిమర్రి మైనింగ్ కార్యాలయాల్లో సోదాలు జరిపి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరభద్రారెడ్డి చేతిరాత ఫైళ్లను, ఆయన వివిధ సంస్థలతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా సేకరించి, ఆ సంస్థ అసలు యజమాని ఎవరో కనిపెట్టే పనిలోపడ్డారు.   వారు సేకరించిన ఫైళ్ళలో బ్రదర్ అనిల్ కు చెందినవిగా భావిస్తున్న రక్షణ స్టీల్స్, బయ్యారం గనులకు ఏమయినా లింకు దొరికినట్లయితే, అప్పుడు అనిల్ కుమార్ చెప్పినట్లు ఆయనను ఆ ప్రభువే కాపాడుకోవలసి ఉంటుంది.   అయితే, ఒకవేళ కీలక ఆధారాలు దొరికినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ దానిని అవసరమయిన సమయంలోనే ఒక అస్త్రంగా వాడుకొని తన ప్రభుత్వం కాపాడుకొనే ఆలోచన చేసినా ఆశ్చర్యంలేదు. లేకుంటే, వేరే సమయంలో దానినే ఒక బ్రహ్మాస్త్రంగా చేసుకొని జగన్ మోహన్ రెడ్డి పై ప్రయోగించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఏప్రిల్ నెలకోసం జగన్ ఎదురుచూపులు

  అక్రమాస్తులకేసులో అరెస్ట్ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్. జగన్ మోహన్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడివలె బెయిలు కోసం అనేక సార్లు ప్రయత్నించినపటికీ, సీబీఐ ఎప్పటికప్పుడు సైంధవుడిలా అడ్డుపడుతుండటంతో, తొమ్మిది నెలలు గడిచినా ఆయనకీ ఇంతవరకు బెయిలు భాగ్యం దొరకలేదు. అయితే, పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి షర్మిల గత కొన్ని రోజులుగా త్వరలో అన్న బయటకి వచ్చేస్తున్నాడంటూ కొంచెం నమ్మకంగానే చెపుతున్నారు.   జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి బయటకి రావడానికి మరెంతో కాలం పట్టదని ఆయన పార్టీ నేతలు కూడా చాల గట్టిగానే చెపుతున్నారు. అయితే, వారు అంత ధృడంగా విస్వసించడానికిగల కారణాలు ఏమిటంటే, గతంలో జగన్ మోహన్ రెడ్డి బెయిలు కోసం సుప్రీం కోర్టులో పిటిషను వేసినప్పుడు, రాష్ట్ర కోర్టుల్లో తేల్చుకోవలసిన అంశాన్ని తన వద్దకు తీసుకురావద్దని హెచ్చరిస్తూనే, ఒకవేళ సీబీఐ గనుక ఇప్పట్లో విచారణ పూర్తిచేయలేదని తాము భావించినట్లయితే అప్పుడు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని జగన్ మోహన్ రెడ్డి లాయర్లకు హామీ ఇచ్చింది. అంతే గాకుండా, సీబీఐను త్వరగా విచారణ పూర్తిచేయడం మంచిదని హెచ్చరించింది. అదే సమయంలో మార్చి నెలలోగా విచారణ పూర్తిచేయడానికి ప్రయత్నించామని సీబీఐ ను కోరింది.   ఇటీవల సిబీఐ నాంపల్లి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి ప్రయత్నించినప్పుడు, బహుశః అదే కారణంతో జగన్ లాయర్లు తీవ్రంగా వ్యతిరేఖించి ఉంటారు. వచ్చేనెలలోగా సిబీఐ విచారణ ఎలాగు పూర్తిచేయలేదు కనుక, ఇప్పుడు దానిని అభియోగాపత్రం నమోదు చేయనిచ్చినట్లయితే, అప్పుడు బెయిలు కోరెందుకు సమస్యలు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతోనే వారు సిబీఐను అడ్డుకొని ఉండవచ్చును. బహుశః వారు జగన్ మోహన్ రెడ్డికి తప్పనిసరిగా ఏప్రిల్ నెలలో బెయిలు వస్తుందని భరోసా ఈయడం వల్లనే, షర్మిలతో సహా ఆ పార్టీ నేతలందరూ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలు నుండి విడుదల అవుతాడని నమ్మకంగా ప్రజలకి చెపుతున్నారనుకోవచ్చును.   అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా ఏప్రిల్ నెల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ సారి కూడా బెయిలు దొరకకపోతే జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర నిరాశ తప్పదు. తత్ఫలితంగా, ఆయన ఆగ్రహావేశాలకి సహజంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే బలయిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గనుక బెయిలుపై విడుదల అయినట్లయితే, జగన్ మోహన్ రెడ్డి కొంచెం సర్ధుకొనే వరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మరి కొద్ది రోజులు అవకాశం దక్కే అవకాశం ఉంటుంది.

భువనగిరి థియేటర్ లో బాంబు ...?

భువనగిరిలోని భద్రాది థియేటర్ లో మార్నింగ్ షో సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారు సినిమా టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళుతుండగా గేటు దగ్గర సిబ్బంది వారిని ఆపి వారి చేతిలోని బ్యాగ్ చూపించావలసిందిగా కోరారు. కానీ ఆ నలుగురూ బ్యాగ్ తెరవకుండానే వెనుతిరిగి పోతుండగా సిబ్బందికి అనుమానం వేసి వారిని నిలదీసి బ్యాగ్  చూపించాలని పట్టుబట్టారు. దీంతో ఆ నలుగురు వ్యక్తులు పరుగుప్రారంభించడంతో థియేటర్ కి వచ్చిన వారు పట్టుకోవాలని ప్రయత్నించారు. ముగ్గురు వ్యక్తులు పారిపోగా ఒకతన్ని పట్టుకుని భువనగిరి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. డి.ఎస్.పి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో సి.ఐ. మధుసూదనరెడ్డి విచారణ ప్రారంభించారు. విచారణ తరువాత డి.ఎస్.పి. మాట్లాడుతూ వారు తీవ్రవాదులు కారని మహారాష్ట్రలోని షోలాపూర్ కి చెందినవారని, వారు చిల్లర దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు. మిగిలిన ముగ్గురి గురించి పట్టుబడ్డ వ్యక్తి ద్వారా వివరాలు సేకరిన్స్తామని చెప్పారు.

నాగమన్నా అట్టా ఆగం సేయకే

  ఇటీవల మీడియాలో తెరాస మరియు తెలంగాణా జేయేసిలకు వ్యతిరేఖంగా మళ్ళీ మరోసారి నిప్పులు కక్కిన నాగం జనార్ధన్ రెడ్డిని మంచి చేసుకొనే ప్రయత్నంలో పడ్డారు తెరాస నేతలు. నిన్నగాక మొన్న ఉద్యమంలోకి వచ్చి, తెరాసలో చేరిపోయి వెన్వెంటనే తెలంగాణా జేయేసి కూడా స్థానం సంపాందించడమే గాకుండా మొన్న శాసన మండలి సభ్యుడిగా కూడా పదోన్నతి పొందిన స్వామీ గౌడ్, నాగం ఆగం ఎందుకో గ్రహించలేకపోలేదు.   అందుకే , ఇటీవల టీఎన్‌జీవోభవన్‌లో నిర్వహించిన జేఏసీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన నాగం జనార్ధన్ రెడ్డిని ‘పదవీత్యాగం చేసిన మహానేత, తెలంగాణా ఉద్యమంలో కీలక వ్యక్తీ’ అంటూ తెగ పొగిడేశారు. నాగం తెలంగాణా జేయేసిలో సభ్యుడు కాకపోయినా, తాము ఆయనని జేయేసీలో అంతర్భాగంగానే చూస్తున్నామని అందుకే ఆయన చేపట్టిన భరోసా యాత్రకు మద్దతు తెలిపామని అన్నారు. ఇకపై జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు నాగమన్నను తప్పక ఆహ్వానిస్తామని అన్నారు. ఒకవైపు కేసీఆర్, ప్రొఫసర్ కోదండరామ్ తనను తెలంగాణా జేయేసిలోకి రాకుండా అడ్డుకొంటున్నారని మీడియా ముందు బాహాటంగానే చెపుతున్న నాగం జనార్ధన్ ప్రచారం వల్ల తనకీ, తెరాసా పార్టీకి, తెలంగాణా జేయేసికి కూడా కొత్త సమస్యలు ఎదురవుతాయనే భయంతోనే స్వామీ గౌడ్ ఆయనను మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.   అయితే, తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన కేసీఆర్, ప్రొఫసర్ కోదండరామ్ ల అభీష్టానికి వ్యతిరేఖంగా స్వామీగౌడ్ నాగం జనార్ధన్ రెడ్డిని జేయేసిలోకి ఆహ్వానించడం సాధ్యం కాకపోవచ్చును. ఒకవేళ, నాగం అందుకు సిద్దపడినా ఇప్పటికీ ఆయనని అనుమానంగా చూస్తున్న కేసీఆర్ అంగీకరించకపోవచ్చును. తత్ఫలితంగా, నాగం ముందే చెపుతున్నట్లు స్వయంగా కొత్త రాజకీయ పార్టీని స్తాపించడమో లేక బీజేపీలో చేరడమో జరగవచ్చును. అప్పుడు తెరాసకు నాగం జనార్ధన్ రెడ్డి నుంచి మరిన్నికొత్త సవాళ్ళు ఎదురయే అవకాశం ఉంది.

ఢిల్లీలో రేప్ కు గురైన నిర్భయకు అమెరికా అవార్డ్

  ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయకు  అమెరికా ఇచ్చే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సాహస మహిళా అవార్డు ప్రకటించింది . లైంగిక దాడులను ఎదురోడ్డేవారికి స్ఫూర్తినిచ్చేందుకు మరణానంతరం ఆమెకు ఈ అవార్డు ఇస్తున్నట్లు అమెరికా ప్రథమ మహాల మిషెల్లీ ఒబామా, విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఒక ప్రకటనలో ప్రకటించారు. ఈ అవార్డును జ్యోతిసింగ్ పాండే కుటుంబ సభ్యులకు ఫిబ్రవరి 8న నిర్వహించే అంతర్జాతీయ  మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందజేయనున్నారు. ఈ అవార్డును అమెరికా ప్రభుత్వం 2007న ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 10 మంది మహిళలకు అందజేస్తారు. ఈ అవార్డును ప్రకటించడంతో జ్యోతిసింగ్ పాండే కుటుంబసభ్యులు తమ హర్షాన్ని ప్రకటించారు.

జంటనగరాలకు మరో పేలుడు ముప్పు

దిల్ షుక్ నగర్ ప్రేల్లుళ్ళు మరవక ముందే బుధవారం ఉదయం కేంద్ర నిఘావర్గాల నుంచి మరోసారి హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తుంది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో జంటనగరాల పోలీస్ వ్యవస్థ అప్రమత్తతై నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తిన్చ్నినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు. ఇంటర్మీడియ పరీక్షలు జరుగుతున్నా సమయంలోనే కేంద్ర నిఘావర్గాల నుండి హెచ్చరికలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసు వర్గాలు నగరంలో హై అలర్ట్ ప్రకటించి తనీఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

విద్యుత్ సంక్షోభంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా

  ఈ రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ కోతలకు, పెరిగిన కరెంటు చార్జీలకు నిరసనగా మహాధర్నా కార్యక్రమం చేప్పటింది. ఆ పార్టీ గౌరవాద్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల ఇద్దరూ ఈ మహా ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.   విజయమ్మ ప్రసంగిస్తూ “నేటి విద్యుత్ సంక్షోభానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడుకి కూడా అంతే బాధ్యతా ఉంది. ఇద్దరూ కూడా విద్యుత్ సంక్షోభాన్ని నివారించగలిగే అవకాశం ఉన్నపటికీ, ఒకరు ఆలోచనా రహితంగా, నిర్లక్ష్యంతో, మరొకరు స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారకులయ్యారు. రాష్ట్రంలో తగినంత విద్యుత్ ఉత్పాదన లేదని తెలిసి, అందుకు అవసరమయిన ఏర్పాట్లు చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారు. తన హయాంలో ఎన్నడూ ఉచిత విద్యుత్ గురించి మాట్లాడని చంద్రబాబు నేడు ఊరూరు తిరుగుతూ ఉచిత విద్యుత్ ఇస్తానని భూటకపు వాగ్దానాలు చేస్తున్నాడు. ఆయన తన హయంలో కొన్ని మినీ విద్యుత్ ప్రాజెక్టులను నిబందనలకు విరుద్ధంగా ఎంవీఎస్ మూర్తి లాంటి తన వారికి కట్టబెట్టారు. మరణించిన నా భర్తను నిత్యం ఆడిపోసుకొనే చంద్రబాబు తన హయంలో జరిగిన ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్దమేనా? నాడు రాజశేఖర్ రెడ్డి గారి హయం లో లేని విద్యుత్ సంక్షోభం నేడు ఎందుకు ఏర్పడింది? ప్రభుత్వాల అసమర్ధత వల్లనే కదా? మరి అటువంటప్పుడు మీరు చేసిన తప్పులకు ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారు?” అంటూ ఆమె ప్రశ్నించారు.

రాహుల్ పెళ్ళి చేసుకుంటారా..!

        కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీకి పెళ్ళి కబురు కోసం కాంగ్రెస్ నేతలే కాకుండా, దేశంలో ప్రజలు ఆశక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయనను కలిసిన లోక్ సభ సభ్యులు పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. అయితే “నేనా పెళ్లి చేసుకుంటాను గానీ..ఇప్పట్లో పెళ్లి చేసుకోను” అని రాహుల్ సెలవిచ్చారు. అంతే కాకుండా నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని అన్నారు. వారసత్వం పరంగానే 2014లో రాహుల్ ను దేశ ప్రధాని చేయాలని తల్లి సోనియాగాంధీ ఆశపడుతుంటే, ఆయన మాత్రం దీనికి వ్యతిరేకం అంటున్నారు. ఇప్పటికే 42 ఏళ్లు నిండిన రాహుల్ ఇక ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా,లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో ఎవరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడని, ప్రేమలో పడ్డాడని వార్తలు వచ్చాయి. అలాంటిది ఇప్పట్లో పెళ్ళి లేదనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.