ప్రధాని నరేంద్ర మోడీతో నేడు సమావేశం కానున్న చంద్రబాబు
ఈరోజు ఉదయం 10.30 గం.లకి ప్రధాని నరేంద్ర మోడీతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుసమావేశం కాబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఆర్ధిక లోటుని పూడ్చేందుకు అవసరమయిన నిధులు వంటి అనేక హామీలను కేంద్రప్రభుత్వం అమలుచేయకపోవడంతో రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్ళి తక్షణమే ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీల అమలుచేయాలని ప్రదానిని చంద్రబాబు కోరబోతున్నారు. రాష్ట్ర విభజన వలన ఇప్పటికే రాష్ట్రం చాలా దెబ్బతింది. హామీల అమలుపై కేంద్రప్రభుత్వం ఇంకా ఆలస్యం చేసినట్లయితే రాష్ట్రంలో మళ్ళీ ఉవ్వెత్తున ఉద్యమాలు మొదలయితే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజెప్పి, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదాతో బాటు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి కూడా మంజూరు చేయాలని కోరబోతున్నారు. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఏవిధంగా స్పందిస్తారో మరికొన్ని గంటల్లోనే తెలియవచ్చును. ప్రధాని మోడీతో సమావేశం ముగిసిన తరువాత హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ లతో చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశం అవుతారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావలసిన నిధులు, ఇతర హామీల గురించి వారితో చర్చిస్తారు. కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమయ్యేందుకు వీలుగా చంద్రబాబు నాయుడు డిల్లీలో రెండు రోజులు ఉంటారు. మళ్ళీ బుదవారం విజయవాడకి తిరిగి వస్తారు.