మహాకూటమికి పూర్తి ఆధిక్యం

  బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ ప్రారంభంలో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత నితీష్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమి ఆధిక్యాన్ని సాధించింది. మహా కూటమి ఆధిక్యంలోకి వచ్చినప్పటి నుంచి వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకుని వెళ్తూనే వుంది. ఆదివారం ఉదయం పదిన్నర సమయానికి మహా కూటమి 155 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఎన్డీయూ కూటమి 79 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో వుంది. అంటే, ఎన్డీయే కూటమి కంటే రెండింతల ఆధిక్యంలో మహాకూటమి వుంది. కౌటింగ్ ప్రారంభ సమయంలో ఆధిక్యం వచ్చిన సందర్భంగా బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది. ప్రస్తుతం మహా కూటమి కంటే ఎన్డీయే కూటమి కంటే బాగా వెనుకబడి వుండటంతో ఎన్డీయే వర్గాలు తలలు పెట్టుకున్నాయి. అయితే ముందు ముందు ఎన్డీయే కూటమి ముందంజలోకి వచ్చే అవకాశం వుందన్న ఆశాభావంతో ఎదురుచూస్తున్నాయి.

సీఎం కుర్చీ ఇస్తే పుచ్చుకుంటా

  ఒకపక్క బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతూ వుంటే, నోటికి వచ్చినట్టు మాట్లాడే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మరో కామెడీ కామెంట్ చేశారు. ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే తనకు బీహార్ ముఖ్యమంత్రి సీటు ఇస్తే పుచ్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఆదివారం ఉదయం తొమ్మది గంటల 30 నిమిషాల వరకు జరిగిన కౌంటింగ్‌లో ఎన్డీయే కూటమిలో వున్న బీజేపీ 67 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. మాంఝీ నాయకత్వంలోని హెచ్ఎఎం పార్టీ ఎనిమిది స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో వుంది. ఒకవేళ ఎన్డీయే గెలిస్తే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో వున్న బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలామంది వున్నారు. అలాంటిది మాంఝీకి మరోసారి ముఖ్యమంత్రి అయిపోవాలని కోరిక పుట్టడం విచిత్రమే.

రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యేనట

  వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు వారి ఇంట్లోని బెడ్‌రూమ్‌లో సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ నాలుగు మరణాలు హత్యలని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోస్టుమార్టం వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం సారిక తన ముగ్గురు కుమారులతో కలసి ఆత్మహత్య చేసుకుంది. గ్యాస్ సిలెండర్లను తానే బెడ్‌రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి, గ్యాస్ లీక్ చేసి నిప్పంటించుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. రాజయ్య, ఆయన కుమారుడు అనిల్, రాజయ్య భార్య మాధవి, అనిల్ రెండో భార్య సన పెట్టే చిత్ర హింసలను భరించలేకే సారిక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

బీహార్ ఓట్ల లెక్కింపు... ఎన్డీయే ఆధిక్యం

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐదు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని మహా కూటమి కంటే ఆధిక్యంలో వుంది. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయానికి ఎన్డీయే కూటమి 62 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. మహా కూటమి 55 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. పార్టీల వారీగా చూస్తే జేడీయు 20 స్థానాల్లో, ఆర్జేడీ 25, కాంగ్రెస్ 7, బీజేపీ 48, ఎల్‌జెపి 6, హెచ్ఏఎం 7, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు.

కూచిభొట్లని చూసి నేర్చుకోండి తెలుగు తమ్ముళ్ళూ!

పదేళ్ళ విరామం తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పదేళ్ళపాటూ తెలుగుదేశం పార్టీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో తమ పనులు అవుతాయని ఆశలు పెట్టుకున్నారు. అయితే తమ పార్టీ పవర్లో వున్నా  తమకు సంతృప్తి లేకుండా పోయిందని, అధికారుల నుంచి తమకు అస్సలు స్పందనే లభించడం లేదని చాలామంది నాయకులు, కార్యకర్తలు బాధపడిపోతున్నారు. అయితే అలా బాధపడిపోయేవారంతా తమలోనే ఏదో తప్పుందని అర్థం చేసుకోవాలి. అధికారుల నుంచి పనులు చేయించుకునేవాళ్ళు ఎలా చాకచక్యంగా చేయించుకుంటున్నారో చూసయినా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్... అమెరికా నుంచి వచ్చిన కూచిభొట్ల ఆనంద్‌నే చూడండి. తెలుగుదేశం ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో అలా కూచిపూడి నాట్యారామం ప్రాజెక్టు సొంతం చేసేసుకున్నారు. దాంతోపాటు క్యాబినెట్ ర్యాంకు కూడా పొందేశారు. తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధం లేకపోయినా అధికారుల నుంచి పనులు ఎలా చకచకా చేయించుకున్నారో ఆయన్ని చూసి నేర్చుకోవాలి. నిన్నగాక మొన్న నవంబర్ రెండున ఆయన ప్రభుత్వానికి ఓ అప్లికేషన్ పెట్టారు.. కూచిపూడిలో ఓ ఆస్పత్రి పెడతాను స్థలం మంజూరు చేయండీ అని... అంతే... ఎమ్మార్వో దగ్గర్నుంచి రెవిన్యూ శాఖ పెద్ద అధికారుల వరకు ఫైలు చకచకా కదిలింది. అప్లికేషన్ పెట్టిన రెండ్రోజుల్లోనే... అంటే నవంబర్ 4న ఆయనకు కూచిపూడిలో ఒక ఎకరం ఎనిమిది సెంట్ల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. అప్లికేషన్ పెట్టిన రెండ్రోజుల్లోనే భూమి కేటాయింపు కూడా జరిపించుకోవడం మాటలా? అది కూచిభొట్ల ఆనంద్‌కే చెల్లింది.  మేధావితనం అంటే అలా వుండాలి. ఎప్పుడొచ్చాం.. ఎక్కడినుంచి వచ్చాం అనేది ముఖ్యం కాదు.. పనులు అవుతున్నాయా లేదా అనేది ముఖ్యం. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు  కూచిభొట్ల ఆనంద్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. అధికారుల నుంచి పనులు చేయించుకునే విషయంలో ఆయన నుంచి ట్రైనింగ్ తీసుకున్నా తప్పు లేదు. అయితే ఓ పని చేయొచ్చు... టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ కార్యకర్తలకు శిక్షణా క్లాసులు నిర్వహిస్తూ వుంటారు కదా... ఈసారి ఎప్పుడైనా అధికారుల చేత పనులు ఎలా చేయించుకోవాలనే అంశంలో తెలుగు తమ్ముళ్ళకు కూచిభొట్ల ఆనంద్ చేత శిక్షణ ఇప్పించమని అడగాలి. అదృష్టం బాగుండి కూచిభొట్ల ఆనంద్ తెలుగు తమ్ముళ్ళకు శిక్షణ ఇస్తే, ఇక పనులు కావడం లేదని బాధపడిపోకుండా అందరూ హ్యాపీగా వుండొచ్చు.  

టీ పోలీసు శాఖలో పోస్టుల భర్తీ.. టీ సిలబస్ తప్పనిసరి

తెలంగాణలో 9000 పోలీసు ఉద్యోగాలకుగాను పోస్టుల భర్తికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులపై కేసీఆర్ సంతకాలు కూడా చేశారు. సివిల్ విభాగంలో మూడవ వంతు మహిళలకు కేటాయించారు. మొత్తం పోలీస్ శాఖకు.. 8360 ఎస్పీఎఫ్ కు.. 186  ఫైర్ సర్వీస్.. 510 పోస్టులకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈసారి ఆర్మీ తరహాలో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించనున్నారు. దేహాధారుడ్య టెస్ట్ లో మాత్రం కొంచెం మార్పు చేసినట్టు తెలుస్తోంది..దీనిలోభాగంగానే పరుగు పందెం రద్దు చేశారు. అంతేకాదు ఈసారి సిలబస్ లో తెలంగాణ చరిత్ర గురించి కూడా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

దావూద్ తో సంబంధాలు.. పేర్లు బయటపెట్టిన చోటారాజన్?

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సీబీఐ అర్ధరాత్రి ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఐదు రోజుల కస్టడీ విధించింది. అయితే చోటా రాజన్ ను అరెస్ట్ చేసినప్పుడు.. తనను ముంబై కాదు ఢిల్లీ తీసుకెళ్లమని.. ముంబై పోలీసుల్లో చాలా మంది దావుద్ తో కుమ్మక్కయారని చెప్పిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న రాజన్ ముంబై పోలీసులలో ఎవరెవరికి దావూద్‌తో సంబంధాలు ఉన్నాయో వాళ్ల పేర్లన్నీ బయటపెట్టాడని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇంకా చోటా రాజన్ విచారణలో ఏం నిజాలు భయటపడతాయో చూడాలి.

కేసీఆర్ నాకు జీతం ఇవ్వడంలేదు.. చెప్పినట్టు చేయడానికి..

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల తొలగింపుపై ఇప్పటికే చాలా రకాల విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ మండిపడ్డారు. గతంలో ఓట్ల తొలగింపుపై కావాలనే ఓట్లు తొలగించారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల వల్లే అధికారులు ఓట్లు తొలగించారని విమర్శించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. కేసీఆర్ ఆదేశాలు పాటించేందుకు నేను ఆయన కింద పనిచేయడంలేదు.. ఆయన చెప్పినట్టు వినడానికి.. ఆయన నాకు జీతం ఇవ్వడంలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నేనేమి తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ను కాను.. అయినా ఆయనకు భయపడి ఓట్లను తొలగించాల్సిన అవసరం నాకేంటి అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ నేను చాలా చోట్లకు బదిలీ అయ్యాను.. అందుకు ముఖ్యమంత్రులు చెప్పినట్టు వినకపోవడమే కారణమంటూ చెప్పుకొచ్చారు. 

ఒకే ఒక్క మాట చోటా రాజన్ ను పట్టించిందా?

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ఇండోనేషియాలోని పోలీసులకు చిక్కడం.. అక్కడి నుండి ఇండియాకి తీసుకురావడం.. 5 రోజుల కస్టడీ విధించడం అందరికి తెలిసిందే. అయితే దేశ దేశాలని గడ గడలాడించిన డాన్ అంత తేలికగా పోలీసులకు ఎలా చిక్కాడా అని అందరి సందేహం. అయితే ఈ ప్రశ్నకు ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. చోటా రాజన్ కావాలనే లొంగి పోయాడని.. తన ఆరోగ్యం బాలేని నేపథ్యంలో తనే పోలీసులకు చిక్కాడని అంటున్నారు. కానీ చోటా రాజన్ ఎలా పట్టుబడ్డాడో పోలీసులు చెబుతున్న కథనం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకే ఒక్క మాట చోటారాజన్ ను కటకటాలపాలు చేసింది. ఆ ఒక్క మాట ఏంటనుకుంటున్నారా? చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ నిఖల్జే. కానీ ఆ పేరు ఉపయోగించింది చాలా తక్కువ. సందర్భాన్ని బట్టి తన పేరును మార్చేస్తుంటాడు చోటారాజన్. అయితే అక్టోబర్ 25 న ఇండోనేషియా నుండి ఆస్ట్రేలియా వెళ్లడానికి రెడీ అయిన నేపథ్యంలో అక్కడ బాలి విమానాశ్రయానికి చేరుకున్న చోటారాజన్ ఏం ఆలోచిస్తున్నాడో ఏమో కానీ తన అసలు పేరు చెప్పేశాడు. అయితే పాస్ పోర్టులో ఉన్న పేరు మాత్రం మోహన్ కూమార్. అంతే అక్కడ ఉన్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి.. ప్రశ్నలు మీద ప్రశ్నలు అడగగా అసలు సంగతేంటో బయటపడింది. మొత్తానికి చోటారాజన్ నోటి నుండి వచ్చిన ఒకే ఒక్క మాట ఆయన తలరాతనే మార్చేసింది.

సారిక పోస్ట్ మార్టం రిపోర్టులో దిగ్బ్రాంతికర విషయాలు

  వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎంపికయిన ఎస్. రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనం అయ్యారు. పోస్ట్ మార్టం నివేదికలో తీవ్ర దిగ్బ్రాంతి కలిగించే కొన్ని విషయాలను ఫోరెన్శిక్ నిపుణుడు నాగ మోహన్ బయటపెట్టారు.   ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సారిక శవానికి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆమె పక్కటెముకలు విరిగి ఉన్నట్లు గుర్తించాము. అలాగే ఆమె ఇద్దరు కుమారులు అభినవ్ మరియు శ్రీయన్ కాళ్ళ ఎముకలు కూడా విరిగి ఉన్నట్లు గుర్తించాము. వారి ముగ్గురి ఛాతిలో పొగ పేరుకొనిపోయుంది. గదిలో అగ్ని ప్రమాదం జరిగినపుడు ఏర్పడిన పొగను వారు పీల్చినందున అది వారి ఛాతిలో అలాగే ఉండిపోయింది. ఇంకా మరికొన్ని అంశాలను నిశితంగా పరీక్షించవలసి ఉంది,’ అని అన్నారు.   అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగ పీల్చి ఉండటం చాలా సహజమే కానీ సారిక పక్కటెముకలు, పిల్లల కాళ్ళు విరిగిపోయి ఉండటం చాలా అసహజంగా ఉంది. వారు అగ్నిప్రమాదంలో చిక్కుకొన్నప్పుడు గదిలో నుండి బయటకు వచ్చి మేడ మీద నుండి దూకలేదు. అదే గదిలో సజీవ దహనం అయిపోయారు. అంటే వారిని చనిపోయే ముందు ఎవరో చాలా దారుణంగా బలమయిన వస్తువుతో కొట్టి ఉండాలి. లేకుంటే ఎముకలు విరిగిపోయే అవకాశం లేదు. వారి పట్ల అంత దారుణంగా ఎవరు వ్యవహరించినా క్షమార్హులు కారు. ఒక అభాగ్యురాలయిన మహిళను, అభం శుభం తెలియని ముద్దులొలికే ఆ ముగ్గురు చిన్నారులను అంత దారుణంగా ఎవరయినా హత్య చేసి ఉండి ఉంటె వాళ్ళు ఐసిస్ ఉగ్రవాదుల కంటే కిరాతకులు..క్రూరులని చెప్పవచ్చును.

మరో వివాదంలో చింతమనేని ప్రభాకర్

  ఇదివరకు ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై చెయ్యి చేసుకొన్నందుకు విమర్శలు మూటగట్టుకొని, ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు కల్పించిన దెందులూరు తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్ళీ మరో వివాదం సృష్టించారు. కొల్లేరులో నిషేధిత ప్రాంతమైన ఆటపాక - కోమటిలంక మధ్య నిన్న రాత్రి మట్టి రోడ్డు నిర్మించారు. ఈసారి ఆయన చేతిలో అటవీశాఖ డిప్యూటీ రేంజర్ ఈశ్వరరావు అవమానం పొందవలసి వచ్చింది.   కొల్లేరు సరస్సుకి చాలా దూర దేశాల నుండి రకరకాల పక్షులు వలస వస్తుంటాయి. కనుక అక్కడ ఎటువంటి నిర్మాణ పనులు జరుపకూడదని సుప్రీంకోర్టు స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చింది. పైగా ఆ ప్రాంతమంతా అటవీశాఖ అధీనంలో ఉంది. అయినా చింతమనేని లెక్కచేయకుండా రాత్రికి రాత్రే మట్టి రోడ్డు నిర్మించారు. సుమారు 500లారీల మట్టిని తెచ్చి రోడ్డు నిర్మించారు. కోమటి లంకలో తన అనుచరుల పేరిట ఉన్న తన బినామీ చేపల చెరువులలో చేపలకు ఆహారం వగైరా తరలించదానికి వీలుగా రోడ్డు నిర్మించినట్లు సమాచారం. చింతమనేనిని అడ్డుకోలేకపోయిన అటవీశాఖ అధికారులు కైకలూరు పోలీసులకు పిర్యాదు చేయగా సెక్షన్స్ 353, 447 క్రింద ఆయనపై, అనుచరులపై కేసు నమోదు చేసారు.

జమ్మూ కాశ్మీర్ కి రూ.80 వేల కోట్లు ప్యాకేజి ప్రకటించిన ప్రధాని మోడీ

  ఈరోజు శ్రీనగర్ లో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడి జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి రూ. 80, 000 కోట్ల ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించారు. ఆ రాష్ట్రంలో పి.డి.పి., బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఈరోజు జరిగిన బహిరంగ సభలో ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయ్యిద్, రెండు పార్టీలకు చెందిన రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రమంటే తనకు చాలా ఇష్టమని ప్రధాని అన్నారు. రాష్ట్రాభివ్రుద్ధికి తన ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తుందని, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అందుకోసం అవసమయితే ఇంకా నిధులు అందించడానికి తన ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. మోడీ ప్రకటించిన భారీ ఆర్ధిక ప్యాకేజి పట్ల జమ్మూ, కాశ్మీర్ ప్రభుత్వం ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మట్టి సత్యాగ్రహంతో కాంగ్రెస్ కు ఒరిగేదేమన్న ఉందా?

  కాంగ్రెస్ పార్టీ అసలు ఎందుకు ఉద్యమాలు చేస్తుందో.. ఆ ఉద్యమాల వల్ల ఆ పార్టీకి ఒరిగేదమన్న ఉందో లేదో తెలియదు కాని రోజుకో ఉద్యమం పేరుతో హడావుడి చేయడం ఎక్కువైంది. జగనే దీక్షలు, నిరసనలు అంటూ ఎప్పుడూ హడావుడి చేస్తుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ఉద్యమాలు చేయడంలో జగన్ ను మించిపోయేలా ఉన్నారు. పోనీ చేస్తున్నారు.. వాటి వల్ల ఏమన్నా ఉపయాగం ఉందా అంటే అదీ లేదు.. ఏదో రెండు రోజులు హడావుడి చేయడం ఆ తర్వాత షరా మామూలే.. ఎవరి పనుల వారివి. గతంలో కోటి సంతకాలు, కోటి ఎమ్మెస్ లు అంటు కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాల సంగతి ఎటు పోయిందో తెలియదు. ఎప్పుడో మొదలు పెట్టిన కోటి సంతకాల ఉద్యమంలో.. ఇప్పుడు సంతకాలు సేకరణ పూర్తయిందట.. దీనిని ఇప్పుడు తీసుకెళ్లి సోనియా గాంధీకి ఇస్తారట. అంతేకాదు ఆ తర్వాత కోటి ఎస్సెమ్మెస్ లు అంటూ మరో ఉద్యమం చేశారు. అది ఎంత వరకూ వచ్చిందో.. ఎన్ని ఎస్సమ్మెస్ లు వచ్చాయో.. కోటి ఎస్సెమ్మెస్ లు వచ్చేసరికి ఎంత టైమ్ పడుతుందో..వారికైనా తెలుసో లేదో. మళ్లీ ఇప్పుడు మట్టి సత్యాగ్రహం అంటూ మరో ఉద్యమం చేస్తున్నారు. అమరావతిలో ఉన్న మట్టినే తీసుకొని.. ఈ మట్టికుండలని ప్రధాని నరేంద్రమోడీకి పంపిస్తారట. దీనివల్ల వారికి ఒరిగేదేముందో వారికే తెలియాలి. అసలు జగన్ నిరాహార దీక్ష చేసినప్పుడే కొంచెం కూడా కదలని మోడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మట్టి కుండలని పంపినంత మాత్రం రియాక్ట్ అవుతారా?. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సి విషయం ఏంటంటే.. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఇక్కడ ఎంత హడావుడి చేసినా ప్రయోజనం ఉండదు. తాము చేయాల్సిన ఉద్యమాలు సోనియా సారథ్యంలో చేస్తే కనీసం సోనియా, రాహుల్ గాంధీ పార్లమెంట్లో నోరు విప్పడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఏదో చేస్తున్నాం కదా అని ఇక్కడ గల్లీల్లో చేస్తే ఏం ఉపయోగముండదు. అసలు కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమాలకి కేంద్ర ప్రభుత్వం నుండే ఎలాంటి స్పందన ఉండదు.. మరి అలాంటిది మోడీని కదిలించగలరా..? ఇవన్నీ ఆలోచించకుండా మట్టి కుండ ఉద్యమం అని బయలు దేరిన కాంగ్రెస్ పార్టీకి.. ప్రజలు వారి నోట్లో మట్టికొట్టకుండా చూసుకుంటే చాలా బెటర్..

నటసింహం ఆప్తుడు తన్నులు తిన్నాడు

సింహం గుడ్డిదైతే ఎలుకలు ఎకసెక్కాలాడాయంట...! ఇప్పుడు తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా కళ్ళుమూసుకున్న నటసింహం పరిస్థితి కూడా అలాగే తయారైంది. నటసింహం నిజంగానే సింహమే... కానీ ఆయన చుట్టు వున్నది మాత్రం ఎలుకలు కాదు... ఏకంగా పందికొక్కులు... ఇసుకను బొక్కేసే పందికొక్కులు. శాండ్‌ని శాండ్‌విచ్‌లాగా మింగేసే ప్రయత్నంలో ఆ పందికొక్కుల కీచులాటలు నటసింహం ప్రతిష్టకే ఇబ్బందికరంగా మారే పరిస్థితులు వచ్చాయి. అసలింతకీ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుకే బంగారమైపోయింది. బెల్లం వున్న చోట ఈగలు మూగినట్టు ఇసుక వున్న చోట ఇసుక బకాసురుల మాఫియా మూగుతోంది. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రముఖుడు నటసింహం చుట్టూ తిరిగే ఒక వ్యక్తికి తూర్పు గోదావరి జిల్లాలోని ఒక ఇసుక ర్యాంపు మీద కన్నుపడింది. నటసింహం పేరు చెప్పి ఆ ఇసుక ర్యాంపును బినామీ పేరుతో సొంతం చేసుకున్నాడు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఆ ఇసుక ర్యాంపు కొనుగోలుకు అవసరమైన డబ్బు కోసం కొంతమందిని పార్టనర్లుగా చేర్చుకున్నాడు. సొంత పార్టీలో ఎవరూ లేనట్టుగా ప్రతిపక్ష హోదాకూడా లేని ఓ పార్టీకి చెందిన వ్యక్తిని ఒక పార్టనర్‌గా చేర్చుకున్నాడు. ఆ పార్టనర్ మరెవరో కాదు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆత్మకి ఆత్మబంధువుగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తికి స్వయానా బావమరిది. వీళ్ళంతా కలసి ‘నటసింహం’ పేరు ఉపయోగించుకుంటూ మూడు జేసీబీలు ఆరు లారీల్లాగా ఇసకని రొల్లుకున్నారు.. ఇంతవరకూ బాగానే వుందిగానీ, ఆ తర్వాతే అసలు ప్రాబ్లం వచ్చింది. ఈమధ్య తూర్పు గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపు  ద్వారా వచ్చిన కొన్ని కోట్ల రూపాయలని మన నటసింహం గారి తాలూకు వ్యక్తి  గప్‌చుప్‌గా తన జేబులో వేసేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సదరు బావమరిది ఆవేశంతో రగిలిపోయాడు. నువ్వు జేబులో వేసుకున్న డబ్బులో నా వాటా నాకివ్వు అని డిమాండ్ చేశాడు. అయితే నటసింహం తాలూకు మనిషి ఈ డిమాండ్‌ని ఎంతమాత్రం పట్టించుకోలేదు. రేపు మాపు అని తిప్పుకోవడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వడు.. లెక్కలు చెప్పడు... డబ్బులు గట్టిగా అడిగితే ఎక్కువగా మాట్లాడితే నటసింహంతో నీ గురించి బ్యాడ్‌గా చెబుతా అని బెదిరించడం మొదలెట్టాడు. దాంతో బావమరిది గారికి ఫుల్లుగా కోపం వచ్చేసింది. నటసింహం తోకలాంటి సదరు వ్యక్తినిహైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌కి పిలిపించాడు. అక్కడ అతన్ని ఆ ఎడాపెడా తన్నాడు. దాంతో ఈ విషయం పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ప్రస్తుతం ఈ విషయంలో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ అంశంలో ఇద్దరూ ఇసుక మింగే పందికొక్కులే. కాకపోతే ఈ పందికొక్కులకారణంగా సింహం లాంటి నటసింహానికి చెడ్డపేరు వస్తోంది. నటసింహం ఎవరు ఎలాంటివారో తెలుసుకోకుండా తనచుట్టూ చేర్చుకోవడం వల్ల వాళ్ళు ఇలాంటి అవినీతి పనులకు పాల్పడుతూ నటసింహానికి చెడ్డపేరు తెస్తున్నారు. నటసింహానికి తోకలాగా వుండే వ్యక్తిని వైఎస్సార్ ఆత్మకి బామ్మర్ది కొట్టాడన్న విషయం ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో మార్మోగుతోంది. ఈ విషయం నలుగురికీ తెలిసినా నటసింహానికి తెలియకపోవడం ఆశ్చర్యకరమే.  అందువల్ల మచ్చలేని చంద్రుడి లాంటి నటసింహం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జూలు విదల్చాలని, తన చుట్టూ వున్నవాళ్ళు చేస్తున్న అవకతవకలను అరికట్టాలని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేవాళ్ళని దూరంగా పెట్టాలని ఆయన్ని అభిమానించేవారు కోరుకుంటున్నారు.