కాంగ్రెస్ పార్టీపై రాజయ్య ఎఫెక్ట్ పడుతుందా?

  అసలే కాంగ్రెస్ పార్టీకి  ప్రజాదారణ అంతంతమాత్రమే ఉంది. ఎన్నికల్లో పోటీ చేసినా కానీ గెలుస్తుంది అన్న నమ్మకం లేదు. ఇప్పుడు కొత్తగా రాజయ్య తలనొప్పి వచ్చిపడింది. మొదట వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజయ్యను బరిలోకి దించిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు జరిగిన ఘటనతో రాజయ్య పోటీకి విముఖత చూపించడంతో ఈస్థానంలో సర్వే పేరును ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఇప్పుడు రాజయ్య ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద పడుతుందా అంటే.. అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. రాజయ్య ఎంతమాత్రం తనకు తానుగా పోటీ నుండి తప్పుకున్నా.. ఆ స్థానంలో పోటీ చేసే ఏ అభ్యర్ధికైనా రాజయ్య ఎఫెక్ట్ పడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే ఈ ఘటనలో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఏదో యాక్సిడెంటల్ జరిగిన సంఘటన అయితే ప్రజలు అంత పట్టించుకోకపోవచ్చు కానీ ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయి. గతంలోనే రాజయ్య, కోడలు సారికకు తరచూ గొడవలు జరుగుతుండేవని.. అంతేకాదు రాజయ్య కుటుంబంపై సారిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు రాజయ్యకు ఎంపీ టికెట్ ఇవ్వద్దూ అంటూ సారిక అధిష్టానాని లేఖ రాయడం వెరసి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపచ్చు అనుకుంటున్నారు. మరి రాజయ్య ఎఫెక్ట్ ఎంతవరకూ పడుతుందో చూడాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

మామ రాజయ్యకు టికెట్ ఇవ్వద్దు.. సారిక లేఖ

  కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య ఇంట్లో గ్యాస్ సిలీండర్ లీక్ అయి కోడలు సారిక, ముగ్గురు మనవలు మృతి చెందిన నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ఎలా లీకైంది అంటూ అనుమానం వ్యక్తమవుతుండగా కొత్తగా ఈ కేసులో మరో ట్విస్ట్ వచ్చి పడింది. అది సారిక రాసిన లెటర్. తన మామ అయిన రాజయ్యకు వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి లేఖ రాసిందట. అంతేకాదు తనను, తన పిల్లలని మామ రాజయ్య సరిగా చూసుకోవడం లేదని అందుకే వరంగల్ లోక్ సభ టికెట్ ఇవ్వొద్దంటూ లేఖలో పేర్కొందట. కానీ సారిక రాసిన ఆ లేఖ ఏమైందో ఏమో తెలియదు కాని కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజయ్యకు టికెట్ ఇస్తూ ప్రకటన చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన రెండు రోజుల తరువాత వరంగల్ లోని నివాసానికి వెళ్లిన  రాజయ్య అక్కడ సారికతో గొడవపడినట్టు చెబుతున్నారు. దీంతో రాజయ్య బహుశ ఆ లేఖ గురించే గొడవ పడ్డారామే అని అనుమానిస్తున్నారు.  గతంలో కూడా సారిక తన భర్తపైన, మామ రాజయ్య, అత్తలపై పోలీసు కంప్లైట్ ఇచ్చిన దాఖలాలు కనపడుతున్నాయి. అంతేకాదు సారిక, రాజయ్యల మధ్య తరుచూ గొడవలు వస్తుండేవట. ఇప్పుడు ఈ ఘటన జరగడంతో ఇప్పుడు మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముందుముందు ఇంకెన్ని ట్విస్ట్ లు వస్తాయో చూడాలి.

వరంగల్ ఉపఎన్నిక.. తప్పుకున్నరాజయ్య.. సర్వేకు టికెట్

  కాంగ్రెస్ అభ్యర్ది సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలీండర్ లీక్ అయి అతని కోడలు సారిక, ముగ్గురు మనుమలు సజీవ దహనమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వరంగల్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి రాజయ్య దిగనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగ ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఈ సంఘటనతో వరంగల్ ఉపఎన్నికకు రాజయ్య విముఖత చూపినట్టు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం కూడా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై కసరత్తు చేసి ఆఖరికి రాజయ్య స్థానంలో సర్వే సత్య నారాయణ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం సర్వే నామినేషన్ వేయనున్నారు.

సారిక పిరికిది కాదు.. కుటుంబసభ్యులు

  కాంగ్రెస్ నేత సిరిసిల్ల రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని కోడలు సారిక మనుమలు అభినవ్, అమోన్, శ్రీయోన్ లు కూడా సజీవ దహనమయ్యారు. బెడ్ రూమ్ లో సిలిండర్ లీకేజ్ వల్లనే మంటలు చెలరేగాయని.. పూర్తిగా కాలిపోయారని చెబుతున్నారు. సారిక ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గతంలో కూడా సారిక రెండుసార్లు ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. కానీ ఇప్పుడు సారిక మృతి పట్ల ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి కుటుంబ సభ్యులు సారిక ఆత్మహత్య చేసుకునేంత పరికిది కాదని ఆరోపిస్తున్నారు. సారికను హత్య చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారిక తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా.. తల్లి, సోదరి నిజామాబాద్ నుండి వరంగల్ బయలుదేరారు.

రాజయ్య కోడలది హత్యా..ఆత్మహత్యా?

  వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు నిన్న రాత్రి రాజయ్య ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సజీవ దహనం అవడం అందరినీ తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తాజా సమాచారం ప్రకారం కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆమె గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోనేంత పిరికిది కాదని ఆమె తల్లితండ్రులు అంటున్నారు. ఆమె భర్త అనిల్, అత్తగారు కలిసి ఆమెను, పిల్లలను అడ్డు తొలగించుకొవడానికే ఈవిధంగా హత్య చేసి ఉంటారని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   అనిల్-సారికలు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించి 2002సం.లో వివాహం చేసుకొన్నారు. కొంత కాలం వారి కాపురం సవ్యంగానే సాగింది. కానీ అనిల్ కి హైదరాబాద్ లో వేరే స్త్రీతో వివాహేతర సంబంధం ఉందని తెలిసినప్పటి నుంచి వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుండి అనిల్ వరంగల్ లో తమ ఇంటికి రావడం బాగా తగ్గించేసినట్లు తెలుస్తోంది. భర్త అత్త మామల తీరుతో వేసారిన సారిక గతంలో వారిపై పోలీసులకు పిర్యాదు కూడా చేసారు. ఒకసారి తనుండే మామగారి ఇంటి ముందే పిల్లలతో కూర్చొని తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌన దీక్ష చేసారు. ఆ తరువాత పరిస్థితులు కొంచెం సర్దుకొన్నట్లు సమాచారం. అప్పటి నుంచి ఆమె రాజయ్య ఇంట్లో పై అంతస్తులో తన పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నారు. ఆమె భర్త అనిల్ మాత్రం ఎప్పుడో ఒకసారి వచ్చి చూసి పోతుండేవాడు తప్ప ఆమెతో కాపురం చేయలేదు. ఆ కారణంగా తరచూ అత్తా కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని ఇరుగు పొరుగులు చెపుతున్నారు.   నిన్న అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆమె భర్త అనిల్ ఇంట్లోనే ఉండటంతో పోలీసులు అతనినే అనుమానిస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసి ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ లీకయి అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. కానీ సారిక ఆమె పిల్లలు వేరే గదిలో నిద్రిస్తున్నప్పుడు గ్యాస్ ఏవిధంగా లీక్ అయింది. లీక్ అయితే ఎటువంటి విస్పోటనం ఎందుకు జరుగలేదు? ఎప్పుడో కానీ రాజయ్య ఇంటికి రాణి అనిల్ నిన్ననే ఎందుకు వచ్చేడు? వంటి అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజయ్యను అతని కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబడుతున్నారు. వారి దర్యాప్తు పూర్తయితే కానీ సారికది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేలదు.

కాంగ్రెస్ నేత రాజయ్య ఇంట్లో అగ్నిప్రమాదం, కోడలు, మనుమలు మృతి

  సీనియర్ కాంగ్రెస్ నేత మరియు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో నిన్న రాత్రి జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సాగరికతో సహా ముగ్గురు మనుమలు అభినవ్ (7), అమోన్ (3),శ్రీయోన్ (3) సజీవ దహనం అయ్యారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. అగ్ని ప్రమాదం సంగతి తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికే చేరుకొని మంటలు ఆర్పివేశారు. గత కొన్నేళ్లుగా వారి ఇంట్లో కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు సమాచారం. బహుశః ఆ కారణంగానే సాగరిక ఈ పనికి పూనుకొని ఉండవచ్చని ఇరుగు పొరుగు వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   సాగరిక భర్త చాలా కాలంగా హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. సాగరిక వరంగల్ లో తన మావగారి ఇంట్లోనే మేడ మీద అంతస్తులో తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. నిన్న రాత్రి ఆమె ఉంటున్న ఇంట్లోంచి పొగలు వస్తుండటం గమనించిన ఇరుగుపొరుగు వారు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగానే వారు అక్కడికే చేరుకొని మంటలు ఆర్పివేశారు. వరంగల్ పోలీస్ కమీషనర్ సుదీర్ బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించిన తరువాత పోలీసులను దర్యాప్తుకు ఆదేశించారు. సాగరిక ఆమె పిల్లల మరణానికి కారణాలు ఏమిటో పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది.

ఆటోలో షికారు చేసిన సీఎం

  రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ఆటోలో షికారు చేశారు, ఫుల్ సెక్యూరిటీ మధ్య బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరిగే సీఎం... ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా ఆటో ఎక్కి షికార్లు కొట్టారు. జైపూర్లో పర్యటిస్తుండగా అందంగా తెల్లటి రంగులో ముస్తాబైన ఆటోను చూసి ముచ్చటపడ్డ వసుంధరరాజే... వెంటనే ఆటో ఎక్కేసి జైపూర్ రోడ్లపై చక్కర్లు కొట్టేశారు, ఆటో ఫొటోలను, తాను ఆటోలో షికారు చేస్తున్న ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వసుంధరరాజే... జైపూర్ లో ఇలాంటి కళాత్మక ఆటోలను ఎవరైనా చూస్తే... వాటి ఫొటోలను ఆర్ట్ ఆన్ వీల్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు అలాంటి అందమైన ఆటోల్లో ప్రయాణించి మజాను ఆస్వాదించాలంటూ సూచించారు.

పార్లమెంట్ టు రాష్ట్రపతి భవన్

    దేశంలో పెరిగిపోతున్న మత అసహనంపై ఏఐసీసీ అధ్యక్షురాలు ఆందోళన వ్యక్తంచేశారు, ఇదే అంశంపై సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి మోడీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన సోనియాగాంధీ... కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు, పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ జరిగిన ర్యాలీలో సోనియా, రాహుల్ గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు, అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు.... దేశంలో నెలకొన్న అసహనాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.

ప్రయాణికులకు ముఖ్య గమనిక

  దీపావళి నేపథ్యంలో రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, కొందరు ప్రయాణికులు రైళ్లలో టపాసులు తీసుకెళ్లే అవకాశమున్నందున క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్న రైల్వే సిబ్బంది... ఎవరైనా బాణాసంచా తీసుకెళ్తే పదివేల రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు, రైళ్లలో టపాసులు తీసుకెళ్లడాన్ని నిషేధించినట్లు తెలిపిన రైల్వే అధికారులు... ప్రమాదరహితంగా దీపావళిని జరుపుకోవాలని ప్రజలకు, ప్రయాణికులకు సూచించారు, రైళ్లలో ఎవరూ టపాసులు తీసుకెళ్లకుండా ఎక్కడిక్కడ తనిఖీలు చేపడుతున్నామని, ప్రయాణికులు కూడా సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

ఐపీఎల్ సీఈవో సుందర్ రామన్ రిజైన్

  ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీఈవో సుందర్ రామన్ తన పదవికి రాజీనామా చేశారు. బోర్డు ప్రక్షాళనపై దృష్టిపెట్టిన బీసీసీఐ నూతన అధ్యక్షుడు శశాంక్ మనోహర్... ఆదేశాల మేరకే సుందర్ రామన్ రిజైన్ చేసినట్లు తెలుస్తోంది, 2013 ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుందర్ రామన్‌ను అక్టోబర్ 31లోగా రాజీనామా చేయాలని శశాంక్ మనోహర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సుందర్ రామన్ రాజీనామా చేశారని, అందుకే బీసీసీఐ కూడా వెంటనే ఆమోదించిందని అంటున్నారు. ఐపీఎల్ ఫిక్సింగ్‌లో సుందర్ రామన్ పాత్ర ఉన్నట్లు సుప్రీంకోర్టుకు నివేదించిన జస్టిస్ ముగ్దల్ కమిటీ కూడా ఆయన రాజీనామాను స్వాగతించింది. సుప్రీం ఆదేశించినప్పుడే సుందర్ రామన్ ఈ పని చేసి ఉంటే బాగుండేదని ముగ్దల్ కమిటీ అభిప్రాయపడింది.

ఒకరికి బుల్లెట్ తగిలిందంటున్న ఖాకీలు

  హైదరాబాద్ వనస్థలిపురం ఆటోనగర్ లో జరిగిన పోలీస్ కాల్పుల్లో తప్పించుకున్న చైన్ స్నాచర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు, పోలీసులు కాల్పులు జరిపినా చాకచక్యంగా తప్పించుకున్న స్నాచర్లలో ఒకరికి బుల్లెట్ గాయమైందని అనుమానిస్తున్నారు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుల్లో ఒకరికి బుల్లెట్ తగిలిందని భావిస్తున్న సైబరాబాద్ పోలీసులు... దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, స్నాచర్లు.... ఆటోనగర్ నుంచి చింతల్ కుంట, సాగర్ రింగ్ రోడ్, కర్మాన్ ఘాట్ మీదుగా కంచన్ బాగ్ వైపు పారిపోయినట్లు పోలీసులు సమాచారం సేకరించారు, దాంతో ఆ మార్గంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లోనూ పేషెంట్ల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.

రాజకీయాల్ని జూదంలా మార్చారు.. కేసీఆర్ పై జైపాల్ రెడ్డి ఫైర్

రాజకీయ నాయకులకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడుతుంటారు. రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన రాజకీయ మార్పుల వల్ల కొంతమంది యాక్టివ్ లీడర్స్ కూడా ఎందుకో సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా నోరు తెరిచి విమర్శలు చేస్తూ మేము కూడా ఉన్నామంటూ గుర్తుచేస్తున్నారు. అలాగే కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. కేంద్రంలో కీలకంగా వ్యవహరించిన జైపాల్ రెడ్డి మళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్ని జూదంలాగ మార్చేసిందని.. కేసీఆర్ కాసినో పాలిటిక్స్ నడిపిస్తున్నారని అన్నారు. వరంగల్ ఉపఎన్నిక కేసీఆర్ కు గుణపాఠం చెబుతుందని.. అసలు ఈ ఉపఎన్నిక అవసరం ఎందుకు వచ్చిందో జనం గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల నేపథ్యంలో తనకు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేశారు.. ఇప్పుడు వాటిని అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. మొత్తానికి జైపాల్ రెడ్డి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ.. తను మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవడానికి వస్తున్నట్టు సంకేతాలు పంపారు.

వరంగల్ అభ్యర్ధిని ప్రకటించిన వైసీపీ

  వరంగల్ ఉపఎన్నికకు వైసీపీ కూడా తమ అభ్యర్ధిని ప్రకటించింది, వరంగల్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... తమ అభ్యర్ధిగా నల్లా సూర్యప్రకాశ్ ను అనౌన్స్ చేసింది, నల్లా సూర్యప్రకాశ్ ఎంపికను అధికారికంగా ప్రకటించిన తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... ఆయనకు పార్టీ బీఫామ్ ను అందజేశారు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకే నల్లా సూర్యప్రకాశ్ ను వరంగల్ బరిలోకి దింపుతున్నట్లు పొంగులేటి ప్రకటించారు. వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ ను తాము క్షమించబోమని, అన్ని పార్టీలకూ బుద్ధిచెప్పడానికే తాము పోటీ చేస్తున్నట్లు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు, తనకు టికెట్ ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలిపిన సూర్యప్రకాశ్... ఇది కార్యకర్తకు లభించిన గౌరవమని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుపై చేగొండి వివరణ

  చంద్రబాబునాయుడుపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, కేవలం తనకు తెలిసిన విషయాలను, అప్పట్లో జరిగిన సంఘటనలను మాత్రమే పుస్తకంలో వివరించానని మాజీ మంత్రి చేగొండి హరిరామజోయ్య అన్నారు, పుస్తకంలో తాను రాసిన విషయాలన్నీ జరిగినవేనని, తాను వాస్తవమని నమ్మిన వాటిని మాత్రమే రాశానన్నారు, 1988లో రంగా హత్య జరిగితే... ఆనాడే ఎందుకు చెప్పలేదని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే తాను శివరామరాజు చెప్పిన విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని, కానీ హత్య జరిగాక నమ్మానని చెప్పుకొచ్చారు, చంద్రబాబు అనుమతితోనే రంగా హత్య జరిగిందన్న విషయాన్ని ఆ తర్వాత చాలాసార్లు చెప్పానని, సీబీఐ తనను వివరాలు అడిగి ఉంటే వాళ్లకూ చెప్పేవాడినన్నారు, నా పుస్తకంలో ఒక్క చంద్రబాబు మీదే కాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మీద రాశానని చేగొండి హరిరామజోయ్య గుర్తుచేశారు.