సడక్ బంద్ కు సన్నాహాలు

  ఈ నెల 21న టి.ఆర్.ఎస్. టి.జెఎసి తలపెట్టిన సడక్ బంద్ కు సన్నాహాలు చేస్తుంది. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిర్వహించియన సడక్ బంద్ సన్నాహక సమావేశాలో టి.ఆర్.ఏ.స్. నేత హరీశ్ రావు మాట్లాడుతూ "ప్రభుత్వం సడక్ బంద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని,ఉదయం ఆరు గంటలనుండి సాయంత్రం ఐదు గంటలవరకు రోడ్డుమీద చీమకూడా కదలకుండా సడక్ బంద్ చేసి జయప్రదం చేయాలని,  ప్రజలకోసం చేపడుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోకూడద''ని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ స్వామీ గౌడ్ మాట్లాడుతూ అమరవీరుల సాక్షిగా తెలంగాణా సాధనకోసం చేపట్టిన ఈ కార్యక్రమం విఅజయవంతం చేయడం కోసం  కృషి చేయాలని టి.ఆర్.ఎస్., టి.ఆర్.ఏ.సీ.వీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అవాంతరాలు, ఎన్ని నిర్భంధాలు పెట్టినా సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, ఈ సడక్ బంద్ కార్యక్రమానికి సుమారు ఇరవై ఐదు వేలమంది కార్యకర్తలను తరలించాలని పిలుపునిచ్చారు.  టి.ఆర్.ఎస్. సీనియర్ నాయకుడు నాయిని నరసింహ ప్రసంగిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలను అరికట్టడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం తెలంగాణా రాష్ట్ర సాధనకోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తనడైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

టి.డి.పి. కి మరో ఝలక్ ...

  టి.డి.పి. నుండి వలసలు ఆగడం లేదు. తాజాగా 30 ఏళ్ళుగా టి.డి.పి.లో పలు కీలక పదవులు చేపట్టిన మహబూబ్ నగర్ సీనియర్ నేత పొడపాటి చంద్రశేఖర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టి.ఆర్.ఎస్. లో జాయినయ్యే యోచనలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంనుంచి పార్టీలో కొనసాగుతున్న చంద్రశేఖర్ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లభించకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2009లో ఎన్నికల పొత్తులో భాగంగా మహబూబ్ నగర్ స్థానాన్ని టి.ఆర్.ఎస్.కు కేటాయించడంతో ఆయన రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రశేఖర్ రాజీనామా విషయం తెలుసుకున్న టి.డి.పి. జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు చంద్రశేఖర్ తో భేటీ అయ్యి రాజీనామాపై పునరాలోచించుకోవాలని కోరినా చంద్రశేఖర్ రాజీనామాపై వెనక్కి తగ్గే సమస్యే లేదని తెగేసి చెప్పారు. ఈనెల 21న టి.ఆర్.ఎస్. తెలంగాణా జెఎసి తలపెట్టిన సడక్ బంద్ లో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్ టిడిపి చచ్చిపోయింది

        ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీడీపీ నిర్ణయంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని ఆయన అన్నారు. అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షం మద్ధతు ఇవ్వడమన్నది ప్రపంచంలో ఇదే ప్రథమం అని కేసీఆర్ తెలిపారు. అసలు అవిశ్వాసాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడపీ ప్రవేశ పెడుతుందనుకున్నమని, కానీ అలా చేయకపోవడంతో తమతో అయినా కలిసి వస్తుందని అవిశ్వాసం పెట్టామని కేసీఆర్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో ఏప్రిలో మొదటి వారంలోగా తేలిపోతదని కేసీఆర్ అన్నారు. ఇక అవిశ్వాసంపై ఓటు వేయకపోవడం అన్నది ఎంఐఎం నేతల విజ్ఞతకే వదిలివేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

బెజవాడ పదం దమ్ము విజయవాడలో లేదు: ఎన్టీఆర్

        ఎన్ని జన్మలెత్తినా ఎన్టీఆర్ అంత గొప్పవాడిని కాలేనని జూనియర్ ఎన్టీఆర్ తేల్చిచెప్పాడు. తాత గారికి తప్పితే 'అన్న' అని పిలిపించుకునే హక్కు ఎవరికీ లేదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం విజయవాడ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలకు తను తమ్ముడిలాగే ఉంటానన్నారు. బెజవాడలో ఈ కార్యక్రమం మొదలు పెట్టిన విజయవంతం అవుతుందని అన్నారు. బెజవాడ తనకు సన్నిహితమైన ప్రాంతామని...ప్రతి కుటుంబం తనను మీ బిడ్డలాగా ఆదరించాలని కోరారు. విజయవాడ కన్న బెజవాడ అని పిలవడమే తనకు ఇష్టమని, బెజవాడకు తానెప్పుడూ రుణపడి ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

నటి కవిత కూతురు ప్రేమ పెళ్ళిలో ట్విస్ట్ లు

        ప్రముఖ నటి, తెలుగుదేశం పార్టీ నేత కవిత కుమార్తె మాధురి తమ డ్రైవర్ రాజ్ కుమార్ ను పెద్దపల్లి వెంకటేశ్వరాలయంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో సడన్ గా ట్విస్ట్ వచ్చి చేరింది. “మా తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మేమే పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం" అని చెప్పిన మాధురి రోజు తిరగగానే తిరగబడింది.   అసలు రాజ్ కుమార్ నాకు 15 రోజులకిందట షాపింగ్ మాల్ లో పరిచయం అయ్యాడని, ఆ తర్వాత ఒకరోజు నాకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడని ఆ తరువాత ఏం జరిగింది నాకు తెలియదని మాధురి చెబుతున్నట్లు తెలుస్తోంది. తనకు స్పృహ వచ్చేసరికి ఇద్దరికి వివాహం అయిందని చెప్పాడని, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మాధురి చెబుతోంది. ఇక తల్లి కవిత తన కుమార్తెను పెళ్లి చేసుకున్న అతను మా డ్రైవర్ కానే కాదని, అతనిని నేను ఎప్పుడూ చూడలేదని అంటోంది.

గుర్నాథం! కాణిపాకం వస్తావా? పయ్యావుల కేశవ్

  ప్రస్తుత రాజకీయాలలో ఒకరిమీద మరొకరు వేసుకొంటున్న నిందలు, చేసుకొంటున్న ఆరోపణలు, బయట పెడుతున్న వ్యాపారలావాదేవీల రహస్యాల వలన అర్ధమవుతున్న విషయం ఏమిటంటే అందరూ ఆ తానూ ముక్కలేనని. అంతే కాదు, ఏ రాజకీయకుడు కూడా కేవలం ప్రజాసేవ చేసుకొంటూ బ్రతికేయట్లేదని మరో నిజం కూడా బయటపడుతోంది. అధికారం, రాజకీయాలు రెండూ కూడా వారి వృత్తి అయితే, వ్యాపారాలు, కాంట్రాక్టులు వారి ప్రవృత్తి అని అర్ధం అవుతుంది.   తేనే తీసిన చేతిని నాకడం ఎంత సహజమో, చెరువులో చేపలు నీళ్ళు తాగడం ఎంత సహజమో అధికారం, రాజకీయ అండదండలు, పలుకుబడి ఉన్న అటువంటి వ్యక్తులు వాటిని తమ వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడం కూడా అంతే సహజం. అయితే, అది ఆశ నుండి అత్యాశగా, దురాశగా మారినప్పుడు ఎవరో ఒకరు వేలెత్తి చూపకమానరు.   మరి తెదేపా నేత పయ్యావుల కేశవ్ విషయంలో అదే జరిగిందని వైకాపా నేత గురనాథ రెడ్డి ఆరోపణలు సందిస్తుంటే, ఆ ఇద్దరి నేతల మద్య షరా మామూలుగానే మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరడం, ముందు దానిని మీడియా స్క్రోలింగు బారుకి తగిలించేసి ఆనక నలుగురుని పిలిచి చర్చలు పెట్టడం షరా మామూలే.   ఇటీవలే, వైకాపా నేత గురనాథ రెడ్డి పయ్యావుల కేశవ్ పై తన తొలి అస్త్రం సందిస్తూ, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డితో ఆయనకీ వ్యాపార లావాదేవీలున్నాయని బాంబు పేల్చారు. ఇంకేముంది? ఇటీవల మన రాజకీయ నాయకులకు బాగా అలుసయిపోయిన కాణిపాకం వినాయక స్వామికి మళ్ళీ పనితగిలింది. పయ్యావుల కేశవ్ గురునాధరెడ్డికి సవాలు విసురుతూ “నాకు గాలితో ఎటువంటి వ్యాపారలావదేవీలు లేవని నేను కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మరి నువ్వు చేస్తున్న ఆరోపణలు నిజమేనని నువ్వు కూడా ప్రమాణం చేయగలవా? నాపై చేసిన ఆరోపణలకు నేను ఎటువంటి విచారణకయినా నేను సిద్ధం. మరి నీ వ్యాపార లావాదేవీలపై విచారణకు సిద్ధమేనా? నేను గాలిని ఏదో పెళ్లి సందర్భంలో కలుసుకొన్నాను. అధిపట్టుకొని నాకు ఆయనకీ ముడిపెట్టేయడమేనా?” అని ప్రశ్నించారు.   ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు, ఖండన ముండనాలన్నీ మీడియాకు మరో మంచి మసాలా వార్తా దొరికే వరకు కనిపిస్తుంటాయి. ఆ తరువాత షరా మామూలే మళ్ళీ!

బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ మధ్య విభేదాలంటూ వార్తలు

        నందమూరి కుటుంబంలో ఏర్పడిన విభేదాలు ఇంకా సమసిపోలేదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. విజయవాడలో ఓ జ్యుయలరీ షాపు ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన ఎన్టీఆర్ కు అభిమానులే మోటార్ బైక్ లతో ర్యాలీగా తీసుకెళ్లారు. అయితే ఆయనకు సినీ అభిమానులు తప్ప తెలుగుదేశం పార్టీ నేతలుగాని, కార్యకర్తలు గానీ ఎవరూ స్వాగతం పలకకపోవడం పట్ల ఆ కుటుంబంలో విభేదాలున్నాయని ప్రచారం జరుగుతోంది.   టిడిపి కార్యకర్తలు జూనియర్ పర్యటనకు దూరంగా ఉండాలని బాలకృష్ణ సన్నిహితులు సంకేతాలు ఇచ్చారని కధనాలు రావడం ఆసక్తికరంగా ఉంది. నిజంగానే బాలకృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్.ల మధ్య అంతరం ఏర్పడిందా? అయితే ఇది వరకే తనకు సన్నిహితుడు అయిన  కొడాలి నాని పార్టీని వీడి జగన్ పార్టీలో చేరినా జూనియర్ టీడీపీకే మద్దతు పలికారు. తన తాత పార్టీకే తన మద్దతు అని, అది తెలుగువారి ఆత్మగౌరవం అని ప్రకటించారు.

అసెంబ్లీ లో కాంగ్రెస్, టిడిపిలకు ఝలక్

        కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కాంగ్రెస్, తెలుగుదేశం లను నుంచి ఏకంగా 16 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా గీత దాటారు. కాంగ్రెస్ నుంచి అవిశ్వాసానికి అనుకూలంగా మద్దాల రాజేష్, పేర్నినాని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి , బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి, అమరనాథ్ రెడ్డి, సాయిరాజ్, జోగి రమేశ్, సుజయ్ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్లనానిలు ఓటు వేశారు. వీరంతా కాంగ్రెస్ నుంచి వైఎస్ ఆఆర్ సీపీ వైపు వెళ్లిన వారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా తమ పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించారు.   ఇక తెలుగుదేశం  నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించారు. రెబెల్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, రామకోటయ్య, వేణుగోపాల చారి ఓటింగ్ దూరంగా ఉన్నారు. కొడాలి నాని, వనితలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలిచారు. మరి వీరిపై ఆయా పార్టీలు చర్యలు తీసుకుంటాయా?  

అంజిరెడ్డి కి చిరంజీవి నివాళి

        అనారోగ్యంతో కన్నుమూసిన రెడ్డీస్ ల్యాబ్ అధినేత అంజిరెడ్డి బౌతికకాయనికి కేంద్రమంత్రి చిరంజీవి దంపతులు నివాళులర్పించారు. ఆయన కుంట సభ్యులను పరామర్శించారు. అంతకముందు సీపీఎం ఎమ్యెల్యే జూలకంటి రంగారెడ్డి అంజిరెడ్డి బౌతికకాయనికి నివాళులర్పించారు. ఈ మధ్యాహ్నం అంజిరెడ్డి అంత్యక్రియలు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో జరగనున్నాయి.   1943లో గుంటూరు జిల్లా, తాడేపల్లిలో జన్మించిన అంజిరెడ్డి 1984లో రెడ్డీ ట్యాబ్‌ను ప్రారంభించారు. దేశంలో రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదిగింది. ఆయన ఎంతో శ్రమించి రెడ్డి ల్యాబ్స్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. భారతీయ ఔషద పరిశ్రమపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఔషాధాల తయారీలో ప్రపంచానికే గుర్తింపు తీసుకు వచ్చారు. ఫార్మా రంగంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.  

ఎమ్మార్ కేసులో నష్టపోయిన ఎపిఐఐసి : సిబీఐ

  ఎమ్మార్ కేసులో అభియోగాల నమోదు నిమిత్తం సిబీఐ కోర్టు ప్రధాన న్యాయాధికారి యు.దుర్గాప్రసాద్ ఎదుట సిబీఐ డిప్యూటీ సలహాదారు బల్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపిస్తూ "2004లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మార్ ప్రాపర్టీస్ గత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు చేసి ప్రాజెక్టును తిరిగి చేప్పట్టిందని, గతంలో రెండు ఎస్సీవీలుగా ఉన్న ప్రాజెక్టును మూడు ఎస్సీవీలుగా చేపట్టిందని, దీనికోసం ప్రభుత్వం 535 ఎకరాల భూమిని కేటాయించినట్లు చెప్పారు. ఈ సంస్థల్లో ఎపిఐఐసి ఎం.డి.గా బి.పి.ఆచార్య ఉమ్మడి సంస్థల నామినీ డైరెక్టర్ గా ఉండి దుబాయ్ సంస్థ రూ,వందల కోట్లను కొల్లగొడుతున్నా ప్రేక్షకపాత్ర పోషించారని, డాక్యుమెంట్లలో చూపిన ధరకంటే ఎక్కువ ధరలకు విల్లాలను విక్రయిస్తున్నారని తెలిసీ వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని పేర్కొన్నారు. అంతే కాకుండా ఎపిఐఐసికి తెలియకుండా ఈ.హెచ్.టి.పి.ఎల్., ఎమ్మార్ ఎంజీఎఫ్ తో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకున్నందువల్ల ఎపిఐఐసికి దక్కాల్సిన 25 శాతం వాతా 5 శాతానికి పడిపోయి దాదాపు రూ.43కోట్లకు పైగా నష్టపోయిందన్నారు. కోనేరు రాజేంద్రప్రసాద్ సూచనలతో తుమ్మల రంగారావు స్టైలిష్ హోమ్స్ ను ఏర్పాటు చేసి, చదరపు గజం పత్రాల్లో రూ.5 వేలుగా చూపించి అదనంగా రూ.4వేల నుంచి రూ. 45వేల వరకూ వస్తూసు చేశారన్నారు. కోనేరు సూచనలతో రంగారావు స్టైలిష్ హోమ్స్ ద్వారా 105 విల్లాల స్థలాల విక్రయాలు జరిగాయన్నారు. ఈ విక్రయాలతో తుమ్మల రంగారావు రూ, 96.01 కోట్లు వసూలు చేసిందని, ఈ మొత్తాన్ని కోనేరు రాజేంద్రప్రసాద్ కు, సునీల్ రెడ్డికి అందజేశారన్నారు. బి.పి.ఆచార్య, ఎమ్మార్ హిల్స్ టౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ ఎం.జీ.ఎఫ్., కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ తదితరుల పాత్ర గురించి కోర్టుకు వినిపించారు.

భారత్ లో మొట్టమొదటి జపాన్ వాహన తయారీ సంస్థ

  భారత్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరుజిల్లాలో జపాన్ తన మొట్టమొదటి వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ స్థాపించనుంది చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ఆర్థిక మండలిలో రూ.1500 కోట్లతో తేలికరకం వాణిజ్య వాహనాలు ట్రక్కులు, వ్యాన్ల వంటి తయారీ పరిశ్రమను స్థాపించనుంది.  శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ మేరకు అవగాహనా ఒప్పందం (ఎం.వో.యూ)కుదుర్చుకుంది. ఇసుజు మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరు షిగేరు వకబయాషి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్రలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సమావేశానికి జపాన్ రాయబారి తోకేషి యాగీ, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీసిటీ ప్రతినిథులు రవి సన్నారెడ్డి, శ్రీనిరాజు హాజరయ్యారు.శ్రీసిటీలో 110 ఎకరాల్లో ఈ పరిశ్రమను ఏర్పాటుచేయనున్న పరిశ్రమకోసం విద్యుత్తు, వ్యాట్ తో బాటు ఇతర రాయితీలు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం తన సంసిద్ధతను తెలియజేసింది.

గేట్ ఫలితాలు విడుదల ... రాష్ట్ర విద్యార్థుల హవా

ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఫిబ్రవరి 10న దేశవ్యాప్తంగా నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టేస్ట్ (గేట్) ప్రవేశ పరీక్షనిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 10 లక్షలమంది హాజరయ్యారు.  గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టేస్ట్ - 2013 ఫలితాలు విడుదలయ్యాయి. ఆలిండియా స్థాయిలో జరిగే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టేస్ట్ (గేట్)లో రాష్ట్ర విద్యార్థులు తమ సత్తా చాటారు. ఈసీఈలో మొదటి ర్యాంక్ తో పాటు 3,4,5,6,7,8,10 ర్యాంకులను రాష్ట్ర విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వాసి పోతుల శివహర్ష మొదటి ర్యాంక్ ను సాధించాడు. ఐఎన్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంక్ తో పాటు ఐదవ ర్యాంక్ సాధించారు. ఈసీఈలో మొదటి ర్యాంక్, ఈఈఈలో అన్నందేవుల రవితేజ 2వ ర్యాంక్ తో పాటు 6, 8  ర్యాంక్ లను, సీఎస్ఈలో 4,6,9, ర్యాంకులను సాధించి జాతీయస్థాయిలో తమ సత్తాను చాటుకున్నారు.

అతికష్టం మీద వీగిపోయిన అవిశ్వాసం

  టి.ఆర్.ఎస్., వైఎస్సార్సీపీ విడివిడిగా స్పీకర్ కు సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానానికి టి.డి.పి. తటస్థంగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అతి కష్టంగా 142-58 తేడాతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ రెబల్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆళ్ళ వంశీకృష్ణ శ్రీనివాస్, పేర్ని నాని, సుజయ్ కృష్ణ రంగారావు, ముద్దాల రాజేష్ కుమార్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జోగి రమేష్, గొట్టిపాటి రవి, టి.డి.పి. రెబల్స్  కొడాలి నాని, వై.బాలనాగిరెడ్డి, ఎం. అమరనాథ్ రెడ్డి, పిరియా సాయిరాజ్, ఎ.వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 295మంది సభ్యులు కాగా 264 మాత్రమే హాజరయ్యారు. మొదటినుండి చెపుతున్నట్టుగానే ఎం.ఐ.ఎం. అవిశ్వాస తీర్మానానికి దూరంగా వుంది. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ఇండిపెండెంట్ సభ్యుడు నాగం జనార్థన రెడ్డి, టిడిపికి చెందిన చిన్నం రాంకోటయ్య, వేణుగోపాలచారి, హరీశ్వర్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో పాల్గొనలేదు.

మాది తెనాలి, మీది తెనాలి అంటున్న తెలంగాణా నేత

  ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెరాస శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి తన చిత్తూరు జిల్లాకే చెందినవారు కావడంతో చంద్రబాబు నాయుడు ‘మీది తెనాలి మాది తెనాలి’ అన్న రీతిలో ‘మీది చిత్తూరు మాది చిత్తూరు’ అనే సెంటిమెంటుతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని హేళన చేసారు. ‘కిరణ్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమయిందని నిత్యం తిట్టిపోసే చంద్రబాబు నాయుడు స్వయంగా అవిశ్వాసం పెట్టకపోగా, మేము పెడుతున్న అవిశ్వాసానికి కూడా మద్దతునీయకపోవడం ద్వారా కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకొన్నట్లు కనిపిస్తున్నారు’ అని ఎద్దేవా చేసారు.   ఇక్కడ ఈ తెరాస నేత ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవాలని మనస్పూర్తిగా ప్రయత్నిస్తున్నామని చెపుతుంటే, మరో వైపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని కలిపెసేందుకు నేటికీ సిద్దంగా ఉన్నామని ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అసమర్ధ ప్రభుత్వమని ఒకవైపు అవిస్వాసం పెడుతూనే, మళ్ళీ అదే పార్టీలో కలిసిపోవాలని ఎందుకు ఉవ్విళ్ళు ఊరుతున్నారో తెరాస నేతలే చెప్పాలి.

పొత్తులొద్దు, ఒంటరిపోరే బెస్ట్: చంద్రబాబు

  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం, రాబోయే ఎన్నికలకు 6 నెలలు ముందుగానే, పార్టీ అభ్యర్ధులను నిర్ణయిస్తామని ప్రకటించారు. మళ్ళీ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, ఆచంట నియోజక వర్గాల పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఎవరితోనూ ఎన్నికల పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని మరో సంచలన ప్రకటన చేసారు.   ఇంతవరకు ఇతరపార్టీలతో పెట్టుకొన్న ఎన్నికల పొత్తుల వలన పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువొచ్చిందని ఆయన అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో ఒంటరిపోరుకు పార్టీలో అందరూ సిద్దం కావాలని కోరారు. కార్యకర్తలందరూ ఇప్పటి నుండే పార్టీ తరపున తమ తమ గ్రామాలలో ప్రచారం మొదలుపెట్టి, ఎన్నికల నాటికి ప్రజలందరూ పార్టీకే ఓటు వేసేలా చూడాలని ఆయన కార్యకర్తలను కోరారు. కొంత మంది నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయినా, కార్యకర్తలు మాత్రం పార్టీ పట్ల అచంచల విశ్వాసం చూపుతూ పార్టీ కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేస్తున్నారని ప్రశంసించారు. నేతలు వెళ్ళిపోయినా పార్టీ చెక్కు చెదరక పోవడానికి కారణం పార్టీ కార్యకర్తల అండదండలే అని ఆయన అన్నారు.   బహుశః గత ఎన్నికలలో తెరాసతో పెట్టుకొన్న ఎన్నికల పొత్తులు పెట్టుకొన్న తెలుగు దేశం పార్టీ గెలవకపోగా, తదనంతర కాలంలో అదే తెరాసతో చాలా ఇబ్బందులు పడింది. బహుశః చంద్రబాబు యొక్క ఈ అకాల వైరాగ్యానికి అదీ ఒక కారణం అయి ఉండవచ్చును. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికల పొత్తులు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రావడం అసంభవం అని చంద్రబాబుకి తెలిసినప్పటికీ, ఆయన ఈ రకమయిన ప్రకటనచేయ సాహసించారంటే బహుశః తన పాదయాత్రలో పల్లె పల్లెకు తిరిగిన ఆయన తన పార్టీ యదార్ధ పరిస్థితిని, బలాబలాలను పూర్తిగా అంచనా వేసుకొన్నందునే బహుశః ఆయన ఈనిర్ణయం తీసుకొని ఉండవచ్చును.   ఏది ఏమయినప్పటికీ, తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తులు అనివార్యం కావచ్చును. అదే విధంగా కాంగ్రెస్ పార్టీతో కటిఫ్ చేసుకొన్న మజ్లిస్ పార్టీ జగన్ పంచన గనుక జేరకపోతే, తప్పనిసరిగా తెదేపాతోనే పొత్తుల కోసం ప్రయత్నించవచ్చును. ఇక కేంద్రంలో యుపీయే కు ప్రత్యామ్నాయమయిన బీజేపీ నేతృత్వంలో నడుస్తున్న యెన్డీయే కూటమిలో భాగస్వామి అయిన తెదేపా రాష్ట్రంలో బీజేపీతో ఎంతో కొంత సర్దుబాట్లు అనివార్యం కావచ్చును.   అందువల్ల పొత్తుల విషయంలో చంద్రబాబు ఇప్పుడే ఒక స్పష్టమయిన ప్రకటన చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులను బట్టి తన నిర్ణయం మార్చుకోక తప్పదు.

రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత అంజిరెడ్డి కన్నుమూత

        భారతీయ ఔషద పరిశ్రమలో ప్రఖ్యాత ఖ్యాతిపొందిన ప్రముఖ వ్యాపారవేత్త రెడ్డీ ల్యాబ్స్ అధినేత డాక్టర్ అంజిరెడ్డి శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న అంజిరెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.   1943లో గుంటూరు జిల్లా, తాడేపల్లిలో జన్మించిన అంజిరెడ్డి 1984లో రెడ్డీ ట్యాబ్‌ను ప్రారంభించారు. దేశంలో రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదిగింది. ఆయన ఎంతో శ్రమించి రెడ్డి ల్యాబ్స్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. భారతీయ ఔషద పరిశ్రమపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఔషాధాల తయారీలో ప్రపంచానికే గుర్తింపు తీసుకు వచ్చారు. ఫార్మా రంగంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

చంద్రబాబును వెనకేసుకు వచ్చిన కిరణ్, బోత్సల అంతర్యం ఏమిటో?

  నిన్న జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ఇద్దరూ కూడా మొట్టమొదటిసారిగా తెలుగు దేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని కొంచెం మెచ్చుకొంటూ మాట్లాడటం విశేషం. తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా తెరాస మరియు వైకాపాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాలకు తెదేపా మద్దతు ఈయని కారణంగానే వారు ఆశించని, ఊహించని ఆ మర్యాదలు ఒలకబోస్తున్నారని అందరూ భావిస్తున్నారు.   అయితే, వాటి వెనుక ఇంకా బలమయిన కారణాలే ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్తిబాబులు ఇద్దరూ కూడబలుకొన్నట్లుగా చంద్రబాబుకి, తేదేపాకు అనుకూలంగా మాట్లాడటం ద్వారా, ఇప్పటికే తెర వెనుక నుండి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారిగా రహస్య ఒప్పందం చేసుకొని తమ అవిశ్వాస తీర్మానాలకు మద్దతు పలుకకుండా, కిరణ్ కుమార్ ప్రభుత్వం పడిపోకుండా కాపడుతున్నాడని చంద్రబాబు మీద విరుచుకు పడుతున్న తెరాస మరియు వైకాపాలకు మరింత అనుమానం కలిగేలా మాట్లాడి తద్వారా వారికి మరో కొత్త ఆయుధం అందించి వారిరువురినీ చంద్రబాబుపైకి ఉసిగొల్పడమే ప్రధాన లక్ష్యంగా కిరణ్, బోత్సలు మాట్లాడారు.   తద్వారా, మూడు ప్రధాన ప్రతిపక్షాల మద్య మరింత చిచ్చు రగిలించి వారిని ఒకరికొకరిని దూరంగా ఉంచగలిగితే, అది తమ పార్టీకి మేలు చేస్తుందనే దూరాలోచనతోనో లేక ‘దురాలోచానతో’నో వారిరువురూ ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చును. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా తన శత్రువుని పొరపాటున కూడా మెచ్చుకొనే అవకాశం లేదు. అటువంటి సమయంలో 2014 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయ చిత్ర పటం నుండి మాయమయిపోతుందని ఒకనాడు నొక్కి చెప్పిన ముఖ్యమంత్రే స్వయంగా ఈ రోజు తెలుగు దేశం పార్టీ మాత్రమే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమని, తెరాస, వైకాపా వంటి ప్రాంతీయ పార్టీలతో పోటీ పడవలసిన అవసరం లేదని పలకడం చూసినట్లయితే, ఆ మూడు పార్టీల మద్య తమ మాటలతో ఇప్పటికే ఉన్న పెద్ద అగాదాన్ని మరింత పెద్దది చేస్తే రాబోయే ఎన్నికలలో తమ పార్టీ నల్లేరు మీద నావలా సాగిపోవచ్చునని వారు ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చును.   తద్వారా ఇప్పటికకే తోక పార్టీలు, లోపాయికారీ పార్టీలు అంటూ కీచులాడుకొంటున్న ప్రతిపక్షాలకి, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు, పెద్ద పార్టీలు, అంటూ కొత్తగా కొట్టుకు చచ్చే సౌలభ్యం కూడా వారికి కల్పించవచ్చునని వారిరువురీ ఆలోచన కావచ్చును.   తెలుగు దేశం పార్టీ పెద్ద పార్టీ అని, మిగిలిన రెండూ ప్రాంతీయ పార్టీలని వాటిమధ్య పోలిక పెట్టడం వెనుక ఉద్దేశ్యం కూడా అదే. రేపటి నుండి ఇదే విషయంపై ఆ మూడు పార్టీలు కత్తులు దూసుకొంటున్నపుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరూ చప్పట్లు కొడుతూ వెనక నుండి ప్రోత్సహించడం కూడా మనం చూడవచ్చును.