కొండవలస కన్నుమూత
తెలుగు సినిమా హాస్య నటుడు, ‘నేనొప్పుకోను... ఐతే ఓకే’ అంటూ అందర్నీ అలరించిన నటుడు కొండవలస లక్ష్మణరావు కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా అధిక రక్తపోటు, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అమీర్ పేట ప్రాంతంలో నివాసం వుంటున్న ఆయన సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని నిమ్స్‌కి తరలించారు. అక్కడ ఆయన మరణించారు. మంగళవారం నాడు కొండవలస అంత్యక్రియలు జరుగుతాయి. కొండవలస లక్ష్మణరావు మూడు వందలకు పైగా సినిమాలలో నటించారు. 1946 ఆగస్టు 10వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో కొండవలస లక్ష్మణరావు జన్మించారు. నాటకాలు వేయడంలో, బుర్రకథలు చెప్పడంలో అభిరుచి వున్న కొండవలస ఆ దిశగా కృషి చేశారు. నాటక రంగంలో నంది అవార్డును కూడా అందుకున్నారు. దర్శకుడు వంశీ దృష్టిలో పడిన ఆయన ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా ద్వారా సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలోని తన ఊతపదం.. ‘నేనొప్పుకోను... ఐతే ఓకే’ ద్వారా ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ఆ తర్వాత ఆయన హాస్య నటుడిగా బిజీ అయ్యారు. ‘కబడ్డీ కబడ్డీ’ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ఆయన షూటింగ్‌లో భాగంగా ఒక నీటి మడుగులో దూకారు. అయితే అది లోతు ఎక్కువగా వుండి, కలుషిత నీటితో నిండిన మడుగు. దానిలో ఆయన మునిగిపోయి, ఆ నీటిని తాగేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కొండవలస కన్నుమూత పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.