వాళ్లిద్దరి వల్ల జగన్ కు బ్రేక్ పడిందా?
posted on Aug 24, 2015 @ 4:39PM
ప్రస్తుతానికి వైకాపా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కాలం కలిసి రానట్టుగానే కనపడుతోంది. ఏదో విషయం పై రాద్దాతం చేసి రాజకీయంగా బలపడుదామనుకునే జగన్ కు పాపం ఇప్పుడు ఆఛాన్స్ సరిగా దొరకడం లేదు. ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదాపై.. భూసేకరణపై తను పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా కాని అవి బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయి.
అసలు రాష్ట్ర విభజన చేసినప్పుడు యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ హామి ఇచ్చింది. అయితే ఎన్నికల తరువాత ఆపార్టీ తలరాతే మారిపోయంది. రాష్ట్రం ఇచ్చినందుకు తెలంగాణ మాత్రం సోనియమ్మ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు కాని ఓట్లు మాత్రం వేయలేదు. ఇక ఏపీలో ఆపార్టీ పరిస్థితి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఏదో ఒక విధంగా ప్రజలకు దగ్గరవ్వాలన్న నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎన్డీఏ ప్రభుత్వంపై ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడతానని చెప్పారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తునే ఆందోళన చేశారు. ఏకంగా ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. దీనిలో భాగంగానే ఈ నెల 29వ రాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. తేదీన కానీ రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా కోసం పోరాడతానని ప్రకటించిన తర్వాతే ఈ అంశంపై జగన్ స్పందించారనే ప్రచారం జరిగింది.
ఇప్పుడు భూసేకరణ విషయంలో కూడా అలాగే జరిగింది. ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం భూసేకరణ చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీని విమర్శించి ఏదో విధంగా పెద్ద ఆందోళన చేసేసి క్రెడిట్ కొట్టేద్దామనుకున్నారు. కానీ దానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వలేదు. తాను రైతులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకుందామనుకునే లోపలే పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతాల్లో ముఖ్యంగా భూసేకరణకు ఏపీ ప్రభుత్వం నోటీఫికేషన్లు జారీ చేసిన ప్రాంతాల్లో పర్యటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాదు.. రైతల దగ్గర నుండి భూములను తీసుకోవద్దని.. వారికి ఇష్టమైతేనే భూములు తీసుకోండని అంతేకాని బలవంతంగా భూములు తీసుకుంటే ఊరుకోనని పోరాడటానికైనా సిద్ధమని చెప్పారు. ఇలా జగన్ కు ఈ అవకాశం కూడా పోయింది.
మొత్తానికి జగన్ కు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూసుకుపోవాలని భావిస్తున్న జగన్ కు బాగానే బ్రేకులు పడుతున్నాయి. ఈ యువ నాయకులు జగన్క కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వడంలేదు. తను ముహూర్తాలు చూసుకొని.. అన్నీ ఆలోచించుకొని తీరిగ్గా వెళదాములే అనుకునేలోపు ఇతర పార్టీల నాయకులు దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ఇప్పుడు ఇంకేం కొత్త అంశంపై ఆందోళనలు చేస్తారో చూడాలి.