డిల్లీకి చేరుకొన్న ఛోటా రాజన్

  సిబీఐ మరియు ఉన్నతాధికారులు మాఫియా గ్యాంగ్ లీడర్ ఛోటా రాజన్ని ఇండోనేషియా నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు డిల్లీకి తీసుకువచ్చేరు. ఈరోజు తెల్లవారుజామున 5.30-6.00 గంటల మధ్య వారి ప్రత్యేక విమానం డిల్లీలో ల్యాండ్ అవగానే స్పెషల్ కమెండోల సహాయంతో కట్టుదిట్టమయిన భద్రత నడుమ అతనిని డిల్లీలో సిబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో సిబీఐ ప్రధాన కార్యాలయం వైపు ఉన్న అన్ని మార్గాలను మూసి వేసేసారు. సిబీఐ భవనం చుట్టూ ఆ సంస్థ రక్షణ సిబ్బంది కాకుండా అధనంగా కేంద్ర పారిశ్రామిక రక్షణ సిబ్బందిని కూడా మొహరించారు.   మరికొద్ది సేపటిలో సిబీఐ అధికారులు ఛోటా రాజన్ కి వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారు. అతనిని ప్రశ్నించడానికి జ్యూడిషియల్ కస్టడీ కోసం కోర్టు అనుమతి పొందిన తరువాత మళ్ళీ సిబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించి ప్రశ్నించడం మొదలుపెడతారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అతనిపై సుమారు 70పైకి పైగా కేసులు నమోదు చేసారు. అవి కాక డిల్లీ పోలీసులు మరో పది కేసులు నమోదు చేసారు. వాటన్నిటినీ సిబీఐకి బదిలీ చేసారు. కనుక సిబీఐ అధికారులే ఛోటా రాజన్ని అన్ని కేసులలో ప్రశ్నించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ముంబై పోలీసుల నుండి తనకు ప్రాణ హాని ఉందని ఛోటా రాజన్ చెప్పడం వలననే బహుశః అన్ని కేసులను సిబీఐకి బదిలీ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   సుమారు రెండున్నర దశాబ్దాలుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఛోటా రాజన్ గత నెల 26వ తేదీన ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియాలో బాలి వస్తుండగా ఇండోనేషియా పోలీసులు అతనిని విమానశ్రయంలో అరెస్ట్ చేసారు. అనేక హత్యలు, అక్రమ ఆయుధాల సరఫరా, ముంబై లోకల్ రైళ్ళలో వరుస బాంబు ప్రేలుళ్ళు వంటి అనేక తీవ్రమయిన నేరాలలో అతని ప్రమేయం ఉంది.

నాందేడ్‌, రాయలసీమ, ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ రైళ్ళలో దొంగలు పడ్డారు

  ప్రజలు ఇళ్ళకు తాళాలు వేసుకొని ఊళ్లకు వెళితే ఇంట్లో దొంగలు పడుతుంటారు. కానీ పోలీసులు ఏమీ చేయలేరు. పోనీ రైల్లో అయినా భద్రత ఉంటుందా అంటే దారిలో దోపిడీ దొంగలు ఉన్నదంతా దోచుకొని పోతుంటారు. కానీ రైల్లో ఉండే రైల్వే పోలీసులు కూడా ఏమీ చేయలేరు.   నిన్న అర్ధరాత్రి ఒకేసారి నాందేడ్‌, రాయలసీమ, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో దొంగలు పడ్డారు. అనంతపురం జిల్లాలో గుత్తి రైల్వే స్టేషన్ శివార్లలో నాందేడ్‌, రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైళ్ళు సిగ్నల్ కోసం ఆగి ఉన్నప్పుడు, దొంగలు రైల్లో ప్రయాణికులను దోచుకొన్నారు. రైల్వే పోలీసులు ఉన్నప్పటికీ దొంగలు తెలివిగా వారి దృష్టిని మరోవైపు మళ్ళించి తమ పని కానిచ్చుకొని వెళ్ళిపోయారు. ఆ తరువాత ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికుల వంతు వచ్చింది. కానీ వారి అదృష్టం కొద్దీ గ్రీన్ సిగ్నల్ పడటంతో బ్రతికిపోయారు. మొదట దోపిడీకి గురయిన నాందేడ్‌ ఎక్స్ ప్రెస్ గుత్తి రైల్వే స్టేషన్ చేరుకొన్న వెంటనే అందులో ప్రయాణికులు రైల్వే పోలీసులకు పిర్యాదు చేసారు. కనీసం అప్పుడయినా రైల్వే పోలీసులు మేల్కొని ఉండి ఉంటే తరువాత వచ్చిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులు దొంగల బారిన పడేవారు కాదు. కానీ దేనినయినా ‘లైట్’ తీసుకోవడం రైల్వే పోలీసులకు అలవాటుగా మారిపోయింది కనుక ఇటువంటి సంఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉంటాయి..వాటి గురించి ఇలాగ వార్తలు వస్తూనే ఉంటాయి.

కాంగ్రెస్ కు షాక్.. 9మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి..!

ఇప్పటికే ఏపీ, తెలంగాణ లో ఉన్న కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. అయితే ఈసారి తెలుగు రాష్ట కాంగ్రెస్ నేతలు కాదు పొరుగు రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి షాకివనున్నట్టు తెలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అస్సాం బిజెపి అధ్యక్షుడు సిద్దార్థ భట్టాచార్య తెలిపారు. కాంగ్రెస్ మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ ఇంతకుముందే కాంగ్రేస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన నేతృత్వంలోనే ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జెండా ఎగరేశారు. కాగా ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సస్పెండే చేసింది. మిగిలిన ఐదుగురికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. కాగా ఈ తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరంటే.. బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా(జొనాయ్), పల్లబ్ లోచన్ దాస్(బెహాలి), రాజెన్ బోర్‌ఠాకూర్ (తేజ్‌పూర్), పిజూష్ హజారికా(రోహా), కృపానాథ్ మల్లా (రతబరి), అబు తాహెర్ బేపారి (గోలక్‌గంజ్), బినంద సైకియా(సిపాఝర్), జయంత మల్లా బారువా(నల్‌బారి)లు.

అయితే 24 గంటల్లో అందజేయండి.. గ్రీన్ ట్రిబ్యునల్

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కేంద్ర పర్యావరణ సంస్థ అనుమతిచ్చిందని.. ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ రాజధాని విషయంలో షాకిచ్చింది. శ్రీమన్నారాయణ అనే వ్యక్తి ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పర్యావరణ చట్టాలను, నిబంధనలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ, కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. అయితే దీనికి ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పందించి ఏపీ రాజధాని నిర్మణానికి కేంద్ర పర్యావరణ శాఖ నుండి అనుమతి పొందామని.. అక్టోబర్ 9 నాటికే అనుమతులు వచ్చాయని చెప్పారు. దీనికి గ్రీన్ ట్రిబ్యునల్.. అయితే దానికి సంబంధించిన పత్రాలను 24 గంటల్లో అందజేయాలని సూచించింది.

సమంత అవయవ దానం

  అవయవదానాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా వుంది. మనిషి మరణించిన తర్వాత శరీర అవయవాలను అవసరం వున్న వ్యక్తులకు అమర్చడం ద్వారా కొన్ని జీవితాలను నిలబెట్టడమే కాదు... మరణించిన వ్యక్తి వారి రూపంలో మరోసారి జీవించే అవకాశం వుంది. ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుందేమో... హీరోయిన్ సమంత తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆమె సమాజ సేవ కోసం ప్రత్యూష ఫౌండేషన్ అనే సేవా సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థ పేద బాలలకు వైద్య సహాయం అందిస్తోంది. నవంబర్ నెలలో ఒక ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహించే ఒక కార్యక్రమంలో సమంత తన అవయవాలను దానం చేయనున్నట్టు ప్రకటించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.

విమర్శించడం ఆపి సలహాలు ఇస్తే మంచిది.. డొక్కా కౌంటర్

ఏపీలో టీడీపీపై, చంద్రబాబునాయుడిపై పలువురు బీజేపీ నేతలు పలు రకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ వారికి ధీటుగా సమాధానం చెప్పారు. హరిరామ జోగయ్య తన 60 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అనే పుస్తకంలో చంద్రబాబు గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై వివారణ ఇవ్వాలని మాజీ మంత్రి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అంతేకాదు టీడీపీకి ఆదరణ తగ్గుతుందని కావూరి వ్యాఖ్యనించాడు. దీనిపై డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ-బీజేపీ మిత్రపక్షమన్న సంగతి బీజేపీ నేతలు మరిచిపోయినట్టున్నారు.. మిత్రధర్మాన్ని మరచి వారు విరుద్దంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబును విమర్శించడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మంచిదని సూచించారు. రాజకీయంగా ఉనికి లేనప్పుడే కాపుల గురించి మాట్లాడే నేతల పట్ల కాపులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి రాజకీయ నేతలా కాకుండా కాగ్ ప్రతినిధిగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.

అక్కడే ఎక్కువగా ఉంటున్న కేసీఆర్..!

  కేసీఆర్ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు తలెత్తుతున్నాయి. వాటికి తోడు ఇప్పుడు కొత్తగా ఫాంహౌస్ వ్యవహారం చూస్తే ఆయనపై విమర్శలకు అవకాశం ఇచ్చేలా ఉంది. మామూలుగానే కేసీఆర్ కు తన ఫాం హౌస్ అంటే మక్కువ ఎక్కువ అని అందరికి తెలిసిందే. ఖాళీ దొరికినప్పుడల్లా అక్కడికి వెళుతుంటారు. కానీ ఈమధ్య కేసీఆర్ ఎక్కువగా అక్కడే ఉంటున్నారు. అందులోనూ తను డిసెంబర్ లో చేయనున్న చండీయాగం కార్యక్రమం ఇక్కడే కావడంతో ఆదివారం ఫాం హౌస్ కు వచ్చిన ఆయన ఇప్పటికీ అక్కడే ఉన్నారు. అంతేకాదు ఇంకా రెండు రోజుల పాటు కూడా అక్కడే ఉంటారట. మరి ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు చేయకుండా ఉంటారా. ఇప్పటికే కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదని పలువురు పలురకాలుగా అనుకుంటున్నారు. వాస్తు విషయంలో నిక్కచ్చిగా ఉండే కేసీఆర్.. సచివాలయం వాస్తు సరిగా లేకపోవడంతో అక్కడికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. క్యాంపు కార్య్లలయంలోనే అన్ని పనులు చూస్తున్నారు. ఎటూ కేసీఆర్ రావడం లేదు కదా అని మరమత్తులు చేసే వారు కూడా చూసి చూడనట్టు వదిలేశారు. ఇప్పుడు అసలు సచివాలయానికే రావడానికి ఇష్టపడని కేసీఆర్.. రోజులకు రోజులు ఫాంహౌస్ లోనే ఉంటుంటే ఆయనపై విమర్శలకు తానే అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని పలువురు ఆభిప్రాయపడుతున్నారు.

వీర్రాజుకు వెంకన్న కౌంటర్.. చంద్రబాబును అంటే సహించం

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీ పై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ, టీడీపీ మిత్రపక్షం కాబట్టి వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలకు ఒకింత కోపం వచ్చినా వినివిననట్టు వదిలేశారు. అయితే ఇప్పుడు అలా కాకుండా వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కూడా రివర్స్ కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టున్నారు. దీనికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. వీర్రాజు చేసిన విమర్శలకు గాను వెంకన్నస్పందిస్తూ చంద్రబాబు భిక్ష వల్లే వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారని ఆ విషయం ఆయన మర్చిపోయారేమో అని కౌంటర్ ఇచ్చారు. మంత్రి పదవి కోసమే వీర్రాజు టీడీపీని విమర్శిస్తున్నారని.. ఇలాంటి వారిపై బీజేపీ పెద్దలు దృష్టిసారించాలని సూచించారు. అంతేకాదు తమ అధినేత చంద్రబాబుకు మచ్చతెచ్చేలా మట్లాడితే సహించేది లేదని బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

రాజయ్య గురించి మాట్లాడొద్దు.. పీసీసీ హుకుం

రాజయ్య కోడలు సారిక అతని ముగ్గురు మనవలు అతిదారుణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇప్పుడు రాజయ్య ఎఫెక్ట్ పార్టీ పై ఎక్కడ పడుతుందా అని కాంగ్రెస్ పార్టీ తెగ భయపడుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అధిష్టానం ఓ హుకుం జారీ చేసిందట. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో రాజయ్య గురించి కాని.. రాజయ్య కుటుంబలో జరిగిన ఘటన గురించి ప్రస్తావించకూడదని.. ఒకవేళ ఎక్కడైనా అనుకోకుండా అటువంటి సందర్బం వచ్చినప్పుడు రాజయ్యమీద సానుభూతి వ్యక్తమయ్యేలా మాట్లాడొద్దని ఆదేశించారట. అంతేకాదు రాజయ్య మీద సానుభూతి చూపేలా ఒక్క మాట మాట్లాడినా అది వంద ఓట్లకు చేటు తెస్తుందని సూచించారట. కాగా ఇప్పటికే సారిక మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా సారికని హత్య చేశారనే అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్థానికులు కూడా రాజయ్య కుటుంబంపై ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. రాజయ్య గురించి మాట్లాడితే.. అసలే అంతంత గుర్తింపు ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే కోట్లు కూడా రావని భయంతో ఈ రకమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ఓట్లను పునరుద్దరించాకే ఎన్నికలు నిర్వహించాలి.. ఎమ్మెల్యేల ధర్నా

జీహెచ్ఎంసీ ఎదుట టీ టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా ఓట్లు తొలగించారని, డివిజన్ల విభజన అస్తవ్యస్తంగా చేశారని ఆరోపించారు. ప్రభుత్వంతో అధికారులు కుమ్మక్కయి 25 లక్షల పరిధిలో ఓట్లను తొలగించారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ప్రభత్వం ఇలాంటి కుట్రలు పన్నింది.. కానీ తొలగించిన ఓట్లను పునరుద్దరించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో ధర్నా చేపట్టిన ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో కొంత మంది నేతలు కిందపడియారు. కాగా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫిర్యాదుకు ముందే న్యాయవాదికి సారిక ఈ-మెయిల్

కాంగ్రెస్ పార్టీనేత రాజయ్య కోడలు సారిక మృతి అనంతరం పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అని పలు అనుమానాలు రేకెత్తున్న తరుణంలో ఇప్పుడు ఇంకా కొన్ని ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. ఇప్పటికే మత్తుమందు ఇచ్చి సారికపై పెట్రోల్ పోసి కాల్చేశారా? అంటూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిలో భాగంగానే రాజయ్య ఇంటిలోని ఆహార పదార్ధాలను సీజ్ చేశారు. అయితే సారిక గతంలో రాజయ్య కుటుంబంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఫిర్యాదుకు ముందే సారిక తన కష్టాల గురించి రెహానా అనే న్యాయవాదికి ఈ మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. ఇంట్లో నుండి వెళ్లి పోవాలని పదే పదే అత్త, భర్త వేధించేవారని.. శారీరక, మానసిక చాలా బాధించేవారని పేర్కొంది. అరుపులు, కేకలు, తిట్లతోనే అత్త రోజంతా ఉండేదని.. నన్ను ఎప్పుడు పంపిద్దామా అన్నదే వారి ఆలోచన అని.. రాజయ్య ఎంపీ అయ్యాక వేధింపులు మరీ ఎక్కువయ్యాయని సారిక ఈ మెయిల్ లో తెలిపింది. అంతేకాదు తన భర్త వివాహేతర సంబంధాల గురించి కూడా ప్రస్తావించింది సారిక. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని.. ఎప్పుడు ఇంటికి వస్తాడో.. ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదని.. కనీసం తనని, తన పిల్లల్ని పట్టించుకునేవాడు కాదని చెప్పింది. ఇదిలా ఉండగా సారిక ఈ మెయిల్ చేసిన న్యాయవాది రెహానా సారిక మృతిపై స్పందిస్తూ సారికది ఆత్మహత్య కాదని హత్య అని ఆరోపిస్తున్నారు.

చోటా రాజన్ పట్టుబడటానికి అసలు కారణం అదా?

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను ముంబై పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇండోనేషియాలో ఉన్న ఆయనను నిన్ననే ఇండియాను తీసుకొచ్చారు. అయితే అసలు చోటా రాజన్ పట్టుబడటానికి అసుల కారణం వేరే ఉందంటున్నారు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు. వివరాల ప్రకారం.. చోటా రాజన్ రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయంట. ప్రస్తుతం ఆయన రోజూ డయాలసిస్ చేయించుకుంటూ బ్రతుకుతున్నారంట. అయితే 55 ఏళ్ల చోటా రాజన్ ఎక్కువ రోజులు బ్రతకాలంటే కిడ్నిల మార్పిడి చేయాలి. అలా చేయించుకోవాలంటే డాన్ గా ఉన్న చోటా రాజన్ కు జరగని పని. విదేశాల్లో చేయించుకోవాంటే అసలే కుదురదు. అందుకే భారత్‌కు వస్తే తప్పకుండా తన కిడ్నీ మార్పిడికి అధికారులు అనుమతించే అవకాశం ఉందని రాజన్ భావించినట్టు ఓ అధికారి తెలిపారు. అయితే దీనికి సంబంధించి చోటా రాజనే ఒక సంవత్సరం నుండే ప్లానింగ్ చేస్తున్నడంటా. దీనిలో భాగంగానే వైద్య పరీక్ష వివరాలను తన కుటుంబసభ్యులకు మైయిల్ ద్వారా పంపించగా.. వారిలో తన మేనల్లుడు కిడ్ని సరిపోగా తను కిడ్నిదానం చేసేందుకు ముందుకురావడంతో చోటారాజన్ ఈ రకమైన ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.

సారిక, పిల్లలకు మత్తు ఇచ్చి చంపారా?

  వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు బుధవారం ఉదయం హన్మకొండలో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదు.. హత్యలన్న ఆరోపణలు తీవ్రంగా రావడంతో ఈ దిశలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు వున్న తీరు కూడా ఇవి హత్యేలనన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఇదిలా వుంటే, నలుగురు మృతులకు మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత తగులబెట్టి చంపారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా రాజయ్య ఇంట్లోని ఆహార పదార్ధాలన్నిటినీ సీజ్ చేశారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరంగల్ ఉపఎన్నిక నామినేషన్ గడువు పూర్తి.. బరిలో 5గురు

వరంగల్ ఉపఎన్నిక పోరుకు నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. ఈ బరిలో మొత్తం 5గురు అభ్యర్ధులు ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రచారం కోసం పార్టీలు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. కాగా ఈ వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ తరుపున పసునూరి దయాకర్, వైసీపీ అభ్యర్దిగా నల్లా సూర్యప్రకాశ్, టీడీపీ-బీజేపీ అభ్యర్ధిగా దేవయ్య. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సర్వే సత్యనారాయణ బరిలో దిగనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగిన రాజయ్య.. ఈ రోజు జరిగిన సంఘటనతో పోటీ నుండి తప్పుకొనగా.. కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో సర్వే పేరును ప్రకటించింది.

చంద్రబాబును కేసీఆర్ పిలుస్తారా? పిలిస్తే ఎలా?

ఏపీ రాజధాని శంకుస్థాపన గురించి చంద్రబాబు కేసీఆర్ ను పిలుస్తారా? పిలిస్తే ఎలా పిలుస్తారు? అంటూ పలు రకాలుగా చర్చించుకున్నారు అప్పట్లో. దానికి చంద్రబాబు కూడా తాను చెప్పినట్టు కేసీఆర్ ను ఇంటికెళ్లి పిలవడం.. కేసీఆర్ కూడా శంకుస్థాపనకు రావడం.. చంద్రబాబు కేసీఆర్ ను జాగ్రత్తగా చూసుకోవడం జరిగాయి. అయితే ఇప్పుడు జనాలకు మళ్లీ ఓ మంచి టాపిక్ దొరికింది మాట్లాడుకోవడానికి. అది కేసీఆర్ చండీయాగం గురించి. ఈ కార్యక్రమానికి కేసీఆర్ చంద్రబాబును ఆహ్వానిస్తారా?లేదా? అన్నది డౌట్. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు కేసీఆర్ ను ఆహ్వానించారు కాబట్టి కేసీఆర్ కూడా చంద్రబాబును ఆహ్వానిస్తారు అని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు లాగ  కేసీఆర్ స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తారా? లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఒకవేళ ఆహ్వానించాలనుకున్నా చంద్రబాబు ఎక్కువ విజయవాడలోనే ఉంటున్నారు కాబట్టి కేసీఆర్ అక్కడకు వెళ్లి ఆహ్వానిస్తారా? లేక హైదరాబాద్ వచ్చినప్పుడే ఆహ్వానిస్తారా? లేకపోతే అసలు అవేమి లేకుండా మంత్రులతో ఆహ్వానం పంపుతారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

గొడ్డు మాంసం తింటావా? తల తీసేస్తా.. ముఖ్యమంత్రికి వార్నింగ్

దేశంలో ఇప్పుడు నేతలు ఎక్కువగా మాట్లాడేది గోమాంసం గురించే. దీనిపై నేతలు ఒకరి కంటే ఒకరు రెచ్చిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేశారు. అయితే దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తను ఇప్పటి వరకూ గోమాంసం తినలేదని.. కానీ బీజేపీ నేతలు చేస్తున్న రాద్దాంతం చూస్తుంటే తనకు తినాలనిపిస్తుందని.. ఇప్పటికిప్పుడే తెప్పించుకొని తింటా ఎవరేం చేస్తారు అని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలకు గాను ఓ బీజేపీ నేత అతనిని హెచ్చరించారు. ఈ క్రమంలో శివమొగ్గ మునిసిపల్‌ కౌ‌న్సిల్‌ మాజీ అధ్యక్షుడు ఎస్‌.ఎన్‌.చెన్నబసప్ప మాట్లాడుతూ ‘గొడ్డు మాంసం తింటావా? తిను.. తల తీసేస్తా’ అంటూ ఓ బీజేపీ నేత హెచ్చరిక చేశారు. అయితే చెన్నబసప్ప చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఆయన ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తోంది. చెన్నబసప్ప చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఆయనపై వేటు వేయాలని చూస్తుంది. అంతేకాదు ఒక ముఖ్యమంత్రిని ఇంత బహిరంగంగా హెచ్చరించేసరికి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.