వైఎస్సార్ ఫోటో తొలగింపు.. అసెంబ్లీలో ఆందోళన

  ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ అలా మొదలైందో లేదో ఇలా వైసీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఆసెంబ్లీ ఆవరణలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటం తొలగించినందుకు వైసీపీ నేతలు రాజశేఖర్ రెడ్డి ప్లకార్డులు పట్టుకొని వైయస్‌ జోహార్‌ అంటూ నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టి నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆందోళనలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా కరవు, రైతు ఆత్మహత్యలు, తాగునీటి సమస్యపై వైకాపా ఇచ్చిన వాయిదాతీర్మానాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించారు. దీంతో వైకాపా నేతలు మరోసారి ఆందోళనలు చేయగా కరవు పరిస్థితులపై రేపు చర్చిస్తామని ప్రభుత్వం చెప్పిందని స్పీకర్‌ కోడెల తెలిపారు.

22 ఏళ్ళ తర్వాత చరిత్ర సృష్టించిన యంగ్ ఇండియా

టెస్ట్ క్రికెట్ లో ఉండే మజా ఏమిటో క్రికెట్ అభిమానులకు తెలియజెప్పింది భారత్ శ్రీలంక సిరీస్. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిచే స్థితిలోంచి ఓటమి చెందడం అప్పుడు భారత్ క్రికెట్ అభిమానులకు బాధకలిగించింది. దీంతో పట్టుదలతో ఆడిన టీం ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించింది.ఇక, సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే అనే లక్ష్యంతో మూడో టెస్ట్ బరిలోకి దిగిన రెండు జట్లు నేటితో చారిత్రాత్మక ఫలితాన్ని ఇచ్చాయి. ఐదు రోజుల క్రితం ప్రారంభమయిన మూడో టెస్ట్ తొలిరోజు వర్షం కారణంగా సరిగ్గా జరగపోయిన మిగిలిన నాలుగు రోజుల ఆటలో తొలి ఇన్నింగ్స్ లో టీం ఇండియా 312 పరుగులు చేయగా, శ్రీలంక 201 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా 274 పరుగులు చేయగా, 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నేడు 268 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఈ విజయంతో భారత్ 2-1తో సిరీస్ గెలుచుకోవడంతో పాటు 22 ఏళ్ళ తర్వాత తొలిసారిగా యువ భారత్ శ్రీలంక గడ్డపై సిరీస్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సీనియర్ల రిటైర్మెంట్ ల తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ సారధ్యంలోని ఈ యువ టీం ఇండియా సాధించడం విశేషం.

బాబు రాజీనామా చేసిన ప్రత్యేక హోదా రాదు..!!

ఎమ్.పి జెసి దివాకరరెడ్డి ఎప్పుడూ, ఎలా మాట్లాడుతాడో ఆయనకే తెలియాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం టిడిపి ఎంపిలను రాజీనామా చేయమంటున్న జగన్, ఎమ్.పిలంతా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వెంటనే తీసుకురాగలడా అని ఎమ్.పిలే కాదు, ముఖ్యమంత్రి రాజీనామా చేసినా ప్రత్యేక హోదా రాదని ఆయన స్పష్టం చేశారు. ఎపికి మెరుగైన ప్యాకేజీ వస్తుందని, అది బీహారు కంటే బాగుంటుందని ఆయన అబిప్రాయపడ్డారు. జగన్ సి.ఎమ్. అవుతానని ఎగిరెగిరి పడుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియకుండా చాలామంది మాట్లాడుతున్నారని జెసి వ్యాఖ్యానించారు. జగన్ కూడా మావాడేనని ఆయన ముక్తాయించడం విశేషం.

అసెంబ్లీ లో బూతులు..!!

    పవిత్ర దేవాలయమైన అసెంబ్లీలో వైకాపా సభ్యులు బూతులు మాట్లాడుతున్నారని...స్పీకర్ను సీఎంను తిడితే ఏదో గొప్ప అనుకుంటున్నారని...హుందాతనం కాపాడుకోవలని వైకాపా సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. జగన్ టీడీపీపై బురద జల్లేందుకు తెరాస కేసీఆర్ తో లాలూచీ పడ్డారని..జగన్ హరీష్ రావు ఎక్కడ సీక్రెట్ గా కలుసుకున్నారో..వారి రహస్య ఎజెండా డాక్యుమెంట్ కూడా తన వద్ద ఉందని చంద్రబాబు అన్నారు.   జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ నీ తండ్రి 25 ఎంక్వైరీలు వేసినా నన్నేమి చేయలేకపోయాడు...నువ్వు ఎవ్వరితో లాలూచీ పడినా నన్నేం చేయలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిప్పు లాంటోడినని..అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని అన్నారు. ఏ అవినీతి పరుడిని తాను వదిలిపెట్టనని..ఇందుకు సంబంధించిన చట్టం కూడా రెఢీ అవుతోందంటూ చంద్రబాబు జగన్ పై ఆగ్రహంతో ఊగిపోయారు.

అసెంబ్లీ లో మాటల యుద్ధం..అంతా గందరగోళం

అసెంబ్లీ రెండో రోజు జగన్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మధ్య ఆసక్తికర మాటల యుద్ధం జరిగింది. తమ సీఎం చంద్రబాబునాయుడు ఏపీని ఎలా అభివృద్ధి చేయాలా...నవ్యాంధ్రకు ఎలా నిధులు రాబట్టాలా అని ప్రతి రోజు హోం వర్క్ చేస్తుంటారని..అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి రోజు మనీ లాండరింగ్ కంపెనీలు..సూట్ కేసుల కంపెనీలు ఎలా పెట్టాలా అని హోం వర్క్ చేస్తుంటారని ఎద్దేవా చేశారు. జగన్ ఆయన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ విషయంలో బాగా ఆరితేరిపోయారని యనమల ఫైర్ అయ్యారు. అందుకే ప్రతి శుక్రవారం జగన్ జైలు దర్శనం చేసుకోవాల్సి వస్తోందని సెటైర్ వేశారు. ఇందుకు జగన్ స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ఓట్లకు కోట్ల మీద ఎక్కువగా హోం వర్క్ చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందుగా చంద్రబాబు ఓటుకు నోటు కేసు విషయంపై మాట్లాడుతూ ఒక రాష్ర్ట ప్రభుత్వంపై మరో రాష్ర్ట ప్రభుత్వం నిఘాపెట్టే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ధర్మం తనవైపు ఉందని..తాను ఎవ్వరికి భయపడాల్సిన పనిలేదని అన్నారు. తాను జీవింతో ఏ తప్పు చేయలేదని..తనతో పెట్టుకున్న వారంతా ఏమయ్యారో మీకు తెలుసని... రెండు కొంటే ఒకటి ఫ్రీ అన్న చందంగా జైలుకెళ్లిన ఘనత మీకే ఉందంటూ ప్రతిపక్షనేత జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు సెటైర్లు వేశారు.

ఎవరికి పడితే వారికి క్యాబినెట్ హోదా ఎలా ఇస్తారు?

ప్రభుత్వ సలహాదారులకు.. ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులకు.. వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ లకు కేబినెట్ హోదా కల్పిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎవరికి పడితే వారికి కేబినెట్ హోదా ఇవ్వటానికి వీల్లేదని స్పష్టం చేసింది. జీతాలు.. వసతులు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉన్నా.. కేబినెట్ హోదాలు మాత్రం ఇవ్వకూడదని పేర్కొంది.   కేసు విచారణలో భాగంగా.. రూల్స్ కు అనుగుణంగానే కేబినెట్ హోదా కల్పించామని.. జీతాలు.. సౌకర్యాల కోసం కేబినెట్ ర్యాంకు ఇచ్చినట్లుగా తెలంగాణ సర్కారు తరఫు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి చేసిన వాదనను హైకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. జీతాలు కావాలంటే ఇచ్చుకోవచ్చని.. సౌకర్యాలు కూడా కల్పించుకోవచ్చు తప్పించి.. ఎవరికి పడితే వారికి కేబినెట్ హోదా ఇవ్వకూడదని స్పష్టం  చేసింది.   సలహాదారులు.. ఇతర హోదాలలో తీసుకున్న వారు మంత్రులతో సమానంగా కాదని స్పష్టం చేసిన హైకోర్టు వాదన.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎంతోమంది మంత్రుల మనసులకు కాసింత ఊరట ఇవ్వటం ఖాయమన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రమాదానికి గురయిన తెదేపా ఎంపీ గల్లా జయదేవ్

  గుంటూరు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఒక స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేసే ముందు దానిని టెస్ట్ రైడ్ చేయబోయి దానిపై నుండి జారి క్రింద పడ్డారు. ఆయన వెన్నెముక, కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. ఆయనని హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వెన్నెముకకి కొంచెం లోతుగా గాయం అవడంతో దానిని సరి చేయడానికి చిన్న శస్త్ర చికిత్స చేయవలసి వస్తుందని సమాచారం. కానీ కంగారు పడవలసిందేమీ లేదని వైద్యులు స్పష్టం చేసారు. తెదేపా నేత నారా లోకేష్ అపోలో ఆసుపత్రికి వెళ్లి గల్లా జయదేవ్ ని పరామర్శించారు.

వైకాపాకు బాబు వార్నింగ్..!!

ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేయాలని చూసే జగన్ లాంటి వాళ్లను చాలా మందిని చూశానని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అసెంబ్లీ వాయిదా పడ్డ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట పై ఈ రోజు అసెంబ్లీ లో జగన్ చేసిన వ్యాఖలను తప్పుబట్టారు బాబు.   పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాటకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని, ఆరోజు ఏ ప్రభుత్వమూ స్పందించనంత వేగంగా స్పందించానని, పీఠాధిపతి పుష్కర ఘాట్ లో ఉండబట్టే తాను కూడా అక్కడికే వెళ్లానుతప్ప మరే ఇతర కారణాలూ చెప్పారు. జగన్ మంచి సలహాలు ఇస్తే హర్షించి ఉండేవాడినని, కానీ వాస్తవానికి అలా జరగడం లేదని, ఇది రాష్ట్రమంతటికీ దురదృష్టకరమని అన్నారు. అలాగే ప్రతిపక్షంగా ఏది పడితే అది మాట్లడోచ్చని జగన్ అనుకుంటున్నారని, పదే పదే రెచ్చ గొట్టే ధోరణిలో మాట్లాడటం సరికాదని, అది ఆయన అపరిపక్వతకు నిదర్శనమని అన్నారు. అయితే, ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేయాలనేది జగన్ ఉద్దేశమని, ప్రతీ దానికి ఓ లిమిట్ ఉటుందని, ఆ లిమిట్ ను దాటితే మాత్రం సహించబోమని, అధికార పక్షంగా ఏం చేయాలో ఆ విదంగా  యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు బాబు. పద్దతిగా ఉండాలని ఈ సందర్భంగా విపక్షానికి సూచనా చేశారాయన.

చంద్రబాబుకు జగన్ సవాల్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదలైన తొలిరోజే గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేత జగన్, ఏపీ సీఎం చంద్రబాబు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. హత్యరాజకీయాల ప్రస్తావన కూడా మరోసారి తెరమీదకొచ్చింది. ఈ విమర్శల పర్వంలోనే జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.   ప్రత్యేక హోదా చర్చ సందర్భంగా మాట్లాడిన బాబు.. లోక్ సభలో నాడు కాంగ్రెస్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని, ఎంపీలుగా ఉన్న జగన్, మేకపాటి ఆ నోటీసును వెనక్కి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అయితే.. బాబు చేసిన ఈ స్టేట్ మెంట్ పై ఏమాత్రం వాస్తవం లేదని జగన్ ఖండించారు. చంద్రబాబు సభలో మాట్లాడిన మాటలు స్టేట్ మెంట్ లో లేవన్నారు. ఒకవేళ.. ఎక్కడైనా ఉన్నాయని నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని.. లేకుంటే బాబే రాజీనామా చేయాలని జగన్ సవాల్ విసిరారు. స్టేట్ మెంట్ లో ఒకటి ఉంటే చంద్రబాబు ఇంకొకటి మాట్లాడారని చెప్పారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్.. సభలో తమకు వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోవం చాలా దారుణమన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజలను చంద్రబాబు సందేహంలో పడేశారని ఆరోపించారు. ఇలాంటి సభను తానెక్కడా చూడలేదని మండిపడ్డారు. ఆయన చేసేవన్నీ దిక్కుమాలిన రాజకీయాలని, సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

జగన్ కు చంద్రబాబు పంచ్

ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారికి అసెంబ్లీ సంతాపం తెలిపింది. దీనిపై జగన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వారు ఆత్మహత్యలు చేసుకోలేదని... కేవలం చంద్రబాబు నాయుడు బీజేపీ మంత్రులు ఇస్తున్న స్టేట్ మెంట్ల పై నమ్మకం లేకే వారు ఆవేదనతో చనిపోయారని జగన్ విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన సీఎం చంద్రబాబు యూపీఏ ప్రభుత్వం రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నప్పుడు ఎంపీగా ఉన్న జగన్మోహ్న్ రెడ్డి ఏం చేశారని..ఆయన పార్లమెంటులో ఎక్కడ దాక్కున్నారంటూ ఎద్దేవా చేశారు.   పార్లమెంటు సమావేశపు హాలు తలుపులు మూసేసి మరీ రాష్ర్ట విభజన చేస్తుంటే జగన్ పార్లమెంటులో కూర్చుని ఏం చేశాడని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంత్రి వెంకయ్యనాయుడు రాష్ర్టానికి అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే అప్పుడు యూపీఏ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

జగన్ పై మండిపడ్డ స్పీకర్

పుష్కర తొక్కిసలాట మృతుల సంతాపం తీర్మానం సందర్భంగా వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యల పై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే స్పీకర్ మైకులు కట్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు.స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.దీని పై స్పందించిన స్పీకర్ జగన్ పై అగ్రహం వ్యక్తం చేశారు.సభలో ప్రతిపక్ష నేత హుందాగా వ్యవహరించాలని ..సభను,సభావతిని అవమానపరిచేలా మాట్లాడటం తగదని జగన్‌కు సూచించారు.సంతాప తీర్మానాల్లో రాధ్దాంతం సృష్టించడం సభా సంప్రధాయాలకు విరుద్దమన్నారు.జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించేకోవాలని స్పీకర్ సూచించారు.

చంద్రబాబు మేకప్ వేసుకొని, హీరోలా..

సోమవారం శాసనసభ సమావేశాల్లో పుష్కరాల తొక్కిసలాటలో చనిపోయిన మృతులకు సంతాప తీర్మానం సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమండ్రి పుష్కరాలలో తొక్కిసలాటలో మరణించినవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రధ్దాంజలి ఘటించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విపక్ష నేత జగన్ అన్నారు. విఐపి ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ కోసం పుష్కర ఘాట్ లో స్నానానికి వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు మేకప్ చేసుకుని వచ్చారని , సినిమాలో హీరోలా కనిపించాలని ఆయన ప్రయత్నం చేస్తూ సామాన్యులకు కేటాయించిన ఘాట్ వద్దకు చంద్రబాబు వచ్చారని అన్నారు.   మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సంతాప సందేశం కాకుండా మొత్తం అంతా మాట్లాడి ,ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఫ్యాక్షన్ సందేశం ఇస్తున్నారని యనమల ఆరోపించారు. ఇది సంతాప సందేశంగా కనిపించడం లేదని, పరిమితంగానే మాట్లాడాలని, వేరే చర్చలో వీటిని మాట్లాడవచ్చని అన్నారు.   జగన్ మాట్లాడుతూ..మనిషిని పొడిచి, ఆ తర్వాత దండలు వేసినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.సభలో దీనిపై గందరగోళంగా మారింది. కోడెల మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, మొత్తం శాసనసభపై ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని అన్నారు.శాసనసభపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కోడెల అన్నారు.తాను చంద్రబాబుపై ఆరోపణ చేస్తే శాసనసభపై ఆరోపణలు చేస్తున్నట్లు చెబుతున్నారని అన్నారు.

అబ్దుల్ కలాం మృతికి ఏపీ అసెంబ్లీ నివాళి

భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాంకు ఏపీ అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. సంతాప తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశ పెట్టారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలని సూచించారు. రాష్ట్రపతి పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కలాం అన్నారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు కలాం ప్రయత్నించారని బాబు తెలిపారు. ఒంగోలులో ట్రిపుల్‌ఐటీకి అబ్దుల్‌కలాం పేరు పెడతాం ప్రకటించారు. చదువుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అబ్దుల్‌కలాం పేరుతో పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. భరతమా ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం అని ప్రతిపక్ష నేత జగన్ పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం కలాం మృతికి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా జనగ్ ప్రసంగించారు. ఆయన మృతి చెందడం తనకే కాకుండా దేశాన్ని కలిచివేసిందన్నారు. అబ్దుల్‌కలాం సాధారణ జీవితం గడిపారని చెప్పారు. రాష్ట్రపతి పదవి అనంతరం ఉపాధ్యాయుడిగా జీవితం కొనసాగించారని జగన్ అన్నారు.