టిడిపిలో ఎమ్మెల్సీ చిచ్చు
posted on Mar 10, 2013 @ 2:59PM
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎంపికలో చిచ్చు రేగింది. దాడి వీరభద్రరావుకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వనందుకు ఆయన అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి మండలాధ్యక్షులు సుమారు 600 మంది రాజీనామాలు చేశారు. ఆ లేఖలను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. దీంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో నామా నాగేశ్వరరావు, సుజనాచౌదరి సమావేశమయ్యారు. వీరభద్రరావుని బుజ్జగించే బాధ్యతను చంద్రబాబు వారిద్దరికీ అప్పగించారు.
దాడి వీరభద్రరావు పదవీ కాలం ముగియడానికి ఇంకా రెండు నెలల సమయం ఉన్నా మనస్తాపం కారణంగా ఇప్పుడే రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దఫా యనమలకు అవకాశం ఇవ్వాలని బాబు నిర్ణయించారు. అయితే, ఈ విషయాన్ని తనతో కొంత ముందుగా చెప్పి ఉంటే బాగుండేదని, పొలిట్ బ్యూరో సమావేశానికి పిలిచి, అప్పుడే చెప్పడం తనను మనస్తాపానికి గురి చేసిందని దాడి ఆవేదన వ్యక్తం చేశారట.