పారిస్ లో ఉగ్రవాదుల దాడులు ఎలా జరిగాయంటే..
సంతోషానికి, సౌందర్యారాధనకి నిలయమయిన పారిస్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు దాడులు జరిపి సుమారు 20గంటల తరువాత పోలీసుల దర్యాప్తులో వాటి వివరాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులను ప్రతీకార చర్యగా తామే జరిపినట్లు ఐసిస్ ఉగ్రవాదులు ప్రకటించుకొన్నారు. సుమారు 8 మంది ఉగ్రవాదులు నిన్న సాయంత్రం సుమారు 8గంటలకు ఒకే సమయంలో ఆరు వేర్వేరు ప్రదేశాలలో దాడులు చేసారు.
వాటిలో ఐదు దాడులు పారిస్ నగరంలోని 10, 11 జిల్లాల పరిధిలో గల బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ మరియు మరొకటి బటక్లాన్ ఆడిటోరియంలో జరిగింది. ఇక్కడే ఎక్కువమంది పౌరులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. యు.ఎస్. బాండ్ ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్ బృందం బటక్లాన్ ఆడిటోరియంలో కచేరీ నిర్వహిస్తున్నప్పుడు కొందరు ఉగ్రవాదులు లోపలకి జొరబడి తమతో తెచ్చుకొన్న హ్యాండ్ గ్రెనేడ్స్ ప్రేక్షకులపైకి విసిరి ఆ తరువాత తమ వద్ద ఉన్న ఏకే-47 మెషిన్ గన్లతో వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపదాంతో అక్కడికక్కడే సుమారు 80మంది వరకు చనిపోయారని తెలుస్తోంది.
మరొకటి పారిస్ నగరానికి ఉత్తరాన్న గల స్టేడ్-డి-ఫ్రాన్స్ జాతీయ స్టేడియం బయట జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 128 మరణించినట్లు 185 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారిక సమాచారం. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఫ్రాన్కోయీస్ హోల్లాండీ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి ఇరువురూ ఇరు దేశాల మధ్య జాతీయ స్టేడియంలో జరుగుతున్న సాకర్ మ్యాచ్ చూస్తున్న సమయంలోనే ఉగ్రవాదులు స్టేడియం బయట బాంబులు పేల్చారు.
బటక్లాన్ కన్సర్ట్ ఎవెన్యూ, 50 బోలివార్డ్ వోల్టైర్ వద్ద మిషన్ గన్ మరియు బాంబులతో దాడులు జరిగాయి.
పారిస్ నగరం ఉత్తరాన్న సెయింట్ డెనిస్ వద్ద గల స్టేడ్-డి-ఫ్రాన్స్ జాతీయ స్టేడియం వద్ద బాంబు దాడులు జరిగాయి.
లీ కారిల్లన్ బార్, 18 ర్యూ అలిబెర్ట్ వద్ద ఉగ్రవాదులు తుపాకులతో ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
లీ పెటిట్ కేంబోడ్జ్ రెస్టారెంట్, 20 ర్యూ అలిబెర్ట్ వద్ద ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరిపారు.
లా బెల్లి ఎక్వీప్, 92 ర్యూ డీ కరోనీ వద్ద తుపాకులతో కాల్పులు జరిపారు.
లా కాస నోస్ట్రా రెస్టారెంట్, 2 ర్యూ డీ లా ఫాన్ టేయినీ వద్ద తుపాకులతో కాల్పులు జరిపారు.
అన్ని దేశాల అధినేతలు ఈ దాడుల పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ దాడులు కేవలం ఫ్రాన్స్ దేశంపైనో లేదా ఆ దేశ ప్రజల మీదనో జరిగిన దాడులు కావని యావత్ మానవాళిపై జరిగిన దాడులని అభివర్ణిస్తున్నారు. జర్మనీ, అమెరికా తదితర అనేక దేశాలు ఈ ఉగ్రవాదుల దాడులపై దర్యాప్తులో ఫ్రాన్స్ దేశానికి అవసరమయిన సహాయ సహకారాలు అందించదానికి సంసిద్దత వ్యక్తం చేసాయి.