లోహం ... కాగితం ... ఇప్పుడు ప్లాస్టిక్

యుగాల క్రితం లోహపు కరెన్సీ చలామణిలో ఉండేది. తరువాత కాగితపు కరెన్సీ చలామణిలోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ప్లాస్టిక్ కరెన్సీ మార్కెట్లోకి విడుదల కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పది రూపాయల ప్లాస్టిక్ రూపాయల నోటును ఐదు రాష్ట్రాలలో విడుదల చేయనుంది. దేశంలో విభిన్న వాతావరణం, భౌగోళిక పరిస్థితులు ఉన్న కోచీ, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా నగరాలలో మొదట వీటిని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా మంగళవారం రాజ్యసభలో తెలిపారు. వందకోట్ల పదిరూపాయల నోట్లను విడుదల చేస్తామని తెలిపారు. నకిలీ నోట్లను నిరోధించడానికి, నోట్ల జీవితకాలాన్ని పెంచడమే వీటి ధ్యేయమని తెలిపారు.

అవిశ్వాసానికి మేము దూరం ...

తెలంగాణా రాష్ట్ర సమితి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడతామని ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెరాస రాజకీయ ఎత్తుగడలకు సాయపడకూడదని నిర్ణయించారు. జగన్ బెయిల్ కోసం బేరసారాలు నెరిపెందుకు వైఎస్సార్సీపీ, ప్యాకేజీలు మాట్లాదేకునేందుకు తెరాస ఇటువంటి డ్రామాలు ఆడుతోందని అన్నారు.  తోక పార్టీలను పట్టుకుని ఎందుకు వెళ్ళడం, రేపో  మాపో కాంగ్రెస్ లో విలీనం అయ్యే పార్టీలతో మనం ఎందుకు కలిసి వెళ్ళాలి? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వం మెడలు వంచేందుకు పోరాడదాం. ప్రభుత్వం దిగిరాకపోతే అవిశ్వాస తీర్మానంపై సరైన సమయంలో సొంతంగా నిర్ణయం తీసుకుందాం అని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నట్లు తెలిసింది. తెరాస, వైఎస్సార్సీపి రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి ఎత్తుగడలను, బ్లాక్ మెయిల్, డ్రామాలు ఆడుతోందని దానికి తాము ఎందుకు సహకరించాలని పార్టీ ముఖ్యనేతలంతా భావిస్తున్నట్లు తెలిసింది.

నీ ఊరికొస్తా...నీ వీధికొస్తా...నీ ఇంటి కొస్తా... కిరణ్ కుమార్

  ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లాలో మొదలయిన రెవెన్యు సదసులో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తానూ మెహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటివరకు 7సార్లు వచ్చానని, కానీ, ఇదే జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తున్న కేసీఆర్ మీ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చాడని ప్రజలను ప్రశ్నించారు. తానూ ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసం జిల్లాకు వస్తుంటే, కేసీఆర్ మాత్రం ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలను అమలు చేయడానికి మాత్రమే జిల్లాకు వచ్చిపోతుంటాడని హేళన చేసారు. తానూ మహా మొండివాడినని, తానూ దేనికీ వెనుకాడే మనిషిని కానని అన్నారు. తన ప్రభుత్వానికి 5ఏళ్ళు పాలించమని ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు తానెవారికో భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ ను పరోక్షంగా ఉద్దేశించి అన్నారు.   తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాసం పై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా చొరవతీసుకొని తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా ఆయన ప్రాతినిద్యం వహించే జిల్లా మెహబూబ్ నగర్ కే వెళ్లి కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించడం ద్వారా తానూ నిజంగానే తాటాకు చప్పులకి బెదిరేవాడిని కానని ఆయన స్పష్టం చేసినట్లయింది.

వైఎస్ కు రూ. 500 కోట్లు ఇచ్చిన గాలి..!

        దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. 2009 ఎన్నికల ఫండ్‌గానూ గాలి జనార్ధన్‌రెడ్డి వైఎస్‌కు రూ. 500 కోట్లు ఇచ్చారని వార్తలు వస్తున్నాయని పయ్యావుల ఆరోపించారు. ఈ విషయాన్ని గాలి జనార్ధన్‌రెడ్డి సీబీఐ ఎదుట ఒప్పుకున్నట్లు తెలిసిందని అన్నారు. ఆ డబ్బు వైఎస్ ఎన్నికల ఖర్చు కోసం వినియోగించారని కేశవ్ అరోపించారు. సీబీఐకి గాలి ఇచ్చిన వాంగ్మూలం రెండు మూడు రోజుల్లో కోర్టుకు వస్తుందని పయ్యావుల పేర్కొన్నారు. ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించే ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని కేశవ్ డిమాండ్ చేశారు. కాగా ఓఎంసీ గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్ధన్‌రెడ్డి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

రామానాయుడి దర్శక అవతారం

        నాలుగున్నర దశాబ్దాలుగా శతాధిక చిత్రాలను నిర్మించిన మూవీమొఘల్ డాక్టర్ డి.రామానాయుడు డైరెక్టర్ అవతారం ఎత్తుతున్నారు. పంజాబీలో ఆయన నిర్మించిన 'సింగ్ వర్సెస్ కౌర్' సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమా తో రామానాయుడు డైరెక్టర్ గా మారబోతున్నారు. ఈ సినిమాని తెలుగు లో తన మనవడు దగ్గుబాటి రానా తో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొదట ఈ సినిమాని వెంకటేష్ తో చేయాలని అనుకున్నారు..కాని రాణాతో చేస్తే బాగుంటుందని ఆయన భావించారట. ఆ తరువాత వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఉండాలని..ఈ సినిమాని మల్టీస్టారర్ గా తీయబోతున్నారు. ప్రముఖ రచయిత సత్యానంద్ స్క్రిప్ట్ వర్క్ ను కూడ మొదలుపెట్టారు. మనవడి కోసం తాత దర్శకుడిగా మారడం విశేషమే.

రా౦సింగ్ ది ఆత్మహత్య: పోస్టుమార్టం రిపోర్ట్

        ఢిల్లీలో వైద్య విద్యార్ధిని పై సాముహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రా౦సింగ్ మృతుదేహానికి ఎయిమ్స్ లో శవపరీక్ష నిర్వహించారు. రా౦సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఉరి వేసుకోవడం వల్లనే అతను మృతి చెందాడని వైద్యుల పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. 'నిర్భయ' పై సాముహిక అత్యాచారం కేసులో నిందితుడు రా౦సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాంసింగ్ ఆత్మహత్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాంసింగ్ మృతిపై అతని తల్లిదండ్రులు, న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని చంపేశారని, తన కుమారుడిని మృతిని హత్యగా పరిగణించాలని రాంసింగ్ తండ్రి అన్నారు. ఆరు రోజుల క్రితం తాను కోర్టులో తన కుమారుడిని కలిశానని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అతను తనకు చెప్పాడని, తన సహచర ఖైదీలు తన పట్ల అసహజంగా ప్రవర్తించారని తన కుమారుడు తనతో చెప్పినట్లు రాంసింగ్ తండ్రి మాంగే లాల్ సింగ్ చెప్పారు.      23 ఏళ్ల నిర్భయపై నిరుడు డిసెంబర్ 16వ తేదీన బస్సులో అతి కిరాతకంగా అత్యాచారం జరిగింది. బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో డిసెంబర్ 29వ తేదీన ప్రాణాలు విడిచింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ వ్యవహారంపై ఢిల్లీ అట్టుడికింది. తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో మహిళల రక్షణపై చర్చకు ఈ సంఘటన దారి తీసింది. మహిళ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి విధించాల్సిన శిక్షలు వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్భయ పేరు మీద మహిళల కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది.

కొరివితో తల గోక్కొంటున్న షిండే గారు!

  హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే గతంలో రెండు మూడు సార్లు అనవసరంగా నోరు జారి తానూ ఇబ్బందులలో పడటమే కాకుండా, తన కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టారు. ఆయన చేసిన ‘నెల రోజుల్లో తెలంగాణా’ వాగ్దానం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బందులకు గురయిందో అందరికీ తెలిసిందే. చివరికి గులంనబీ ఆజాద్ కలుగజేసుకొని ‘నెలంటే ముప్పై రోజులు కాదు’ అని ఒక కొత్త భాష్యం చెప్పి కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసాడు మాహానుభావుడు. నాటి నుండి తెలంగాణా విషయంలో నిశ్చింతగా కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి షిండే మళ్ళీ తన సరికొత్త వ్యాక్యలతో తలనొప్పులు తెచ్చిపెట్టారు.   తెరాస తదితర తెలంగాణా వాదులు ఎన్నికల సీజన్ వచ్చినందున తెలంగాణా అంశాన్ని పక్కన బెట్టడంతో రాష్ట్రంలో బయట వాతావరణంతో బాటు రాజకీయ వాతావరణం కూడా చాలబడి బాగా ప్రశాంతంగా ఉందని ప్రజలు సంతోష పడుతుంటే, హోం మంత్రి షిండేగారు తెలంగాణా పై మళ్ళీ అనవసరంగా నోరు విప్పి అగ్గి రాజేశారు.   “నేను నెలరోజుల్లో తెలంగాణా ప్రకటిస్తానని ఎన్నడూ, ఎవరితోను చెప్పలేదు. కేవలం నెల రోజుల్లో తెలంగాణా అంశంపై నా నివేదిక ఇస్తానని మాత్రమే చెప్పాను. చెప్పిన మాట ప్రకారమే నా నివేదికను కేంద్రానికి అందజేసాను. ప్రస్తుతం దాని మీదే చర్చ జరుగుతోంది. అయినా, తెలంగాణా అంశం ఇప్పటికిప్పుడు తేల్చే విషయం కాదు. తెలంగాణా ఇచ్చినట్లయితే, దేశంలో విదర్భవంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండులు చాలా తలెత్తుతాయి. అందువల్ల నిర్ణయం తీసుకోవాలన్నాకూడా దేశంవ్యాప్తంగా ఏర్పడే పరిస్థితులను పరిగానణలోకి తీసుకొనే నిర్ణయం చేయవలసి ఉంటుంది”అని అన్నారు.   ఆయన ఈ విధంగా పనిగట్టుకొని మరీ తెలంగాణా వాదులను రెచ్చగొట్టి కోరుండి కొరివితో తల ఎందుకు గోక్కోవాలని ప్రయత్నిస్తున్నారో తెలియదు. ఈవిధంగా అప్రస్తుత ప్రసంగం చేసి కాంగ్రెస్ తెలంగాణాకు వ్యతిరేఖం అని ఆయనే స్వయంగా చాటింపు వేసుకోన్నట్లు అవుతుంది. కేంద్రంలో ఉన్న ఆయనకు తెలంగాణా వాదులనుండి కొత్తగా వచ్చే ఇబ్బందులేవీ లేకపోవచ్చును, కానీ, ఆయన చేస్తున్న ఇటువంటి ప్రకటనల వల్ల తెలంగాణా కాంగ్రెస్ వాదుల గుండెల్లో మాత్రం రైళ్ళు పరిగెట్టిస్తుంటాయి. స్థానికంగా ఉండే వారికి ఆయన మాటలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.   ప్రస్తుతం తెలంగాణా కావాలని ఎవరూ ఆయన వెంటబడటం లేదు. తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీతో పోరాటాలు చేసి చేసి అలిసిపోయున్న తెరాస కూడా ఇక ఎన్నికలే శరణ్యం అని భావిస్తూ, ఎన్నికలకి పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతుంటే, ఇటువంటి సమయంలో షిండేగారు ఈ అనవసరమయిన ప్రకటనలు చేయడం ఎంత మాత్రం సబబు కాదు. తద్వారా రాష్ట్రంలో అయన పార్టీకే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది.

బాలనటుడు తేజ మృతదేహం లభ్యం

    గంగానదిలో గల్లంతైన బాల నటుడు తేజ మృతదేహం లభ్యమైంది. ఉత్తరఖండ్‌లోని రిషికేష్ సాయిఘాట్ దగ్గర తేజ మృతదేహం తేలింది. తేజ పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లో ఉన్న మిరిపిరి అకాడమీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5న కళాశాలకు చెందిన 25 మంది సభ్యుల బృందంలో రుషికేష్‌ వెళ్లిన తేజ గంగానదిలో దిగి గల్లంతయ్యాడు. గాలింపు చేపట్టిన పోలీసులు సాయిఘాట్ వద్ద తేజ మృతదేహాన్ని గుర్తించారు. శవపరీక్ష అనంతరం రేపు తేజ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. తేజ బాలనటుడిగా మురారి, కథానాయకుడు, రామదండు తదితర చిత్రాల్లో నటించాడు. తేజ మరణం పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

వైఎస్ విజయమ్మ ఇంటర్వ్యూకి సవరణలున్నాయి

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మొన్న తానూ ఎకనామిక్స్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యు పై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో ఈ రోజు ఆమె కొన్ని సవరణలు ఇచ్చారు.   వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా తన పార్టీ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ “నా ఇంటర్వ్యు వివరాలను ఆ పత్రిక లోపలి పేజీలలో సరిగ్గానే ప్రచురించినప్పటికీ, మొదటిపేజీలో మాత్రం వేరే అర్ధం వచ్చేలా హెడ్డింగ్ పెట్టి ప్రచురించింది. ప్రతిపక్షాలు అది పట్టుకొని రాద్ధాంతం మొదలుపెట్టారు. వారిలో ఎవరూ కూడా నా ఇంటర్వ్యు వివరాలను కనీశం పూర్తిగా చదివి ఉండరు. అందుకే, మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మన పార్టీ 2014సం. ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో ఏర్పడే మూడో ఫ్రంటుకో లేదా బీజేపీయేతర మరో పార్టీకో మద్దతు ఇస్తామని చెప్పాను. కానీ, ఆపత్రిక ఆ విషయాన్ని మరో విధంగా ప్రచురించింది. దానిని పట్టుకొని ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి,” అని అన్నారు ఆమె.   అయితే, ఇప్పుడు చెపుతున్నదానికి, మొన్న ఆ పత్రికకు చెప్పినదానికి మధ్య ఉన్న తేడా ఏమిలేదు. కాకపొతే ఆమె ఈసారి ‘కాంగ్రెస్ నేతృత్వం పనిచేస్తున్న యు.పీ.యే.ప్రభుత్వానికి మా మద్దతు’ అనే వాఖ్యానికి బదులు ‘మరో పార్టీకి మద్దతు ఇస్తామని’ చెప్పారు. కేంద్రంలో బీజేపీకి తాము మద్దతు ఈయమని ఆమె స్పష్టం చేసిన తరువాత, ఇక మిగిలింది కేవలం కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేస్తున్న యు.పీ.యే.ప్రభుత్వo మాత్రమే. ఇక, 3వ ఫ్రంటు ఉనికే లేనప్పుడు, ఆమె ఎంత డొంకతిరుగుడుగా చెప్పినా దానర్ధం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని చెప్పడమే.   అయితే, ఆమె ఆ పని చేసేందుకు ఒక సంవత్సరం వృధా చేయడం వలన, ఆమె కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అంతకాలం జైల్లోనే కాలం వెళ్ళదీయక తప్పదు. అందువల్ల, 2014సం.లో చేయాలనుకొన్న ఆ పనేదో ఇప్పుడే చేసినట్లయితే, కనీసం ఆమె కుమారుడు జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యే అవకాశం అయినా ఉంటుంది. 2014సం.లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినా, ఇప్పుడు కలిపినా ఛ్చీ కొట్టేవారు ఎప్పుడు ఛ్చీ కొట్టకమానరు. అందువల్ల ఏడాది కాలం వృధా చేసుకొని, అంతవరకు జగన్ మోహన్ రెడ్డిని జైలులో కుమిలిపోయేలా చేసే బదులు ఆ పనేదో ఇప్పుడే చేసేసి వీలయినంత ఎక్కువ ప్రయోజనం పొందడం వివేకం కదా? కేంద్రంలో ఏ పార్టీ వస్తుందో తెలియదని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండువేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తాను చెబితే ఎకనామిక్ టైమ్స్ పత్రిక మొదటి పేజీలో ఒకరకంగా రాశారని, లోపల పేజీలో మాత్రం కరెక్టుగానే రాశారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అన్నారు.పార్టీ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆమె ప్రసంగింఆచరు.ఆయా పక్షాల నేతలు తన ఇంటర్వ్యూను పూర్తిగా చదవకుండా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.అయితే ఈ వివరణలో ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన తేకుండా విజయమ్మ జాగ్రత్తపడ్డారు.కేంద్రంలో వస్తుందో లేక, మరే పార్టీ వస్తుందో తెలియదని, అందువల్ల అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని మద్దతు ఇస్తామని ఆమె అన్నారు.లోక్ సభకు ముప్పై నుంచి ముప్పై మూడు స్థానాలు, శాసనసభకు రెండువందల స్థానాలు తమ పార్టీకి వస్తాయని చెప్పినట్లు కూడా ఆమె పేర్కొనడం విశేషం.

మల్కాజ్‌గిరి పై దేవేందర్‌గౌడ్ కు మైనంపల్లి వార్నింగ్

        మల్కాజ్‌గిరి అసెంబ్లీ టిక్కెట్ వ్యవహారంపై సీనియర్ నేత, ఎంపీ దేవేందర్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సోమవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నీ నిర్వాకం వల్లనే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీలో చిచ్చుపెట్టి స్వంత పార్టీ పెట్టుకుని దాన్ని ప్రజారాజ్యం పార్టీలో కలిపి పోటీ చేయించావు. నీ కుట్రలకు ఎందరినో బలిచేశావు. నన్ను వ్యక్తిగతంగా నష్టపరచాలని చూశావనుకో ..నీ భాగోతం అంతా బయటపెడతా” అని హెచ్చరించారు. జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశంలో, మల్కాజ్‌గిరిలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు తమ నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారంటూ మైనంపల్లిని దృష్టిలో పెట్టుకొని దేవేందర్‌గౌడ్ విమర్శలు చేశారు. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు స్థానికులకే కేటాయిస్తామని బయట వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని ఆయన సమావేశంలో అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి పొటీ చేయాలని భావిస్తున్న మైనంపల్లికి దేవేందర్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు రుచించలేదు. దీంతో దేవేందర్‌గౌడ్ పై మండిపడ్డారు.

మోడీకి అమెరికా అనుమతి నిరకరాణ దేనికి సంకేతం?

  సాధారణంగా ప్రపంచాదేశాలన్నిటి మీదా ఒక కన్నేసి ఉంచే అమెరికా, అభివృద్ధి పదంలో దూసుకు పోతున్న భారత్ వంటి దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించదనుకొంటే పొరపాటే. భారతదేశంలో రాజకీయ పరిస్థితులను ఎప్పటికపుడు బేరీజు వేసుకొని తదనుగుణంగా వ్యూహాలు అమలుచేసే అమెరికా, వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలిచే అవకాశం లేదని రూడీ చేసుకొన్న తరువాతనే మోడీకి తమ దేశంలో ప్రవేశించేదుకు అనుమతి నిరాకరించిందా? లేకపొతే ఆయన భారతీయ జనతాపార్టీకి నాయకత్వం వహించి ప్రధాని పదవి చేపట్టే అవకాశం లేదని తన గూడచార వర్గాలు నివేదికలు ఇచ్చినందునే దైర్యంగా ఆయనకు అనుమతి నిరాకరించిందా? అనే ప్రశ్నలు తలఎత్తేలా చేస్తోంది.   అలా కాని పక్షంలో నరేంద్ర మోడీకి అనుమతి నిరాకరించడం ద్వారా అమెరికా రాజకీయంగా చాలా పెద్ద తప్పే చేసినట్లవుతుంది. ఇప్పుడు బీజేపీ నేత అయిన నరేంద్ర మోడీకి అనుమతి నిరాకరించిన అమెరికా ప్రభుత్వం, రేపు ఎన్నికల తరువాత ఒకవేళ బీజేపీ ప్రభుత్వమే ఏర్పడితే, మళ్ళీ అప్పుడు అదే బీజేపీ ప్రభుత్వంతో అమెరికా తన సంబందాలను కొనసాగించవలసి ఉంటుంది. ఒకవేళ నరేంద్ర మోడి ప్రధాన మంత్రి పదవికి అవకాశం దక్కక ఏ విదేశాంగ శాఖో లేక రక్షణ శాఖకో కేంద్రమంత్రిగా బాద్యతలు స్వీకరించినా అమెరికాకు ఆయనతో చేదు అనుభవాలు ఎదుర్కొనక తప్పదు.   మోడీకి అమెరికా తన దేశంలో అడుగుపెట్టడానికి అనుమతి నీయకపోవడం ద్వారా తన అసమ్మతిని తెలియజేయడం బాగానే ఉన్నపటికీ, ఒకవేళ ఆయన ఈ రోజు కాకపోయినా రేపయినా భారత దేశ ప్రధాని పదవిని అధిష్టిస్తే అప్పుడు అమెరికా ఆయనను అవమానించినందుకు క్షమాపణలు కోరుతుందా లేక ఆయన విషయంలో అదే ధోరణి కొనసాగిస్తుందా? అనే ప్రశ్నలకు జవాబులు కాలమే చెపుతుంది.

రా౦సింగ్ మృతుదేహానికి శవపరీక్ష

        దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సాముహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రా౦సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణ కొనసాగుతోంది. రా౦సింగ్ మృతుదేహానికి ఎయిమ్స్ లో శవపరీక్ష నిర్వహించనున్నారు. రాంసింగ్ మృతిపై అతని తల్లిదండ్రులు, న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని చంపేశారని, తన కుమారుడిని మృతిని హత్యగా పరిగణించాలని రాంసింగ్ తండ్రి అన్నారు. ఆరు రోజుల క్రితం తాను కోర్టులో తన కుమారుడిని కలిశానని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అతను తనకు చెప్పాడని, తన సహచర ఖైదీలు తన పట్ల అసహజంగా ప్రవర్తించారని తన కుమారుడు తనతో చెప్పినట్లు రాంసింగ్ తండ్రి మాంగే లాల్ సింగ్ చెప్పారు.

పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ లో విలీనం

        నేను మొదటి నుంచి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ విలీనం కాక తప్పదని చెబుతూనే ఉన్నాను అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ ఒకే గూటికి చేరుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనున్నాం. 2014 తర్వాత కాంగ్రెస్‌లోనే కలుస్తా'మని స్పష్టం చేశారు. ఆ పార్టీ విజయ రహస్యం ఏమిటన్నది ఇప్పుడు బయటపడింది'' అని చంద్రబాబు అన్నారు. '2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు సహకరిస్తాం' అనే ఆమె మాటల్లో అంతరార్థం ఏమిటనేది గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్‌ను కేసుల నుంచి బయటపడేసేందుకు తొలినుంచీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు అదే విషయం బయటపడింది అని బాబు విమర్శించారు.  వైసీపీని కాంగ్రెస్ లో విలీనంచేసే దిశగా ఎత్తుగడలు ప్రారంభమయ్యాయని అన్నారు. పార్టీలను కలిపేసుకోవడానికి కాంగ్రెస్ ఎత్తుగడలు వేయడం కొత్తేమీ కాదని, బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ నుంచి చిరంజీవి పార్టీ వరకు.. ఇదే కథ కొనసాగిందని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ను వీడిన పెద్దిరెడ్డి

        కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి టాటా చెప్పారు. ఈ మేరకు సోనియాగాంధీ,గులాం నబీ అజాద్, బొత్స సత్యనారాయణలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా లేఖలను పంపించారు. ఈయన మూడు నెలల క్రితమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు సమర్పించారు. శాసనసభ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. తాజాగా ఆయన కాంగ్రెస్ వీడుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రికి బద్ద వ్యతిరేకి అయిన పెద్దిరెడ్డి ఆయనను పదవి నుండి తొలగించాలని అధిష్టానం మీద వత్తిడి తెచ్చారు. పెద్దిరెడ్డి కుమారుడు మిధున్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పనిచేస్తున్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో జగన్ పార్టీ ఎమ్మెల్సీ గెలవడానికి పెద్దిరెడ్డి కారణమయ్యారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గెలవడానికి కూడా పెద్దిరెడ్డి మద్దతు ఉంది. జిల్లావ్యాప్తంగా ఆయనకు ప్రజల్లో మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ రాజీనామా చేసిన ఆయన జగన్ పార్టీలోకి చేరడం ఖాయమని తెలుస్తోంది.  

అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తాం : కెసిఆర్

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తామని ప్రకటించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తాము ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించబోమని ప్రకటిస్తుండగా, వై.ఎస్.ఆర్.సి.పి. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలా వద్దా మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కెసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అటు తెలుగుదేశం, ఇటు  వై.ఎస్.ఆర్.సి.పి.లను ఇరుకున పెట్టేందుకే కెసిఆర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సరైన సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి తమకు మద్ధతు ప్రకటించాల్సిందిగా కెసిఆర్ బిజెపి, మజ్లీస్, సిపిఎం, సిపీఐ, లోక్ సత్తా పార్టీల మద్ధతు కొరకు కసరత్తు చేస్తున్నారు.

చంద్రబాబు పాదయాత్ర పార్టీకి మేలు చేస్తోందా?

  గత 6నెలలుగా చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర వలన తెలుగుదేశం పార్టీ చాలా ప్రయోజనం పొందిఉండవలసినది. కానీ, అదే కారణంతో, అంటే ఆయన పార్టీ కార్యాలయాన్ని, పార్టీ అంతర్గత నిర్వహణ బాధ్యతలను తన సీనియర్లకు అప్పగించి దూరంగా తిరుగుతున్నందున, ఇదివరకు కంటే ఇప్పుడు పార్టీలో ముఠా తగాదాలు, వలసలు, అలకలు, అసమ్మతి, అసంతృప్తులు బాగా ఎక్కువయిపోయాయి. అయినా కూడా చంద్రబాబు తన పాదయాత్రకే ప్రాధాన్యం ఇచ్చి ముందుకు సాగుతుండటం వలన, ఆయనకు బదులు పార్టీని పూర్తీ సాధికారంగా నిర్వహించే అధికారం మరెవరికీ లేనందున, రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట పార్టీలో సమస్యలు తలెత్తుతున్నాయి.   ఒకరోజు అయ్యన్న పాత్రుడు అలిగితే, మరొక నాడు మరో శాసన సభ్యుడో మరొకరో జగన్ పార్టీ వైపు దూకుతారు. ఇక చంద్రబాబు పాదయత్రకి తెలంగాణా లో ఇబ్బందులు ఎదురవుతాయని అందరూ భావిస్తే, అక్కడ అనుకోన్నదానికంటే చాలా ప్రశాంతంగా దిగ్విజయంగా ముగిసింది. కానీ, ఆయన ఆంధ్ర ప్రాంతంలో అడుగిడిన నాటినుండి సమస్యలు మొదలయ్యాయి.   కృష్ణ జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లావరకు సాగిన పాదయాత్రలో ప్రతి చోటా పదనిసలే వినిపించాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ముఠా తగాదాలు బయట పడితే, అదే సమయంలో విశాఖలో అసమ్మతి తలెత్తింది. శ్రీకాకుళం నుండి జగన్ పార్టీలోకి వలసలు అప్పుడే మొదలయ్యాయి. ఇక యం.యల్.సీ. టికెట్ కోసం దాడి వీరభద్రరావు చేస్తున్నహడావుడి కూడా అందరూ చూస్తున్నదే.   చంద్రబాబు పాదయాత్ర చేయకపోతే ఈ సమస్యలు రావని కాకపోయినా, ఆయన పార్టీ కార్యాలయంలో ఉండిఉంటే, ఎప్పటికప్పుడు ఇటువంటి గోటితో పోయే సమస్యలను గొడ్డలి దాక పోకుండానే పరిష్కరించ గలిగే వారని మాత్రం చెప్పవచ్చును. ఇక, ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి చేస్తున్న ఈ పాదయత్రవల్ల చంద్రబాబు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గేవి కావు.   కానీ, ఈ పాదయాత్ర వల్ల చంద్రబాబు చెప్పుకొంటునట్లు, ఆయన ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రజల కష్ట నష్టాలను స్వయంగా చూసి తెలుసుకోవడం వల్ల కలిగిన మార్పు ఆయనలో శాశ్వితం అయితే అది ఆయన పార్టీకి, ప్రజలకి కూడా తప్పక మేలు చేస్తుందని చెప్పవచ్చును.

రాంసింగ్ ను హత్య చేశారు

      రాంసింగ్ మృతిపై అతని తల్లిదండ్రులు, న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని చంపేశారని, తన కుమారుడిని మృతిని హత్యగా పరిగణించాలని రాంసింగ్ తండ్రి అన్నారు. ఆరు రోజుల క్రితం తాను కోర్టులో తన కుమారుడిని కలిశానని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అతను తనకు చెప్పాడని, తన సహచర ఖైదీలు తన పట్ల అసహజంగా ప్రవర్తించారని తన కుమారుడు తనతో చెప్పినట్లు రాంసింగ్ తండ్రి మాంగే లాల్ సింగ్ చెప్పారు. మరోవైపు రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై జైలు అధికారులు సోమవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేకు నివేదిక అందజేశారు.

మోడీకి సుద్దులు చెపుతున్న పెద్దన్న

  ప్రపంచాదేశాలకి తనని తానూ పెద్దన్నగా భావించుకొనే అమెరికా, ఒక దేశంగా ఉద్భవించిన నాటి నుండి ఏదో ఒక దేశంలో తన యుద్ధం సాగిస్తూనే ఉంది. కానయితే, దానికి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’, ‘శాంతి స్థాపన’అనే రెండు హుందా అయిన పేర్లను తగిలించు కొంటుంది.   హిరోషిమా నాగాసాకిల మీద అణుబాంబులు వేసి లక్షలాది ఆమయక ప్రజలను బలిగొన్నఅమెరికా, అప్పుడూ ప్రపంచ శాంతికే ఆ పని చేసానని చెప్పుకొంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆధునిక ఆయుధాలను తయారుచేసుకొనే అమెరికా, శాంతి స్థాపనపేరిట వాటిని ఇతరదేశాలలో సామాన్య పౌరులపైన, పిల్లలు, వృద్ధులు, మహిళలపైన ప్రయోగించి పరీక్షించుకొంటూ తన పైశాచిక మనస్తత్వాన్ని చాటి చెప్పుకొంటూనే, మరో వైపు ప్రపంచానికి శాంతి ప్రవచనాలు చిలకల అప్పజెప్పడానికి ఎన్నడూ సిగ్గుపడలేదు.   అలనాటి వియత్నాం యుద్ధం మొదలుకొని నిన్న మొన్నటి ఇరాక్ యుద్ధం వరకు అమెరికా ప్రపంచ శాంతి స్థాపన కోసం చాలానే యుద్ధాలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంటుంది కూడా. ఇరాక్ లో ప్రజాస్వామ్యం పునరుద్దరించేసి, అక్కడ శాంతి స్థాపన చేసేసి చేతులు దులుపుకొన్నవెంటనే, అమెరికాకు అత్యవసరంగా లాడెన్ కోసం ఆఫ్ఘానిస్తాన్ బయలుదేరవలసి వచ్చింది.   ఇరాక్ యుద్ధంలో తన అత్యాదునిక ఆయుధ సంపత్తిని అక్కడి ప్రజలకి పరిచయం (?) చేసిన అమెరికా, ప్రపంచంలోకెల్లా అత్యంత విలువయిన ప్రాణులయిన తన సైనికుల ప్రాణాలు కాపాడుకొనే గొప్ప ఆలోచనతో ‘డ్రోన్’ వంటి మానవరహిత యుద్ధవిమానాలతో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాలలో ఉగ్రవాదుల కనబడుతున్న ప్రజల నెత్తిన బాంబుల వర్షం కురిపిస్తూ, తన సరికొత్త ఆయుధాలు కూడా సమర్ధంగానే పని చేస్తున్నాయని రూడీ చేసుకొనే అవకాశం పొందింది.   కానీ, పామరులయిన జనాలు మాత్రం అమెరికా చేస్తున్న ఈ శాంతి స్థాపన కార్యక్రమాలను అపార్ధం చేసుకొనడమే కాకుండా, అమెరికా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని గొంతు చించుకొంటున్నారు.   ఇటువంటి నేపద్యంలో మొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో ఒక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరబోతే, ఆయన (కూడా) మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడని కనిపెట్టేసిన అమెరికా ఆయనకు వీసా నిరాకరించింది.   కానీ, తనకు మాత్రం ఆ సూత్రం వర్తించదని మనస్పూర్తిగా నమ్మే దేశం కనుక, తనకు తానే ఒక ‘యూనివర్సల్ వీసా’ మంజూరు చేసుకొని, ఏదేశంలో కావాలంటే ఆ దేశంలోకి తన విమానాలలో గుట్టలుకొద్దీ బాంబులను నింపుకొని జొరబడి అక్కడ తన శాంతి స్థాపన కార్యక్రమాలు మొదలుపెట్టగలదు.   ఎందుకంటే, ప్రపంచానికి పెద్దన్న అయిన తానూ ప్రపంచం దేశాలలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం పరిరక్షణ చేయవలసిన గురుతరమయిన బాధ్యతను తన భుజస్కంధాలపై మోస్తోంది గనుక. అయినా వెర్రి ప్రజ అర్ధం చేసుకోదూ.