bus falls through a large crater in northern Brazil

బ్రెజిల్లో వెరైటీ యాక్సిడెంట్

  బ్రెజిల్లో ఒక వెరైటీ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఎవరూ చనిపోలేదు కాబట్టి ‘వెరైటీ’ అని అంటున్నాం. బ్రెజిల్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో ఓ నది పక్కనే మట్టిరోడ్డు వుంది. దాని మీద వాహనాలు నిరంతరం ప్రయాణిస్తూ వుంటాయి. ఈమధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీరు భారీగా చేరింది. బుధవారం నాడు ఆ నదిలో నిరూ మట్టిరోడ్డు కిందకి చేరుకుంది. దాంతో రోడ్డు మధ్యలో పెద్ద రంధ్రం పడింది. సరిగ్గా అదే సమయానికి నిండుగా ప్రయాణికులతో వున్న బస్సు ముందు చక్రాలు ఆ రంధ్రంలో ఇరుక్కుపోయాయి. ఈ విషయాన్ని గమనించిన ఆ బస్సులో వున్నవారందరూ చకచకా కిందకి దిగేశారు. ఆ తర్వాత క్షణాల్లోనే ఆ బస్సు రంధ్రంలో పడిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బస్సులో ఎవరైనా వుంటే ఒక్కరు కూడా బతికేవారు కాదు. తాము ఎక్కిన బస్సు క్షణాల్లో నీటిలో కొట్టుకుపోవడం చూసిన బస్సు ప్రయాణికులందరూ వామ్మో అని గుండెల మీద చేతులు వేసుకున్నారు.

MLC elections

టీచర్స్ ఎమ్మెల్సీగా రామకృష్ణ గెలుపు

  గుంటూరు-కృష్ణా జిల్లాల టీచర్స్ శాసనమండలి స్థానానికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఏఎస్ రామకృష్ణ గెలుపొందారు. ఏఎస్ రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై తొలి ప్రాధాన్యత ఓటుతో ఆయన విజయం సాధించారు. యూటీఎఫ్ తరపున బరిలోకి దిగిన ఏఎస్ రామకృష్ణకు 6986 ఓట్లు రాగా, కేఎస్ లక్ష్మణరావుకు 5037 ఓట్లు వచ్చాయి. తన ఓటమిని అంగీకరిస్తున్నట్టు లక్ష్మణరావు తెలిపారు.అటు తెలంగాణ జిల్లాలో నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్‌ ఫలితం సాయంత్రానికి వెలువడనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాత్రంతా కౌంటింగ్‌ కొనసాగనుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి రౌండ్‌ కౌంటింగ్‌ జరుగుతోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఆధిక్యంలో వున్నారు.

renuka chowdary followers

రేణుకా చౌదరి అనుచరులకు చెప్పుదెబ్బలు

  కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అనుచరుల మీద చెప్పుదెబ్బ పడింది. ఇటీవల రేణుకా చౌదరి మీద ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ జీ అనే కాంగ్రెస్ నాయకుడు ఇటీవల మరణించాడు. ఆయనకు గత ఎన్నికలలో కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పిస్తానని రేణుకా చౌదరి కోటి పది లక్షలు వసూలు చేశారని రామ్ జీ భార్య లీల ఆరోపించారు.ఈ మేరకు ఆమె రేణుకా చౌదరి మీద ఆమె కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఖమ్మంలో రేణుకా చౌదరి అనుచరులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి లీల వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు, రేణుకా చౌదరి అనుచరులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో లీల రేణుకా చౌదరి అనుచరులను చెప్పుతో కొట్టారు.

madhyapradesh

ఎం.పి. గవర్నర్‌ కుమారుడి హత్య?

  మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. 2013 సంవత్సరంలో సంచలనం సృష్టించిన ఎంపీపీఇబి (మధ్యప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డు) కుంభకోణంలో శైలేష్ యాదవ్ ఒక నిందితుడు. ఈ మధ్యే ఈ విషయం బయటపడింది. ఈ కుంభకోణంలో శైలేష్ యాదవ్ హస్తం వుండటంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసినప్పటికీ రామ్ నరేష్ యాదవ్ తన పదవిని విడిచిపెట్టలేదు. ఈ కేసు ఇంకా విచారణలో వుండగానే శైలేష్ యాదవ్ మరణించడం సంచలనాన్ని సృష్టించింది. తన నివాసంలో అనుమానాస్పదంగా మరణించి వున్న శైలేష్ యాదవ్‌ను పోలీసులు కనుగొన్నారు. ఈ అనుమానాస్పద మరణం హత్యేనని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. శైలేష్ యాదవ్ మరణవార్త వినగానే గవర్నర్ రాంనరేష్ షాకై అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

Sydney Anushka Sharma

విరాట్ చెంతకు అనుష్క

  బీసీసీఐ క్రికెటర్లకు వారి భార్యలను, ప్రియురాళ్లను కలిసే విషయంపై నిషేదం ఎత్తివేసిందని మనకు తెలిసిందే. అయితే అలా ఛాన్స్ ఇచ్చిందో లేదో ఇలా అనుష్కశర్మ సిడ్ని చేరుకుందట. 26న జరిగే సెమీ ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. తన లవర్ ఆడబోయే ఆటను దగ్గరుండి మరీ చూసేందుకే అక్కడికి వెళ్లిందట ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే కొంత మంది భార్యలు సిడ్నీ చేరుకున్నారు. అనుష్కను తను ప్రేమిస్తున్నట్టుగా కొద్ది రోజుల క్రితమే కోహ్లి చెప్పిన విషయం తెలిసిందే. ముందు జరిగిన రెండు, మూడు మ్యాచుల్లో సెంచరీ కొట్టని విరాట్ కోహ్లీ అనుష్కశర్మ రాకతో ఈ మ్యాచ్లో అయినా సెంచరీ కొడతాడేమో చూద్దాం.

rajendra prasad pannel

నటుడు రాజేంద్రప్రసాద్‌కి షాక్

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల స్థాయిలో పోటాపోటీగా జరుగుతున్న విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదవి కోసం నటి జయసుధ, నటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడుతున్నారు. అయితే జయసుధ వైపే సినిమా పరిశ్రమ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలలో మా ప్యానల్‌నే గెలిపించండంటే జయసుధ, రాజేంద్రప్రసాద్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్‌కి ఒక షాక్ తగిలింది. రాజేంద్ర ప్రసాద్ ప్యానల్లో జనరల్ సెక్రటరీగా శివాజీరాజా, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ పోటీలో నిలిచారు. అయితే బుధవారం నాడు వీరిద్దరూ తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఇది రాజేంద్రప్రసాద్‌కి షాక్ లాంటిదే.

telangana assembly

ఆంధ్రా నేతల బూట్లు నాకారు...

  ఈ మధ్య అసెంబ్లీల్లో చర్చల కంటే గొడవలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు మన నాయకులు. తెలంగాణా అసెంబ్లీలో బుధవారం మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్టు అంశంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మళ్లీ నోటికి పని చెప్పారు. డీకె అరుణ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన జగదీశ్ రెడ్డి చాలా నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. దీనికి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ... ఆంధ్రా నేతల బూట్లు నాకారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలకు సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలంటూ స్పీకర్ పోడీయం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.

love couple suicide train khammam

ట్రైన్ కింద పడిన ప్రేమజంట

  ప్రేమ ప్రాణాలు పోస్తుందని అంటారు.. కానీ ప్రేమ ప్రాణాలు తీస్తోంది. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేమ కారణంగా ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ప్రేమ కారణంగా ప్రాణాలు తీసుకున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇదిలా వుంటే, బుధవారం నాడు ఖమ్మం జిల్లాలో ఒక ప్రేమ జంట రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. బాగా చదువుకున్నవారైనప్పటికీ క్షణికావేశంతో ప్రాణాలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్, నీలిమ వరంగల్లోని ఎస్ఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దల నుంచి అంగీకారం లభించలేదో, మరో కారణం ఏదైనా ఉందోగానీ, వీరిద్దరూ బుధవారం ఉదయం ఖమ్మం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా  పెద్దపోతల పాడు గ్రామానికి చెందిన మాధవి (20), సుమన్ (20) కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

maa president jayasudha

పట్టుదలతోనే పోటీలో... జయసుధ...

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి నట కిరిటీ రాజేంద్రప్రసాద్, సహజనటి జయసుధ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజేంద్రప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటానికి జయసుధను తప్పుకోమని చాలామందే చెప్పారంట కానీ జయసుధ మాత్రం పోటీ నుండి తప్పుకోలేదు. ఈ విషయం పై జయసుధ మాట్లాడుతూ నన్ను పోటీ నుండి తప్పుకోమని రాజకీయ నాయకులు నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అసలు ఓ మహిళ ఎందుకు పోటీ చేయకూడదనే పట్టుదలతోనే పోటీకీ దిగానని చెప్పారు. ఈ నెల 29న జరగనున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ జయసుధకు మద్దతు ఇస్తున్నారు. ‘‘జయసుధగారు అందరికన్నా సీనియర్. ఆమె చాలా సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఓ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఈ ప్యానెల్ కమిటీలో ఈ సారి ఏడుగురు మహిళలను తీసుకున్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా మంచు లక్ష్మీ, శివకృష్ణ ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు’’ అని తెలిపారు. కృష్ణంరాజు కూడా తన మద్దతు జయసుధకే అని ప్రకటించారు.

Greater Hyderabad Municipal Elections

గ్రేటర్ హైదరాబాద్ వార్డులు 175 కాదు 200?

  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ బోర్డు పదవీకాలం గత ఏడాది డిశంబర్ 3వ తేదీన ముగిసింది. కానీ ఇంతవరకు దానికి ఎన్నికలు నిర్వహించలేదు. పెరిగిన జనాభాకి అనుగుణంగా ప్రస్తుతం కార్పోరేషన్ పరిధిలో ఉన్న 150 వార్డులను పునర్విభజనచేసి వాటిని 175కి పెంచాలని భావిస్తునందున ఎన్నికలు నిర్వహించడంలో ఆలశ్యం జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించుకొని ఇంతకాలం ఎన్నికలను వాయిదా వేసుకొంటూ వచ్చింది. కానీ హైకోర్టు ధర్మాసనం ఒక పిటిషన్ పై స్పందిస్తూ తెలంగాణా ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది. రెండు వారాలలో తనకు ఎన్నికల షెడ్యూల్ సమర్పించకపోయినట్లయితే తనే స్వయంగా ఆపని చేయవలసి వస్తుందని హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా అందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కానీ ఇంతకు ముందు అనుకొన్నట్లుగా కార్పోరేషన్ పరిధిలో ఉన్న 150 వార్డులను 175కి బదులు ఏకంగా 200కి పెంచబోతున్నట్లు తాజా సమాచారం. ఆవిధంగా చేయడం వలన ఒక్కో వార్డులో సుమారు 30,000 మంది ఓటర్లు ఉంటారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో ప్రస్తుతం సుమారు 70 నుండి 80 వేల జనాభా ఉంది. కనుక అక్కడ కొత్తగా రెండు వార్డులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీలయినంత త్వరలో ఈ వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.

Legislative Council

నేడే శాసన మండలి ఎన్నికల ఫలితాలు

  ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో చెరో రెండు శాసనమండలి స్థానాలకు మొన్న ఆదివారంనాడు ఎన్నికలు జరిగాయి. ఈరోజు వాటి ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడించబడుతాయి. రెండు రాష్ట్రాలలో జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పట్టభద్రుల నియోజకవర్గాలలో పోలయిన ఓట్లను కాకినాడలో గల రంగరాయ మెడికల్ కళాశాలలో, అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో పట్టభద్రుల నియోజకవర్గాలలో పోలయిన ఓట్లను గుంటూరులో సెయింట్ జోసెఫ్ మహిళా బీఈడి కళాశాలలో లెక్కించనున్నారు.   తెలంగాణా రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం జిల్లాలలో పట్టభద్రుల నియోజకవర్గాలలో పోలయిన ఓట్లను నల్గొండలో గల నాగార్జున ప్రభుత్వ కళాశాలలో, హైదరాబాద్, రంగారెడ్డి, మెహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గాలలో పోలయిన ఓట్లను హైదరాబాద్ లో గల విక్టరీ ఇండోర్ స్టేడియంలో లెక్కించబడతాయి. ఈ నాలుగు చోట్ల ఒకేసారి ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

gujarath driving licence

ఇకనుంచి సెన్సార్లతో డ్రైవింగ్ లైసెన్స్

  మామూలుగా డ్రైవింగ్ లైసెన్సు తీసుకొవాలంటేనే నానా రకాల ఫ్రూఫ్ లు, డ్రైవింగ్ టెస్టులు ఉంటాయి. కానీ గుజరాత్ ఇకనుండి అలాకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కొత్త సిస్టమ్ ను ప్రవేశపెట్టనుంది. అక్కడి ఆర్టీఓ సెన్సార్లతో పనిచేసే ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ను దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉపయోగించనుందని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ రుపానీ తెలిపారు. డ్రైవింగ్ సరిగ్గా ఉందని సెన్సార్లు గుర్తించి అభ్యర్ధి ఆ పరీక్షలో పాసయితేనే లైసెన్సు వస్తుంది లేకపోతే అంతే సంగతులు. ముందుగా అన్ని ప్రముఖ నగరాల్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. తరువాత అన్ని ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నారు.

వాట్సప్‌ కలిపింది అందరిని

సామాజిక మాద్యమాల వల్ల నష్టం ఎంత ఉన్నా కొంత లాభం కూడా ఉంది. ఇవి కేవలం ఫొటోలు పోస్టు చేసుకోవడానికి, చాట్ చేసుకోవడానికే కాదు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అలా పదహారేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది వాట్సప్. ఈ ఘటన చెన్నైలో తిరువొత్తియూర్లో జరిగింది. వివరాల ప్రకారం తిరువొత్తియూర్ కు చెందిన దామోదరన్, సుందరి దంపతులకు ఆరుగురు కొడుకులు. వీరందరూ 1999లో పుదుచ్చేరిలో ఒక వివాహ వేడుకకు వెళ్లగా ఆ సమయంలో దామోదరన్ ఐదో కొడుకు శిగామణి (7) తప్పిపోయాడు. శిగామణి కోసం తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. ఎన్నో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. కొన్నాళ్లు కుమారుడి కోసం దామోదరన్ కుటుంబం పుదుచ్చేరిలోనే ఉన్నారు. కానీ ఎటువంటి ఉపయాగం లేకుండా పోయింది. శిగామణి ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే పుదుచ్చేరిలో తప్పిపోయిన శిగామణి చెన్నైలోని ఒక అనాధ శరణాలయానికి చేరుకొని అక్కడే ఇన్ని సంవత్సరాలు జీవనం గడిపాడు. ఇప్పుడు శిగామణికి 23 సంవత్సరాలు. ఎలాగైనా తన తల్లిదండ్రులను కలవాలనే ఆకాంక్షతో తన వివరాలను ఆడియో రికార్డు చేసి వాట్సప్‌లో పెట్టాడు. అలా ఈ సందేశం తిరువొత్తియూర్‌లోని శిగామణి తల్లిదండ్రులకు చేరగా వారు వాట్సప్ నంబరు ద్వారా శిగామణిని సంప్రదించి ఎట్టకేలకు కలుసుకున్నారు.

జల ప్రాజెక్టుల విలన్... జగన్

  ఆంధ్రపదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పట్టిసీమ ప్రాజెక్టు పై టీడీపీ, వైకాపా ఇరు పక్షాలు గొడవపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో శాసనమండలి ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన పులివెందులలోనే ఈ ర్యాలీ జరగడం విశేషం. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్ పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుపడుతున్నారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు కృష్ణా జలాలు వస్తాయని, లేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని అన్నారు. వైఎస్ కుటుంబం వల్లే పులివెందుల ఫ్యాక్షన్ కు కేంద్రం అన్న అపఖ్యాతి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్

  ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. దాంతో దక్షిణాఫ్రికా ఇంటికి, న్యూజిలాండ్ ఫైనల్‌కి చేరుకున్నాయి. సెమీ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 43 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగించి మ్యాచ్‌ని 43 ఓవర్లకు పరిమితం చేశారు. ఈ 43 ఓవర్లలో న్యూజిలాండ్ 298 పరుగులు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. న్యూజిలాండ్ తన ఇన్నింగ్స్‌ని చాలా దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ మెక్కల్లమ్ కేవలం 22 బంతుల్లో 50 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత 59 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ పరుగుల వేటలో వెనుకబడింది. ఒక దశలో ఓడిపోతుందేమోనన్న సందేహాలు కూడా కలిగించింది. ఎట్టకేలకు 42.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. చివరి బాల్‌కి సిక్స్‌తో న్యూజిలాండ్ విజయం సాధించింది. ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి న్యూజిలాండ్ ఫైనల్‌కి చేరుకుంది. గురువారం జరిగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా - ఆస్ట్రేలియా పోటీ పడనున్నాయి.