ఏపీకి "స్పెషల్" కాదు "స్పెషల్" 'స్పెషల్" స్టేటస్
posted on Aug 25, 2015 @ 3:03PM
ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై ఈ రోజు చర్చించిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో ఏపీ ప్రత్యేక హోదా ఇంకా స్పష్టత రాలేదు కానీ.. కేంద్రం మాత్రం విభజన చట్టంలో అన్ని హామీలు నెరవేరుస్తామని.. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని మాత్రం చెప్పింది. అయితే ఈ ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను మించిన ఆదరణ ఇస్తుందని.. ఏపీకి స్పెషల్ స్టేటస్ కాదు.. స్పెషల్ స్పెషల్ స్టేటస్ వస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా అన్న పదం వాడేందుకు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని రాయితీలు, ప్రయోజనాలు వస్తాయో, వాటన్నింటినీ సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు.
తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అప్పుడు ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చింది ఆ హామీని తప్పకుండా నెరవేర్చాలని అన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చుతామని కేంద్రం చెప్పిందని.. అలాగే ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని.. దీనిపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఉండగా మరోవైపు సుజనా చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్యాకేజీలతో కూడిన రాయితీలు ఉంటాయని సుజనా చేసిన వ్యాఖ్యలను బట్టి ఏపీకి ప్రత్యేక హోదా రావడం అనుమానంగానే ఉందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాక ఏపీకి ప్రత్యేక కాదు.. స్పెషల్ స్పెషల్ స్టేటస్ అని చేసిన వ్యాఖ్యలు కూడా నిజమేనా లేక వెటకారమా అని అనుకుంటున్నారు.